స్వైన్‌ఫ్లూపై సమరభేరి
ఐపీఎంలో 24 గంటలూ శాంపిల్స్ పరీక్షలు
ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే కేసుల వివరాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ వైరస్ విస్తరిస్తోంది. 15 రోజుల్లో ఐదుగురు చనిపోగా, ఈ ఏడాది మొత్తం ఈ వ్యాధితో 9 మంది చనిపోయినట్లయింది. ఆరేళ్లలో 10 వేలమంది రక్త నమూనాలను పరీక్షించగా 1,800 స్వైన్‌ఫ్లూ కేసులను గుర్తించారు. నెల రోజులుగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ప్రైవేటు ఆస్పత్రులకు స్వైన్‌ఫ్లూ కేసులు వస్తే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని... వారిని ప్రభుత్వాసుపత్రులకు తరలించాలని సూచించింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ చంద బుధవారం సమీక్ష నిర్వహించారు.
అనుమానిత కేసుల శాంపిల్స్ సేకరించి వ్యాధి నిర్ధారణ చేసే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)ను 24 గంటలూ పనిచేసేలా చర్యలు చేపట్టాలని, షిఫ్టులవారీగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గాంధీ ఆస్పత్రితోపాటు ఉస్మానియా, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నారని... వారు అంతకుముందు తిరుపతి వెళ్లొచ్చారని సమాచారం. తిరుపతిలో ఎవరి నుంచైనా వీరికి సోకిందా? లేక వీళ్ల ద్వారా అక్కడ ఎవరికైనా సోకిందా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, కేవలం స్వైన్‌ఫ్లూతో కాకుండా ఇతరత్రా అనారోగ్యం ఉన్న వ్యాధిగ్రస్తులే చనిపోయారని సురేష్‌చంద ‘సాక్షి’కి చెప్పారు.
చిన్నారులు జాగ్రత్త తీసుకోవాలి
రెండేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని అటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డెరైక్టర్ సాంబశివరావు బుధవారం చెప్పారు. అలాగే కిడ్నీ, లివర్, షుగర్, బీపీ తదితర వ్యాధులున్నవారూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, చేతులు తరచుగా కడుక్కోవాలని సూచించారు. ఎక్కువ నీరు తాగాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి రుమాలు అడ్డం పెట్టుకోవాలన్నారు. అవసరమైన మందులు జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్నాయన్నారు.
గాంధీలో మరో స్వైన్‌ఫ్లూ రోగి మృతి
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ రోగి మృతి చెందాడు. దీంతో ఇక్కడ మృతి చెందిన స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య ఐదుకు చేరింది. ఆలస్యంగా తెలిసిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి యాదమ్మబండకు చెందిన సూర్యప్రకాశ్ (50) చలి జ్వరంతో ఈనెల 29న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు అతని నమూనాలను పరీక్షల కోసం పంపారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి సూర్యప్రకాశ్ మృతి చెందాడు. కాగా, బుధవారం అందిన నివేదికలో స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. దీంతో అతడు స్వైన్‌ఫ్లూతోనే మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. కాగా, గతంలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు స్వైన్‌ఫ్లూ బాధితులు మృతి చెందారు.