సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ కరోనా టెస్ట్‌లు చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ భారీ ఏర్పాట్లు చేసింది. మొదట్లో 2 లక్షల కిట్లు తెప్పించగా, ఆ తర్వాత ఇప్పుడు విడతల వారీగా మరో ఐదు లక్షల యాంటిజెన్ కిట్లను తెప్పించింది. జ్వరం వచ్చిన వారందరికీ యాంటిజెన్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు 65 వేల యాంటిజెన్ టెస్టులు నిర్వహించినట్లు వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లో కరోనా టెస్టులు ప్రారంభం అయినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ టెస్టులతో చాలా ఆలస్యం అవుతోంది. వాటి ఫలితాల కోసం కనీసం రెండు మూడు రోజుల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. దాంతో ఆర్టీపీసీఆర్ కంటే యాంటిజెన్ టెస్టులకే సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో కేవలం అరగంటలోనే ఫలితం వస్తుంది. దాంతో కరోనా సోకిన వారిని వెంటనే గుర్తించి, ఐసోలేషన్ చేసేందుకు వీలు కలుగుతుంది. అందుకే ఆర్టీపీసీఆర్ స్థానం లో యాంటిజెన్ టెస్టులను విస్తృతంగా చేయనున్నారు. ప్రస్తుతం రోజుకు సగటున 13–14 వేల మధ్య టెస్టులు చేస్తున్నారు. వాటిలో 90 శాతం మేరకు యాంటిజెన్ పరీక్షలే ఉంటున్నాయి.
ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ...
యాంటిజెన్ టెస్టులకు డిమాండ్ పెరగడంతో వాటిని ప్రైవేట్‌లోనూ నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. అందుకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో అర్హత కలిగిన అన్ని ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లలోనూ యాంటిజెన్ పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. పైగా అత్యవసర సర్జరీలకు ముం దు యాంటిజెన్ టెస్టులు తప్పనిసరిగా చేయాల్సి ఉన్నందున సర్కారు కూడా అంగీకారం తెలిపింది. అయితే పాజిటివ్ కేసుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాల్సి ఉంటుంది.
జ్వరం ఉంటే వెంటనే టెస్టు : ఈటల
రాష్ట్రవ్యాప్తంగా జ్వరం వచ్చిన వారందరినీ గుర్తించి త్వరగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరో గ్య శాఖ కార్యదర్శి ముర్తజా రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ జ్వరం వచ్చిన వారిని వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయించాలన్నారు. త్వరగా వైరస్ నిర్ధారణ జరిగితే ప్రాణ నష్టం జరగకుండా చూడవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment