Samples for tests
-
7లక్షల టెస్టులకు రెడీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ కరోనా టెస్ట్‌లు చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ భారీ ఏర్పాట్లు చేసింది. మొదట్లో 2 లక్షల కిట్లు తెప్పించగా, ఆ తర్వాత ఇప్పుడు విడతల వారీగా మరో ఐదు లక్షల యాంటిజెన్ కిట్లను తెప్పించింది. జ్వరం వచ్చిన వారందరికీ యాంటిజెన్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు 65 వేల యాంటిజెన్ టెస్టులు నిర్వహించినట్లు వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో కరోనా టెస్టులు ప్రారంభం అయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ టెస్టులతో చాలా ఆలస్యం అవుతోంది. వాటి ఫలితాల కోసం కనీసం రెండు మూడు రోజుల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. దాంతో ఆర్టీపీసీఆర్ కంటే యాంటిజెన్ టెస్టులకే సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో కేవలం అరగంటలోనే ఫలితం వస్తుంది. దాంతో కరోనా సోకిన వారిని వెంటనే గుర్తించి, ఐసోలేషన్ చేసేందుకు వీలు కలుగుతుంది. అందుకే ఆర్టీపీసీఆర్ స్థానం లో యాంటిజెన్ టెస్టులను విస్తృతంగా చేయనున్నారు. ప్రస్తుతం రోజుకు సగటున 13–14 వేల మధ్య టెస్టులు చేస్తున్నారు. వాటిలో 90 శాతం మేరకు యాంటిజెన్ పరీక్షలే ఉంటున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ... యాంటిజెన్ టెస్టులకు డిమాండ్ పెరగడంతో వాటిని ప్రైవేట్‌లోనూ నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. అందుకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో అర్హత కలిగిన అన్ని ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లలోనూ యాంటిజెన్ పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. పైగా అత్యవసర సర్జరీలకు ముం దు యాంటిజెన్ టెస్టులు తప్పనిసరిగా చేయాల్సి ఉన్నందున సర్కారు కూడా అంగీకారం తెలిపింది. అయితే పాజిటివ్ కేసుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. జ్వరం ఉంటే వెంటనే టెస్టు : ఈటల రాష్ట్రవ్యాప్తంగా జ్వరం వచ్చిన వారందరినీ గుర్తించి త్వరగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరో గ్య శాఖ కార్యదర్శి ముర్తజా రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ జ్వరం వచ్చిన వారిని వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయించాలన్నారు. త్వరగా వైరస్ నిర్ధారణ జరిగితే ప్రాణ నష్టం జరగకుండా చూడవచ్చన్నారు. -
కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్ పరిశోధన
న్యూఢిల్లీ: ఇండియన కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దేశంలో కరోనా వ్యాప్తిని కనుగొనేందుకు పరిశోధన చేయనుంది. దీనిలో భాగంగా దేశంలోని 75 జిల్లాలను ఎంచుకొని అందులో కరోనా సోకినా ఎటువంటి లక్షణాలను చూపని వారిపై పరిశోధనలు చేయనుంది. దేశంలో కరోనా వ్యాప్తి కమ్యూనిటీ స్థాయిలో జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడనుంది. ఈ పరిశోధనలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల నుంచి జిల్లాలను ఎంచుకొని పరీక్షించనున్నారు. అందులో కరోనా సోకిన వారికి వారి శరీరంలోని యాంటీబాడీలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోనున్నారని ఐసీఎంఆర్ కు చెందిన అధికారి తెలిపారు. ఈ పరిశోధన ముందే జరపవలసి ఉన్నప్పటికీ, చైనా నుంచి వచ్చిన కిట్లు సరిగా పనిచేయకపోవడంతో ఆలస్యమైట్లు చెప్పారు. ఈ పరిశోధనను త్వరలో ప్రారంభించనున్నారు. అధిక జనాభా, ఎక్కువగా రాకపోకలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోనున్నారు. కరోనా వచ్చిన వారిలో 80 శాతం మంది లక్షణాలను చూపకపోతున్న సంగతి తెలిసిందే. -
స్వైన్‌ఫ్లూపై సమరభేరి
ఐపీఎంలో 24 గంటలూ శాంపిల్స్ పరీక్షలు ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే కేసుల వివరాల సేకరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ వైరస్ విస్తరిస్తోంది. 15 రోజుల్లో ఐదుగురు చనిపోగా, ఈ ఏడాది మొత్తం ఈ వ్యాధితో 9 మంది చనిపోయినట్లయింది. ఆరేళ్లలో 10 వేలమంది రక్త నమూనాలను పరీక్షించగా 1,800 స్వైన్‌ఫ్లూ కేసులను గుర్తించారు. నెల రోజులుగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ప్రైవేటు ఆస్పత్రులకు స్వైన్‌ఫ్లూ కేసులు వస్తే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని... వారిని ప్రభుత్వాసుపత్రులకు తరలించాలని సూచించింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ చంద బుధవారం సమీక్ష నిర్వహించారు. అనుమానిత కేసుల శాంపిల్స్ సేకరించి వ్యాధి నిర్ధారణ చేసే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)ను 24 గంటలూ పనిచేసేలా చర్యలు చేపట్టాలని, షిఫ్టులవారీగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గాంధీ ఆస్పత్రితోపాటు ఉస్మానియా, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నారని... వారు అంతకుముందు తిరుపతి వెళ్లొచ్చారని సమాచారం. తిరుపతిలో ఎవరి నుంచైనా వీరికి సోకిందా? లేక వీళ్ల ద్వారా అక్కడ ఎవరికైనా సోకిందా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, కేవలం స్వైన్‌ఫ్లూతో కాకుండా ఇతరత్రా అనారోగ్యం ఉన్న వ్యాధిగ్రస్తులే చనిపోయారని సురేష్‌చంద ‘సాక్షి’కి చెప్పారు. చిన్నారులు జాగ్రత్త తీసుకోవాలి రెండేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని అటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డెరైక్టర్ సాంబశివరావు బుధవారం చెప్పారు. అలాగే కిడ్నీ, లివర్, షుగర్, బీపీ తదితర వ్యాధులున్నవారూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, చేతులు తరచుగా కడుక్కోవాలని సూచించారు. ఎక్కువ నీరు తాగాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి రుమాలు అడ్డం పెట్టుకోవాలన్నారు. అవసరమైన మందులు జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్నాయన్నారు. గాంధీలో మరో స్వైన్‌ఫ్లూ రోగి మృతి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ రోగి మృతి చెందాడు. దీంతో ఇక్కడ మృతి చెందిన స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య ఐదుకు చేరింది. ఆలస్యంగా తెలిసిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి యాదమ్మబండకు చెందిన సూర్యప్రకాశ్ (50) చలి జ్వరంతో ఈనెల 29న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు అతని నమూనాలను పరీక్షల కోసం పంపారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి సూర్యప్రకాశ్ మృతి చెందాడు. కాగా, బుధవారం అందిన నివేదికలో స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. దీంతో అతడు స్వైన్ఫ్లూతోనే మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. కాగా, గతంలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు స్వైన్‌ఫ్లూ బాధితులు మృతి చెందారు.