తిరుమలలో మాస్క్ లు ధరించిన భక్తులు
12 కేసులు నమోదైనట్లు చెప్పిన మంత్రి కామినేని
సాక్షి, విజయవాడ బ్యూరో/ విశాఖపట్నం: తెలంగాణను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ మెల్లగా ఏపీలోనూ విస్తరిస్తోంది. ఒంగోలు, విశాఖపట్నంలో పలువురికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 12 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ విశాఖలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వారం క్రితం సంతమాగులూరు క్వారీలో పనిచేసే శివకృష్ణ (27) ఈ లక్షణాలతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శుక్రవారం విశాఖపట్నం కింగ్‌జార్జి ఆస్పత్రిలో ఆరేళ్ల బాలుడు స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో మృతి చెందాడు. అక్కడే మరో ఎనిమిదేళ్ల బాలికకు ఈ వ్యాధి లక్షణాలున్నట్టు అనుమానిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కేజీహెచ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నాయనే అనుమానంతో వారి శాంపిల్స్‌ను వైద్య పరీక్షలకు పంపారు. వరుసగా ఈ కేసులు బయటపడుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తంగా జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేస్తున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నట్టు అనుమానం ఉంటే వెంటనే సరైన చికిత్స తీసుకుంటే ఆదిలోనే నివారించవచ్చని చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు ముదిరిపోయిన తర్వాత ప్రభుత్వాస్పత్రికి వచ్చే కేసుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముందుగానే అర్హులైన వైద్యులను సంప్రదిస్తే ఈ వ్యాధిని నివారించవచ్చని, ప్రజలు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ప్రతీ జిల్లాలోనూ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్టు మంత్రి కామినేని శ్రీనివాస్ మీడియాకు చెప్పారు.
తిరుమలలో అలర్ట్
సాక్షి, తిరుమల: స్వైన్‌ఫ్లూపై తిరుమల శ్రీవారి భక్తులూ అప్రమత్తమయ్యారు. దీంతో ఎక్కువమంది భక్తులు ఎన్ 95 మాస్కులు, సాధారణ మాస్క్‌లు ధరించి తిరుగుతున్నారు. తక్షణం వైద్యసాయం అందించేందుకు వీలుగా టీటీడీ అశ్విని ఆస్పత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేసింది. మాస్క్‌లు, మందులు తెప్పించింది.