ఒకే కుటుంబంలో ఐదుగురికి స్వైన్‌ఫ్లూ!
* నలుగురికి మహబూబ్‌నగర్‌లో చికిత్స
* చికిత్స పొందుతున్న బాధితులు
* పరారైనట్లు వదంతులు
* వీటిని కొట్టిపారేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. అందులో ఒకరికి వైరస్ లక్షణాలు బయటపడటంతో శనివారం నుంచి హైదరాబాద్‌లో చికిత్స చేస్తున్నారు. అనుమానంతో వైద్య బృందం ఆ వ్యక్తి కుటుంబాన్ని కూడా పరిశీలించగా, వారికీ స్వైన్‌ఫ్లూ సోకినట్లు వెల్లడైంది. దీంతో మిగతా నలుగురికీ మహబూబ్‌నగర్‌లో చికిత్స చేస్తున్నారు. ప్రజలు భయాందోళనకు గురవుతారన్న అనుమానంతో ఈ విషయాన్ని అధికారులు బయటకు పొక్కనీయడం లేదు. మరోవైపు ఆస్పత్రి నుంచి కొందరు స్వైన్‌ఫ్లూ బాధితులు పరారయ్యారని ప్రచా రం జరగడంతో వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. వారు పరారు కాలేదని... వైరస్ లక్షణాలు తగ్గడంతో వెళ్లిపోయారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇప్పటివరకు 8 మంది మృతి
ఈ ఏడాది ఇప్పటివరకు అధికారికంగా 70 కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. గత 15 రోజుల్లోనే నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అన్నిచోట్లా స్వైన్‌ఫ్లూ మందులున్నాయని చెబుతున్నా, జిల్లాల్లో స్వైన్‌ఫ్లూను గుర్తించే పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో బాధితులు హైదరాబాద్‌కే వస్తున్నారు. అన్ని జిల్లాలకు కలిపి కేవలం 13 వేల స్వైన్‌ఫ్లూ మందులే అందుబాటులో ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రుల్లోనూ స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ‘గాంధీ’లోనే స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డులున్నాయి.
ప్రజల్లో వైరస్‌ను తట్టుకునే శక్తి వచ్చింది
స్వైన్‌ఫ్లూను చూసి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డెరైక్టర్ డాక్టర్ పి.సాంబశివరావు ‘సాక్షి’కి చెప్పారు. ఇప్పటికే స్వైన్‌ఫ్లూను తట్టుకునే రోగ నిరోధక శక్తి ప్రజలకు వచ్చిందన్నారు. ఈ వైరస్ మామూలుగా వచ్చి పోతుందని, దీని తీవ్రత ఏమాత్రం లేదని ఆయన భరోసా ఇచ్చారు. కొందరు స్వైన్‌ఫ్లూ బాధితులు పారిపోయారని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టంచేశారు. వారి జబ్బు నయమయ్యాక ఆస్పత్రిలో ఎందుకుంటారని ఎదురు ప్రశ్నించారు. భయాందోళనకు గురిచేసే అనవసర ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. తలనొప్పి, ఒంటినొప్పులు, జలుబు, దగ్గు, జ్వరం ఉంటే అనుమానించి సమీపంలో ఉన్న ఆసుపత్రులకు వెళ్లి చూపించుకోవాలని సూచించారు.