స్వైన్ రన్... | Five patients treated for swine flu at Hyderabad hospital die | Sakshi
Sakshi News home page

స్వైన్ రన్...

Published Sun, Jan 18 2015 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

స్వైన్ రన్...

స్వైన్ రన్...

స్వైన్‌ఫ్లూ... గ్రేటర్‌లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. నగరవాసుల ప్రాణాలను మింగేస్తోంది. వారం రోజుల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. గాంధీ, బంజారాహిల్స్ కేర్, అపోలో, యశోద, కిమ్స్, ఉస్మానియా, సిటీజన్స్, పీస్ ఇలా ఏ ఆస్పత్రిలో చూసినా స్వైన్ ఫ్లూ రోగులే. కేవలం 17 రోజుల్లో 136 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చలికాలంలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది..

స్వైన్ ఫ్లూ పేరు వింటే ప్రజలు హడలిపోతున్నారు. దీని నుంచి ప్రజలను కాపాడడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కనీసం వైద్యానికి కావాల్సిన కిట్స్ కూడా అందుబాటులో లేవు. సిబ్బంది సైతం జంకుతున్నారు.

 
సిటీపై స్వైన్ ఫ్లూ దాడి
మృత్యువాత పడుతున్న నగర వాసులు
వారం రోజుల్లో ఏడుగురి మృతి
17 రోజుల్లో 136 కేసులు
తీవ్ర చలిలో వేగంగా విస్తరిస్తున్న వైరస్
హడలిపోతున్న జనం

సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాంచిన హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా (స్వైన్ ఫ్లూ) వైరస్ గ్రేటర్‌ను హడలెత్తిస్తోంది. సాధారణంగా ఈ సీజన్‌లో చాలా తక్కువగా వ్యాపిస్తుంది. జూన్ నుంచి అక్టోబర్ మాసాల్లో విస్తరించే ఈ వైరస్ జనవరిలో కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ కూడా ప్రస్తుతం సాధారణ వైరస్‌లా రూపాంతరం చెంది గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలపై ప్రతాపాన్ని చూపుతోంది.

తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల తో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్‌లోనే వైరస్ తీవ్రత ఎక్కువ ఉంది. స్వైన్‌ఫ్లూ వ్యాధి నిరోధక వాక్సిన్‌ను ప్రభుత్వం ముందస్తుగా సరఫరా చేయక పోవడంతో ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తోంది. ఇదే అదనుగా భావించిన పలు కార్పొరే ట్ ఆస్పత్రులు, ప్రైవేటు మెడికల్ షాపుల్లో వ్యాక్సిన్‌ను విక్రయిస్తుండడంతో ప్రజలు ఎగబడుతున్నారు.
 
ఏడురోజుల్లో ఏడుగురు మృతి..
గ్రేటర్ హైదరాబాద్‌లో కేవలం ఏడు రోజుల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. పదోతేదీ నుంచి వరుసగా ఆరురోజుల్లో ఐదుగురు బాధితులు మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో శనివారం సాయంత్రం మరో ఇద్దరు మరణించారు. మృతుల్లో ఒకరు ఆసీఫ్‌నగర్‌కు చెందిన 37 ఏళ్ల మహిళ కాగా, ఏఎస్‌రావునగర్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. కొత్తగా మరో 21 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

వీరంతా గాంధీ , బంజారాహిల్స్ కేర్, అపోలో, యశోద, కిమ్స్, ఉస్మానియా, సిటిజన్స్, పీస్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 10 మంది మహిళలు ఉండగా, నలుగురు పిల్లలు ఉన్నారు. చాపకింది నీరులా విస్తరిస్తోన్న ఈ వైరస్ బారి నుంచి గ్రేటర్ వాసులను కాపాడడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వైరస్ విస్తరించకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయి.
 
17 రోజుల్లో 136 కేసులు నమోదు..
రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 81 పాజిటివ్ కేసులు న మోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు అంటే 17 రోజుల్లో 136 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా గురువారం 24, శుక్రవారం 11, శనివారం 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో అత్యధికులు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన వారుండగా, ఇద్దరు నిజామాబాద్, తొమ్మిది మంది మహబూబ్‌నగర్, ముగ్గురు నల్లగొండకు చెందిన వారున్నారు.

ఒక వైపు వైరస్ విజృంభిస్తుంటే మరో వైపు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పుతుండడం గమనార్హం. గాంధీ సహా ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లోనూ స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా.. అక్కడ వైద్యానికి కావాల్సిన కనీసం కిట్స్‌ను కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా ఆస్పత్రుల్లో చేరిన బాధితుల వద్దకు వెళ్లి వైద్యసేవలు అందించేందుకు సిబ్బంది జంకుతున్నారు.
 
వ్యాక్సిన్ కోసం పరుగులు..
స్వైన్‌ఫ్లూ వైరస్ బారిన పడకుండా ముందస్తుగా మందులు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాక్సిన్ సరఫరా ఖరీదైన వ్యవహారం కావడమే ఇందుకు కారణం. ప్రభుత్వం కూడా ఇందుకోసం అవసరమైన బడ్జెట్ కేటాయించలేదు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినా.. ఫలితం లేకుండా పోయింది. చేసేది లేక ప్రజలు ముందస్తు భద్రత కోసం ప్రైవేటు వాక్సిన్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు.

‘సనోఫీ అవెంటీస్’కంపెనీకి చెందిన వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లో రూ.750 ఉండగా, బంజారాహిల్స్ కేర్ అవుట్‌పేషంట్ విభాగంతో పాటు నాంపల్లికేర్, ముషీరాబాద్, సికింద్రాబాద్ కేర్ ఆస్పత్రుల్లో రూ.450కే వేస్తుండడంతో సిటిజన్లు ఆయా ఆస్పత్రుల ముందు బారులు తీరుతున్నారు. ఇలా ఒక్క కేర్ గ్రూప్ ఆఫ్ ఆస్పత్రుల్లోనే ప్రతి రోజూ సుమారు 500 మంది వాక్సిన్ వేయించుకుంటున్నట్లు సమాచారం.

అయితే స్వైన్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర స్వై న్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శుభకర్ చెప్పారు. కొన్ని ఫార్మాకంపెనీలు ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని వాక్సిన్ ధరలు అమాంతం పెంచేశాయన్నారు. వైద్యులు కూడా అవసరం లేకపోయినా వచ్చిన ప్రతి ఒక్కరికి స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేస్తూ ప్రజలను గందర గోళపరుస్తున్నారని ఆరోపించారు. ముందస్తు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన  అవసరం లేదని, వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు.
 
లక్షణాలు ఇలా..
స్వైన్‌ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వైరస్ గాల్లోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి వాతారణంలోకి ప్రవేశించిన వైరస్ సాధారణంగా రెండు, మూడు గంటలకు మించి బతుకదు. కానీ ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల వల్ల వైరస్ బలపడుతోంది. సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. తీవ్ర జ్వరం, గొంతు నొప్పి, ఒంటి పై బొబ్బలు, ఉన్నట్టుండి వాంతులు, తరచూ విరేచనాలు అవుతుండటం, ముక్కు దిబ్బడ, ముక్కు, కళ్ల నుంచి నీరు కారడం, భరించలేని ఒంటి నొప్పలు ఉంటే దాన్ని హెచ్1ఎన్1 వైరస్‌గా అనుమానించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.    - డాక్టర్ శుభకర్, నోడల్ ఆఫీసర్, స్వైన్‌ఫ్లూ
 
ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి...
సాధ్యమైనంత వరకు రద్దీగా ఉండే హాట్‌స్పాట్‌ల (ఎగ్జిబిషన్లు, సినిమా థియేటర్లు, తీర్థయాత్రలు, దేవాలయాలు, మసీదులు, పార్కులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు)కు వెళ్లకపోవడమే ఉత్తమం. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ఇతరులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం చేయరాదు. చిన్న పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వ్యాధి నిర్ధారణ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. కాళ్లు, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. డాక్ట ర్‌ను సంప్రదించకుండా స్వయంగా మందులు వాడకూడదు.    - డాక్టర్ శ్రీహర్ష యాదవ్, సర్వేలెన్స్ అధికారి, హైదరాబాద్ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement