మే నెలతో కాలపరిమితి ముగియనున్న వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యంతో రూ.లక్షల విలువైన మందులు మురిగిపోతున్నాయి. ప్రాణాంతక స్వైన్ ఫ్లూ వైరస్ నివారణలో కీలకమైన వ్యాక్సిన్ల పంపిణీలో వారు చూపుతున్న అలసత్వం పేదలను ఈ టీకాలకు దూరం చేయడంతోపాటు భారీగా ప్రజాధనం వృథాకు కారణమవుతోంది. స్వైన్ ఫ్లూను నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తోం ది. వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదనల మేరకు 2017–18లో వినియోగించేందుకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) 10 వేల డోసుల వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి జిల్లా స్థాయి ఆస్పత్రులకు పంపిణీ చేసింది. ఒక్కో డోసు ధర రూ. 258 చొప్పున రూ. 25.58 లక్షలు ఖర్చు చేసింది.
ఈ వ్యాక్సిన్ కాలపరిమితి 2018 మే వరకే ఉంది. వీటి వినియోగంపై ప్రజారోగ్య విభాగం వైద్యలు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 10 వేల డోసుల్లో 3,138 డోసులనే వినియోగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన డోసులు వినియోగించకుండానే పారేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్స్‌పైరీ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రజారోగ్యం విభాగం ఉన్నతాధికారులు హడావుడి మొదలుపెట్టారు. ప్రజలు, రోగులకు ఇవ్వకున్నా వైద్య, ఆరోగ్యశాఖలోని సిబ్బంది, వారి కుటుంబసభ్యులు వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిల్వ ఉన్న వ్యాక్సిన్‌ను కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశారు. ఈ నెలలోనే ఎక్స్‌పైరీ తేదీ ముగుస్తుండటంతో సిబ్బందీ వినియోగించేందుకు భయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment