mmr
-
Telangana: గణనీయంగా తగ్గిన మాతృ మరణాలు..
సాక్షి, హైదరాబాద్: మాతా, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) ప్రత్యేక బులిటెన్ 2018–20 ప్రకారం, రాష్ట్రంలో ఎంఎంఆర్ 43కు తగ్గింది. 2017–19లో ఇది 56 ఉండగా, వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఎంఎంఆర్ ఏకంగా 13 పాయింట్లు తగ్గింది. తద్వారా అతి తక్కువ మరణాలతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేరళ, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు అన్నమాట. 2017–19లోనూ తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఎంఎంఆర్ 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 43కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 49 పాయింట్లు తగ్గింది. జాతీయ సగటు 2014లో 130గా ఉండగా... ఇప్పుడు 97కు తగ్గింది. కేవలం 33 పాయింట్లు మాత్రమే తగ్గుదల నమోదైంది. ►అత్యధిక మాతృమరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాల్లో అస్సాం 195, మధ్యప్రదేశ్ 173, ఉత్తర్ ప్రదేశ్ 167గా నమోదయ్యాయి. 2017–19 నుంచి 2018–20 మధ్య ఆయా రాష్ట్రాల్లో ఎంఎంఆర్ తగ్గకపోగా పెరిగింది. మధ్యప్రదేశ్‌లో 10 పాయింట్లు, హరియాణాల్లో 14 పెరగగా, ఉత్తర్ ప్రదేశ్‌లో ఎంఎంఆర్ తగ్గుదలలో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు. ఐరాస ప్రకారం 70 కంటే తక్కువ లక్ష్యం... ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ‘మాతృ మరణం అనేది ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు లేదా గర్భం ముగిసిన 42 రోజులలోపు సంబంధిత కారణాల వల్ల జరుగుతుంది. 15–49 ఏళ్ల వయస్సుగల సంబంధిత మహిళల్లో లక్షకు జరిగే మరణాలను లెక్కలోకి తీసుకుంటారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) లక్ష్యం లక్షకు 70 కంటే తక్కువ చేయాలని నిర్ణయించగా, తెలంగాణ ఎప్పుడో ఆ లక్ష్యానికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేసీఆర్ కిట్, మాతా శిశు సంరక్షణ చర్యల్లో భాగంగానే ఎంఎంఆర్ తగ్గింది. కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ప్రతి ఒక్క గర్బిణిని నమోదు చేసుకోవడం, ప్రతి నెలా చెకప్స్ చేయించడం, ఉచితంగా అమ్మ ఒడి వాహన సేవలు అందించడం వల్ల గర్భిణులకు నాణ్యమైన సేవలు అన్ని దశల్లో అందుతున్నాయి. అరికట్టగలిగిన మాతృ మరణాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంలో భాగంగా మిడ్ వైఫరీ వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించింది. ఎంపిక చేసిన నర్సులకు శిక్షణ ఇచ్చి వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు 207 మంది మిడ్ వైఫరీ నర్సులు సేవలు అందిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కృషి అభినందనీయం: మంత్రి హరీశ్‌రావు ఎంఎంఆర్ 56 నుంచి 43కు తగ్గటం గొప్ప విషయం. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలతో పాటు, ఇతర సంరక్షణ చర్యలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలో 300 అమ్మ ఒడి వాహనాలు ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 12.61 లక్షల మంది గర్బిణులు లబ్ధి పొందారు. మొత్తం కేసీఆర్ కిట్ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.1,525 కోట్లు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కృషి అభినందనీయం. ఎంఎంఆర్ తగ్గుదలలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు వెనుకబడ్డాయి. అత్యధిక మాతృ మరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాలు అస్సాం, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాలే. -
క్యాషే కింగ్!
నగదు లావాదేవీల్లో బ్లాక్ మనీని నియంత్రించేందుకు కేంద్రం చేపట్టిన రూ.1,000, రూ.500 నోట్ల రద్దు (డీమానిటైజేషన్) పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. డీమానిటైజేషన్ చేపట్టి మూడేళ్లు గడిచినా.. నేటికీ ప్రాపర్టీ డీల్స్‌లో 30 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో కంటే ద్వితీయ శ్రేణి నగరాల్లోని గృహ విభాగంలోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ తెలిపింది. సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్‌లో నల్లధన లావాదేవీలకు పేరొందిన నగరాలు ఎంఎంఆర్, ఎన్సీఆర్. ఇక్కడ ప్రైమరీ గృహ అమ్మకాల్లో నగదు వినియోగం తగ్గినప్పటికీ.. రీసేల్ ప్రాపరీ్టల్లో మాత్రం క్యాషే కింగ్. మొత్తం ప్రాపర్టీ విలువలో 20–25 శాతం నల్లధనం రూపంలోనే జరుగుతాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. . బెంగళూరు, పుణే, హైదరాబాద్ వంటి నగరాల్లో రీసేల్ ప్రాపర్టీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా ఉంది. ఇక్కడ రీసేల్ గృహాల మార్కెట్లలో బ్లాక్‌మనీ ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రాపర్టీ విలువలో సుమారు 30 శాతం దాకా నగదు రూపంలోనే చెల్లింపులు చేస్తున్నారు. క్యాషే కింగ్ ఎందుకంటే? సర్కిల్ రేట్ల కంటే మార్కెట్ రేట్లు ఎక్కువగా ఉన్న చోట, ఊహాజనిత (స్పెక్లేటివ్) కొనుగోళ్లు, అమ్మకాల్లో నగదు లావాదేవీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సర్కిల్ రేట్లకు, మార్కెట్ రేట్లకు మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండే ప్రధాన నగరాల్లోని రియల్టీ లావాదేవీల్లో నల్లధనం వినియోగం చాలా తక్కువ. ఉదాహరణకు గుర్గావ్లోని ఎంజీ రోడ్లో సగటు సర్కిల్ రేటు చ.అ.కు రూ.11,205లుగా ఉంటే.. మార్కెట్ రేటు రూ.11,000లుగా ఉంది. అలాగే డీఎల్ఎఫ్ సిటీ ఫేజ్–4లో డెవలపర్ విక్రయించే మార్కెట్ రేటు, అక్కడి సర్కిల్ రేటు రెండూ చ.అ.కు రూ.10,800లుగా ఉంది. ముంబైలోని లోయర్ పరేల్‌లో సర్కిల్ రేటు చ.అ.కు రూ.32,604, అదే మార్కెట్ రేటు రూ.32,750లుగా ఉంది. రీసేల్ నగదు రూపంలోనే.. ప్రాథమిక గృహాల్లో కంటే రీసేల్ ప్రాపర్టీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా జరుగుతుంది. కొనుగోలుదారులు, అమ్మకందారులు అధికారిక చెల్లింపులను మాత్రమే అకౌంటెడ్‌గా చేస్తున్నారని.. మిగిలిన చెల్లింపులన్నీ నగదు రూపంలోనే చేస్తున్నారు. రీసేల్ ప్రాపరీ్టల్లో ధర, పారదర్శకత రెండూ నల్లధన ప్రవాహానికి కారణమవుతున్నాయి. రీసేల్ ప్రాపరీ్టలకు స్థిరమైన ధర, క్రయవిక్రయాల్లో కఠిన నిబంధనలు లేకపోవటమే ఇందుకు కారణమని అనూజ్ పూరీ తెలిపారు. ప్రాథమిక గృహాల ధర స్థానిక మార్కెట్‌ను బట్టి ఉంటుంది. అదే రీసేల్ ప్రాపరీ్టలకు లొకేషన్, వసతులు తదితరాల మీద ఆధారపడి ధరల నిర్ణయం ఉంటుంది. హైదరాబాద్‌లో... హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా జరిగేది స్థలాలు, ప్రీలాంచ్ గృహాల కొనుగోళ్లలోనే. పెద్ద మొత్తంలో భూముల కొనుగోళ్లు క్యాష్ రూపంలో జరగడానికి ప్రధాన కారణం.. ఆఫీసర్లే! ఎందుకంటే చేయి తడిపితే గానీ పని చేయని ఆఫీసర్లు బోలెడు మంది. పెద్ద మొత్తంలోని ఈ సొమ్మును రియల్ ఎస్టేట్‌లో తప్ప బ్యాంక్‌లోనో లేక ఇంట్లోనో దాచుకోలేరు. అందుకే భారీగా స్థలాలు, ప్రీమియం గృహాల కొనుగోళ్లు చేస్తుంటారని అప్పా జంక్షన్‌కు చెందిన ఓ డెవలపర్ ‘సాక్షి రియలీ్ట’కి తెలిపారు. క్యాష్‌ను తగ్గించాలంటే? రియల్టీ లావాదేవీల్లో నగదు వినియోగాన్ని తగ్గించాలంటే మార్కెట్ ధరలను పెంచి.. స్టాంప్ డ్యూటీని తగ్గించాలని షాద్‌నగర్‌కు చెందిన ఓ డెవలపర్ సూచించారు. ఉదాహరణకు సదాశివపేటలో మార్కెట్ రేటు ఎకరానికి రూ.50 లక్షలు, ప్రభుత్వ విలువ రూ.70 వేలుగా ఉంది. ఈ లావాదేవీలను వైట్ రూపంలో ఇవ్వడానికి డెవలపర్ రెడీనే. కానీ, అమ్మకందారులు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఎక్కువ మొత్తం స్టాంప్ డ్యూటీని చెల్లించేందుకు అమ్మకందారు ఒప్పకోడు. అదే ఒకవేళ ప్రభుత్వం గనక ప్రభుత్వ రేటును పెంచి.. స్టాంప్ డ్యూటీని తగ్గిస్తే వైట్ రూపంలో లావాదేవీలు జరిపేందుకు ముందుకొస్తారు. -
ఠాణే కార్పొరేషన్‌కు భారంగా టీఎంటీ
సాక్షి, ముంబై : నష్టాల్లో నడుస్తున్న ఠాణే మున్సిపల్ ట్రాన్స్‌పోర్టు (టీఎంటీ) ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు బెస్ట్ సంస్థ ప్రకటించింది. అందుకు టీఎంటీ సంస్థ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తే త్వరలో టీఎంటీ బస్సులన్నీ బెస్ట్‌గా మారనున్నాయి. ముంబైలాగా ఠాణేకర్లకు నాణ్యమైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయి. ఏటా ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ రూ.25 కోట్లు టీఎంటీకి ఆర్థిక సాయం అందజేస్తోంది. అయినప్పటికీ ఈ సంస్థకు ప్రతీ నెలా రూ.1.50 కోట్ల నుంచి రూ.1.75 కోట్ల వరకు నష్టాలు వస్తున్నాయి. సంవత్సరానికి రూ.25 కోట్లు మేర నష్టం వస్తోంది. టీఎంటీని పోషించడం ఠాణే కార్పొరేషన్‌కు పెను భారంగా మారడంతో టీఎంటీని బెస్ట్‌లో విలీనం చేయాలనే అంశం తెరమీదకు వచ్చింది. నష్టాల బాటలో నడుస్తున్న టీఎంటీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని బెస్ట్ కూడా ఆసక్తి కనబరుస్తోంది. టీఎంటీకి అగ్ని పరీక్ష ప్రస్తుతం టీఎంటీ సంస్థ రజతోత్సవాలు జర్పుకుంటోంది. 25 సంవత్సరాల నుంచి డొక్కు బస్సులతోనే రవాణా సేవలందిస్తున్న టీఎంటీకి ఇప్పుడు ఒక అగ్ని పరీక్షగా మారింది. సేవలను మెరుగు పరిచేందుకు నీళ్లలా డబ్బులు ఖర్చు చేస్తున్నా ఆనుకున్నంతమేర ఆదాయం మాత్రం రావడం లేదు. ఠాణే కార్పొరేషన్ ఆర్థికంగా ఆదుకుంటున్నా నష్టాల ఊబి నుంచి బయట పడలేక పోతోంది. బస్సులు తరుచూ బ్రేక్ డౌన్ కావడం, సమయానికి బస్సులు రాకపోవడం, వచ్చినా అవి కిక్కిరిసి ఉండడం లాంటి ప్రధాన కారణాలున్నాయి. టీఎంటీ ఆధీనంలో 325 బస్సులున్నాయి. ఇందులో కేవలం 125 బస్సులు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. మిగతావన్నీ మరమ్మతుల కారణంగా డిపోలకే పరిమితమయ్యాయి. మేం సిద్ధం : బెస్ట్ జీఎం టీఎంటీని తమ సంస్థలో విలీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బెస్ట్ జనరల్ మేనేజర్ ఓ.పి.గుప్తా స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇటీవలే ఠాణే మున్సిపల్ కమిషనర్ అసీం గుప్తాతో చర్చలు జరిపినట్లు ఆయన చెప్పారు. మరో రెండు, మూడు సంవత్సరాలు ఠాణే కార్పొరేషన్ టీఎంటీని ఆర్థికంగా ఆదుకుంటే ఆ తరువాత తామే స్వయంగా సేవలను అందిస్తామని వెల్లడించారు. టీఎంటీ బస్సులు బెస్ట్ ఆధీనంలోకి వస్తే సిబ్బందికి బెస్ట్ తరహాలో వేతనాలు, ఇతర భత్యాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం ఠాణేలో సేవలు అందించేందుకు బెస్ట్‌కు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. ఠాణేకర్లకు ముంబై తరహాలో సేవలు అందిచేందుకు మార్గం సుగమం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆందోళనకర స్థాయిలో గర్భిణుల మరణాలు
పింప్రి, న్యూస్‌లైన్: గర్భిణుల మరణాల సంఖ్య పెరగడంపై పుణే నగరవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అఖిల భారత ప్రసూతి విభాగం (ఎంఎంఆర్) గత నవంబర్ వరకు అందజేసిన వివరాలు ఆందోళనకర విషయాలను వెల్లడించాయి. సరైన పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోకపోవడమే గర్భిణుల మరణాలకు ప్రధాన కారణమని తేలింది. గత ఏడాది పుణే జిల్లావ్యాప్తంగా 104 మంది గర్భిణులు మరణించారని వెల్లడయింది. పింప్రి-చించ్వాడ్లో 60 మంది గర్భిణులు మరణించారు. పట్టణ ప్రాంతాల్లో ఈ మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో మృతుల సంఖ్య అధికంగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడి మహిళలు గర్భం సమయంలో తగు జాగ్రత్తలు పాటించకపోవడం, మందులు వేసుకోవడంలో నిర్లక్ష్యం, పోషకాహారానికి ప్రాముఖ్యం ఇవ్వకపోవడం, చిన్న వయసులోనే గర్భం దాల్చడం ఈ దుస్థితికి కారణమని డాక్టర్లు చెబుతున్నారు. నిపుణులు సూచించిన మేరకు గర్భిణులు తరచూ వైద్యపరీక్షలు చేయించుకోకపోవడంతో వారి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోంది. పింప్రిలోని యశ్వంత్రావ్ చవాన్ ఆస్పత్రిలో ఖేడ్, రాజ్‌గురునగర్, చకణ్ ప్రాంతాల్లో గర్భిణుల మరణాలను నిరోధించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ అనిల్ రాయ్ తెలిపారు. అయితే 2011-12తో పోల్చితే పింప్రి-చించ్వాడ్ కార్పొరేషన్ ఆస్పత్రుల్లో 2012-13 నవంబర్ వరకు గర్భిణుల మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. 2011-12లో 15 మంది గర్భిణులు మృతి చెందగా, 2012-13లో 28 మంది మరణించారు. పింప్రి-చించ్వాడ్ కార్పొరేషన్ పరిధిలో 27 ఆస్పత్రులు ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలోని ఆస్పత్రుల్లో సమీప గ్రామాల గర్భిణులు చేరేందుకు చర్యలు తీసుకోవడం, వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించడం వల్ల మరణాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని రాయ్ అన్నారు. రక్తస్రావం, రక్తపోటు, ఇన్ఫెక్షన్ల వల్ల వంటి సమస్యలు గర్భిణుల మరణాలకు కారణమవుతున్నట్టు అఖిల భారత ప్రసూతి విభాగం అధ్యయనంలో తేలింది.