సాక్షి, ముంబై : నష్టాల్లో నడుస్తున్న ఠాణే మున్సిపల్ ట్రాన్స్‌పోర్టు (టీఎంటీ) ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు బెస్ట్ సంస్థ ప్రకటించింది. అందుకు టీఎంటీ సంస్థ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తే త్వరలో టీఎంటీ బస్సులన్నీ బెస్ట్‌గా మారనున్నాయి. ముంబైలాగా ఠాణేకర్లకు నాణ్యమైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయి. ఏటా ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ రూ.25 కోట్లు టీఎంటీకి ఆర్థిక సాయం అందజేస్తోంది.
అయినప్పటికీ ఈ సంస్థకు ప్రతీ నెలా రూ.1.50 కోట్ల నుంచి రూ.1.75 కోట్ల వరకు నష్టాలు వస్తున్నాయి. సంవత్సరానికి రూ.25 కోట్లు మేర నష్టం వస్తోంది. టీఎంటీని పోషించడం ఠాణే కార్పొరేషన్‌కు పెను భారంగా మారడంతో టీఎంటీని బెస్ట్‌లో విలీనం చేయాలనే అంశం తెరమీదకు వచ్చింది. నష్టాల బాటలో నడుస్తున్న టీఎంటీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని బెస్ట్ కూడా ఆసక్తి కనబరుస్తోంది.
టీఎంటీకి అగ్ని పరీక్ష
ప్రస్తుతం టీఎంటీ సంస్థ రజతోత్సవాలు జర్పుకుంటోంది. 25 సంవత్సరాల నుంచి డొక్కు బస్సులతోనే రవాణా సేవలందిస్తున్న టీఎంటీకి ఇప్పుడు ఒక అగ్ని పరీక్షగా మారింది. సేవలను మెరుగు పరిచేందుకు నీళ్లలా డబ్బులు ఖర్చు చేస్తున్నా ఆనుకున్నంతమేర ఆదాయం మాత్రం రావడం లేదు. ఠాణే కార్పొరేషన్ ఆర్థికంగా ఆదుకుంటున్నా నష్టాల ఊబి నుంచి బయట పడలేక పోతోంది. బస్సులు తరుచూ బ్రేక్ డౌన్ కావడం, సమయానికి బస్సులు రాకపోవడం, వచ్చినా అవి కిక్కిరిసి ఉండడం లాంటి ప్రధాన కారణాలున్నాయి. టీఎంటీ ఆధీనంలో 325 బస్సులున్నాయి. ఇందులో కేవలం 125 బస్సులు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. మిగతావన్నీ మరమ్మతుల కారణంగా డిపోలకే పరిమితమయ్యాయి.
మేం సిద్ధం : బెస్ట్ జీఎం
టీఎంటీని తమ సంస్థలో విలీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బెస్ట్ జనరల్ మేనేజర్ ఓ.పి.గుప్తా స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇటీవలే ఠాణే మున్సిపల్ కమిషనర్ అసీం గుప్తాతో చర్చలు జరిపినట్లు ఆయన చెప్పారు.
మరో రెండు, మూడు సంవత్సరాలు ఠాణే కార్పొరేషన్ టీఎంటీని ఆర్థికంగా ఆదుకుంటే ఆ తరువాత తామే స్వయంగా సేవలను అందిస్తామని వెల్లడించారు. టీఎంటీ బస్సులు బెస్ట్ ఆధీనంలోకి వస్తే సిబ్బందికి బెస్ట్ తరహాలో వేతనాలు, ఇతర భత్యాలు లభిస్తాయన్నారు.
ప్రస్తుతం ఠాణేలో సేవలు అందించేందుకు బెస్ట్‌కు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. ఠాణేకర్లకు ముంబై తరహాలో సేవలు అందిచేందుకు మార్గం సుగమం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.