గర్భిణుల మరణాల సంఖ్య పెరగడంపై పుణే నగరవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
పింప్రి, న్యూస్‌లైన్: గర్భిణుల మరణాల సంఖ్య పెరగడంపై పుణే నగరవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అఖిల భారత ప్రసూతి విభాగం (ఎంఎంఆర్) గత నవంబర్ వరకు అందజేసిన వివరాలు ఆందోళనకర విషయాలను వెల్లడించాయి. సరైన పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోకపోవడమే గర్భిణుల మరణాలకు ప్రధాన కారణమని తేలింది. గత ఏడాది పుణే జిల్లావ్యాప్తంగా 104 మంది గర్భిణులు మరణించారని వెల్లడయింది. పింప్రి-చించ్‌వాడ్‌లో 60 మంది గర్భిణులు మరణించారు. పట్టణ ప్రాంతాల్లో ఈ మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో మృతుల సంఖ్య అధికంగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడి మహిళలు గర్భం సమయంలో తగు జాగ్రత్తలు పాటించకపోవడం, మందులు వేసుకోవడంలో నిర్లక్ష్యం, పోషకాహారానికి ప్రాముఖ్యం ఇవ్వకపోవడం, చిన్న వయసులోనే గర్భం దాల్చడం ఈ దుస్థితికి కారణమని డాక్టర్లు చెబుతున్నారు. నిపుణులు సూచించిన మేరకు గర్భిణులు తరచూ వైద్యపరీక్షలు చేయించుకోకపోవడంతో వారి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోంది. పింప్రిలోని యశ్వంత్‌రావ్ చవాన్ ఆస్పత్రిలో ఖేడ్, రాజ్‌గురునగర్, చకణ్ ప్రాంతాల్లో గర్భిణుల మరణాలను నిరోధించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ అనిల్ రాయ్ తెలిపారు.
అయితే 2011-12తో పోల్చితే పింప్రి-చించ్‌వాడ్ కార్పొరేషన్ ఆస్పత్రుల్లో 2012-13 నవంబర్ వరకు గర్భిణుల మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. 2011-12లో 15 మంది గర్భిణులు మృతి చెందగా, 2012-13లో 28 మంది మరణించారు. పింప్రి-చించ్‌వాడ్ కార్పొరేషన్ పరిధిలో 27 ఆస్పత్రులు ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలోని ఆస్పత్రుల్లో సమీప గ్రామాల గర్భిణులు చేరేందుకు చర్యలు తీసుకోవడం, వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించడం వల్ల మరణాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని రాయ్ అన్నారు. రక్తస్రావం, రక్తపోటు, ఇన్ఫెక్షన్ల వల్ల వంటి సమస్యలు గర్భిణుల మరణాలకు కారణమవుతున్నట్టు అఖిల భారత ప్రసూతి విభాగం అధ్యయనంలో తేలింది.