క్యాషే కింగ్‌! | Cities Known For Black Money Transactions In Real Estate MMR And NCR | Sakshi
Sakshi News home page

క్యాషే కింగ్‌!

Published Sat, Nov 30 2019 5:41 AM | Last Updated on Sat, Nov 30 2019 5:41 AM

Cities Known For Black Money Transactions In Real Estate MMR And NCR - Sakshi

నగదు లావాదేవీల్లో బ్లాక్‌ మనీని నియంత్రించేందుకు కేంద్రం చేపట్టిన రూ.1,000, రూ.500 నోట్ల రద్దు (డీమానిటైజేషన్‌) పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. డీమానిటైజేషన్‌ చేపట్టి మూడేళ్లు గడిచినా.. నేటికీ ప్రాపర్టీ డీల్స్‌లో 30 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో కంటే ద్వితీయ శ్రేణి నగరాల్లోని గృహ విభాగంలోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌లో నల్లధన లావాదేవీలకు పేరొందిన నగరాలు ఎంఎంఆర్, ఎన్‌సీఆర్‌. ఇక్కడ ప్రైమరీ గృహ అమ్మకాల్లో నగదు వినియోగం తగ్గినప్పటికీ.. రీసేల్‌ ప్రాపరీ్టల్లో మాత్రం క్యాషే కింగ్‌. మొత్తం ప్రాపర్టీ విలువలో 20–25 శాతం నల్లధనం రూపంలోనే జరుగుతాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. . బెంగళూరు, పుణే, హైదరాబాద్‌ వంటి నగరాల్లో రీసేల్‌ ప్రాపర్టీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా ఉంది. ఇక్కడ రీసేల్‌ గృహాల మార్కెట్లలో బ్లాక్‌మనీ ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రాపర్టీ విలువలో సుమారు 30 శాతం దాకా నగదు రూపంలోనే చెల్లింపులు చేస్తున్నారు.

క్యాషే కింగ్‌ ఎందుకంటే?
సర్కిల్‌ రేట్ల కంటే మార్కెట్‌ రేట్లు ఎక్కువగా ఉన్న చోట, ఊహాజనిత (స్పెక్‌లేటివ్‌) కొనుగోళ్లు, అమ్మకాల్లో నగదు లావాదేవీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సర్కిల్‌ రేట్లకు, మార్కెట్‌ రేట్లకు మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండే ప్రధాన నగరాల్లోని రియల్టీ లావాదేవీల్లో నల్లధనం వినియోగం చాలా తక్కువ. ఉదాహరణకు గుర్గావ్‌లోని ఎంజీ రోడ్‌లో సగటు సర్కిల్‌ రేటు చ.అ.కు రూ.11,205లుగా ఉంటే.. మార్కెట్‌ రేటు రూ.11,000లుగా ఉంది. అలాగే డీఎల్‌ఎఫ్‌ సిటీ ఫేజ్‌–4లో డెవలపర్‌ విక్రయించే మార్కెట్‌ రేటు, అక్కడి సర్కిల్‌ రేటు రెండూ చ.అ.కు రూ.10,800లుగా ఉంది. ముంబైలోని లోయర్‌ పరేల్‌లో సర్కిల్‌ రేటు చ.అ.కు రూ.32,604, అదే మార్కెట్‌ రేటు రూ.32,750లుగా ఉంది.

రీసేల్‌ నగదు రూపంలోనే..
ప్రాథమిక గృహాల్లో కంటే రీసేల్‌ ప్రాపర్టీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా జరుగుతుంది. కొనుగోలుదారులు, అమ్మకందారులు అధికారిక చెల్లింపులను మాత్రమే అకౌంటెడ్‌గా చేస్తున్నారని.. మిగిలిన చెల్లింపులన్నీ నగదు రూపంలోనే చేస్తున్నారు. రీసేల్‌ ప్రాపరీ్టల్లో ధర, పారదర్శకత రెండూ నల్లధన ప్రవాహానికి కారణమవుతున్నాయి. రీసేల్‌ ప్రాపరీ్టలకు స్థిరమైన ధర, క్రయవిక్రయాల్లో కఠిన నిబంధనలు లేకపోవటమే ఇందుకు కారణమని అనూజ్‌ పూరీ తెలిపారు. ప్రాథమిక గృహాల ధర స్థానిక మార్కెట్‌ను బట్టి ఉంటుంది. అదే రీసేల్‌ ప్రాపరీ్టలకు లొకేషన్, వసతులు తదితరాల మీద ఆధారపడి ధరల నిర్ణయం ఉంటుంది.

హైదరాబాద్‌లో...
హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా జరిగేది స్థలాలు, ప్రీలాంచ్‌ గృహాల కొనుగోళ్లలోనే. పెద్ద మొత్తంలో భూముల కొనుగోళ్లు క్యాష్‌ రూపంలో జరగడానికి ప్రధాన కారణం.. ఆఫీసర్లే! ఎందుకంటే చేయి తడిపితే గానీ పని చేయని ఆఫీసర్లు బోలెడు మంది. పెద్ద మొత్తంలోని ఈ సొమ్మును రియల్‌ ఎస్టేట్‌లో తప్ప బ్యాంక్‌లోనో లేక ఇంట్లోనో దాచుకోలేరు. అందుకే భారీగా స్థలాలు, ప్రీమియం గృహాల కొనుగోళ్లు చేస్తుంటారని అప్పా జంక్షన్‌కు చెందిన ఓ డెవలపర్‌ ‘సాక్షి రియలీ్ట’కి తెలిపారు.

క్యాష్‌ను తగ్గించాలంటే?
రియల్టీ లావాదేవీల్లో నగదు వినియోగాన్ని తగ్గించాలంటే మార్కెట్‌ ధరలను పెంచి.. స్టాంప్‌ డ్యూటీని తగ్గించాలని షాద్‌నగర్‌కు చెందిన ఓ డెవలపర్‌ సూచించారు. ఉదాహరణకు సదాశివపేటలో మార్కెట్‌ రేటు ఎకరానికి రూ.50 లక్షలు, ప్రభుత్వ విలువ రూ.70 వేలుగా ఉంది. ఈ లావాదేవీలను వైట్‌ రూపంలో ఇవ్వడానికి డెవలపర్‌ రెడీనే. కానీ, అమ్మకందారులు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఎక్కువ మొత్తం స్టాంప్‌ డ్యూటీని చెల్లించేందుకు అమ్మకందారు ఒప్పకోడు. అదే ఒకవేళ ప్రభుత్వం గనక ప్రభుత్వ రేటును పెంచి.. స్టాంప్‌ డ్యూటీని తగ్గిస్తే వైట్‌ రూపంలో లావాదేవీలు జరిపేందుకు ముందుకొస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement