పెద్ద నోట్ల తిప్పలు!
నల్ల డబ్బుపై మంగళవారం పొద్దుపోయాక కేంద్ర ప్రభుత్వం సంధించిన బ్రహ్మాస్త్రం అన్ని వర్గాలనూ నివ్వెరపరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ చేసిన ఈ ప్రకటన పర్యవసానాలేమిటో తెల్లారి రోడ్డెక్కేవరకూ చాలామందికి అర్ధం కాలేదు. పెద్ద నోట్లు ఈ క్షణం నుంచి చిత్తు కాగితాలతో సమా నమని స్వయానా దేశ ప్రధానే ప్రకటిస్తారని ఎవరూ ఊహించరు. రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ సంతకంతో హామీ ముద్రించి ఉండే నోటుకు ఈ గతి పడుతుందనుకోరు. దానికి కారణం ఉంది... ఇలా నోట్లు రద్దు చేయడమన్నది దాదాపు నాలుగు దశా బ్దాల తర్వాత ఇదే తొలిసారి. అంటే రెండు తరాలకు నోట్ల ఉపసంహరణ గురించి పెద్దగా తెలియదు. 1978లో జనతా పార్టీ ప్రభుత్వం రూ. 1,000, రూ. 5,000, రూ. 10,000 నోట్లను రద్దు చేసింది.
పౌరుల్లో అత్యధికులకు దాని ఫలితం అనుభ వంలోకి రాలేదు. అప్పట్లో అది 2 శాతం మందిని మాత్రమే ప్రభావితం చేసింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఇప్పుడు రూ. 500 నోట్లు, రూ. 1,000 నోట్లను రోజు కూలీలు కూడా ఉపయోగించక తప్పని స్థితి ఏర్పడింది. చలామణిలో ఉన్న డబ్బులో ఈ రెండు నోట్ల వాటా దాదాపు 86 శాతం ఉంటుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అందువల్లే కావొచ్చు... బుధవారం రోజంతా సాధారణ పౌరులు నానా యాతనలూ పడ్డారు. ‘మనిషికి ఉంటే పుష్టి... పశువుకు తింటే పుష్టి’ అని నానుడి. ఇంట్లో ఉన్న డబ్బు చూసుకుని ధైర్యంగా ఉండేవారికి ఉన్నట్టుండి అది చెల్లుబాటు కాకపోవడం ఊహించని పరిణామం. నోట్ల రద్దుపై ప్రభుత్వం నుంచి సరైన వివరణ లేకపోవడంవల్ల ఈ గందరగోళ స్థితి ఏర్పడింది. ఇవి ఎక్కడెక్కడ చెల్లుబాటవుతాయో మోదీ జాబితా ఇవ్వడంవల్ల మిగిలినచోట్ల అవి చెల్లవన్న అభిప్రాయం ఏర్పడింది. ఫలితంగా ఆయన ప్రస్తావించిన అవస రాలకు కూడా అవి అక్కరకు రాకుండా పోయాయి. లావాదేవీలన్నీ స్తంభించాయి.
పెట్రోల్ బంకుల వద్దా, ఆస్పత్రుల్లోనూ ఆ నోట్లు తీసుకోలేమని చెప్పినట్లు ఫిర్యాదు లొస్తున్నాయి. దుకాణాలు, రెస్టరెంట్లు వగైరాల సంగతి చెప్పనవసరమే లేదు. రూ.50,000 వరకూ పాన్ నంబర్ ఇవ్వకుండా... దానికి మించిన నగదుకు పాన్ నంబర్ ఇస్తే డిపాజిట్ చేసుకోవడానికి వచ్చే ఏడాది మార్చి వరకూ వెసులుబా టుంది. కనుక ఎవరూ వాటిని నిరాకరించాల్సిన పనిలేదు. మరి సమస్య ఎందుకు రావాలి? ఈ స్థితిని అడ్డం పెట్టుకుని కమిషన్ ఏజెంట్లు పుట్టుకొచ్చారు. పెద్ద నోట్లు తీసుకుని కొంత డిస్కౌంట్‌తో చిన్న నోట్లు ఇవ్వడం... సామాన్య పౌరులు అందుకు సిద్ధపడటం తప్పలేదు. ఒకపక్క ఏటీఎంలలో రూ.500 నోట్లు లభ్యమయ్యే స్థితి ఉండగానే బయట అవి ఎక్కడా చెల్లకపోవడమేమిటో తెలియక అందరూ అయో మయానికి గురయ్యారు. ఈ గందరగోళం తాత్కాలికమేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కానీ ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్థితి ఏర్పడేది కాదు.
నల్లడబ్బు వంటి మహమ్మారిపై యుద్ధం ఎవరికీ ఏ ఇబ్బందీ కలగకుండానే పూర్తవుతుందని ఎవరూ అనుకోరు. ఆ నల్లడబ్బు ఉగ్రవాద భూతానికి ఊతమి స్తుందన్న మాటను ఎవరూ తోసిపుచ్చరు. దేశంలో అవినీతి పెరగడానికి, రాజకీ యాలతోపాటు అన్ని రంగాలూ భ్రష్టుపట్టడానికీ నల్లడబ్బు చలామణి ప్రధాన కారణం. అది దాదాపు రూ. 75 లక్షల కోట్ల వరకూ ఉంటుందని గతంలో బీజేపీ అగ్ర నేత అద్వానీయే అన్నారు. అందులో చాలా భాగం విదేశీ బ్యాంకుల్లో మూలు గుతున్నదని కూడా చెప్పారు. దాన్ని వెనక్కి తీసుకొస్తామని గతంలో యూపీఏ హామీ ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కానీ ఏ ప్రభు త్వాలు ఆ పని చేయలేకపోయాయి. నిజానికి నల్లడబ్బు ఆ రూపంలోనే ఉండి పోవడం లేదు. బంగారం, రియల్‌ఎస్టేట్, షేర్లు, డాలర్లుగా రూపాంతరం చెందు తోంది. హవాలా ద్వారా అది దేశం బయటకు పోతోంది. పెట్టుబడుల రూపంలో మళ్లీ ఇక్కడికొస్తోంది. అందుకే పెద్దనోట్ల రద్దు పరిష్కారం కాదని సీబీడీటీ నాలుగేళ్ల క్రితం చెప్పింది.
నిన్న మొన్నటి స్వచ్ఛంద వెల్లడి పథకం వరకూ మోదీ అధికారంలోకొచ్చాక తీసుకున్న చర్యలు పెద్దగా ఫలితాన్నివ్వలేదు. జీఎస్‌టీ ఇంకా అమలు కావాల్సి ఉంది. స్వచ్ఛంద వెల్లడిలో బయటికొచ్చిన రూ. 65,000 కోట్లు పెద్ద మొత్తమే కావొచ్చుగానీ చలామణిలోని నల్లడబ్బుతో పోలిస్తే అది చాలా తక్కువ. రియల్‌ఎస్టేట్ నల్లడబ్బు పోగుపడటానికి తోడ్పడుతోంది. తాజా చర్య పర్యవసానంగా పారదర్శకత తప్పనిసరై ఇలాంటివి దారికొస్తాయి. ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా ఉన్న నకిలీ కరెన్సీ సైతం పనికిరాకుండా పోతుంది. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టే రూ. 500, రూ.2,000 నోట్లకు నకిలీ బెడద ఉండ బోదని చెప్పలేం. ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇన్నాళ్లూ పన్నుల పరిధిలోకి రాని రైతు ఇప్పుడు ఏం చెప్పి బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలో తెలియని స్థితి.
దేశ హితాన్ని ఆశించి ప్రభుత్వం తీసుకునే చర్యకు రాజకీయ రంగు ఉండ కూడదు. ప్రభుత్వం తీసుకునే చర్య ఒక పార్టీ సాహసంగా, మరొక పార్టీ పోరాట ఫలితంగా ప్రచారం కావడం మంచిదికాదు. దేశంలోనూ, బయటా ఏం జరిగినా తన ఘనతేనని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల అలాంటి స్థితి ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దు ఆలోచనకు తానే ఆద్యుడినని ఆయన ప్రకటిం చుకున్నారు.
సెల్‌ఫోన్ నా ఘనతేనని, హైదరాబాద్‌కు ఐటీ రావడం తన గొప్పే నని, సత్య నాదెండ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ కావడం తన మహిమేనని చెప్పుకోవడాన్ని క్షమించి వదిలేయొచ్చేమోగానీ... ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆడియో, వీడియోల్లో దొరికాక, ఓటు కొనుక్కోవడం అవినీతి కాదని న్యాయస్థానంలో వాదించాక పెద్ద నోట్ల రద్దు తన పోరాట ఫలితమని ప్రచారం చేసుకుంటే ఆ చర్యపై శంకలు తలెత్తవా? పైగా ఇది చాలదన్నట్టు రూ. 2,000 నోటు అవసరమేమిటని ప్రశ్నించి తాను మోదీని మించిన నిజాయితీపరుణ్ణని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఆయన పార్టీ ఎన్‌డీఏ భాగస్వామి కాకపోతే ఇది చర్చనీయాంశం కాకపోయేది. ఆ సంగతలా ఉంచి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల సాధారణ పౌరులకు ఇబ్బం దులు తలెత్తకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం, వెసులుబాట్లు కల్పించడం అవసరం.