సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినందున సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. డెంగీ, మలేరియా, ఇతర వ్యాధులు ప్రబలకుండా ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని, అధికారులు కూడా ఇంటింటి సర్వే ద్వారా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో మంత్రుల సమీక్ష జరిగింది. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాలు, గూడేలతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్త వహించాలని కోరారు. మలేరియా, డెంగీ కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామని వెల్లడించారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ను అంటువ్యాధులకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు.
వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గురుకులాల్లో నిల్వ ఉంచిన బియ్యం స్థానంలో తాజా బియ్యాన్ని సరఫరా చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ను కోరినట్లు చెప్పారు. వరదల వల్ల ఏర్పడిన కరెంటు ఇబ్బందుల పరిష్కారానికి సంబంధిత శాఖలకు రూ.పదేసి కోట్ల చొప్పున విడుదల చేసినట్లు తెలిపారు. సమీక్షలో హరీశ్‌రావుతోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు.
గురుకులాలకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు
సంక్షేమ విద్యాసంస్థల్లో ఆహార నాణ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలకు ఉపక్రమించింది. కొన్ని రోజులుగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, వసతిగృహాలతోపాటు ఇతర విద్యాసంస్థల్లో ఆహారం వికటిస్తున్న సందర్భాలు వెలుగుచూస్తున్న క్రమంలో సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గురుకుల విద్యాసంస్థలు, సక్షేమ వసతి గృహాల్లో ఆహార నాణ్యతను పరిశీలించాలని కోసం ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించింది.
మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉన్నాం
మంకీపాక్స్ వ్యాధి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ‘కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించాం. ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీం నమూనాలను పుణేలోని ఎన్‌ఐవీ ల్యాబ్‌కు పంపాం. మంకీపాక్స్ చికిత్సకు ఫీవర్ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
గాంధీ ఆసుపత్రిలో మంకీపాక్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మంకీపాక్స్ లక్షణాలుంటే వెంటనే ఫీవర్ ఆసుపత్రిని సందర్శించాలి’అని హరీశ్‌రావు చెప్పారు. ప్లేట్‌లెట్స్ పడిపోతే ఆందోళనలతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని, అన్ని జిల్లా, బోధనాసుపత్రుల్లో ప్లేట్‌లెట్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment