పీహెచ్‌సీ పరికరాల కొనుగోళ్లు వాయిదా
- ఇప్పటికీ రాని బ్లడ్‌బ్యాంకు యంత్రాలు
- ఈడీపై తీవ్రమవుతున్న ఆరోపణలు
- బదిలీ అయినా కదలని అధికారి
- టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో రోజుకో లీల
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అవినీతి ఆరోపణలతో రూ.200 కోట్ల విలువైన వైద్య పరికరాల కొనుగోళ్లు వాయిదాపడి నెలరోజులైనా కాకముందే మరో వివాదానికి తెరలేచింది. తెలంగాణ వ్యాప్తంగా 55 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్‌సీ)ల్లో రూ.20 కోట్లతో పరికరాల కొనుగోళ్లకు ఆర్డరు ఇచ్చారు. అయితే తమకు నచ్చిన కంపెనీలకే రిపోర్టు ఇవ్వమన్నారని... అలా అయితే కమిటీ సభ్యులుగా తామెందుకు రావాలని... వారి మనుషులనే తెచ్చుకుంటే సరిపోదా అంటూ కమిటీ సభ్యులు మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో పరికరాల కొనుగోళ్లు వాయిదాపడ్డాయి. అసలే పీహెచ్‌సీల్లో కనీస వసతులు లేక అల్లాడుతోంటే, మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థలో ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం వివాదాలకు తావిస్తోంది.
రక్తనిధి యంత్రాల పరిస్థితీ అంతే...
ఇటీవలే రూ.9 కోట్లతో రక్తనిధి కేంద్రాలకు అవసరమైన యంత్రాలకు టెండరు పిలిచారు. అయితే ఒక కంపెనీకి టెండరు కట్టబెట్టాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తాము అనుకున్న కంపెనీ రాకపోవడంతో వచ్చిన కంపెనీకి ఇప్పటికీ ఆర్డరు ఇవ్వలేదు. దీంతో డెంగీ తదితర రోగాలు వచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్లేట్‌లెట్స్ తదితర కణాలను వేరుచేసే యంత్రాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)కి సరఫరా అయ్యే మందులు, యాంటీబయాటిక్స్, కాటన్, బ్యాండేజీ తదితర కొన్నిరకాలు ఔషధ నియంత్రణ శాఖ నాసిరకం అని తేల్చినా ఆ సంస్థ అధికారులు ఓకే చెబుతున్నారు. తాజాగా రోలర్ బ్యాండేజీపై ఓ కంపెనీకి సంబంధించి డ్రగ్ కంట్రోల్ విభాగం రెండు ఉత్పత్తులను నాసిరకంగా తేల్చింది. అయినా అనాలసిస్ విభాగంలో పనిచేసే ఓ ఫార్మసిస్ట్ వీటినే కొనసాగిస్తూనే ఉన్నారు. పలువురు సరఫరాదారులు అనాలసిస్ విభాగంలో పనిచేస్తున్న వారికి మామూళ్లివ్వడమే కారణమనే ఆరోపణలున్నాయి.
మామూళ్ల వ్యవహారం...
ప్రస్తుతం టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో ఎండీలేరు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందానే ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే జీఎం కూడా లేరు. ప్రస్తుతం రెవెన్యూ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ) మాత్రమే ఉన్నారు. ఆయన చెప్పిందే వేదంగా నడుస్తోంది. గత ఆరు నెలల్లో ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో నెల కిందట బదిలీ చేశారు. ఆయన స్థానంలో పద్మారావు అనే మరో రెవెన్యూ అధికారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే ఆ ఉత్తర్వులు బేఖాతర్ అయ్యాయి. ప్రస్తుత ఈడీ తన బదిలీని ఆపుకొని అదే పోస్టులో దర్జాగా కొనసాగుతున్నారు. సరఫరాదారుల నుంచి మామూళ్లు తీసుకుని ఉన్నతాధికారులకు ఇవ్వడం వల్లే ఇక్కడ ఉండగలుగుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. సివిల్ పనులు, మందులు, పరికరాల కొనుగోలు ఇలా 1,000 కోట్ల వరకూ జరిగే ఈ వ్యవహారాలకు ఎండీ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడి ఘోరంగా తయారైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ విభాగం పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.