ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌! | TSMSIDC Cleansing | Sakshi
Sakshi News home page

ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌!

Published Sun, May 5 2019 1:45 AM | Last Updated on Sun, May 5 2019 5:22 AM

TSMSIDC Cleansing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)కు ప్రాథమిక చికిత్స మొదలైంది. నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేశాక పసి పిల్లలకు ప్రమాదకరమైన ట్రెమడాల్‌ మాత్రలు వేయడం, వికటించడం, ఇద్దరు చనిపోయిన విషయం విదితమే. దీంతో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో ప్రక్షాళనకు అధికారులు పూనుకున్నారు. ఈ సంఘటన అనంతరం మొత్తం వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై సర్కారు తీవ్ర అసంతృప్తితో ఉంది. ముఖ్యంగా ట్రెమడాల్‌ మాత్రలు అవసరం లేకపోయినా ఏకంగా 33 లక్షల మాత్రలను రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించారు. అందులో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులు, ఫార్మసిస్టులు, కంపెనీలు కుమ్మక్కు అయ్యారని తెలిసింది.

నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేవలం 500 మాత్రలు అవసరమని చెబితే ఏకంగా 10 వేలు పంపించిన సంఘటన చాలా సీరియస్‌ అయింది. దీంతో ఈ మాత్రలు అవసరానికి మించి ఇష్టారాజ్యంగా సరఫరా చేసిన సంఘటనలో పాత్రధారులపైనా, ఫార్మసిస్టులపైనా వేటు వేయాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ నిర్ణయించింది. ఔషధ నియంత్రణ విభాగం నుంచి మొదలుపెడితే టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ వరకు పాత్రధారులపై ఇటీవల వేటు ప్రారంభమైంది. అయితే కేవలం చిన్నవారిని బలి తీసుకుంటున్నారని, పెద్దల పాత్రపై ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న 33 లక్షల ట్రెమడాల్‌ మాత్రలను వెనక్కు తెప్పించి సంబంధిత కంపెనీకి పంపించారు.

ఆ కంపెనీకి అంతకుముందే సొమ్ము ఇచ్చినందున వాటి విలువను ఇతరత్రా అడ్జెస్ట్‌ చేయాలని నిర్ణయించారు. రెండు కోట్ల రూపాయల విలువైన గడువు తీరిన మందులను కూడా వెనక్కు తెప్పిస్తున్నారు. ఇప్పటివరకు గడువు తీరిన మందులను కంపెనీలకు వెనక్కు ఇచ్చేవారు కాదు. ఆ నష్టాన్ని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీనే భరించేది. కంపెనీలతో కొందరు అధికారులు కుమ్మక్కై ఇలా చేసేవారన్న విమర్శల నేపథ్యంలో ఇక నుంచి మూడు నెలల ముందు గడువు ముగిసే వాటిని కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ తెలిపింది. 

ఆయనకు అంత జీతమా? 
కీలకస్థానంలో ఓ అధికారి కనుసైగల్లోనే టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ నడుస్తోందన్న వాదన ఉంది. ఎవరు ఎండీగా వచ్చినా ఆయనను మచ్చిక చేసుకొని విచ్చలవిడిగా దోపిడీ చేస్తుంటారన్న ప్రచారం ఉంది. అతని వేతనం నెలకు రూ. 2.50 లక్షలు, అతను వాడే వ్యక్తిగత కారు కోసం రూ.46 వేల రవాణా భత్యం నెలకు ఇస్తారన్న ప్రచారం ఉంది. పది కిలోమీటర్ల దూరం ఉండే ఇంటి నుంచి కార్యాలయానికి వచ్చే అతనికి అంత జీతభత్యాలు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. నెలా రెండు నెలలకోసారి ఢిల్లీ టూర్‌ పేరిట మరో రూ.40 వేలు ఆయనకు చెల్లిస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. ఈ విషయంపై కొందరు ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఆరా తీసినట్లు, అతని పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో త్వరలో అతనిపై వేటువేసే అవకాశాలున్నట్లు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి చెందిన ఓ కీలకాధికారి తెలిపారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి చెందిన వైద్య ఉత్పత్తుల్లో ఒక దానికి సంబంధించి మూడు బ్యాచ్‌ నంబర్లు గల వాటిని తిరిగి వెనక్కు తెప్పిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆ బ్యాచ్‌ నంబర్లను కంపెనీ కూడా వెనక్కు తెప్పిస్తోందన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆ ఉత్పత్తుల బ్యాచ్‌ నంబర్లు బయటపడ్డాయని, వాటిని తెప్పిస్తున్నామని చెప్పారు.  

సంస్థను ప్రక్షాళన చేస్తున్నాం
టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో నెలకొన్న కొన్ని రకాల లోపాలను సరిదిద్దుతున్నాం. అక్రమాలు జరిగినచోట కఠినంగా వ్యవహరిస్తున్నాం. ట్రెమడాల్‌ మాత్రలు వికటించిన ఉదంతం తర్వాత ప్రక్షాళన చేపట్టిన మాట వాస్తవమే. గడువు తీరిన మాత్రలు, మందులను వెనక్కు పంపించాలని నిర్ణయించాం. గతంలో వాటిని కాల్చడమో ఏదో ఒకటి చేసేవారం. కానీ, ముందుగానే కంపెనీకి అప్పగించాలని నిర్ణయించాం. తద్వారా నష్టాలను భరించాల్సిన అవసరం టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి ఉండదు. 33 లక్షల ట్రెమడాల్‌ మాత్రలను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వెనక్కు తెప్పించి కంపెనీకి అప్పగించాం. 
– చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement