British Journal
-
పాపం కంటిపాపలు
తల్లిదండ్రులకు కంటిపాపలైన చిన్నారుల్లో కంటిచూపు క్రమంగా క్షీణిస్తోంది. సగటున ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు హ్రస్వదృష్టి (దూరంలోని వస్తువులు సరిగా కని్పంచని) సమస్యతో బాధపడుతున్నట్టు అంతర్జాతీయ విశ్లేషణ ఒకటి హెచ్చరించింది. ఆసియాలోనైతే సమస్య మరీ దారుణంగా ఉంది. జపాన్‌లో ఏకంగా 85 శాతం, కొరియాలో 73 శాతం మంది బాలలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆఫ్తల్మాలజీలో తాజాగా ప్రచురితమైన అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల పరిధిలోని 50కి పైగా దేశాల్లో విస్తృతంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆందోళనకర గణాంకాలు వెలుగులోకి వచి్చనట్టు పేర్కొంది. అధ్యయనంలో భాగంగా 50 లక్షలమందికి పైగా బాలలు, టీనేజర్లను పరీక్షించారు. స్కూలు పుస్తకాలతో కుస్తీకి తోడు స్క్రీన్ సమయం విపరీతంగా పెరగడం, ఆరుబయట గడిపే సమయం తగ్గడం పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి కోట్లాది మంది పిల్లల కంటిచూపు బాగా ప్రభావితం అవుతుందని హెచ్చరించారు. హ్రస్వదృష్టి సాధారణంగా స్కూలుకు వెళ్లడం మొదలు పెట్టే దశలోనే మొదలవుతుంది. కళ్ల ఎదుగుదల ఆగిపోయేదాకా, అంటే 20 ఏళ్లొచ్చేదాకా సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. సగం యువతకు సమస్యే → ప్రపంచవ్యాప్తంగా 36 శాతం మంది బాలలు హ్రస్వదృష్టితో బాధపడుతున్నారు. → 1990 నుంచి 2023 మధ్యకాలంలోనే సమస్య ఏకంగా మూడు రెట్లు పెరిగింది. → పిల్లల్లో హ్రస్వదృష్టి ఆసియా దేశాలతో పోలిస్తే ఆఫ్రికా దేశాల్లో ఏకంగా ఏడు రెట్లు తక్కువగా ఉండటం విశేషం. → ఉగాండాలో అతి తక్కువగా కేవలం ఒక్క శాతం మంది పిల్లల్లో మాత్రమే హ్రస్వదృష్టి నమోదైంది. → ఆఫ్రికా దేశాల్లో పాఠశాల విద్య ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయస్సులో ప్రారంభమ తుంది. పైగా పిల్లలు ఆరుబయట ఎక్కువగా గడుపుతున్నారు. దాంతో అక్క డ బాలలు, యువకుల్లో సమస్య తక్కువగా ఉంది. → జపాన్‌లో ఏకంగా 85%, దక్షిణ కొరియాలో 73% పిల్లలకు హ్రస్వదృష్టి ఉంది. → చైనా, రష్యాల్లో 40 % కంటే ఎక్కువగా, యూకే, ఐర్లాండ్, అమెరికాల్లో 15 శాతానికి పైగా పిల్లల్లో సమస్య ఉంది. → మిగతా ఖండాలతో పోలిస్తే ఆసియాలో 2050 నాటికి ఏకంగా 69 శాతం మంది హ్రస్వదృష్టి బారిన పడతారు. → అప్పటికి ప్రపంచ యువతలో కనీసం సగానికి సగం ఈ సమస్యను ఎదుర్కొంటారు. → వర్ధమాన దేశాల్లో 2050 నాటికి 40% మంది దీని బారిన పడే అవకాశముంది. → పిల్లలను రెండేళ్ల వయసులోనే బడిబాట పట్టించే సింగపూర్, హాంకాంగ్ వంటిచోట్ల సమస్య విస్తరిస్తోంది. → కోవిడ్ లాక్డౌన్ సమయంలో బాలల్లో హ్రస్వదృష్టి సమస్య బాగా పెరిగింది. → కోట్లాది మంది ఇళ్లకే పరిమితమై స్మార్ట్ ఫోన్లు, టీవీలు విపరీతంగా చూడటం దీనికి ప్రధాన కారణం. అమ్మాయిల్లోనే ఎక్కువ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే హ్రస్వదృష్టి ఎక్కువగా కని్పస్తున్నట్టు అధ్యయనం తేలి్చంది. ‘‘అబ్బాయిలతో పోలిస్తే ఎదిగేక్రమంలో వాళ్లు ఇంట్లో గానీ, స్కూల్లో గానీ ఆటలపై, ఆరుబయట, గడిపే సమయం తక్కువ. వీటికితోడు ఆహారపు అలవాట్లు తదితరాల వల్ల చాలా చిన్నవయసులోనే రజస్వల అవుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారిలో చాలావరకు టీనేజ్లోనే హ్రస్వదృష్టి బారిన పడుతున్నారు’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శారీరక శ్రమ లేని వారిపై కరోనా ప్రభావం ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ: శారీరక శ్రమ లేని వారిపై కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. నిశ్చల స్థితిలో రెండేళ్లుగా ఉన్న వారు కరోనాకు గురైతే బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అమెరికాలో కరోనా మహమ్మారి రాక ముందు రెండేళ్లుగా శారీరక శ్రమ (ఇన్ యాక్టివ్) లేని వారు ఎక్కువగా ఆసుపత్రి పాలయ్యారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకులు పేర్కొన్నారు. ఈ తరహా రోగులకు సాధారణంగా ఐసీయూ చికిత్స అందించాల్సి వచ్చిందని, అంతేకాకుండా శారీరక శ్రమ (యాక్టివ్) చేసిన వారికన్నా ఈ తరహా రోగులు ఎక్కువగా మృతి చెందారని పేర్కొన్నారు. ఈ అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ (బీజేఎస్ఎం) తాజా సంచికలో ప్రచురితమైంది. వృద్ధాప్యం, అవయవ మార్పిడి చరిత్ర ఉన్న వారి కన్నా గడిచిన రెండేళ్లుగా నిశ్చలంగా ఏ శారీరక శ్రమ లేని వారికే కరోనా అత్యంత ప్రమాదకారిగా తయారైందని పరిశోధకులు చెబుతున్నారు. వృద్ధాప్యం, చికిత్స పొందుతున్నవారు, డయాబెటిక్, ఒబెసిటీ, గుండెపోటు తదితర రోగాలతో బాధపడుతున్న వారు, పురుషులపై కరోనా ప్రభావం అధికంగా కనిపించినట్లు తెలిపారు. జాతి, వయసు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు ఇలా అనేక అంశాలు పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు. వారంలో 150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేసిన వారికన్నా రెండింతలు ఎక్కువగా శారీరక శ్రమ చేయని వారు ఆసుపత్రి పాలయ్యారని తెలిపింది. వీరిలో 73 శాతం ఐసీయూ అవసరం పడింది. మృతి చెందిన వారిలో 2.5 రెట్లు వీరే అధికం. శారీరక శ్రమ లేని రోగులు 20 శాతం అధికంగా ఆసుపత్రుల్లో చేరితే 10 శాతం ఎక్కువ మంది ఐసీయూలో చేరాల్సి వచ్చిందని, 32 శాతం అధికంగా మృతి చెందారని అధ్యయనంలో తేలింది. ఇది ఒక పరిశీలనాత్మక అధ్యయనంగా పరిశోధనలో పాలు పంచుకున్న కైజర్ పర్మనెంటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు పేర్కొన్నారు. అన్ని వయసుల వారు తప్పకుండా శారీరక శ్రమ చేయాలని కరోనా నియంత్రణ మార్గదర్శకాల్లో చేర్చాలని పరిశోధకులు సూచించారు. చదవండి: ‘కుంభమేళా’పై విమర్శల వెల్లువ -
గుండెపోటును గుర్తించాలంటే ఇలా చేయాలట!
వాషింగ్టన్: భవిష్యత్‌లో రాబోయే గుండెజబ్బును గుర్తించేందుకు రెండు చేతులకు కచ్చితంగా రక్తపోటు పరీక్షలను చేయించుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. దీని మూలంగా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని సరైన సమయంలో గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కుడి,ఎడమ చేతులకు ఈ పరీక్ష చేయడం వల్ల రీడింగ్‌లలో తేడాలను గుర్తించినట్టు చెబుతున్నారు. తరచుగా బీపీ పరీక్షను చేయించుకునేపుడు రెండు చేతులకు చేయించుకోవాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. స్కాట్లాండ్కు చెందిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు. సుమారు 3,000 మందికిపై పరిశోధన నిర్వహించినపుడు ఈ ఆశ్చర్యకరమైన విషయాలు తేలాయని చెబుతున్నారు. ఒక చేతికి మాత్రమే బీపీ చెక్ చేసినప్పుడు, రెండు చేతులకు బీపీ చెక్ చేసినపుడు గణనీయమైన మార్పును గమనించామన్నారు. వీటి తేడాలో 5 పాయింట్లు ఎక్కువగా రక్తపోటు కలిగిన వారికి గుండెపోటు వచ్చే ఆస్కారం రెండు రెట్లు అధికంగా ఉంటుందని తెలిపారు. ఎనిమిదేళ్ల పాటు జరిపిన పరిశోధనల్లో 60 శాతం మందిలో ఈ తేడా కనిపించిందని చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బీపీ పరీక్ష స్థానంలో ఈ పరీక్షకు అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఈ పరీక్షను తరచూ చేయించుకోవడం వల్ల ఆరోగ్యంలో తేడాలను సులభంగా గుర్తించవచ్చని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ క్రిస్ క్లార్క్ తెలిపారు. ఈ పరీక్షల ద్వారా వేరే ఏవైనా జబ్బులు వచ్చే అవకాశాలను గుర్తించగలమా అనే అంశంపైనా, వీటికి పరిష్కార మార్గాలపై పరిశోధనలు చేయనున్నట్లు వివరించారు. పరీక్షలో ఎటువంటి రిస్క్ కనిపించని వాళ్లూ జబ్బు బారిన పడకుండా ఉండేందుకు హైపర్‌టెన్షన్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకునే ముందు బీపీ పరీక్ష చేయించుకోవాలని ప్రొఫెసర్ జెరెమ్ పియర్సన్ తెలిపారు.ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను బ్రిటీష్‌కు చెందిన జర్నల్ ఆఫ్ జనరల్ ప్రాక్టీస్‌లో ప్రచురించారు.