సెల్‌ఫోన్‌ చోరుల కొత్త పంథా.. | Cell Phone Stealing Gang Mystery In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: సెల్‌ఫోన్‌ చోరుల కొత్త పంథా 

Published Sun, Dec 12 2021 8:57 AM | Last Updated on Sun, Dec 12 2021 9:00 AM

Cell Phone Stealing Gang Mystery In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సెల్‌ఫోన్ల దొంగలు రూట్‌ మార్చారు. ఒకప్పుడు చోరీ చేసిన ఫోన్లను యథాతథంగా వినియోగించడం/విక్రయించడం జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇలా తస్కరించిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను ట్యాంపరింగ్‌/క్లోనింగ్‌ చేసి వాడటం మొదలెట్టారు. ఆపై ఇతర రాష్ట్రాలు, దేశాలకు విదేశాలకు తరలించేయడం చేశారు. తాజాగా చోరీ ఫోన్లను స్పేర్‌ పార్ట్స్‌గా మార్చి అమ్మేస్తున్నట్లు నగర పోలీసులు గుర్తించారు. ఈ ముఠాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలోని పిక్‌పాకెటింగ్‌ గ్యాంగ్‌లు ఒకప్పుడు కేవలం పర్సుల్ని మాత్రమే టార్గెట్‌ చేసేవి. అయితే ప్లాస్టిక్‌ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్‌ కార్డుల వినియోగం పెరిగిన తరవాత వీరి దృష్టి సెల్‌ఫోన్లపై పడింది. పీడీ యాక్ట్‌ ప్రయోగం ప్రారంభమయ్యే వరకు కరుడుగట్టిన రౌడీషీటర్లు కూడా ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు.

ఇప్పటికీ మరికొన్ని చోటా మోటా ముఠాలు ఈ దందాలో ఉన్నాయని అంటున్నారు. ఒకరి ‘ఏరియా’ల్లోకి మరోకరు ప్రవేశిస్తుండటంతో వీటి మధ్య అనేక సందర్భాల్లో గ్యాంగ్‌ వార్స్‌ జరిగాయి.  

గల్లీ దుకాణాల కేంద్రంగానే.. 

అనధికారిక సమాచారం ప్రకారం రాజధానిలో ఏటా దాదాపు లక్ష వరకు సెల్‌ఫోన్లు చోరీకి అవుతున్నాయి. రాజధాని నగరంలో అనేక ఛోటామోటా ముఠాలు సెల్‌ఫోన్‌ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని ఈ సెల్‌ఫోన్‌ నేరం అనేది కొనసాగుతోంది. వీరిబారిన పడే వారిలో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు.

ఇలాంటి ఫోన్లను స్పేర్‌పార్ట్స్‌గా మార్చడం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ దందాను పెద్ద దుకాణాలు, మార్కెట్లలో కాకుండా గల్లీల్లో ఉండే చిన్న చిన్న దుకాణాల కేంద్రంగా చేస్తున్నారనే సమాచారం ఉంది. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం. 

– నగర పోలీసు ఉన్నతాధికారి  

గతంలో ఐఎంఈఐ నెంబర్‌ మార్చేసి...  

ప్రపంచంలో తయారయ్యే ప్రతి మొబైల్‌ ఫోన్‌కీ ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిఫికేషన్‌(ఐఎంఈఐ) నెంబర్‌ ఉంటుంది. సదరు సెల్‌ఫోన్‌ను ఎవరు వాడుతున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐఎంఈఐ నెంబర్‌ ట్యాంపర్‌ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్‌ ఇంటర్‌నెట్‌లో లభిస్తున్నాయి.

చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నెంబర్‌కు బదులు మరో ఐఎంఈఐ నెంబర్‌ కేటాయించేసేవారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్‌ బోర్డ్‌పై ఉన్న ఐఎంఈఐ నెంబర్‌ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్‌ ద్వారా సేకరించి చోరీ వాటికి వేసేసే వారు. ఇలా చేస్తే సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. 

ఇలా విడగొట్టేసి.. అలా విక్రయాలు 

ఇటీవల కాలంలో చోరీ ఫోన్లను ఖరీదు చేసే నగర వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు సిటీ పోలీసులు గుర్తించారు. వీటిని యథాతథంగా విక్రయిస్తే నిఘా సమస్య ఉంటోందని భావించారు. దీంతో స్పేర్‌పార్ట్స్‌గా మార్చేసి అమ్ముతున్నారు.

ఐఎంఈఐ నెంబర్‌ అనేది ఫోన్‌ మదర్‌ బోర్డ్‌కు సంబంధించిన అంశం. ఈ నేపథ్యంలోనే దీన్ని మాత్రం అమ్మకుండా మిగిలిన అన్ని విడి భాగాలకు సెల్‌ఫోన్‌ దుకాణాలకు అమ్మేస్తున్నారు.

ఇలా చేయడంతో లాభం తక్కువగా ఉన్నప్పటికీ రిస్క్‌ అనేది ఉండదన్నది చోరీ సొత్తు విక్రేతల ఉద్దేశం. కొందరు సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ షాపులతో పాటు ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లతో ఈ తరహా విక్రేతలకు సంబంధాలు ఉంటున్నాయని అధికారులు తేల్చారు. ఈ దందా చేస్తున్న వ్యాపారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.  

కొన్నేళ్ల నుంచి కరోనా ముందు రోజుల వరకు ఈ చోరీఫోన్లు దేశం దాటేశాయి.  

 ఈ ఫోన్లను వ్యవస్థీకృత ముఠాలు ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు తరలించేసిన సందర్భాలు అనేకం.  

 ఐ–ఫోన్ల వంటివైతే ఒక్కో విడతలో నాలుగైదు ఫోన్లు చొప్పున బ్యాంకాక్‌ తీసుకువెళ్ళి అక్కడ మార్కెట్‌లో అమ్మేసి వచ్చిన చోరులు అనేక మంది ఉన్నారు.  

► నగరంలో జగదీష్‌ మార్కెట్‌ మాదిరిగా ఆ దేశంలోనూ ఓ భారీ సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్ల మార్కెట్‌ ఉందని, అయితే ఐ–ఫోన్లకే గిరాకీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు గుల్బర్గాలో ఉన్న సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో దేశంలో చోరీ మాల్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అని పోలీసులు గుర్తించారు. ఇలానే రిటర్న్‌ మాల్‌ పేరుతో చైనాకు చోరీ ఫోన్లు పంపిన సందర్భాలు అనేకం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement