వ్యక్తితో టీ స్టాల్ యువకుడి ఘర్షణ
ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య
మియాపూర్ పీఎస్ పరిధిలో ఘటన
మియాపూర్: తమను అడగకుండా నీళ్లు తీసుకున్నాడని టీ స్టాల్‌లో పనిచేసే ముగ్గురు యువకులు ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం బోడగట్టు గ్రామానికి చెందిన చాకలి సాయిలు (35)కు భార్య మీనా ఇద్దరు కుమారులు మహి, కిరణ్ ఉన్నారు. బీరంగూడలో ఉంటూ మియాపూర్‌లోని లారీలలో ఇసుకను ఖాళీ చేసే పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సాయిలు ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు మియాపూర్ వచ్చి లారీలలోని ఇసుకను ఖాళీ చేసి ఉదయం ఇంటికి వెళ్తుంటాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటలకు పనికి వచ్చి లారీలలోని ఇసుకను ఖాళీ చేశాడు. శుక్రవారం తెల్లవారు జామున దాహం వేస్తోందని మియాపూర్‌లోని రాజారామ్ కాలనీ సమీపంలో ఉన్న సురక్ష టీ స్టాల్‌లో నీళ్లు తాగేందుకు వెళ్లాడు. నీళ్లు తాగుతుండగా టీ స్టాల్‌లో పని చేస్తున్న సతీష్ అనే యువకుడు సాయిలుతో ఘర్షణకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత సాయిలు అక్కడి నుంచి సమీపంలో ఉన్న కూలీల అడ్డా వద్దకు వెళ్లాడు. కొంత సేపటి తర్వాత టీ స్టాల్‌లో పనిచేసే సతీష్ పాల ప్యాకెట్ తీసుకువచ్చేందుకు వెళ్తుండగా మళ్లీ వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.
స్నేహితులకు ఫోన్ చేసి.. రప్పించి..
సతీష్ ఆగ్రహంతో సమీపంలో ఉన్న స్నేహితులు భాను, లక్ష్మణ్ అలియాస్ లక్కీలకు ఫోన్ చేసి రప్పించాడు. ముగ్గురూ కలిసి సాయిలుపై దాడికి దిగారు. సమీపంలోని కూలీలు విడిపిస్తున్నా వినకుండా తీవ్రంగా కొట్టి సాయిలును స్కూటీపై తీసుకుని టీ స్టాల్ వద్ద పడేసి వెళ్లిపోయారు. స్థానికులు, కూలీలు చూసేసరికి సాయిలు మృతిచెంది ఉన్నాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మృతుని బంధువు నాగారం సాయిలు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. సాయిలు హత్యకు గురయ్యారడనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి కూలీలు మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని న్యాయం చేయాలంటూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment