ఐసీయూ తరహాలో.. | Shops And Salons Caring of Customers in Hyderabad | Sakshi
Sakshi News home page

సేఫ్‌ సర్వీస్‌!

Published Thu, May 21 2020 8:06 AM | Last Updated on Thu, May 21 2020 8:06 AM

Shops And Salons Caring of Customers in Hyderabad - Sakshi

మాస్కులు, గ్లౌజ్‌లతో సెలూన్‌ సేవలు

సాక్షి, సిటీ నెట్‌వర్క్‌:  కోవిడ్‌ సరికొత్త పాఠాలు నేర్పించింది. అన్ని రంగాలు, సేవల్లోనూ కరోనా నిబంధనలకుఅనుగుణమైన మార్పులు వచ్చేశాయి.కోవిడ్‌కు ముందు, ఆ తర్వాత సేవలనిర్వచనాలు మారాయి. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాల్లోనూ కోవిడ్‌ కట్టడి చర్యలు తప్పనిసరిగా మారాయి.మాస్కులు, శానిటైజర్లు, థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు అన్నిచోట్లా దర్శనమిస్తున్నాయి.పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌లను తలపించే డ్రెస్సులతో సెలూన్లు సేవలందజేస్తున్నాయి. ఒకసారి వినియోగించి పారేసే సింగిల్‌ యూజ్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్లు వినియోగంలోకి వచ్చాయి. మరోవైపు జనం సైతం ఎక్కడికెళ్లినా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. స్వచ్ఛందంగానే భౌతిక దూరం పాటిస్తున్నారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌లు, మొబైల్‌ ఫోన్‌ షాపులు, వస్త్ర దుకాణాలు తదితర చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం లాక్‌డౌన్‌ నిబంధనలు భారీగా సడలించి అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతినివ్వడంతో నగరంలో సందడి పెరిగింది.

రహదారులపై వాహనాల రాకపోకలు సైతం పెరిగాయి. ఇదే సమయంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే వివిధ రకాల అవసరాల కోసం బయటకి వచ్చే నగరవాసులు కోవిడ్‌ నిబంధనలను పాటించేందుకే మొగ్గుచూపుతున్నారు. మరోవైపు వ్యాపార సంస్థలు సైతం నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. పలు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్‌ షోరూమ్‌లలో థర్మల్‌ స్క్రీనింగ్‌లను ఏర్పాటు చేశారు. వినియోగదారుల శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటేనే అనుమతిస్తున్నారు. షోరూమ్‌ బయటే కాలుతో నొక్కి వినియోగించేందుకు అనువైన శానిటైజర్లను ఏర్పాటు చేశారు. ఒకేసారి ఎక్కువ మంది వినియోగదారులు వచ్చినప్పుడు భౌతిక దూరానికి విఘాతం కలగకుండా చిన్న చిన్న బృందాలుగా ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. మరోవైపు పలు దుకాణాల్లో  సిబ్బంది సంఖ్యను సైతం బాగా తగ్గించి సేవలు అందజేస్తున్నారు. మరోవైపు సుదీర్ఘమైన లాక్‌డౌన్‌ కారణంగా షాపులు మూసి ఉంచడం, కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా పలు వస్తువులు, సేవల ధరలు సైతం పెరిగాయి. సాధారణ రోజుల్లో ఉన్న ధరలపై 20 నుంచి 26 శాతం వరకు పెంచి విక్రయిస్తున్నారు. 

ఐసీయూ తరహాలో..  
'మై సర్వీస్‌ వెరీ సేఫ్‌’. ఇప్పుడు హెయిర్‌ కటింగ్‌ సెలూన్లు, బ్యూటీపార్లర్లు కొత్త తరహా నినాదాన్ని అందుకున్నాయి. కోవిడ్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా  తీవ్రంగా నష్టపోయిన సెలూన్లు వినియోగదారులకు సురక్షితమైన సేవలనందించేందుకు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లను తలపిస్తున్నాయి. పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సెలూన్లు, బ్యూటీపార్లర్లలో పనిచేసే హెయిర్‌స్టైలిస్ట్‌లు పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్లతో పాటు మాస్కులు, గ్లౌస్‌లు విధిగా ధరిస్తున్నారు. చాలా చోట్ల సింగిల్‌ యూజ్‌ ఎక్విప్‌మెంట్లనే వినియోగిస్తున్నారు. కత్తెర, దువ్వెన వంటివి వినియోగదారులు సొంతంగా తెచ్చుకొనేలా ప్రోత్సహిస్తున్నారు. వేడి డెట్టాల్‌ నీటిలో శుభ్రం చేస్తున్నారు. కస్టమర్ల రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కరిద్దరు కస్టమర్లకు మించి వెయిటింగ్‌లో ఉండనీయడం లేదు. అన్నిచోట్ల ఫోన్‌ బుకింగ్‌లు  తప్పనిసరయ్యాయి. కేటాయించిన స్లాట్‌ ప్రకారం సేవలందజేస్తున్నారు. వరుసగా 4 సీట్లు ఉంటే ఒకటి విడిచి మరో సీటులో సేవలు అందిస్తున్నారు. ప్రతి గంటకు ఒకసారి శానిటైజ్‌ చేస్తున్నారు. హ్యాండ్‌వాష్‌ చేసుకున్న తర్వాతే వినియోగదారులను అనుమతిస్తున్నారు.  

రెస్టారెంట్లలో టేక్‌ అవే సర్వీసులు..
రెస్టారెంట్లు, హోటళ్లు టేక్‌ అవే సర్వీసులను అందజేస్తున్నాయి.రెండు రోజులుగా అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోవడంతో పార్శిళ్లు తీసికెళ్లే వారి సంఖ్య తగ్గింది.   మాస్క్, భౌతికదూరం పాటించాలని, వచ్చిన వారు శానిటర్‌తో చేతులు శుభ్రపరుచుకోవాలని వినియోగదార్లకు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఓన్లీ టేక్‌ అవే (పార్శిల్‌)కి మాత్రమే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. పార్శిల్‌ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితిలో లోపలి లాంజ్‌లో నాలుగు అడుగుల దూరంలో చైర్స్‌ను అమర్చారు. వచ్చిన వారికి ఒక మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ఇచ్చి పార్శిల్‌ వచ్చే వరకు అక్కడ సేద తీరేలా ఏర్పాట్లు చేశారు. ఎంట్రన్స్‌లో ఉంచిన థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు.  

కోవిడ్‌ రహిత క్యాబ్‌ సేవలు..  

క్యాబ్‌లు క్రమంగా రోడ్డెక్కుతున్నాయి. ఉబెర్, ఓలా వంటి సంస్థలు కోవిడ్‌  వైరస్‌ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తున్నాయి. బుకింగ్‌ బుకింగ్‌కూ మధ్య కారును శానిటైజ్‌ చేయడం తప్పనిసరి చేశారు. క్యాబ్‌ డ్రైవర్లకు మాస్క్‌లు, గ్లౌజ్‌లతో పాటు శానిటైజేషన్‌ను ఆయా సంస్థలే అందించేలా చర్యలు చేపట్టాయి. గ్రేటర్‌లో సుమారు 2 లక్షల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం క్యాబ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ పడ్డా ఈ రెండు రోజుల్లో 10 శాతం మాత్రమే రోడ్డెక్కాయి. పూర్తి స్థాయిలో కరోనా జాగ్రత్తలతో కూడిన పరికరాలను సమకూర్చుకుని రోడ్డెక్కాలనే  వ్యూహంలో ఉన్నారు.  

ఉబెర్‌లో ఇద్దరికే అనుమతి..
క్యాబ్‌ డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు మాస్క్‌లు, శానిటైజేషన్‌ చేయించుకోవాలనే నిబంధన ఉంది. ప్రతి బుకింగ్‌ తర్వాత కారు లోపల భాగాన్ని శానిటైజ్‌ చేయాలని నిర్ణయించాం. అది ఏ మేర సాధ్యమవుతుందో ఆలోచిస్తున్నాం. క్యాబ్‌లో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులకు అనుమతి ఉండగా.. ఊబెర్‌ క్యాబ్‌ మాత్రం డ్రైవర్‌తో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తాం.  – ప్రవీణ్, ఉబెర్‌ క్యాబ్‌ చందానగర్‌ బ్రాంచ్‌ లీడ్‌

ఆస్పత్రి తరహా సేవలు..
ఆస్పత్రి తరహాలో సెలూన్‌లో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్కో కస్టమర్‌ బయటికి వెళ్లి మరో కస్టమర్‌ను లోపలికి పిలిచే ముందే షాపును పూర్తిగా శుభ్రపరుస్తున్నాం. పరికరాలు, టవల్స్, సీట్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాం.   – శ్రీనివాస్, సెలూన్‌ నిర్వాహకుడు

ఈ పద్ధతులు ఎప్పటికీ పాటించాలి   
హెయిర్‌ కటింగ్‌ దుకాణాల్లో అమలు చేస్తున్న శానిటరీ పద్ధతులు బాగున్నాయి. కరోనా మాత్రమే కాదు ఎటువంటి అంటు వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఈ పద్ధతులు ఎంతగానో దోహదం చేస్తాయి. అన్ని రోజుల్లోనూ ఇటువంటివి అమలు చేయడం అందరికీ మంచిది.      – వెంకటేశ్, వినియోగదారుడు

శానిటైజేషన్‌ తప్పనిసరి..
కోవిడ్‌– 19 నేపథ్యంలో అటు క్యాబ్‌ డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు సురక్షితమైన ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. క్యాబ్‌లపై విశ్వాసం కలిగేలా కారు లోపలి భాగంలో ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలనే ఆలోచనలోనే యాజమాన్యం కూడా భావిస్తోంది. ఆ దిశగా క్యాబ్‌ డ్రైవర్లను కూడా సిద్ధం చేసే పనిలో ఉంది.– గోపీ, ఓలా క్యాబ్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement