న్యూఢిల్లీ: దేశీయంగా అమ్మకాల పరిమాణం, ఎగుమతులు తగ్గే అవకాశాలు ఉండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) దిగ్గజ ఆటో విడిభాగాల తయారీ సంస్థల వార్షిక ఆదాయ వృద్ధి మందగించనుంది. 5–7 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు అంచనాలతో నివేదికను రూపొందించింది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 2.7 లక్షల కోట్ల వార్షిక ఆదాయాలు ఉన్న 45 ఆటో విడిభాగాల సంస్థలను ఈ అధ్యయనం కోసం పరిగణనలోకి తీసుకుంది.
అధిక బేస్, ఎగుమతుల్లో ఒక మోస్తరు వృద్ధే ఉన్నప్పటికీ దేశీయంగా డిమాండ్ ఆరోగ్యకరమైన స్థాయిలో ఉన్నందున వీటి ఆదాయాలు ఈ ఆర్థిక సంవత్సరం 9–11 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం దేశీయంగా అమ్మకాల పరిమాణం మందగించవచ్చని, ఎగుమతుల పరిస్థితి కూడా బలహీనంగానే ఉండవచ్చని ఇక్రా పేర్కొంది. ఈ నేపథ్యంలో కంపెనీల ఆదాయ వృద్ధి కూడా మందగించే అవకాశం ఉందని తెలిపింది. నివేదికలోని మరిన్ని వివరాలు..
► సామర్ధ్యాలను పెంచుకునేందుకు, టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా ఇన్వెస్ట్ చేశాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగనుంది. 2024–25లో పరిశ్రమ పెట్టుబడి వ్యయాలు కనీసం రూ. 20,000–25,000 కోట్ల మేర ఉండవచ్చని
అంచనా.
► కొత్త ఉత్పాదనల తయారీ, అధునాతన టెక్నాలజీ అభివృద్ధి మొదలైన అంశాలపై అదనంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలు, సామర్ధ్యాల పెంపు, నియంత్రణ సంస్థపరంగా రాబోయే కొత్త మార్పుల అమలు మొదలైన వాటి కోసం మరింతగా ఇన్వెస్ట్ చేయొచ్చు.
► అంతర్జాతీయ దిగ్గజ తయారీ సంస్థలు (ఓఈఎం) కొత్త తరహా వాహనాల కోసం సరఫరాదారులను విస్తృతంగా ఎంపిక చేసుకుంటూ ఉండటం, విదేశాల్లో ఆఫ్టర్ మార్కెట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూ ఉండటం వంటివి భారతీయ ఆటో విడిభాగాల సరఫరా సంస్థలకు సానుకూలం కాగలదు.
► మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు .. ప్రీమియం వాహనాలు .. స్థానికంగా తయారీకి ప్రాధాన్యం పెరుగుతుండటం, విధానాలపరమైన మార్పులు మొదలైన అంశాలు ఆటో విడిభాగాల సరఫరా సంస్థల స్థిర వృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది.
రెండంకెల స్థాయిలో టూ–వీలర్ల ఆదాయ వృద్ధి
ప్రీమియం మోడల్స్‌కు మరింత డిమాండ్– వచ్చే ఆర్థిక సంవత్సరంపై హీరోమోటో సీఈవో గుప్తా అంచనా
వచ్చే ఆరి్థక సంవత్సరం దేశీ ద్విచక్ర వాహనాల పరిశ్రమ ఆదాయాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. ప్రీమియం మోడల్స్‌కు డిమాండ్ మరింతగా పెరగనుండటం ఇందుకు దోహదపడగలదని చెప్పారు. టూ–వీలర్ల విషయంలో కొనుగోలుదారులు ఎక్కువ ఫీచర్లు ఉండే మోడల్స్ వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
గత కొన్నాళ్లుగా అమ్మకాలు ఒక మోస్తరుగానే ఉంటున్న ఎంట్రీ స్థాయి బైకుల విభాగం కూడా కోలుకుంటోందని తెలిపారు. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ డిమాండ్ గణనీయంగా మెరుగుపడిందని గుప్తా వివరించారు. ప్రీమియం సెగ్మెంట్ మోడల్స్ విక్రయం కోసం తమ అవుట్‌లెట్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇప్పటివరకు 300 డీలర్íÙప్‌లను అప్‌గ్రేడ్ చేసినట్లు గుప్తా పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి వీటి సంఖ్యను 400కు, వచ్చే ఏడాది 100 ప్రీమియా స్టోర్స్‌తో పాటు 500కు పెంచుకుంటామన్నారు. హీరో మోటోకార్ప్ గతేడాది అక్టోబర్‌లో ప్రీమియా బ్రాండ్ పేరుతో తొలి ప్రీమియం–ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ప్రారంభించింది. ప్రీమియం సెగ్మెంట్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన మావ్రిక్ 440 డెలివరీలు ఏప్రిల్ నుంచి ప్రారంభం కాగలవని గుప్తా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment