revenue BREAK
-
ICRA: ఆటో విడిభాగాల సంస్థల ఆదాయానికి బ్రేకులు
న్యూఢిల్లీ: దేశీయంగా అమ్మకాల పరిమాణం, ఎగుమతులు తగ్గే అవకాశాలు ఉండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) దిగ్గజ ఆటో విడిభాగాల తయారీ సంస్థల వార్షిక ఆదాయ వృద్ధి మందగించనుంది. 5–7 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు అంచనాలతో నివేదికను రూపొందించింది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 2.7 లక్షల కోట్ల వార్షిక ఆదాయాలు ఉన్న 45 ఆటో విడిభాగాల సంస్థలను ఈ అధ్యయనం కోసం పరిగణనలోకి తీసుకుంది. అధిక బేస్, ఎగుమతుల్లో ఒక మోస్తరు వృద్ధే ఉన్నప్పటికీ దేశీయంగా డిమాండ్ ఆరోగ్యకరమైన స్థాయిలో ఉన్నందున వీటి ఆదాయాలు ఈ ఆర్థిక సంవత్సరం 9–11 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం దేశీయంగా అమ్మకాల పరిమాణం మందగించవచ్చని, ఎగుమతుల పరిస్థితి కూడా బలహీనంగానే ఉండవచ్చని ఇక్రా పేర్కొంది. ఈ నేపథ్యంలో కంపెనీల ఆదాయ వృద్ధి కూడా మందగించే అవకాశం ఉందని తెలిపింది. నివేదికలోని మరిన్ని వివరాలు.. ► సామర్ధ్యాలను పెంచుకునేందుకు, టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా ఇన్వెస్ట్ చేశాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగనుంది. 2024–25లో పరిశ్రమ పెట్టుబడి వ్యయాలు కనీసం రూ. 20,000–25,000 కోట్ల మేర ఉండవచ్చని అంచనా. ► కొత్త ఉత్పాదనల తయారీ, అధునాతన టెక్నాలజీ అభివృద్ధి మొదలైన అంశాలపై అదనంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలు, సామర్ధ్యాల పెంపు, నియంత్రణ సంస్థపరంగా రాబోయే కొత్త మార్పుల అమలు మొదలైన వాటి కోసం మరింతగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ► అంతర్జాతీయ దిగ్గజ తయారీ సంస్థలు (ఓఈఎం) కొత్త తరహా వాహనాల కోసం సరఫరాదారులను విస్తృతంగా ఎంపిక చేసుకుంటూ ఉండటం, విదేశాల్లో ఆఫ్టర్ మార్కెట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూ ఉండటం వంటివి భారతీయ ఆటో విడిభాగాల సరఫరా సంస్థలకు సానుకూలం కాగలదు. ► మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు .. ప్రీమియం వాహనాలు .. స్థానికంగా తయారీకి ప్రాధాన్యం పెరుగుతుండటం, విధానాలపరమైన మార్పులు మొదలైన అంశాలు ఆటో విడిభాగాల సరఫరా సంస్థల స్థిర వృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది. రెండంకెల స్థాయిలో టూ–వీలర్ల ఆదాయ వృద్ధి ప్రీమియం మోడల్స్‌కు మరింత డిమాండ్– వచ్చే ఆర్థిక సంవత్సరంపై హీరోమోటో సీఈవో గుప్తా అంచనా వచ్చే ఆరి్థక సంవత్సరం దేశీ ద్విచక్ర వాహనాల పరిశ్రమ ఆదాయాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. ప్రీమియం మోడల్స్‌కు డిమాండ్ మరింతగా పెరగనుండటం ఇందుకు దోహదపడగలదని చెప్పారు. టూ–వీలర్ల విషయంలో కొనుగోలుదారులు ఎక్కువ ఫీచర్లు ఉండే మోడల్స్ వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గత కొన్నాళ్లుగా అమ్మకాలు ఒక మోస్తరుగానే ఉంటున్న ఎంట్రీ స్థాయి బైకుల విభాగం కూడా కోలుకుంటోందని తెలిపారు. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ డిమాండ్ గణనీయంగా మెరుగుపడిందని గుప్తా వివరించారు. ప్రీమియం సెగ్మెంట్ మోడల్స్ విక్రయం కోసం తమ అవుట్‌లెట్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు 300 డీలర్íÙప్‌లను అప్‌గ్రేడ్ చేసినట్లు గుప్తా పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి వీటి సంఖ్యను 400కు, వచ్చే ఏడాది 100 ప్రీమియా స్టోర్స్‌తో పాటు 500కు పెంచుకుంటామన్నారు. హీరో మోటోకార్ప్ గతేడాది అక్టోబర్‌లో ప్రీమియా బ్రాండ్ పేరుతో తొలి ప్రీమియం–ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ప్రారంభించింది. ప్రీమియం సెగ్మెంట్లో కొత్తగా ప్రవేశపెట్టిన మావ్రిక్ 440 డెలివరీలు ఏప్రిల్ నుంచి ప్రారంభం కాగలవని గుప్తా పేర్కొన్నారు. -
డయాగ్నస్టిక్ కంపెనీలకు ఇబ్బందే
ముంబై: వ్యాధి నిర్ధారణ సేవల్లోని కంపెనీల (డయాగ్నస్టిక్స్) ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం తగ్గొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. కరోనా పరీక్షలు గణనీయంగా తగ్గిపోవడం ఆదాయాల క్షీణతకు దారితీస్తుందని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున ఉండడంతో కంపెనీలు ఆదాయంలో 30 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు గుర్తు చేసింది. వైరస్ ప్రభావం క్షీణించడం, స్వయంగా పరీక్షించుకునే కిట్లకు ప్రాధాన్యం ఇస్తుండడం డయాగ్నస్టిక్స్ కంపెనీల ఆదాయాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సంరలో ప్రభావితం చేస్తుందన్నది క్రిసిల్ విశ్లేషణగా ఉంది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో కంపెనీల లాభాల మార్జిన్లు దశాబ్ద గరిష్టమైన 28 శాతానికి చేరుకోగా, అవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 24–25 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్ తెలిపింది. ఆదాయం తగ్గడానికితోడు అధిక నిర్వహణ వ్యయాలు, ప్రకటనలు, మార్కెటింగ్‌పై అధిక వ్యయాలు లాభాల మార్జిన్లపై ప్రభావం చూపిస్తాయని వివరించింది. అయినప్పటికీ మెరుగైన నగదు ప్రవాహాలు, పటిష్ట మూలధన వ్యయ విధానాలు (ఎక్విప్మెంట్ తదితర), రుణ భారం తక్కువగా ఉండడం వంటివి ఈ రంగంలోని కంపెనీల బ్యాలన్స్ షీట్లను ఆరోగ్యంగానే ఉంచుతాయని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. ఈ రంగంలోని 11 సంస్థల బ్యాలన్స్ షీట్లను క్రిసిల్ విశ్లేషించింది. పెరిగిన పోటీ.. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా టెస్ట్‌ల ద్వారా ఆదాయం మొత్తం ఆదాయంలో 20 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైనట్టు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. కాకపోతే ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షల రూపంలో ఆదాయం 12–14 శాతం మేర పెరగడంతో ఈ ప్రభావాన్ని చాలా వరకు అవి అధిగమిస్తాయని చెప్పారు. ఆన్లైన్ ఫార్మసీ సంస్థలు ల్యాబ్ టెస్ట్‌లను కూడా ఆఫర్ చేస్తుండడంతో ఈ రంగంలో పోటీ పెరిగినట్టు క్రిసిల్ వెల్లడించింది. కాకపోతే వైద్యులు సూచించే పరీక్షలకు ఆన్లైన్ సంస్థల నుంచి పోటీ ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ‘‘ఆన్లైన్ సంస్థలు సొంతంగా సదుపాయాలపై పెట్టుబడులు పెట్టుకుండా, స్థానిక వ్యాధి నిర్ధారణ కేంద్రాలతో టైఅప్ పెట్టుకుని కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే మార్కెట్లో నిలదొక్కుకున్న సంప్రదాయ డయాగ్నస్టిక్ సంస్థలు డిజిటల్ సదుపాయాలు, రోగి ఇంటికి వెళ్లి నమూనాల సేకరణకు పెట్టుబడులు పెంచాల్సిన పరిస్థితులను కల్పిస్తోంది’’అని క్రిసిల్ నివేదిక వివరించింది. భవిష్యత్తులో మరోసారి కరోనా వైరస్ మరింత తీవ్రరూపం దాల్చడం, ఆన్లైన్ సంస్థల నుంచి పెరిగే పోటీ, మార్కెట్ వాటా పెంచుకోవడాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. -
అక్షరాలా రూ. 4,000 కోట్ల ఆదాయం!
ముంబై: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడలు ఆగిపోయాయి. కనీసం చిన్న స్థాయి టోర్నీ కూడా నిర్వహించలేని పరిస్థితి. మన దేశంలోనైతే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020లో కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణ గురించి ఆలోచించింది. ► సాధారణంగా ప్రతీ ఏటా నిర్వహించే ఏప్రిల్–మే షెడ్యూల్ సమయం గడిచిపోయినా ఆశలు కోల్పోలేదు. కోవిడ్–19 కాలంలో ఎన్నో కష్టాలకోర్చి క్రికెట్ నిర్వహించడం అవసరమా అని ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ► అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలన్నీ ఆలోచించి చివరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో విజయవంతంగా ఐపీఎల్‌ను నిర్వహించింది. బీసీసీఐ ఎందుకు ఇంతగా శ్రమించిందో తాజా లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ► ఐపీఎల్–13 సీజన్ ద్వారా భారత బోర్డుకు ఏకంగా రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. లీగ్ జరపకుండా ఉండే ఇంత భారీ మొత్తాన్ని బోర్డు కోల్పోయేదేమో! తాజా సీజన్ ఐపీఎల్‌ను టీవీలో వీక్షించినవారి సంఖ్య గత ఏడాదికంటే 25 శాతం ఎక్కువగా ఉండటం విశేషం. –మరోవైపు ఐపీఎల్ సాగిన కాలంలో బోర్డు మొత్తంగా 1800 మందికి 30 వేల (ఆర్టీ–పీసీఆర్) కరోనా పరీక్షలు నిర్వహించడం మరో విశేషం. ఖర్చులు తగ్గించుకొని... సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఎలాంటి అంతరాయం లేకుండా జరిగిన 60 మ్యాచ్‌ల ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ► ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు దాదాపు రెండు నెలల ముందు ఎగ్జిబిషన్ టోర్నీ సమయంలో వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ జొకోవిచ్‌కు కరోనా రావడంతో మా లీగ్ నిర్వహణపై కూడా సందేహాలు కనిపించాయి. చాలా మంది మమ్మల్ని ముందుకు వెళ్లవద్దని వారించారు. ఎవరైనా క్రికెటర్‌కు కరోనా వస్తే ఎలా అని వారు అడిగారు. అయితే మేం వాటిని పట్టించుకోలేదు. ∙గత ఐపీఎల్‌తో పోలిస్తే బీసీసీఐ 35 శాతం నిర్వహణా ఖర్చులు తగ్గించుకుంది. నిర్వహణకు శ్రీలంక నుంచి కూడా ప్రతిపాదన వచ్చినా యూఏఐ వైపు మొగ్గు చూపాం. మూడు నగరాల మధ్యలో బస్సులో ప్రయాణించే అవకాశం ఉండటంతో అలా కూడా ఖర్చు తగ్గించాం. ► సుమారు 40 సార్లు కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా గంటలకొద్దీ చర్చలు సాగాయి. బయో సెక్యూర్ బబుల్ కోసం రెస్ట్రాటా అనే కంపెనీ సహకారం తీసుకున్నాం. బీసీసీఐ అధికారులు ముందుగా వెళ్లి ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. క్వారంటైన్ విషయంలో దుబాయ్ ప్రభుత్వం ఆటగాళ్లకు సడలింపులు ఇచ్చినా... యూఏఈ ప్రభుత్వం ససేమిరా అంది. చివరకు ఎంతో శ్రమించి వారిని కూడా ఒప్పించగలిగాం. ఇంత చేసినా ఆరంభంలోనే చెన్నై బృందంలో చాలా మందికి కరోనా వచ్చినట్లు తేలడంలో ఆందోళన కలిగింది. అయితే ఆ తర్వాత అంతా కోలుకున్నారు. మొత్తంగా యూఏఈ ప్రభుత్వ సహకారంతో లీగ్ సూపర్ హిట్ కావడం సంతోషకరం. చివరకు మాకు రూ. 4 వేల కోట్ల ఆదాయం కూడా వచ్చింది. -
ఇసుకాసురులు
⇒ పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక తరలింపు ⇒ జిల్లాలో నదులు, వాగుల ప్రాంతాల్లో 20కి పైగా నిల్వలు ⇒ ఫిబ్రవరిలో సర్వే చేసినా ఇవ్వని రీచ్ అనుమతులు ⇒ అక్రమార్కుల ఆగడాలతో ప్రభుత్వాదాయానికి భారీ గండి సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ఇసుక హారతిలా కరిగిపోతూనే ఉంది. వాగులు, వంకలు, ఒర్రెలు, నదుల నుంచి అక్రమార్కులు ఇసుకను నిత్యం తోడేస్తూనే ఉన్నారు. ఇసుక నిల్వలను గుర్తించిన ప్రభుత్వం ఇప్పటివరకు రీచ్‌లకు అనుమతివ్వలేదు. దీంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుండగా.. ప్రభుత్వానికి భారీగా గండిపడుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇసుకాసురుల అక్రమ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. రీచ్ అనుమతుల్లో జాప్యం.. జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్, మెంబర్ కన్వీనర్‌గా భూగర్భ గనుల శాఖ ఏడీ ఉన్నారు. ఐటీడీఏ పీవో, జిల్లా పంచాయతీ అధికారి, భూగర్భ జలాల శాఖ డీడీ, నీటిపారుదల శాఖ ఈఈ, గ్రామీణ నీటి సరఫరా ఈఈ, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డ్ పర్యావరణ ఇంజనీర్, తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ నుంచి ప్రతిపాదిత సభ్యుడు మెంబర్లుగా ఉన్నారు. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం జాయింట్ కమిటీ (భూగర్భ గనులు, రెవెన్యూ, భూగర్భ జలాలు, నీటిపారుదల శాఖ) ఇసుక రీచ్‌లను గుర్తించేందుకు సర్వే నిర్వహించింది. భీంపూర్, ఉట్నూర్, జైనథ్, తలమడుగు, సిరికొండ, ఆదిలాబాద్‌రూరల్ మండలాల్లో నది, వాగులు, వంకలు, ఒర్రెల సమీపంలో ఇసుక నిల్వలను గుర్తించారు. ఇప్పటివరకు ఇసుక నిల్వలున్న వాటికి రీచ్‌లుగా అనుమతి ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ప్రధానంగా ఇసుకకు ఒక ధర నిర్ణయించి దాని ఆధారంగా ప్రభుత్వానికి సీనరేజ్ చార్జీల రూపంలో ప్రతీ క్యూబిక్ మీటర్‌కు రూ.40 చొప్పున చెల్లించాలి. మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ఇసుక మేటలను తీసే, సరఫరా చేసే ప్రక్రియను పరిశీలించి వేబిల్లు ఆధారంగా ప్రక్రియ కొనసాగించాలి. కాగా జిల్లాలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వాదాయానికి గండి. జిల్లాలో ప్రధానంగా భూగర్భ గనుల శాఖకు పెద్ద తరహా ఖనిజం మాంగనీస్, చిన్న తరహా ఖనిజాలు స్టోన్ క్రషర్ల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది రూ7.21 కోట్లు లక్ష్యం నిర్ణయించగా, జూన్ వరకు రూ.4.16 కోట్ల ఆదాయం లభించింది. ఇసుక ద్వారా ఆదాయం లభించే మార్గం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో నష్టం జరుగుతోంది. ఇసుకాసురులు ఎలాంటి అనుమతి లేకుండానే నది పరీవాహక ప్రాంతాలు, వాగుల్లో వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను యథేచ్ఛగా దోపిడీ చేసేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ట్రాక్టర్ (రెండున్నర క్యూబిక్ మీటర్లు) ఇసకకు రూ.2వేల నుంచి రూ.రెండున్నర వేలు, టిప్పర్ (8 క్యూబిక్ మీటర్లు) ఇసుకకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. పెన్‌గంగా నుంచి దోపిడీ.. పెన్‌గంగా నది నుంచి ఇసుక దోపిడీ అడ్డగోలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పెన్‌గంగాలో నీటి ప్రవాహం అంతగా లేదు. ఇసుక మేటలు బయట పడ్డాయి. దీంతో అక్రమార్కుల చూపు దీనిపై పడింది. పెన్‌గంగా పరీవాహక ప్రాంతాల్లో సుమారు 10వేల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల జైనథ్ మండలంలో పెన్‌గంగా పరీవాహక ప్రాంతాల్లో ఇసుకను తోడేందుకు లారీలు, టిప్పర్లు సులువుగా వచ్చేలా నది గచ్చు బండరాళ్లను జిలిటెన్ స్టిక్‌లతో పేల్చివేయడం సంచలనం కలిగిస్తోంది. వీడీసీలకు ఆదాయం.. కొన్ని గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అనధికారికంగా టెండర్లు నిర్వహించి ఇసుకను వాగుల్లో నుంచి దగ్గరుండి తరలిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో అనధికారికంగా టెండర్ అప్పగిస్తున్నారు. ఇలా గ్రామ అభివృద్ధి కమిటీలు, కొంతమంది కాంట్రాక్టర్లు ఇసుక ద్వారా లక్షల ఆదాయం పొందుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వాల్టా చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఇసుకను తోడడం చట్టరీత్యా నేరం. అయితే ప్రభుత్వ పనులకు ఇసుకను ఉపయోగించేందుకు వాగుల నుంచి ఇసుకను తీసుకువస్తున్నట్లు చెబుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇసుక టెండర్లు తీసుకున్న వ్యక్తులు లక్షల్లో సంపాదిస్తున్నారు. నిల్వలున్నా గుర్తించనివి పెన్‌గంగా పరీవాహక ప్రాంతాలైన జైనథ్ మండలం డొల్లార, కరంజి, బేల మండలం సాంగిడి, గూడ, కంగార్పూర్, మాంగుర్లలో ఇసుక నిల్వలున్నప్పటికీ సర్వేలో ఈ ప్రాంతాలను అధికారులు గుర్తించలేదు. అయితే నిత్యం ఇక్కడి నుంచి అనేక వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. సరిహద్దులు గుర్తించకపోవడంతోనే.. పెన్‌గంగాలో ఇసుక రీచ్‌లను గుర్తించేందుకు భౌగోళిక అంశాల పరంగా ఇబ్బందులున్నాయి. తెలంగాణ–మహరాష్ట్ర సరిహద్దుగా నది ఉంది. ఇసుక మేటలు ఎక్కడినుంచి తెలంగాణ పరిధిలోకి వస్తాయనేది ఇప్పటివరకు గుర్తించలేదు. రెవెన్యూ అధికారులు ఆ ప్రక్రియ చేపట్టాలి. జిల్లాలో ఫిబ్రవరిలో ఇసుక నిల్వలను గుర్తించినప్పటికీ ఇంకా రిచ్‌లకు అనుమతివ్వలేదు. – రవిశంకర్, ఏడీ, భూగర్భ గనుల శాఖ, ఆదిలాబాద్