ముంబై: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం (ఈవీ) వృద్ధి చెందుతుండడంతో.. ఆటో విడిభాగాల కంపెనీలకు 2027 నాటికి 9–11 శాతం మేర ఆదాయం ఈవీల నుంచి రావచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ఇదే కాలంలో సంప్రదాయ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాల నుంచి కూడా విడిభాగాల కంపెనీలకు వ్యాపారం వృద్ధి చెందుతుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆటో విడిభాగాల పరిశ్రమ ఆదాయంలో ఈవీ విడిభాగాల వాటా ఒక శాతంగా ఉన్నట్టు తెలిపింది.
ఈవీలకు సంబంధించి ఆటో విడిభాగాల మార్కెట్ ఏటా 76 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చెందుతూ 2026–27 నాటికి రూ.72,500 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇందులో 60 శాతం బ్యాటరీల నుంచే ఉంటుందని పేర్కొంది. 15 శాతం మేర డ్రైవ్‌ట్రైన్‌లు, ఎలక్ట్రానిక్స్ నుంచి ఉంటుందని తెలిపింది. 220 తయారీ సంస్థల నుంచి వివరాలు తీసుకుని విశ్లేషించగా.. ఈవీలకు మళ్లడం అనేది అవకాశాలతో పాటు సవాళ్లను కూడా తీసుకొస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది.
వ్యాపారంలో వైవిధ్యం..
‘‘బ్యాటరీలు, డ్రైవ్‌ట్రైన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఇతర విడిభాగాలు ఆటో కాంపోనెంట్స్ కంపెనీలు తమ ఆదాయాన్ని ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్‌కు వెలుపల విస్తరించుకునేందుకు అవకాశం కల్పిస్తాయి. ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీపై కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నాయి. ఇందులో ఐసీఈ విడిభాగాల కంపెనీలతో పాటు, కొత్తగా ఏర్పాటవున్న ఈవీ విడిభాగాల కంపెనీలు కూడా ఉన్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నవీన్ వైద్యనాథన్ తెలిపారు. ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు ఈవీ వైపు వ్యాపార అవకాశాల విస్తరణకు మద్దతుగా నిలుస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈవీ విభాగంలో టూవీలర్ల వాటా ప్రస్తుతమున్న 2.5 శాతం నుంచి 19 శాతానికి, ప్యాసింజర్ కార్ల వాటా 1 శాతం నుంచి 7 శాతానికి చేరుతుందని పేర్కొంది.
EV: ఈవీ జోరు.. ముందుంది మంచి కాలం.. ఏకంగా 72 వేల కోట్ల వ్యాపారం!
Published Wed, Jul 27 2022 4:25 AM | Last Updated on Wed, Jul 27 2022 7:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment