న్యూఢిల్లీ: టెలికం రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మోస్తరు ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్వల్ప కాలంలో టారిఫ్‌లు పెంచే అవకాశాలు కనిపించకపోవడంతో, యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) విస్తరణకు అవకాశాల్లేవని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో 2023–24 సంవత్సరంలో ఆదాయంలో వృద్ధి 7–9 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది.
5జీ టెక్నాలజీకి సంబంధించి మూలధన వ్యయాల్లో పరిశ్రమ ముందుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 వరకు ఖర్చు చేయవచ్చని తెలిపింది. అలాగే, వచ్చే నాలుగైదేళ్లలో మొత్తం మీద టెలికం కంపెనీలు రూ.3 లక్షల కోట్ల వరకు వ్యయం చేస్తాయని అంచనా వేసింది. 5జీ సేవల ప్రారంభంతో నెట్‌వర్క్ సాంద్రత పెరుగుతుందని.. ఫలితంగా సమీప కాలం నుంచి మధ్య కాలానికి మూలధన వ్యయాల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుందని ఇక్రా పేర్కొంది. దీంతో పరిశ్రమ రుణ భారం 2024 మార్చి నాటికి రూ.6.1–6.2 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది.
5జీ ఆదాయ వనరుగా మారలేదు..
మూడు టెలికం కంపెనీలు కలసి 75–80 శాతం కస్టమర్లను (80 కోట్లు) 4జీకి అప్ గ్రేడ్ చేసుకున్నాయని, ఇక ఇక్కడ నుంచి మరింత పెరగకపోవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అంకిత్ జైన్ పేర్కొన్నారు. ‘‘5జీ సేవలను ప్రారంభించినప్పటికీ దాన్ని కంపెనీలు ఇంకా ఆదాయ వనరుగా మార్చుకోలేదు. 5జీకి ఉద్దేశించిన ప్రత్యేక ప్లాన్లు లేవు. అదే ఉంటే ఏఆర్‌పీయూకి మరింత బలం వచ్చేది. ఈ అంశాలకుతోడు టారిఫ్‌లు పెంచకపోవడం వల్ల ఏఆర్‌పీయూ మోస్తరు స్థాయిలోనే ఉంది’’అని జైన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment