Single Digit
-
సెప్టెంబర్‌లో ఫార్మా వృద్ధి స్వల్పం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మా మార్కెట్ వృద్ధి సెప్టెంబర్‌లో 2.1 శాతానికే పరిమితమైంది. 2022 సెప్టెంబరులో పరిశ్రమ ఏకంగా 13.2 శాతం వృద్ధి సాధించింది. ఆల్ ఇండియా ఆరిజిన్ కెమిస్ట్స్, డి్రస్టిబ్యూటర్స్ ప్రకారం.. అధిక బేస్, పరిమాణం పెరుగుదలలో సవాళ్ల కారణంగా దేశీయ ఔషధ రంగం 2023 సెప్టెంబర్‌లో వరుసగా ఐదవ నెలలో తక్కువ సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో ధర, కొత్త ఉత్పత్తుల విడుదల ద్వారా మొత్తం వృద్ధి సాధ్యమైంది. 2023 జనవరి–సెప్టెంబరులో దాదాపు స్థిరంగా 5–6 శాతం వృద్ధి నమోదైంది. ఇండియా రేటింగ్స్ ఫార్మా మార్కెట్ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 10–11 శాతం ఉంటుందని అంచనా వేసింది. పరిమాణం 2022 సెప్టెంబర్‌లో 4.5 శాతం పెరిగితే, గత నెలలో 5.6 శాతం క్షీణించింది. ధరలు గతేడాది 6.6 శాతం, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 4.8 శాతం దూసుకెళ్లాయి. నూతన ఉత్పత్తుల పెరుగుదల 2022 సెప్టెంబర్‌లో 1.9 శాతం ఉంటే, గత నెలలో ఇది 2.9 శాతం నమోదైంది. మొత్తంగా భారతీయ ఫార్మా మార్కెట్ సగటు వృద్ధి సంవత్సరానికి 6.5 శాతం వద్ద ఆరోగ్యంగా ఉంది. -
టెలికం ఆదాయం అంతంతే.. 5జీ వచ్చినా లాభం లేదు!
న్యూఢిల్లీ: టెలికం రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మోస్తరు ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్వల్ప కాలంలో టారిఫ్‌లు పెంచే అవకాశాలు కనిపించకపోవడంతో, యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) విస్తరణకు అవకాశాల్లేవని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో 2023–24 సంవత్సరంలో ఆదాయంలో వృద్ధి 7–9 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. 5జీ టెక్నాలజీకి సంబంధించి మూలధన వ్యయాల్లో పరిశ్రమ ముందుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 వరకు ఖర్చు చేయవచ్చని తెలిపింది. అలాగే, వచ్చే నాలుగైదేళ్లలో మొత్తం మీద టెలికం కంపెనీలు రూ.3 లక్షల కోట్ల వరకు వ్యయం చేస్తాయని అంచనా వేసింది. 5జీ సేవల ప్రారంభంతో నెట్వర్క్ సాంద్రత పెరుగుతుందని.. ఫలితంగా సమీప కాలం నుంచి మధ్య కాలానికి మూలధన వ్యయాల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుందని ఇక్రా పేర్కొంది. దీంతో పరిశ్రమ రుణ భారం 2024 మార్చి నాటికి రూ.6.1–6.2 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 5జీ ఆదాయ వనరుగా మారలేదు.. మూడు టెలికం కంపెనీలు కలసి 75–80 శాతం కస్టమర్లను (80 కోట్లు) 4జీకి అప్ గ్రేడ్ చేసుకున్నాయని, ఇక ఇక్కడ నుంచి మరింత పెరగకపోవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అంకిత్ జైన్ పేర్కొన్నారు. ‘‘5జీ సేవలను ప్రారంభించినప్పటికీ దాన్ని కంపెనీలు ఇంకా ఆదాయ వనరుగా మార్చుకోలేదు. 5జీకి ఉద్దేశించిన ప్రత్యేక ప్లాన్లు లేవు. అదే ఉంటే ఏఆర్‌పీయూకి మరింత బలం వచ్చేది. ఈ అంశాలకుతోడు టారిఫ్‌లు పెంచకపోవడం వల్ల ఏఆర్పీయూ మోస్తరు స్థాయిలోనే ఉంది’’అని జైన్ వివరించారు. -
ఐటీ రంగంలో తగ్గనున్న నియామకాలు
ముంబై: భారత ఐటీ కంపెనీల ఆదాయంలో వృద్ధి మరింత తగ్గి, మధ్య స్థాయి సింగిల్ డిజిట్‌కు (4–6) పరిమితం అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నందున నియామకాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో కంపెనీలు సమీప కాలంలో కొత్త నియామకాలను తక్కువకు పరిమితం చేసుకోవచ్చని తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో (2022 అక్టోబర్ నుంచి 2023 మార్చి వరకు) నికర నియామకాలు ప్రతికూలంగా ఉన్న విషయాన్ని ఇక్రా తన నివేదికలో ప్రస్తావించింది. ఐటీ కంపెనీల అసోసియేషన్ నాస్కామ్ మార్చిలో విడుదల చేసిన నివేదికను పరిశీలించినప్పుడు 2022–23లో వృద్ధి 8.4 శాతానికి తగ్గిపోయినట్టు తెలుస్తోంది. 2021–22లో ఇది 15 శాతంగా ఉండడం గమనార్హం. ఆర్డర్ బుక్, డీల్స్ బలంగానే ఉనప్పటికీ 2023–24లో ఆదాయం వృద్ధి 4–6 శాతం మించకపోవచ్చని ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలోని కంపెనీల పట్ల స్థిరమైన దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపింది. రుణాలకు సంబంధించి ఇవి మెరుగైన స్థితిలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అమెరికా, యూరప్‌లో స్థూల ఆర్థిక సమస్యలు ఉండడంతో గత రెండు త్రైమాసికాల్లో వృద్ధి ధోరణి తగ్గుముఖం పట్టినట్టు ఇక్రా తెలిపింది. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో 90 శాతం యూఎస్, యూరప్ నుంచే వస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, ఇన్సూరెన్స్ విభాగం నుంచే మూడింట ఒకటో వంతు ఆదాయం ఐటీ కంపెనీలకు వస్తుంటుంది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో ఈ రంగాల నుంచి వచ్చే ఆదాయం తగ్గొచ్చని.. కస్టమర్లు నిర్ణయాలను జాప్యం చేయవచ్చని ఇక్రా తెలిపింది. మార్జిన్లు స్థిరం.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల మార్జిన్లు 1.90 శాతం తగ్గి 22.9 శాతానికి పరిమితమైనట్టు ఇక్రా తెలిపింది. ఆదాయంలో వృద్ధి నిదానించినా, నిర్వహణ మార్జిన్లు ఇదే స్థాయిలో కొనసాగొచ్చని అంచనా వేసింది. ఐటీ రంగంలోని టాప్–5 కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 83,906 మందిని నియమించుకున్నట్టు ప్రస్తావించింది. స్థూల ఆర్థిక అనిశ్చితులు కొనసాగినంత కాలం నియామకాలు తక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. -
టీడీపీ మద్దతుదారులకు ఆరు చోట్ల ‘0’
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మరోసారి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. 175 నియోజకవర్గాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఆరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ మద్దతుదారులు ఖాతా కూడా తెరవలేకపోయారు. పుంగనూరు, మాచర్ల, పులివెందుల, జమ్మలమడుగు, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల్లో విపక్షం మద్దతుదారులు ఒక్కటంటే ఒక్క పంచాయతీలో కూడా గెలవలేదు. మరో 39 నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్ పంచాయతీలకే పరిమితమయ్యారు. అందులో చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరితోపాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం కూడా ఉండడం విశేషం. నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏ జిల్లాలోనూ టీడీపీ మద్దతుదారులు ప్రభావం చూపలేకపోయారు. 13,081 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కేవలం 2,100 పంచాయతీలకే ఆ పార్టీ మద్దతుదారులు పరిమితమయ్యారు. అంటే 16 శాతం సీట్లనే గెలుచుకోగలిగారు. కానీ ఓటమిని ఒప్పుకోకుండా చంద్రబాబు ఎదురుదాడి చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 41 శాతం పంచాయతీల్లో తాము గెలిచినట్లు ప్రకటించిన చంద్రబాబు 4,230 పంచాయతీలు తమ ఖాతాలో పడినట్లు చెప్పారు. ఈ లెక్క ఏమిటో టీడీపీ నాయకులకే అంతుబట్టని విధంగా మారింది. ఆయన చెప్పిన శాతానికి, గెలిచిన పంచాయతీలకు ఏమాత్రం పొంతన లేకపోవడం విశేషం. ఆయన చెప్పినట్లు గెలిచిన పంచాయతీలను బట్టి చూస్తే అది 32 శాతమే. కానీ 41 శాతం ఏమిటనే దానికి సమాధానం లేదు. పోనీ గెలిచిన పంచాయతీలు ఏవో చూపించమన్నా సరైన స్పందన లేదు. చాలా చోట్ల తామే గెలిచినా అధికారులు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచినట్లు ప్రకటించారని, కరెంటు కట్ చేసి దౌర్జన్యం చేశారని ఎదురుదాడికి దిగారు. వాస్తవానికి చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నాయకులు సొంత నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోలేకపోయారు. ‘అనంత’లో నామమాత్రం.. అనంతపురం జిల్లాలో చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ కుదేలైంది. అక్కడ కేవలం 8 పంచాయతీల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. ఈ నియోజకవర్గంలో మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి పట్టున్న కిరికెర, లేపాక్షి, చిలమత్తూరు, కోడూరు పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు నెగ్గారు. హిందూపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి సొంత గ్రామం రొద్దంలో వైఎస్సార్సీపీ గెలుపొందింది. ఆయన నివసిస్తున్న వార్డులో కూడా టీడీపీ ఓడిపోవడం విశేషం. చంద్రగిరిలో రెండు చోట్ల మాత్రమే.. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో 89 పంచాయతీలకు గానూ కేవలం 14 చోట్లే టీడీపీ మద్దతుదారులు గెలిచిన విషయం తెలిసిందే. ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీ మద్దతుదారులు రెండు పంచాయతీల్లో గెలుపొందారు. ఈ నియోజకవర్గం పరిధిలోని తిరుపతి రూరల్ మండలంలో ఒక్క పంచాయతీని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గమైన శ్రీకాళహస్తిలో 121 పంచాయతీలకు టీడీపీ ఒకే ఒక పంచాయతీలో గెలిచింది. మదనపల్లి నియోజకవర్గంలో అతి తక్కువగా ఆరు పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు గెలిచారు. కడప, కర్నూలులో విపక్షం కకావికలం.. ► వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఒక్క పంచాయతీని కూడా టీడీపీ దక్కించుకోలేకపోయింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ ఖాతా తెరవలేకపోయింది. ► కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్‌తోనే సరిపెట్టుకుంది. ఆదోని–5, ఎమ్మిగనూరు–6, నంద్యాల–2, శ్రీశైలంలో 7 పంచాయతీలను మాత్రమే ఆ పార్టీ మద్ధతుదారులు గెలుచుకున్నారు. ► నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు ఒక్క పంచాయతీని కూడా గెలుచుకోలేకపోయారు. కావలి నియోజకవర్గంలోనూ నాలుగు పంచాయతీలకే పరిమితమయ్యారు. మాచర్లలో అధికార పార్టీ క్లీన్ స్వీప్.. ► గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ ఖాతా తెరవలేకపోయింది. ఇక్కడ వైఎస్సార్సీపీ మద్దతుదారులు క్లీన్‌స్వీప్ చేశారు. రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజవర్గంలో కేవలం 9 పంచాయతీలను మాత్రమే టీడీపీ గెలుచుకుంది. రాజధాని గ్రామాలకు ఆనుకుని ఉన్న చోట్ల కూడా టీడీపీ ఓడిపోయింది. రాజధాని పక్కనే ఉన్న తాడికొండ, అమరావతి మేజర్ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుపొందారు. గురజాల నియోజకవర్గంలో మూడు, నర్సరావుపేట–1, తెనాలిలో 7 పంచాయతీలను మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. కృష్ణాలో సైకిల్ బోల్తా ►కృష్ణా జిల్లాల్లో టీడీపీ పరిస్థితి దిగజారింది. మచిలీపట్నం 4, పెనమలూరు 6, మైలవరం 7, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 8 పంచాయతీలు మాత్రమే ఆ పార్టీ మద్దతుదారులు గెలిచారు. ► పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో మూడు, కొవ్వూరులో 7, తణుకులో 8 పంచాయతీల్లో మాత్రమే గెలిచింది. దెందులూరు నియోజకవర్గం పరిధిలోని ఏలూరు రూరల్ మండలంలో కొల్లేటి లంకల్లో ఒకే ఒక గ్రామాన్ని టీడీపీ గెలుచుకోవడం విశేషం. గతంలో ఈ గ్రామాలన్నీ టీడీపీకి కంచుకోటలుగా ఉండగా ఇప్పుడు అవి కూలిపోయాయి. ‘తూర్పు’న సింగిల్ డిజిట్... ► తూర్పుగోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్ పంచాయతీలనే గెలుచుకుంది. కాకినాడ రూరల్ 1, పిఠాపురం 5, ముమ్మిడివరం 8, పెద్దాపురం 6, రామచంద్రాపురం 2, అనపర్తి 7, తుని 3, మండపేటలో 6 పంచాయతీలను మాత్రమే ఆ పార్టీ మద్దతుదారులు గెలవగలిగారు. భీమిలీలో నిల్... ► విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో తొమ్మిది పంచాయతీలనే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. భీమిలి నియోజకవర్గంలో భీమిలి మండలంలో ఒక్క పంచాయతీని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. నాలుగో విడతలో 117 పంచాయతీలకు ఎన్నికలు జరిగి™తే కేవలం 24 పంచాయతీలకు పరిమితమైంది. నేతల సొంత గ్రామాల్లోనూ టీడీపీ కుదేలు.. ► శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో 5 పంచాయతీలను మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావుకు పట్టున్నట్టు చెప్పుకునే రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ఆ పార్టీ నామమాత్రంగానే పంచాయతీలను గెలుచుకుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ సొంత నియోజకవర్గంలో టీడీపీ చతికిలపడింది. టీడీపీ ముఖ్య నాయకులు గౌతు శ్యాంసుందర్ శివాజీ, కూన రవికుమార్, బెందాళం అశోక్, కలమట వెంకటరమణ, ప్రతిభా భారతి, కొండ్రు మురళీమోహన్ సొంత గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఓడిపోయారు. ► విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో 7 పంచాయతీల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. నాలుగో విడతలో ఇక్కడ 239 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 50 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. 40 ఏళ్ల పాటు ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్న గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి విముక్తి లభించింది. ఎన్నో ఏళ్లుగా టీడీపీ చేతుల్లో ఉన్న ఆ పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతుదారు విజయఢంకా మోగించారు. గ్రామస్తులంతా సోమవారం ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. -
జీడీపీ బౌన్స్‌బ్యాక్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రికవరీ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు 7.5 శాతానికి పరిమితమయ్యింది. నిజానికి క్షీణత ‘సింగిల్ డిజిట్’కు పరిమితమవుతుందని పలు విశ్లేషణలు వచ్చినప్పటికీ, ఇంత తక్కువగా నమోదవుతుందని అంచనావేయలేదు. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం క్షీణిస్తుందని అంచనావేసింది. తయారీ, వ్యవసాయం, విద్యుత్, గ్యాస్ రంగాలు ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీకి చేయూతను ఇచ్చాయి. వినియోగ డిమాండ్ మెరుగుపడితే రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ మరింత ఊపునందుకునే అవకాశం ఉందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులతో భారత్ ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారీగా 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ 4.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. వివిధ రంగాలు చూస్తే...: తయారీ: జూన్ నుంచీ కఠిన లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఊపందుకుంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15% వాటా ఉన్న తయారీ రంగం 0.6% వృద్ధి నమోదుచేసుకోవడం గమనార్హం. జూన్ క్వార్టర్లో ఈ విభా గం 39% క్షీణించింది. ► వ్యవసాయం: జీడీపీలో దాదాపు 15% వాటా ఉన్న వ్యవసాయం 3.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► విద్యుత్, గ్యాస్: 4.4% వృద్ధిని సాధించాయి. ► ఫైనాన్షియల్, రియల్టీ సేవలు: ఈ విభాగాలు క్షీణతలోనే ఉన్నాయి. 8.1 శాతం మైనస్ నమోదయ్యింది. ► ట్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్ విభాగాలు సైతం 15.6 శాతం నష్టాల్లోనే (క్షీణత) ఉన్నాయి. ► నిర్మాణం: ఆర్థిక వ్యవస్థలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఈ రంగం క్షీణత 8.6 శాతం. అయితే క్యూ1లో భారీగా ఇది 50% క్షీణించింది. ► ప్రభుత్వ వ్యయాలు: ఆందోళనకరంగానే ఉన్న ప్రభుత్వ వ్యయాలు మరో అంశం. ప్రభుత్వ వ్య యాలు సెప్టెంబర్ క్వార్టర్లో 12% క్షీణించింది. క్షీణత ఇలా...: జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటన ప్రకారం, 2020–21 సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.33.14 లక్షల కోట్లు. 2019–20 ఇదే కాలంలో ఈ విలువ 35.84 లక్షల కోట్లు. అంటే విలువలో ఎటువంటి వృద్ధిలేకపోగా 7.5 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. సాంకేతికంగా మాంద్యమే... ఒక ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాలు క్షీణ రేటును నమోదుచేస్తే, ఆ పరిస్థితిని మాంద్యంగా పరిగణిస్తారు. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో భారత్ వరుస క్షీణ రేటును నమోచేసిన నేపథ్యంలో దేశం సాంకేతికంగా మాంద్యంలోకి జారిపోయినట్లే భావించాల్సి ఉంటుంది. మొదటి ఆరు నెలల కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 15.7 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 4.8 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. అయితే ఎకానమీ ‘వీ’ నమూనా వృద్ధి నమోదుచేసుకుంటుందని ఆర్థిక నిపుణులు భరోసాతో ఉండడమే ఊరట. దేశంలో క్రమంగా వినియోగ డిమాండ్ పుంజుకుంటోంది. ఆటో మొబైల్ పరిశ్రమ బాగుంది, నాన్–డ్యూరబుల్ రంగం మెరుగుపడుతోంది. రైలు రవాణా పెరుగుతోంది. వచ్చే ఏడాది తొలి నెలల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ వృద్ధికి ఊతం ఇచ్చేవి కావడం గమనార్హం. అయితే సెకండ్‌వేవ్ కేసుల భయాలూ ఉన్నాయి. ఇది రానున్న రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థను ప్రతికూలతలోకి నెడతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న దానికన్నా (4% వద్ద నిర్దేశం) అధికంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండడం గమనార్హం. వృద్ధి బాటలో చైనా దూకుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుసహా ప్రపంచంలోని పలు దేశాల ఎకానమీలు కరోనా ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిన నేపథ్యంలో... ఈ మహమ్మారికి పుట్టినిల్లు చైనా మాత్రం వృద్ధి బాటన సాగుతోంది. ఈ ఏడాది వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును (2019 ఇదే కాలంతో పోల్చి) నమోదుచేసుకుంది. కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. 2020తో తొలి ఆరు నెలల కాలం (జనవరి–జూన్) చూసుకుంటే 1.6 శాతం క్షీణతలో ఉన్న చైనా, మూడు త్రైమాసికాలు కలిపితే 0.7 శాతం పురోగతిలో ఉంది. అక్టోబర్‌లో మౌలికం 2.5 శాతం క్షీణత మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి అక్టోబర్‌లో 2.5 శాతం మేర క్షీణించింది. ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ఉత్పత్తి పడిపోవడం ఇందుకు కారణం. మౌలిక రంగం క్షీణించడం ఇది వరుసగా ఎనిమిదో నెల. మార్చి నుంచి ఇది క్షీణ బాటలోనే ఉంది. 2019 అక్టోబర్‌లో ఎనిమిది మౌలిక పరిశ్రమల ఉత్పత్తి 5.5 శాతం క్షీణత నమోదు చేసింది. బొగ్గు, ఎరువులు, సిమెంట్, విద్యుదుత్పత్తి సానుకూల వృద్ధి కనపర్చగా, క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో చూస్తే మౌలికం 13% క్షీణించింది. గతేడాది ఇదే వ్యవధిలో 0.3% వృద్ధి నమోదైంది. విభాగాల వారీగా .. అక్టోబర్‌లో బొగ్గు ఉత్పత్తి 11.6%, సిమెంట్ (2.8%), విద్యుత్ (10.5%) వృద్ధి నమోదు చేశాయి. మరోవైపు క్రూడాయిల్ 6.2 శాతం, సహజ వాయువు 8.6%, రిఫైనరీ ఉత్పత్తులు 17 శాతం, ఉక్కు 2.7 శాతం మేర ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. 1950–51నుంచి భారత్ జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు – 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. అంచనాలు నిజమైతే 2020–21 ఆరవసారి అవుతుంది. అబ్బురపరుస్తున్నాయ్... ఆర్థిక రికవరీ అబ్బుర పరుస్తోంది. ప్రత్యేకించి తయారీ రంగం సానుకూలతలోకి రావడం హర్షణీయం. వ్యవస్థలో తిరిగి డిమాండ్ నెలకొంటోందని ఈ అంశం సూచిస్తోంది. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రోత్సాహకరం మహమ్మారి ప్రేరిత అంశాలు, గత త్రైమాసికం తీవ్ర నిరాశాకర ఫలితాల నేపథ్యంలో వెలువడిన తాజా గణాంకాలు కొంత ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ కొంత ఆందోళన కూడా ఉంది. ఆర్థిక క్షీణత మహమ్మారి వల్లే. ఈ సవాలు ఇంకా కొనసాగుతోంది. – కృష్ణమూర్తి సుబ్రమణ్యం, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ద్వితీయార్ధంలో ‘వృద్ధి’కి అవకాశం ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యలు, సంస్కరణలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో (అక్టోబర్–మార్చి) దేశం వృద్ధి బాటకు వస్తుందన్న విశ్వాసం కనబడుతోంది. 2021–22లో వృద్ధి రెండంకెల్లో నమోదు అవుతుందని భావిస్తున్నాం. అక్టోబర్‌లో భారీగా పెరిగిన వినియోగ డిమాండ్ ఆశావహ పరిస్థితులను సృష్టిస్తోంది. అయితే సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనడమే ప్రస్తుతం కీలకాంశం. – ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ విశ్వాసాన్ని పెంచుతున్నాయ్ తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులను క్రమంగా సడలిస్తున్న నేపథ్యం ఇది. ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక వ్యవస్థ సంస్కరణలు ఫలితాలను అందిస్తున్నాయి. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందని భావిస్తున్నాం. వినియోగ డిమాండ్ మున్ముందు పుంజుకునే అవకాశం ఉంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ తయారీలో విజయం అంచనాలకు మించి సానుకూల ఫలితం రావడం హర్షణీయం. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీ బాటలో ఉన్నట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా తయారీ రంగంలో సానుకూలత మంచి పరిణామం. ప్రోత్సాహకరమైనది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల ఫలితమిది. – సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ ముందుముందు మంచికాలం ఫలితాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. తాజా ఫలితాలను చూస్తుంటే, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లోనూ మంచి ఫలితాలు వెలువడతాయన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలు పురోగతి బాటన పయనిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం మెరుగుపడుతోంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
అంచనాలకు మించి రికవరీ
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ తొలి అంచనాలకన్నా పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అయితే కరోనా కేసుల పెరుగుదలే వృద్ధికి ప్రతికూలమనీ ఆయన అన్నారు. రెండవ త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) గణాంకాలు . శుక్రవారం (27వ తేదీ) వెలువడుతుండడం, క్యూ2లో క్షీణ రేటు ‘సింగిల్’ డిజిట్‌లోనే (10 శాతంలోపే) ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో గవర్నర్ తాజా వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రేరిత సమస్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. విదేశీ మారకానికి సంబంధించి భారత్ డీలర్ల సంఘం (ఎఫ్ఈడీఏఐ) వార్షిక దినోత్సవం సందర్భంగా గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ► వృద్ధి రికవరీకి సంబంధించి.. పండుగ సీజన్ అనంతరం డిమాండ్ కొనసాగడం, పెరుగుతున్న కరోనా కేసులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాక్సిన్ అందుబాటు విషయంలో మార్కెట్ పునఃమదింపు ఎలా ఉంటుం దన్నదీ పరిశీలించాల్సిన ముఖ్యాంశాల్లో ఒకటి. ► తొలి త్రైమాసికంలో భారీ క్షీణత అనంతరం, క్యూ2లో ఆర్థిక క్రియాశీలత ఊహించినదానికన్నా వేగంగా ఉంది. రికవరీలో పటిష్టత నమోదైంది. ► గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం లక్ష్యాలను మించి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం) ఉంటోందన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ అంశాన్ని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) జాగ్రత్తగా పరిశీలించి రేటు కోతకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తాత్కాలికమైనవనీ, ధరల తీవ్రత క్రమంగా తగ్గుతుందని అక్టోబర్ పరపతి సమీక్ష అభిప్రాయపడింది. అందువల్ల ఆర్థిక వ్యవస్థ, రేట్ల కోత అంశాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సరళతర విధానాన్నే పాటించాలనీ నిర్దేశించుకుంది. ► తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉండడం భారత్‌కు ప్రస్తుతం కలిసి వస్తున్న అంశం. నవంబర్ 13 నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 572.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏడాది దిగుమతులకు ఇవి సరిపోతాయి. ► 2020 తరహా సంవత్సరాన్ని మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ అవకాశాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. యూరోప్‌లోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాలూ ఈ సమస్యను ఎదుర్కొం టున్నాయి. ప్రపంచ వృద్ధికి ప్రతికూలాంశమిది. ► మార్కెట్లపై మహమ్మారి పలు విధాలుగా ప్రతికూల ప్రభావాలు చూపింది. ఆర్థిక మందగమనం, ద్రవ్య లభ్యత, కమర్షియల్ పేపర్, కార్పొరేట్ బాండ్ మార్కెట్ క్షీణత, రూపాయి విలువ వంటి ఎన్నో అంశాల్లో ప్రతికూలతలు ఏర్పాడ్డాయి. -
అక్టోబర్‌లో తగ్గిన వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: భారత్ దిగుమతులు భారీగా తగ్గిపోతున్న నేపథ్యంలో– ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సింగిల్ డిజిట్లో నమోదవుతోంది. అక్టోబర్‌లో ఇది 8.71 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వాణిజ్యలోటు 11.53 బిలియన్ డాలర్లు. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఆరు నెలల క్షీణత తర్వాత సెప్టెంబర్‌లో వృద్ధిబాటకు (5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్ డాలర్లు) వచ్చిన ఎగుమతులు అక్టోబర్‌లో మళ్లీ నిరాశను మిగిల్చాయి. సమీక్షా నెల్లో 5.12 శాతం క్షీణత నమోదయ్యింది. విలువలో 24.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక దిగుమతులు కూడా 11.53 శాతం క్షీణతతో 33.60 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరిసి వాణిజ్యలోటు కేవలం 8.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఎగుమతులు భారీగా పడిపోయిన ప్రొడక్టుల్లో పెట్రోలియం ఉత్పత్తులు (–52 శాతం), జీడిపప్పు (–21.57 శాతం), రత్నాలు, ఆభరణాలు (–21.27 శాతం) తోలు (–16.67 శాతం), మేన్ మేడ్ యార్న్/ఫ్యాబ్రిక్స్ (12.8 శాతం), ఎలక్ట్రానిక్ గూడ్స్ (–9.4 శాతం), కాఫీ (–9.2 శాతం), సముద్ర ఉత్పత్తులు (– 8 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (–3.75 శాతం) ఉన్నాయి. అయితే బియ్యం, ఆయిల్ మీల్స్, ముడి ఇనుము, చమురు గింజలు, కార్పెట్లు, ఫార్మా, సుగంధ ద్రవ్యాలు, పత్తి, రసాయనాల ఎగుమతుల్లో వృద్ధి కనిపించింది. ► అక్టోబర్‌లో చమురు దిగుమతులు 38.52 శాతం పడిపోయి, 5.98 బలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతుల విలువ 27.62 బిలియన్ డాలర్లు. ఏడు నెలల్లో ఎగుమతులు 19 శాతం క్షీణత కాగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2020 వరకూ చూస్తే, ఎగుమతులు 19.02 శాతం పడిపోయి 150.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 36.28 శాతం పడిపోయి 182.29 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు సమీక్షా కాలంలో 32.15 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ కాలంలో చమురు దిగుమతులు 49.5 శాతం క్షీణించి 37.84 బలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కరెంట్ అకౌంట్‌కు సానుకూలం దిగుమతుల క్షీణత నేపథ్యంలో కరెంట్ అకౌంట్ లావాదేవీల విషయంలో 2020 వరుసగా రెండవ త్రైమాసికం ఏప్రిల్–జూన్‌లోనూ భారత్ మిగులను నమోదుచేసుకుంది. ఈ మొత్తం 19.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సంబంధిత త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 3.9 శాతం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా కరెంట్ అకౌంట్ మిగులు 0.6 బిలియన్ డాలర్లు (0.1 శాతం) నమోదయ్యింది. ఒక నిర్థిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) కరెంట్ అకౌంట్ ‘మిగులు’ను నమోదుచేస్తుంది. ఈ విలువ దాదాపు 30 బిలియన్ డాలర్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అగ్రి ఎగుమతులు ప్రోత్సాహకరం... అగ్రి, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో వృద్ధి నమోదుకావడం ప్రోత్సాహకర అంశం. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత కల్పించే కీలక దేశాల్లో ఒకటిగా భారత్ ఎదగడానికి సమయం ఆసన్నం అయ్యింది. గడచిన రెండు పంట కాలాల్లో దేశం మంచి ఉత్పత్తులను సాధించిన విషయం ఇక్కడ గమనార్హం. ఫార్మా, రసాయనాలుసహా పలు పారిశ్రామిక రంగాలు ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లోనూ ప్రపంచ మార్కెట్లో సత్తా చాటుతుండడం గమనార్హం. – మోహిత్ సింగ్లా, టీపీసీఐ వ్యవస్థాపక చైర్మన్ -
‘అప్పు’డే వద్దు!
ముంబై: బ్యాంకులు ఒకపక్క వడ్డీరేట్లు తగ్గిస్తున్నప్పటికీ.. రుణాలు తీసుకోవడానికి మాత్రం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడంలేదు. వినియోగ డిమాండ్ బలహీనంగా ఉందనడానికి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనానికి బలమైన నిదర్శనంగా బ్యాంకింగ్ రుణ వృద్ధి ఘోరంగా పడిపోతోంది. సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షానికి(15 రోజుల వ్యవధి) రుణ వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. వృద్ధి ఈ స్థాయికి పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► 2019 సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షానికి (అప్పటికి వార్షిక ప్రాతిపదికన చూస్తే) బ్యాంకింగ్ రుణాలు 97.71 లక్షల కోట్లు. ► 2018 ఇదే కాలానికి రుణాల పరిమాణం రూ.89.82 లక్షల కోట్లు. ► అంటే వృద్ధి రేటు 8.79 శాతమన్నమాట. ► వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ► 2019 సెప్టెంబర్ 13 ముగిసిన పక్షం రోజులకు చూస్తే, రుణాల పరిమాణం రూ.97.01 లక్షల కోట్లుగా ఉంది. 2018 ఇదే కాలంలో పోల్చితే వృద్ధి రేటు 10.26 శాతంగా ఉంది. డిపాజిట్లూ మందగమనమే... ఇక బ్యాంకుల్లో డిపాజిట్ల విషయానికి వస్తే, ఈ విభాగంలో కూడా వృద్ధిరేటు మందగమనంలోకి జారిపోయింది. 2019 సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షం రోజులకు డిపాజిట్లు రూ. 129.06 లక్షల కోట్లు. 2018 ఇదే కాలానికి ఈ మొత్తం రూ.118 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 9.38 శాతంగా ఉంది. 2019 సెప్టెంబర్ 13తో ముగిసిన పక్షం రోజులకు చూస్తే, వృద్ధి రేటు 10.02 శాతంగా ఉంది. -
గ్రేటర్లో కాంగ్రెస్‌కు సింగిల్ డిజిటే
ఖేడ్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీ గల్లంతే: మంత్రి హరీశ్ నారాయణఖేడ్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమవుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు జోస్యం చెప్పారు. శనివారం ఆయన మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్లో దెబ్బతింటామన్న విషయాన్ని కాంగ్రెస్ వారే స్వయంగా ఒప్పుకొంటున్నారని తెలిపారు. ఏంచూసి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. వరంగల్ ఎంపీ స్థానానికి సాధారణ ఎన్నికల్లో డిపాజిట్ దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ తాజా ఉప ఎన్నికల్లో డిపాజిట్‌ను సైతం కోల్పోయిందని హరీశ్‌రావు అన్నారు. తెలుగుదేశం పార్టీని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. అది ఆంధ్రా పార్టీగా అభివర్ణించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి రాజీనామాచేసి బయటకు వస్తున్నారన్నారు. టీడీపీకి ఓటువేస్తే మురికి కాలువలో వేసినట్లేనని హరీశ్‌రావు తెలిపారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని మంత్రి అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్కు ఎంత భారీ మెజార్టీని కట్టబెడితే అంతమేర తలవంచి పనిచేస్తానన్నారు. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా సరే.. ఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన తెలిపారు.