గ్రేటర్‌లో కాంగ్రెస్‌కు సింగిల్ డిజిటే
ఖేడ్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీ గల్లంతే: మంత్రి హరీశ్
నారాయణఖేడ్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమవుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు జోస్యం చెప్పారు. శనివారం ఆయన మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్‌లో దెబ్బతింటామన్న విషయాన్ని కాంగ్రెస్ వారే స్వయంగా ఒప్పుకొంటున్నారని తెలిపారు. ఏంచూసి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. వరంగల్ ఎంపీ స్థానానికి సాధారణ ఎన్నికల్లో డిపాజిట్ దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ తాజా ఉప ఎన్నికల్లో డిపాజిట్‌ను సైతం కోల్పోయిందని హరీశ్‌రావు అన్నారు.
తెలుగుదేశం పార్టీని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. అది ఆంధ్రా పార్టీగా అభివర్ణించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి రాజీనామాచేసి బయటకు వస్తున్నారన్నారు. టీడీపీకి ఓటువేస్తే మురికి కాలువలో వేసినట్లేనని హరీశ్‌రావు తెలిపారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని మంత్రి అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఎంత భారీ మెజార్టీని కట్టబెడితే అంతమేర తలవంచి పనిచేస్తానన్నారు. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా సరే.. ఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన తెలిపారు.