టీడీపీ మద్దతుదారులకు ఆరు చోట్ల ‘0’ | TDP Zero in six places In AP Panchayat Elections | Sakshi
Sakshi News home page

టీడీపీ మద్దతుదారులకు ఆరు చోట్ల ‘0’

Published Tue, Feb 23 2021 5:52 AM | Last Updated on Tue, Feb 23 2021 5:43 PM

TDP Zero in six places In AP Panchayat Elections - Sakshi

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మరోసారి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. 175 నియోజకవర్గాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఆరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ మద్దతుదారులు ఖాతా కూడా తెరవలేకపోయారు. పుంగనూరు, మాచర్ల, పులివెందుల, జమ్మలమడుగు, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల్లో విపక్షం మద్దతుదారులు ఒక్కటంటే ఒక్క పంచాయతీలో కూడా గెలవలేదు. మరో 39 నియోజకవర్గాల్లో సింగిల్‌ డిజిట్‌ పంచాయతీలకే పరిమితమయ్యారు. అందులో చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరితోపాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం కూడా ఉండడం విశేషం. నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏ జిల్లాలోనూ టీడీపీ మద్దతుదారులు ప్రభావం చూపలేకపోయారు.

13,081 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కేవలం 2,100 పంచాయతీలకే ఆ పార్టీ మద్దతుదారులు పరిమితమయ్యారు. అంటే 16 శాతం సీట్లనే గెలుచుకోగలిగారు. కానీ ఓటమిని ఒప్పుకోకుండా చంద్రబాబు ఎదురుదాడి చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 41 శాతం పంచాయతీల్లో తాము గెలిచినట్లు ప్రకటించిన చంద్రబాబు 4,230 పంచాయతీలు తమ ఖాతాలో పడినట్లు చెప్పారు. ఈ లెక్క ఏమిటో టీడీపీ నాయకులకే అంతుబట్టని విధంగా మారింది.

ఆయన చెప్పిన శాతానికి, గెలిచిన పంచాయతీలకు ఏమాత్రం పొంతన లేకపోవడం విశేషం. ఆయన చెప్పినట్లు గెలిచిన పంచాయతీలను బట్టి చూస్తే అది 32 శాతమే. కానీ 41 శాతం ఏమిటనే దానికి సమాధానం లేదు. పోనీ గెలిచిన పంచాయతీలు ఏవో చూపించమన్నా సరైన స్పందన లేదు. చాలా చోట్ల తామే గెలిచినా అధికారులు వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు గెలిచినట్లు ప్రకటించారని, కరెంటు కట్‌ చేసి దౌర్జన్యం చేశారని ఎదురుదాడికి దిగారు. వాస్తవానికి చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నాయకులు సొంత నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోలేకపోయారు.

‘అనంత’లో నామమాత్రం..
అనంతపురం జిల్లాలో చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ కుదేలైంది. అక్కడ కేవలం 8 పంచాయతీల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. ఈ నియోజకవర్గంలో మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి పట్టున్న కిరికెర, లేపాక్షి, చిలమత్తూరు, కోడూరు పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నెగ్గారు. హిందూపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి సొంత గ్రామం రొద్దంలో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. ఆయన నివసిస్తున్న వార్డులో కూడా టీడీపీ ఓడిపోవడం విశేషం.

చంద్రగిరిలో రెండు చోట్ల మాత్రమే..
చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో 89 పంచాయతీలకు గానూ కేవలం 14 చోట్లే టీడీపీ మద్దతుదారులు గెలిచిన విషయం తెలిసిందే. ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీ మద్దతుదారులు రెండు పంచాయతీల్లో గెలుపొందారు. ఈ నియోజకవర్గం పరిధిలోని తిరుపతి రూరల్‌ మండలంలో ఒక్క పంచాయతీని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. టీడీపీ సీనియర్‌ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గమైన శ్రీకాళహస్తిలో 121 పంచాయతీలకు టీడీపీ ఒకే ఒక పంచాయతీలో గెలిచింది. మదనపల్లి నియోజకవర్గంలో అతి తక్కువగా ఆరు పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు గెలిచారు.

కడప, కర్నూలులో విపక్షం కకావికలం..
వైఎస్సార్‌ కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఒక్క పంచాయతీని కూడా టీడీపీ దక్కించుకోలేకపోయింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ ఖాతా తెరవలేకపోయింది.     
    
కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్‌ డిజిట్‌తోనే సరిపెట్టుకుంది. ఆదోని–5, ఎమ్మిగనూరు–6, నంద్యాల–2, శ్రీశైలంలో 7 పంచాయతీలను మాత్రమే ఆ పార్టీ మద్ధతుదారులు గెలుచుకున్నారు.

నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు ఒక్క పంచాయతీని కూడా గెలుచుకోలేకపోయారు. కావలి నియోజకవర్గంలోనూ నాలుగు పంచాయతీలకే పరిమితమయ్యారు.

మాచర్లలో అధికార పార్టీ క్లీన్‌ స్వీప్‌..
గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ ఖాతా తెరవలేకపోయింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు క్లీన్‌స్వీప్‌ చేశారు. రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజవర్గంలో కేవలం 9 పంచాయతీలను మాత్రమే టీడీపీ గెలుచుకుంది. రాజధాని గ్రామాలకు ఆనుకుని ఉన్న చోట్ల కూడా టీడీపీ ఓడిపోయింది. రాజధాని పక్కనే ఉన్న తాడికొండ, అమరావతి మేజర్‌ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుపొందారు. గురజాల నియోజకవర్గంలో మూడు, నర్సరావుపేట–1, తెనాలిలో 7 పంచాయతీలను మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు.

కృష్ణాలో సైకిల్‌ బోల్తా
కృష్ణా జిల్లాల్లో టీడీపీ పరిస్థితి దిగజారింది. మచిలీపట్నం 4, పెనమలూరు 6, మైలవరం 7, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 8 పంచాయతీలు మాత్రమే ఆ పార్టీ మద్దతుదారులు గెలిచారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో మూడు, కొవ్వూరులో 7, తణుకులో 8 పంచాయతీల్లో మాత్రమే గెలిచింది. దెందులూరు నియోజకవర్గం పరిధిలోని ఏలూరు రూరల్‌ మండలంలో కొల్లేటి లంకల్లో ఒకే ఒక గ్రామాన్ని టీడీపీ గెలుచుకోవడం విశేషం. గతంలో ఈ గ్రామాలన్నీ టీడీపీకి కంచుకోటలుగా ఉండగా ఇప్పుడు అవి కూలిపోయాయి.

‘తూర్పు’న సింగిల్‌ డిజిట్‌...
తూర్పుగోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్‌ డిజిట్‌ పంచాయతీలనే గెలుచుకుంది. కాకినాడ రూరల్‌ 1, పిఠాపురం 5, ముమ్మిడివరం 8, పెద్దాపురం 6, రామచంద్రాపురం 2, అనపర్తి 7, తుని 3, మండపేటలో 6 పంచాయతీలను మాత్రమే ఆ పార్టీ మద్దతుదారులు గెలవగలిగారు.

భీమిలీలో నిల్‌...
విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో తొమ్మిది పంచాయతీలనే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. భీమిలి నియోజకవర్గంలో భీమిలి మండలంలో ఒక్క పంచాయతీని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. నాలుగో విడతలో 117 పంచాయతీలకు ఎన్నికలు జరిగి™తే కేవలం 24 పంచాయతీలకు పరిమితమైంది.

నేతల సొంత గ్రామాల్లోనూ టీడీపీ కుదేలు..
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో 5 పంచాయతీలను మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావుకు పట్టున్నట్టు చెప్పుకునే రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ఆ పార్టీ నామమాత్రంగానే పంచాయతీలను గెలుచుకుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ సొంత నియోజకవర్గంలో టీడీపీ చతికిలపడింది. టీడీపీ ముఖ్య నాయకులు గౌతు శ్యాంసుందర్‌ శివాజీ, కూన రవికుమార్, బెందాళం అశోక్, కలమట వెంకటరమణ, ప్రతిభా భారతి, కొండ్రు మురళీమోహన్‌ సొంత గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఓడిపోయారు.

విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో 7 పంచాయతీల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. నాలుగో విడతలో ఇక్కడ 239 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 50 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు.


40 ఏళ్ల పాటు ఫ్యాక్షన్‌ కోరల్లో చిక్కుకున్న గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి విముక్తి లభించింది. ఎన్నో ఏళ్లుగా టీడీపీ చేతుల్లో ఉన్న ఆ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు విజయఢంకా మోగించారు. గ్రామస్తులంతా సోమవారం ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement