హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 376 కోట్ల ఆదాయం (కన్సాలిడేటెడ్)పై రూ. 27 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ. 271 కోట్లుగా, లాభం రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం 84 శాతం ఎగిసి రూ. 594 కోట్ల నుంచి రూ. 1,091 కోట్లకు చేరింది.
నికర లాభం 86 శాతం వృద్ధితో రూ. 35 కోట్ల నుంచి రూ. 66 కోట్లకు పెరిగింది. 2021–22లో 259 ఎలక్ట్రిక్ బస్సులు డెలివరీ చేయగా, 2022–23లో 117 శాతం అధికంగా 563 ఈ–బస్సులను అందించినట్లు సంస్థ తెలిపింది. మొత్తం 3,394 బస్సుల కోసం ఆర్డర్లు ఉన్నట్లు వివరించింది. ఎలక్ట్రిక్ టిప్పర్లను కూడా విక్రయించడం ప్రారంభించామని, క్యూ4లో 17 వాహనాలను డెలివరీ చేశామని పేర్కొంది.
సరఫరా వ్యవస్థ, స్థూల పరిస్థితులపరమైన రిస్కులు నెలకొన్నప్పటికీ తాము తయారీ, సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సీఎండీ కె.వి. ప్రదీప్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల విభాగంలో అగ్రగామిగా కొనసాగేందుకు ఇది తోడ్పడుతోందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment