
న్యూఢిల్లీ: ఓవైపు కోవిడ్–19 మహమ్మారి మూడో దశలో భాగంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్నప్పటికీ ఐటీ ఎగుమతులు మాత్రం జంకబోవంటూ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్‌టీపీఐ) పేర్కొంది. వెరసి ఈ ఏడాది(2021–22) ఎస్‌టీపీఐ పథకంకింద రిజిస్టరైన కంపెనీల నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు రూ. 5 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)తో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో ఈ ఏడాది నిలకడ లేదా కొంతమేర వృద్ధి నమోదయ్యే వీలున్నట్లు ఎస్‌టీపీఐ డైరెక్టర్ జనరల్ అర్వింద్ కుమార్ తెలియజేశారు.
కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నప్పటికీ వర్క్‌ఫ్రమ్ హోమ్ తదితరాలు అమలవుతున్న నేపథ్యంలో ఎస్‌టీపీఐ యూనిట్ల సేవలకు అంతరాయం ఏర్పడబోదని వివరించారు. డిజిటల్ పద్ధతిలో జరిగే సాఫ్ట్‌వేర్ సర్వీసుల ఎగుమతులు కొనసాగనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎస్‌టీపీఐ పథకంలో 4,689 సాఫ్ట్‌వేర్ యూనిట్లవరకూ రిజిస్టరయ్యాయి. దేశం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్స్, సాంకేతిక సమాచార శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర వ్యవస్థగా ఎస్‌టీపీఐ ఏర్పాటైంది. దేశీయంగా నూతన ఆవిష్కరణలతోపాటు, టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రెండ్‌ను ప్రోత్సహించేందుకు వీలుగా వర్థమాన సాంకేతికతల పరిజ్ఞానంతో కూడిన 25కుపైగా కేంద్రాలను నెలకొల్పింది.
చదవండి:సెన్సార్ దెబ్బ.. ఏకంగా రూ.40 వేల కోట్ల నష్టం!! ఆగిపోతే ఆగమేమో?
Comments
Please login to add a commentAdd a comment