Recession Effect: Top Tech Companies Laying Off Their Employees at Big Numbers - Sakshi
Sakshi News home page

ఐటీ దెబ్బ.. భారత్‌లో పరిస్థితి ఏంటి?.. అమెరికా, ఇండియా కంపెనీల మధ్య తేడా ఇదే..

Published Sat, Feb 11 2023 1:28 AM | Last Updated on Sat, Feb 11 2023 8:00 PM

Recession Effect: Top Tech Companies Laying Off Their Employees At Big Numbers - Sakshi

అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల్లో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. పెద్ద ఐటీ, టెక్‌ కంపెనీల్లో వేలాదిమందికి అకస్మాత్తుగా ఉద్వాసన పలికారు. అదే భారతీయ కంపెనీల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇతరులతో పోలిస్తే మన కంపెనీలు కొంచెం మెరుగ్గా ఉండటం కారణం కావచ్చు.

కానీ ఒక్క విషయమైతే స్పష్టం. అమెరికా కంపెనీల మాదిరిగా సోషల్‌ మీడియా సృష్టించిందనుకున్న కొత్త ప్రపంచాన్ని అందుకునే ప్రయత్నాల్లో పడకుండా... భారతీయ కంపెనీలు చేస్తున్న పనుల్లోనే కొత్త మార్గాలను అన్వేషించాయి. ఒకరు సృజనాత్మక సృష్టి చేసేవారైతే, ఇంకొకరు వాటిని అమలు చేసేవారు. వ్యాపార పరిస్థితుల్లో వేగంగా వచ్చిన మార్పుల ప్రభావం అమలు చేసేవారిపై పెద్దగా పడలేదు.

ఆల్ఫాబెట్‌ (గూగుల్‌), అమెజాన్, మెటా (ఫేస్‌బుక్‌), మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, ఆపిల్‌ వంటి దిగ్గజ కంపెనీలు గడచిన కొన్ని నెలల్లో ఒక్కొక్కటీ పదివేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచం మొత్తమ్మీద ఈ లేఆఫ్‌లు పెద్ద ప్రకంపనలే సృష్టించాయి. మరోవైపు భారతీయ ఐటీ దిగ్గజాలు మాత్రం కొత్త ఉద్యోగులను తీసుకునే వేగాన్ని తగ్గించడం ద్వారా పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశాయి. ఇదే సమయంలో అమెరికన్‌  టెక్‌ కంపెనీల లేఆఫ్‌ల కారణంగా భారతీయ కంపెనీల్లో ‘అట్రి షన్‌ ’ (ఉద్యోగులు బయటికి వెళ్లిపోవడం) కూడా తగ్గింది. కరోనా మొదలైన సమయంలో ఈ అట్రిషన్‌  ప్రమాదకర స్థాయికి చేరు కున్న విషయం తెలిసిందే. 

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్‌ మహీంద్రా వంటి భారీ భారతీయ కంపెనీలు ఐటీ సర్వీసుల రంగంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఉత్పత్తుల ఆధారిత కంపెనీలూ కొన్ని ఉన్నా వీటిల్లో అత్యధికం ఈమధ్య కాలంలో మొదలైనవనే చెప్పాలి. ఒక రకంగా స్టార్టప్‌ల లాంటివన్నమాట. కరోనా ఉధృతి దిగివస్తున్న క్రమంలో అటు స్టార్టప్‌లు, ఇటు పెద్ద టెక్‌ కంపెనీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొ న్నాయి. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందన్న వార్తలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం ఈ రెండు వర్గాల వారికి గోరుచుట్టుపై రోకటి పోటు చందమైంది. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇవ్వడం మొదలైంది. వ్యాపారం తగ్గిపోవడం, పెట్టుబడులు వచ్చే అవకాశాలు సన్నగిల్లడంతో లాభా లను కాపాడుకునేందుకు ఈ చర్యలు అనివార్యమయ్యాయి. 

మారిన అంచనాలు..
పరిస్థితులు బాగున్న కాలంలో టెక్‌ కంపెనీల్లో వృద్ధి బాగా నమోదైంది. ఫలితంగా ఆయా కంపెనీలు క్లౌడ్‌ సర్వీసులు, కృత్రిమ మేధ వంటి రంగాల్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు అంచనాలు మారిపోవడంతో మళ్లీ గతంలో మాదిరిగా పనులు చేసే ప్రయత్నం జరుగుతోంది. సరుకుల రవా ణాకు డ్రోన్ల వాడకం మొదలుకొని, గాలి బుడగల ద్వారా మూల మూలకూ ఇంటర్నెట్‌ అందించడం వంటి పలు ప్రాజెక్టులు అప్పట్లో గొప్ప ఆవిష్కరణలుగా అనిపించాయి, కానీ ఇప్పుడు అవి పెద్దగా పట్టించుకోని స్థితికి చేరాయి. సిలికాన్‌  వ్యాలీ కేంద్రబిందువు అని చెప్పుకునే శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతంలోనే గత ఏడాది 80 వేల ఉద్యో గాలకు కోత పడిందంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. 

పెద్ద కంపెనీల్లో ఆపిల్, అమెజాన్‌ ఇప్పటికీ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. కాకపోతే గతం కంటే తక్కువగా. ఈ కంపెనీలిప్పుడు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ కూడా ఇదే పనిలో ఉంది. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా 2023 ఏడాది తన సామర్థ్యం పెంచుకునే సంవత్సరమని ప్రకటించింది. నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు గానూ కంపెనీ నిర్మాణంలోని మధ్య పొరలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. 

భారత్‌లో పరిస్థితి ఏమిటి? 
భారత్‌లో సిలికాన్‌  వ్యాలీ కేంద్రంగా బెంగళూరును చెప్పుకోవచ్చు. గత మూడు నెలల్లో అతిపెద్ద ఐటీ కంపెనీలు ఏడింటిలో సుమారు ఐదు వేల మందికి ఉద్వాసన పలికారు. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌లో 2022 చివరినాటికి మునుపటి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు (నియామకాల నుంచి లేఆఫ్‌లు తీసేయగా) ఉండగా... టీసీఎస్, విప్రో, టెక్‌ మహీంద్రా, ఎల్‌టీఐ మైండ్‌ట్రీల్లో మాత్రం ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఈ ఏడు కంపెనీలు కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు సంపాదించుకుంటున్నాయి. కానీ నైపుణ్యానికి చెల్లిస్తున్న మొత్తాలను నియంత్రించుకుంటూ, లాభాలను గరిష్ఠ స్థాయిలో ఉంచే ప్రయత్నం జరుగుతోంది.

కరోనా వచ్చిన తొలి నాళ్లతో పోలిస్తే ఈ వైఖరి పూర్తిగా భిన్నం. అట్రిషన్‌  నియంత్రణకు, వ్యాపారాన్ని కాపాడుకునేందుకు అప్పట్లో కొత్త ఉద్యోగుల నియామ కాలు ఎడాపెడా జరిగాయి. పోటీ కంపెనీలు ఉద్యోగులను ఎగరేసుకు  పోతే కొండంత ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయలేమన్న ఆలోచనతో అప్పట్లో అలా జరిగింది. నైపుణ్యమున్న ఉద్యోగులకు, ఇండస్ట్రీ అవసరాలకు మధ్య అంతరం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. ఈ తేడా ఈ ఏడాది పది శాతం వరకూ ఉంటుందని అంచనా. ఈ ఏడాది రెండో సగంలో ఉద్యో గుల నియామకాలూ పూర్వస్థితికి చేరుకుంటాయని కంపెనీలు ఆశా భావంతో ఉన్నాయి. 

తేడాకు కారణాలివీ...
ఉద్యోగుల నియామకాలు, ఉద్వాసనల విషయంలో అమెరికా, భారతీయ కంపెనీల మధ్య కనిపిస్తున్న స్పష్టమైన తేడాకు కారణా లేమిటో చూద్దాం. కరోనా ప్రపంచాన్ని చుట్టేసిన సందర్భంలో కంపెనీలన్నీ డిజిటల్‌ మార్గం పట్టే ప్రయత్నం మొదలుపెట్టాయి. క్లౌడ్‌ సర్వీసులకు ప్రాధాన్యమేర్పడింది. అందివచ్చిన కొత్త అవ కాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ప్రతి కంపెనీ ఆశిం చింది. కోవిడ్‌ కారణంగా ఇంటికే పరిమితమైపోయి... అట్టడుగు వర్గాల నుంచి కూడా టెక్నాలజీ కోసం డిమాండ్‌ ఏర్పడటంతో కంపెనీలు కూడా తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చింది. టెక్నాలజీ సర్వీసులకు విపరీతమైన డిమాండ్‌ రావడంతో నియా మకాలు జోరందుకున్నాయి. దీని ఫలితంగా ఆట్రిషన్‌  సమస్య పుట్టుకురావడం, ఆ క్రమంలోనే ఉద్యోగుల వేతన ఖర్చులు పెర గడం జరిగిపోయింది.

రెండేళ్ల తరువాత కోవిడ్‌ తగ్గుముఖం పట్టడం మొదలైంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచేశాయి. దీంతో మాంద్యం వచ్చేస్తుందన్న ఆందోళన మొదలైంది. చేతిలో ఉన్న నగదును కాపాడు కునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీలు టెక్నాలజీ రంగానికి కేటాయించిన నిధులకు కోత పెట్టాయి. ఇదే సమయంలో డిజిటల్‌ టెక్నాల జీలకు డిమాండ్‌ కూడా తగ్గిపోవడంతో వీటిని అభివృద్ధి చేసే కంపె నీలు ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి వచ్చింది.

ఈ మొత్తం పరిస్థితుల్లో ఒక్క విషయమైతే స్పష్టం. భారతీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలు పాశ్చాత్య కంపెనీల మాదిరిగా పూర్తిగా సృజ నాత్మక ఆలోచనలకు బదులు ముందుగానే నిర్ణయించిన పనులు చేయడంలోనే నిమగ్నమయ్యాయి. అమెరికా కంపెనీల మాదిరిగా సోషల్‌ మీడియా సృష్టించిందనుకున్న కొత్త ప్రపంచాన్ని అందుకునే ప్రయత్నాల్లో పడకుండా, భారతీయ కంపెనీలు చేసే పనుల్లోనే కొత్త కొత్త మార్గాలను అన్వేషించాయి. 

ఒక్కమాటలో చెప్పాలంటే– ఒకరు సృజనాత్మక సృష్టి చేసే వారైతే, ఇంకొకరు వాటిని అమలు చేసేవారన్నమాట. వ్యాపార పరిస్థితుల్లో వేగంగా వచ్చిన మార్పుల ప్రభావం అమలు చేసేవారిపై పెద్దగా పడలేదు. ఈ తేడా కారణంగానే భారతీయ కంపెనీల్లో పెద్ద స్థాయిలో లేఆఫ్‌లు లేకుండా పోయాయి. మంచి హోదా, వేతనం కోసం యువత ఇప్పుడు పెద్ద టెక్‌ కంపెనీ స్టార్టప్‌ల వైపు చూడాలి. ఓ మోస్తరు వేతనంతో స్థిరంగా ఉండాలని అనుకుంటే మాత్రం అమలు చేసేవారి వద్ద పనిచేయడం మేలు. అదన్న మాట అమెరికా, భారత కంపెనీల మధ్య తేడా!


వ్యాసకర్త సీనియర్‌ ఆర్థిక విశ్లేషకులు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement