మూడేళ్లలో 1,600 మంది నియామకం
టెక్నో బ్రెయిన్ గ్రూప్ సీఈవో మనోజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న టెక్నో బ్రెయిన్ వచ్చే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యతోపాటు పెట్టుబడులను రెట్టింపు చేయనుంది. హైదరాబాద్, ఆఫ్రికాలోని నైరోబీలో ఆర్‌అండ్‌డీ కేంద్రాలున్న ఈ సంస్థ 25 దేశాల్లో సేవలందిస్తోంది. 1,600 మంది సిబ్బంది ఉన్నారు. 2018 నాటికి మరో 1,600 మందిని నియమించుకోనుంది. గత ఐదేళ్లలో సుమారు రూ.65 కోట్లు వెచ్చించింది. విస్తరణకు మూడేళ్లలో రూ.130 కోట్ల దాకా ఖర్చు చేస్తామని టెక్నో బ్రెయిన్ గ్రూప్ సీఈవో మనోజ్ శంకర్ తెలిపారు. కంపెనీ ఉత్తమ పనితీరుకుగాను సీఎంఎంఐ లెవెల్-5 ధ్రువీకరణ పొందిన సందర్భంగా సీవోవో ఆనంద్ మోహన్‌తో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఇ-గవర్నెర్న్ ప్రాజెక్టులపై ఫోకస్ చేశామని మనోజ్ శంకర్ తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్‌తోపాటు పలు దేశాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులు విజయవంతంగా చేపట్టామన్నారు. ట్రిప్స్ పేరుతో ట్యాక్సేషన్, కస్టమ్స్‌కు సింగిల్ విండో సొల్యూషన్‌ను అభివృద్ధి చేశామని వివరించారు.