ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జి. పద్మ అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
-
అంకితభావంతో పనిచేసి మార్గదర్శకంగా నిలవాలి
-
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పద్మ
విద్యారణ్యపురి : ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జి. పద్మ అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో అన్ని వృత్తులకంటే ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే విద్యాబుద్ధులు నేర్పి తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనన్నారు. విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండేలా టీచర్లు అంకితభావంతో పనిచేయాలన్నారు.
కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించాలంటే విద్యాప్రమాణాలు పెం పొందించే విధంగా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు వ్యక్తిత్వ విలువలు కూడా నేర్పాలని సూచించారు. అదనపు జేసీ తిరుపతిరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఎంపిక పారదర్శకంగా చేశామన్నారు. అవార్డులు వచ్చిన ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ వై. బాలయ్య మాట్లాడుతూ సమాజంలో గురువులకు గొప్పస్థానం ఉందన్నారు. అనంతరం హన్మకొండ డైట్ కళాశాల అధ్యాపకుడు సీహెచ్ కేశవరావు, ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్ పాములవర్తి రామారావుతోపాటు మొత్తం 210 మంది ఉపాధ్యాయులను శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, డీఈఓ రాజీవ్, పరకాల జెడ్పీటీసీ సభ్యురాలు కల్పనాదేవి, మహబూబాబాద్ డిప్యూటీ డీఈఓ తోట రవీందర్, వడుప్సా జిల్లా అధ్యక్షుడు బుచ్చిబాబు, జనరల్ సెక్రటరీ దేవేందర్‌రెడ్డి, పెద్ది వెంకటనారాయణ, కార్పొరేటర్ స్వరూపరాణిరెడ్డి పాల్గొన్నారు.