అంగరంగ వైభవం | Grand celebration of Teachers day | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవం

Published Sat, Sep 6 2014 1:23 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Grand celebration of Teachers day

సాక్షి, గుంటూరు :  నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా గుంటూరు వేదికగా శుక్రవారం రాష్ట్ర స్థాయి గురుపూజోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరులోని పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర  ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని 177 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేసి వారిని ఘనంగా సన్మానించారు.
 
 నిర్ణయించిన  సమయాని కంటే ఆలస్యంగా 11.54 గంటలకు వేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
 
 కార్యక్రమానికి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, తొలుత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి ముఖ్యమంత్రి పూలమాల  వేసి నివాళులర్పించారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు లక్ష్మణరెడ్డి, మునికృష్ణారెడ్డిలను సీఎం ఘనంగా సత్కరించారు.మంత్రి రావెల కిశోర్‌బాబు గురుపూజోత్సవ వేడుకలు గుంటూరులో నిర్వహి ంచడాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.
 
 ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థలు తీవ్ర సంక్షోభం లో ఉన్నాయని, వాటిని ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని  సింగపూర్ తరహాలో తీర్చిదిద్దాలని కోరారు.
 
 గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ గుం టూరును ఆధునిక దేవాలయాల ఖిల్లాగా అభివర్ణించారు. రాజకీయాల్లో విలువలు నేర్పిన తమ గురువు చంద్రబాబును ఇప్పుడు సన్మానించుకుంటున్నట్టు చెప్పారు.
 
 ఆకట్టుకోలేకపోయిన సీఎం ప్రసంగం...
 ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం సభికులను ఆకట్టుకోలేకపోయింది. విద్యకు సంబంధించిన అంశాల కంటే ఇతర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో  ప్రసంగం మధ్యలోనే కొందరు లేచివెళ్లిపోవడం కనిపించింది.
 54 నిమిషాలకు పైగా ప్రసంగించిన సీఎం  విద్యార్థులు,టీచర్లలకు ట్యాబ్‌లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఓ దశలో వేదిక వద్దకు కొంత మంది మహిళలు దూసుక వచ్చి వెంటనే డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని నినాదించారు.‘షార్’ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, సాహితీవేత్త గరికపాటి నరసింహరావు ప్రసంగాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి.
 
 శ్రమించిన అధికారులు..
 గురుపూజోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది.     చివరకు చిన్న చిన్న లోటు పాట్లు మినహా కార్యక్రమం యావత్తూ సజావుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
 కార్యక్రమ విజయవంతానికి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ విశేష కృషిసల్పారు. వారితోపాటు డ్వామా, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్లు ఢీల్లీరావు, ప్రశాంతి, ఆర్‌అండ్‌బీ ఈఈ మహేశ్వరరెడ్డి, ఆర్‌డీఓలు, అధికారులు  తీవ్రంగా శ్రమించారు.
 ఐజి సునీల్ కుమార్, రూరల్ ఎస్పీ పీహెచ్‌డి రామకృష్ణ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
 జిల్లాకు సంబంధించి విద్యా శాఖ అధికారులు సైతం సభను చక్కగా నడిపిం చడంలో తమ వంతు పాత్ర పోషించారు.
 
 కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి, రాష్ట్ర ఉన్నతాధికారులు నీలం సహాని, కె.సునీత, జయలక్ష్మి, ఉషారాణి, అజయ్‌జైన్,అథర్‌సిన్హా, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement