ఉపాధ్యాయులంతా ఉత్తములే
♦ అవార్డులతో గుర్తించాల్సిన అవసరం లేదు
♦ మరింత ప్రోత్సహించేందుకే సన్మానాలు
♦ కష్టపడండి.. ప్రతిభావంతుల్ని తీర్చిదిద్దండి
♦ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో చైర్‌పర్సన్ సునీతారెడ్డి
♦ 92 మంది టీచర్లకు పురస్కారాల ప్రదానం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైంది. అవార్డులు అందుకునే వారే కాదు.. ప్రతి టీచరూ ఉత్తముడే. వారిని మరింత ప్రోత్సహించేందుకు కొందరిని ఎంపిక చేసి ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించి పురస్కరిస్తున్నాం.’ అని జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌లో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడారు. భావిభారత పౌరులు తయారయ్యేది పాఠశాలల్లోనే అని, ప్రతి టీచరు వారి వృత్తికి వందశాతం న్యాయం చేస్తేనే దేశం పురోగమిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు జిల్లా పరిషత్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తుందన్నారు. సమస్యలున్నప్పటికీ బోధనపై మరింత దృష్టి కేంద్రీకరించాలని ఆమె సూచించారు.
ప్రభుత్వ పథకాలపైనా అవగాహన అవసరం..
పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యాంశ బోధనతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని జెడ్పీ చైర్‌పర్సన్ గుర్తు చేశారు. విద్యార్థులను చైతన్య పరిస్తే క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు వస్తాయన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి పాఠశాలలో మెక్కలు నాటి వాటిని సంరక్షించాలని, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో తీవ్ర కరువున్నందున అక్కడ విరివిగా మొక్కలు నాటాలన్నారు. మధ్యాహ్న భోజన అనంతరం చేతులు కడిగే నీటిని మొక్కలకు మళ్లించే ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇటీవల విద్యుదాఘాతంతో ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి మరణించడం విద్యాశాఖకు తీరని లోటన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల సౌకర్యం కోసం జిల్లా పరిషత్ నుంచి రూ.3 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రతి పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తామని, ఒకేసారి కాకుండా విడతలవారీగా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో 92 మంది టీచర్లకు శాలువా, మెమోంటోతో సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ రమేష్, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రవణ్, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.