నేనో టాస్క్ మాస్టర్‌ని! | PM's Teachers' Day speech: Be good students, Modi tells kids | Sakshi
Sakshi News home page

నేనో టాస్క్ మాస్టర్‌ని!

Published Sat, Sep 6 2014 1:44 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

నేనో టాస్క్ మాస్టర్‌ని! - Sakshi

నేనో టాస్క్ మాస్టర్‌ని!

హార్డ్ వర్క్ చేస్తాను.. చేయిస్తాను   పిల్లలూ వెన్నెల్లో ఆడుకోండి
2024 వరకు నా ప్రభుత్వానికి ఢోకాలేదు: ప్రధాని మోడీ

 
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. భావి భారత పౌరుల భావనలను అర్థం చేసుకునేందుకు వారిలో ఒకడిగా మారారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. పిల్లల్లో పిల్లాడిలా కలసిపోయారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. చలోక్తులు విసురుతూ నవ్వులు పంచారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘మోడీ సర్’గా మారారు.

విద్యారంగానికి సంబంధించినంతవరకు బాలికావిద్య తన అత్యంత ప్రాథమ్యాంశమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. డ్రాపౌట్లను తగ్గించేందుకు బాలికల ఇళ్లకు దగ్గరలో పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరానన్నారు. అన్ని పాఠశాలల్లో టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని మానెక్‌షా ఆడిటోరియంలో ఎంపికచేసిన వెయ్యిమంది  విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని, అనంతరం దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని ఇచ్చిన సమాధానాలను దాదాపు అన్ని స్కూళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. తానొక టాస్క్ మాస్టర్‌నని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ‘నేనొక పని రాక్షసుడిని. చాలా హార్డ్ వర్క్ చేస్తాను. ఇతరులతోనూ చేయిస్తాను’ అన్నారు. దేశంలో విద్యారంగ ప్రాముఖ్యత పెరుగుతోందని, అదేసమయంలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని ప్రధాని అన్నారు. అందువల్ల చదువుకున్నవారంతా బోధనను ఒక ఉద్యమంలా చేపట్టి జాతి నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. బోధనలో సాంకేతిక సౌకర్యాల్ని ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలని, అలా చేయకపోతే సామాజిక నేరంగా పరిగణిస్తామని మోడీ హెచ్చరించారు. పాఠ్యపుస్తకాలు, టీవీ, కంప్యూటర్‌లలో పిల్లల జీవితం నలిగిపోవద్దని, జీవితంలో ఆటపాటలు ఉండాలన్నారు. గూగుల్‌లో సమాచారం లభిస్తుంది కానీ.. జ్ఞానం లభించదని వ్యాఖ్యానించారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ప్రధాని నివాళులర్పించారు. కాగా, తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మోడీ ప్రసంగ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. కేరళలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని చానెల్‌లో కూడా ఆ కార్యక్రమం ప్రసారం చేయలేదు. గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. టీచర్లు కొవ్వొత్తుల్లాంటి వారని, ప్రతిఫలాపేక్ష లేకుండా తాము కాలిపోతూ వెలుగులను వెదజల్లుతారన్నారు.

విద్యార్థులతో ప్రధాని ముఖాముఖి

మణిపూర్‌కు చెందిన ఒక విద్యార్థి తాను ప్రధాని కావాలంటే ఏం చేయాలని అడగ్గా.. .‘నువ్వు తప్పకుండా అవుతావు. ప్రజల విశ్వాసాన్ని, ప్రేమను పొందిన ఎవరైనా అవుతారు. మరో పదేళ్ల పాటు నా ప్రభుత్వమే ఉంటుంది. అప్పటివరకు నాకు భయంలేదు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కా. నీ ప్రమాణానికి నన్నుపిలువు’ అని నవ్వారు. బాల్యాన్ని కోల్పోకండి. పఠనాభిలాషను పెంచుకోండి. పరిశుభ్రతపై దృష్టి పెట్టండి. నైపుణ్యాలను పెంచుకోండి. వ్యక్తిత్వాన్ని రూపొందించుకోండి.

 విద్యుత్ పొదుపు, జల సంరక్షణ కూడా దేశసేవయే. మీరు ఇంట్లో చేసే విద్యుత్ పొదుపుతో బిల్లు తగ్గడమే కాదు, ఒక పేదవాడింట్లో దీపం వెలుగుతుంది. దీపాలార్పేసి పున్నమి రాత్రుల్ని ఆస్వాదించండి. {పధాని అవుతానని నేనెన్నడూ అనుకోలేదు. నా కుటుంబ నేపథ్యం అలాంటిది. స్కూల్ లీడర్‌గా కూడా నేనెన్నడూ పోటీ చేయలేదు.   జపాన్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాఠశాలను శుభ్రం చేసుకుంటారు.
     
విద్యార్ధి దశలో అల్లరి పనులు చేయని వారుంటారా..? నేనూ చేశా.పెళ్లిలో సన్నాయి వాయించే వ్యక్తి ముందుకు వెళ్లి చింతకాయ చూపించేవాళ్లం. ఆయన నోరూరి వాయించేవాడు కాదు. పక్కపక్కనిల్చున్నవారి దుస్తులను కలిపి పిన్ను కొట్టేవాళ్లం. తల్లి తన పిల్లల్ని చూసినట్లుగా.. ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ ఒకేరకంగా చూడాలి. వివక్ష ప్రదర్శించకూడదు.వాతావరణం మారలేదు.. మనమే. మన అలవాట్లు మారాయి. ప్రకృతితో పోరాడుతున్నాం. అందువల్లే మన పర్యావరణం నాశనమైంది. ప్రకృతిని ప్రేమించండి.
     
{పధాని అయిన తరువాత జాగ్రత్తగా ప్రసంగించాల్సి వస్తోంది. నా మాటల వల్ల దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లకూడదు కదా! {పధాని కావడం వల్ల వ్యక్తిగతంగా నాలో ఏ మార్పు లేదు. బాధ్యత మాత్రం పెరిగింది.    నన్ను నేను ఇంకా ఆవిష్కరించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు నేనెవరో నేను తెలుసుకోలేకపోయాను.టెక్నాలజీ విద్యార్ధుల వరకు చేరాలి. ఇంటర్నెట్, బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ ద్వారా కొత్త విషయాలపై అధ్యయనంఅలవాటవుతుంది.ప్రతీ విద్యార్ధి శుభకార్యాలకు టీచరును పిలవాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement