గురుపరంపరకు వందనం
ఆలోచనం
కులము, మతము, జెండర్ ఘర్షణలు జోరుగా రగులుతున్న కాలంలోనే నా గురువులు నాకు కులమత దేశాలకతీతంగా మనిషిని చూడటం నేర్పారు. నేనివాళ గ్లోబల్ సిటిజన్‌ని అని చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చారు.
ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన ఈ రోజును భారతదేశం 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవి స్తోంది. ఎంఎన్ రాయ్ మాటల్లో చెప్పాలంటే భారతదేశంలో ఆనాడు ఉన్న మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్ తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి. ఆయన 15సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.నా వరకు నాకు అద్భుతమైన గురువుల సాహచర్యం లభించింది. గ్రాడ్యుయేషన్‌లో ఉన్నపుడు నాకు లెక్చరర్ శోభాదేవిగారు పరిచయమయ్యారు. దొరికిన ప్రతి కాగి తాన్ని చదివేసే నా కాంక్షను ఆమె ఒక దారిలో పెట్టారు. అన్ని అస్తిత్వ చైతన్యాలను నాతో నిశితంగా అధ్యయనం చేయించారు. నేను రాయాలి అనుకున్నపుడు మేడం, ఆమె సహచరుడు సాయి గారు నాకు ఏయే పుస్తకంలో ఏమేం చదవాలో గుర్తు పెట్టి అనేక పుస్తకాలను ఇచ్చి చదివించారు.
యూనివర్సిటీకి వచ్చాక నాకు కేకేఆర్ (కేకే రంగనాథాచార్యులు) సర్ పరిచయమయ్యారు. విరసం వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన ఈ మార్క్సిస్టు విమర్శకుని మార్గదర్శకత్వం నేను పయనించే మార్గాన్ని అప్పటినుంచీ ఇప్పటివరకూ జ్ఞాన కాంతులతో నింపుతూ వస్తోంది. నా ఎంఫిల్ పరిశోధనకు గైడ్‌గా వ్యవహరించి పరిశోధన ఎలా చేయాలో నేర్పించిన గురువు ఆయన. ఎదుటి మనిషిని మాట్లాడనిచ్చే, గౌరవించే సంస్కారాన్ని నేను తననుంచి నేర్చుకున్నాను.
ఇంకో గురువు ఎంవీ (ముదిగొండ వీరభద్రయ్య) గారు నాకే కాదు కేసీఆర్ గారికి కూడా గురువు. పాఠం మొదలుపెడితే ప్రపంచాన్ని చూసొచ్చేవాళ్ళం. ఇప్పటికీ ప్రతి వారం నా కాలమ్ చదివి ‘అమ్మాయ్! ఇదిగో ఇక్కడ ఇలా ఉండాలి, ముగింపు ఇలా ఉండాలి’ అని మార్గనిర్దేశం చేస్తారు. పీహెచ్‌డీకి వచ్చాక నా గురువు పిల్లలమర్రి రాములు గారు. మాతృత్వం కాలాపహరణం చేస్తున్నపుడు మంచి స్నేహితుడిలా నా వెంట నిలిచి నా పీహెచ్‌డీ పూర్తి చేయించారు.
కులం, మతం, జెండర్ ఘర్షణలు జోరుగా రగులుతున్న కాలమిది. ఈ కాలంలోనే నాకు లభించిన ఈ గురువులలో ఒక్కరు కూడా నా కులం వారు కాదు. సగం మంది ఆధిపత్య బ్రాహ్మణ కులాలవారు అయినా వారు నాకు తమది గురువుల కులం అని మాత్రమే సందేశం ఇచ్చారు. ఆ కులానికి విద్యార్ధి సంక్షేమంతో తప్ప ఇతరత్రా అంశాలతో సంబంధం లేదని చెప్పారు. నా గురువులు నాకు కులమత దేశాలకతీతంగా మనిషిని చూడటం నేర్పారు. అయితే అందరు గురువులూ నా గురువులంత ఉదాత్తంగానే ఉన్నారా? లేరని ‘భీమాయణం’ పుస్తక ప్రచురణకర్త ఎస్. ఆనంద్ అంటారు. తమ ప్రొఫెసర్ కులవాది అని తెలుసుకోవడానికి బ్రాహ్మణేతరురాలయిన తన స్నేహితురాలు, తాను పేపర్లు మార్చుకుని అసైన్మెంట్ ఇచ్చినపుడు తనకెప్పుడూ ఎక్కువ మార్కులిచ్చే ప్రొఫెసర్ వేరే పేరుతో సబ్‌మిట్ చేసిన తన పేపర్‌కు తక్కువ మార్కులిచ్చాడని చెప్పుకొచ్చారు. ఈ దేశంలో గురువులు ప్రతిభను కులం వారీగా కూడా కొలుస్తారని చెప్పడానికి ఇది ఒక బ్రాహ్మణుడు చెప్పిన తార్కాణం.
మన దేశంలో భర్తీ అయిన విద్యార్థుల్లో 50% మాత్రమే పాఠశాల విద్య పూర్తి చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వారు తన విజన్ మిషన్ డాక్యుమెంట్ లోని సెక్టార్ పేపర్ ఆన్ ఎడ్యుకేషన్‌లో ‘‘ప్రజాసముదాయానికి నాణ్యమైన విద్య అందిస్తే వారు ‘తక్కువ ఆదాయం ఉచ్చు’ నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు’’ అని రాసుకున్నారు. మన రాష్ట్రంలో 2016–17లో ప్రాథమిక విద్యలో 12.77% డ్రాప్‌అవుట్ ఉంటే సెకండరీ ఎడ్యుకేషన్‌లో 20.67% ఉంది. దీన్ని తగ్గించడానికి ప్రభుత్వం వద్ద కండిషనల్ కాష్ ట్రాన్స్‌ఫర్స్‌లాంటి నిర్దిష్ట కార్యాచరణ ఏమీ లేకపోవటం విచారకరం. మీరు ఈ క్లాస్ వరకు మీ పిల్లల్ని స్కూల్‌కి పంపితే మీకింత డబ్బును ఇస్తాం అంటూ బతకడానికి తమకు తామే పెట్టుబడి అయిన పేద వర్గాల వారికి భరోసా ఇవ్వడం నేడు మన రాష్ట్రంలో అత్యవసరం. ఈ అవసరాన్ని ప్రతిపక్ష నాయకుడు తన నవరత్న పథకాలలో ఒకటిగా ‘అమ్మ ఒడి’ అని ప్రకటించడం ఆశావహమైన వాగ్దానంగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నేత ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు మెస్ బిల్ కోసం కూడా అదనంగా డబ్బు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం విద్యార్ధి భవిష్యత్తుకి భరోసా అనొచ్చు.
అదే కాదు కంప్యూటర్ ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకుంటున్న బాబుగారి పాలనలో కంప్యూటర్ వున్న క్లాస్ రూంల శాతం 28.6% మాత్రమే. అదే మహారాష్ట్రలో 55.7% కేరళలో 93.77%. ప్రథమ్ సంస్థ వారి వార్షిక విద్యా నివేదిక (్చట్ఛట) ప్రకారం 2016లో ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ 2వ తరగతి పాఠాన్ని చదవగలిగిన విద్యార్థులు 52 శాతం మాత్రమే. అయితే ప్రభుత్వ గణాంకాల ప్రకారమే మన ప్రభుత్వ పాఠశాలల్లో 99.97 శాతం ఉపాధ్యాయులు అన్ని అర్హతలూ కలిగి ఉన్నారు.
2030లోగా ప్రపంచ దేశాలు సాధించాల్సిన మానవ అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన.. ‘నిలకడ కలిగిన అభివృద్ధి లక్ష్యాల’లో విద్యకి సంబంధించినది 4వ నంబర్ గోల్. దీని ప్రకారం అందరికీ సమంగా నాణ్యమైన విద్యని అందించడంతోపాటు జీవితాంతం విద్యని అభ్యసించే అవకాశాలని పెంపొందించాలి. చిత్తశుద్ధి ఉన్న ఉపాధ్యాయులు ఈ అడ్డంకులన్నీ అధిగమించగలరు. అందుకు మన పూర్వ గురుపరంపరే తార్కాణం.
(నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా)
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966
సామాన్య కిరణ్