samanya kiran
-
మీదీ మాదీ మనదీ ఒకే కథ
కాలం గడిచి గడిచి పోయాక, చాలా ఏళ్ళకెపుడో ఏదో సంఘటన పరిష్కరించలేనిది తటస్థపడినపుడు దారి చూపించగలదు చూడండి.. దానిని మనం అత్యుత్తమ కళా రూపం అంటాం. వేణు ఊడుగుల సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’ అలాంటిదే. ఉదాత్తమైన ఒక దృశ్యకావ్యం కాలం గడిచి చాలా దూరం నడిచివచ్చినా బట్టల పొత్తిళ్ళలో దాక్కుని కూర్చున్న అపురూప పరిమళంలా మనల్ని మనోరంజితం కావిస్తూనే ఉంటుంది. కలతపరచి దిగులుపరచి, మనం ఆలా ప్రవర్తించకూడదనే తెలివిడిని కలిగి స్తూనే ఉంటుంది. చాలా కాలం క్రితం నేను చూసిన ‘రీడర్’ సినిమా నాకివాళ జ్ఞాపకమొస్తోంది. తనకు చదువు రాదని చెప్పుకోవడానికి సిగ్గు పడిన ఒక అమ్మాయి మౌనంగా అనేక సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవి స్తుంది. అట్లాగే ‘షిండ్లర్స్ లిస్ట్’ నాజీల దురాగతాల సమయంలో ఒక యూదుడు చూపిన అత్యున్నత హృదయస్పందన ఏళ్ళు గడిచినా బాధాభరితమైన రసాయనిక అసమతుల్యతను మనలో కలుగజేస్తుంది. కొరియన్ సినిమా, ‘ఏప్రిల్ స్నో’ అవాంఛితమైన పరిస్థితులలో వైవాహికేతర సంబంధంలోకి వెళ్లిన వివాహిత స్త్రీ పురుషుల ఘర్షణ జ్ఞాపకానికి వచ్చిన ప్రతిసారి హృదయం బరువై మరోవైపుకి ఒత్తిగిలి పడుకోవాలనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే వేణు ఊడుగుల ‘‘నీదీ నాదీ ఒకటే కధ’’ నాకు ఇలాటి భావాన్నే కలి గించింది. కనుక. కాలం గడిచి గడిచి పోయాక, చాలా ఏళ్ళకెపుడో ఏదో సంఘటన పరిష్కరించలేనిది తటస్థపడినపుడు దారి చూపించగలదు చూడండి.. దానిని మనం అత్యుత్తమ కళా రూపం అంటాం . వేణు ఊడుగుల సినిమా అలాంటిదే. అనేక ఒత్తిళ్ల మధ్య చిక్కుకుని, మార్కెట్ చెబుతున్న మార్గంలో పయనించలేక, సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్ రేస్‌లో నిలువలేక రాలి పడిపోతున్న, అయోమయానికి, ఆత్మన్యూనతకు లోనవుతున్న అనేకమందిని వేణు మనకు పరిచయం చేశాడు. చాలా సినిమాలు ఉదాత్తతను చెబుతూనే మధ్యలో ఎక్కడో పురుష దాస్యాన్ని చెబుతుంటాయి. ఫిదా సినిమా చూస్తున్నపుడు నాకు ఇలాటి ఆశ్చర్యమే కలిగింది. తాటి చెట్టంత మగవాళ్ళు ఇద్దరుండగా, అక్కకు సహాయానికి చెల్లి ఇండియానుంచి రావడమూ, కాలేజ్‌లో తన మీదికి వచ్చిన మగపిల్లలపై, వీరనారిని అని చెప్పుకునే నాయిక నాయకుడి వీరత్వ ప్రదర్శనకు ఎదురుచూడటం, ఇంటి చాకిరీ బాధ్యతగా చేయడం, ఆమె వూగిసలాట చాలా చిరాకు తెప్పించింది. వేణు సినిమాలో అలాంటి ద్వైదీయతలు ఉండవు. మొదటినుండి కడదాకా ఒకటే విషయం, స్థిరచిత్తంతో ప్రశ్నిస్తూ వెడతాడు. ‘మీరు సాధించగలరు’ అని ఒకలాటి భ్రమాత్మకత మాదకత వైపుకి నేటి యువతరాన్ని నెడుతున్న అనేక అంశాలను వేణు ప్రశ్నిస్తాడు . వేణు చాలా మృదువైన అబ్బాయి. మితభాషి, ముఖంనిండుగా మాటలు అక్కరలేని మౌనం చిద్విలాసంగా వెలుగుతూ ఉంటుంది. అతనిది ‘‘లవ్ ఎట్ రీజనల్ మైల్ స్టోన్’’ నేను చదివిన మొదటి కవిత. అట్లాగే మనసుకు హత్తుకు పోయింది. ప్రేమ సంబంధాలలోకి ఓ ప్రాంతం ఎలా చొచ్చుకొస్తుందో చెప్తాడు ఈ అబ్బాయి ఎంతో హృద్యంగా. ‘‘వంద ప్లాస్టిక్ సర్జరీలు కావాలి–ఆమె చెంపలపైనున్న నా ముద్దుల తడి ఆరడానికి! ఏడు సముద్రాలు కావాలి – నేను మాత్రమే కని పించే ఆ రెండు కళ్ళని కడుక్కోవడానికి’’ అంటూ నీది మా ఏరి యానే అయితే ఈ గొడవే ఉండేది కాదు అని వెళ్ళిపోయిన ప్రాంతీయేతర ప్రియురాలి గురించి అతను రాసిన కవిత సాహిత్య ప్రపంచంలో ఒక సంచలనం. సామాజిక స్పృహ నిండుగావున్న వ్యక్తి తన ఆలోచనలకు దృశ్య రూపం ఇస్తే అది కచ్చితంగా చాలా పాతదే అయిన మట్టిని చీల్చుకుని బుజ్జి బుజ్జి మారాకులు వేసుకుని ఆత్మవిశ్వాసంతో సూర్యుని దిక్కుకి ధిక్కారంతో తల ఎత్తి ప్రశ్నలు వేస్తున్న చిట్టి మొలకలా ఉంటుంది. వేణు ఇప్పుడు మనముందుంచిన ‘‘నీదీ నాదీ ఒకటే కథ’’ అచ్చం అలాటి సినిమానే. ఎన్నో విలువయిన ప్రశ్నలను ఒక అమాయకుడయినా ఎదిగీ ఎదగని అబ్బాయి చేత అడిగించాడు ఈ దర్శకుడు. సంతృప్తిగా బ్రతకడమంటే ఏమిటీ? సంతృప్తికి కొలమానాలేవి? యూనివర్సిటీలో ఉన్నపుడు క్లాస్ నుంచి తిరిగివస్తుంటే అంత వరకు మట్టి పని చేసిన కూలీలు కేరేజీలు విప్పి వరుసగా కూర్చుని భోజనం చేస్తుండేవారు, మధ్యమధ్యలో బోలెడు చతురులు. ఒక ముద్ద అడిగి పెట్టించుకు తినాలనిపించేది వాళ్ళని చూస్తే. వాళ్ళు సంతృప్తిగా లేరనా? ఇంటికెళ్లి ఉడుకు నీళ్లు పోసుకుని పడుకుంటే వాళ్లకి పట్టే నిద్ర చిరంజీవికి పడుతుందా, మోదీకి పడుతుందా. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నాకు నచ్చింది వ్యక్తిత్వ వికాస తరగతులూ, పుస్తకాలు. ఈ మధ్య కాలంలో వేలం వెర్రిగా మార్కెట్‌ను ఆక్రమించుకుంటున్న ఈ అంశం గురించి వేణు భలే చెప్పాడు. ‘‘గొప్ప విజయాలకు ఎల్లప్పుడూ గొప్పత్యాగాలు అవసరమవుతాయి’’ అంటాడు మోటివేషనల్ స్పీకర్ రాబిన్ శర్మ. శాక్రిఫైస్ అనేదానికి పరిమితి ఏమిటీ? ఎంతవరకూ? తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు చుట్టూ అల్లిపెడుతున్న బంగారు వలలో పడి పిల్లలు చేస్తున్న త్యాగాల అత్యాచారాన్ని ఎవరైనా కొలతలు వేస్తున్నారా? వేణు వేసిన అన్నిటి కన్నా పెద్ద ప్రశ్న ఒకటి ఉంది అది ’’డిగ్నిటీ ఆఫ్ లేబర్’’. డిగ్నిటీ అఫ్ లేబర్ అంటే ఏమిటీ, మనమూ, మనపక్కన వ్యక్తి చేస్తున్న పని ఏదయినా అది విలువయినదే. నేను కార్ నడుపుతాను, నువ్వు ఆ కార్ ఓనర్‌వి అయితే ఏమిటీ, నాకు ఈ వృత్తి వచ్చు, నీకు మరో వృత్తి వచ్చు. ఒక వృత్తి మాత్రమే గొప్పది అని నిర్వచించిన కుట్ర ఎక్కడ మొదలయింది? లేచీ లేవగానే తిండి గింజల కోసం రెక్కలల్లార్చుకుని ఆకాశపు దారుల్లో బయలుదేరే పిట్ట కడుపు నిండాక పడే తృప్తి ముందు రేపటి చింత నిలబడగలదా? సాదా సీదా సెట్టింగుతో, ఎక్కడా కించిత్తు శారీరక ప్రదర్శనలు లేకుండా ఇన్ని ప్రశ్నలు అడిగిన ఈ అబ్బాయికి, ఇంత మంచి సినిమా తీసిన ఈ అబ్బాయికి భవిష్యత్తు మరిన్ని అవకాశపు వాకిళ్ళను తెరిచే ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పక చూడండి, ఎప్పుడో ఒకప్పుడు మనం ఫీలయిన కథ మనందరి కథ, వేణు ఊడుగుల ‘‘నీదీ నాదీ ఒకటే కథ’’. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900 -
వెన్నుపోటును మర్చిపోవాలా?
ఆలోచనం కొన్నిసార్లు పట్టుకుని ఉండటం కన్నా వదిలివేయడం మేలు అన్నది కదా ఆ అమ్మాయి. వదిలివేయడం అంటే ఎట్లాగా? సర్వ ధ్వంసం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా పట్టుకోకుండా వదిలివేస్తామా? నిన్న దినపత్రికలో తల్లిని హత్య చేసి తలనుపట్టుకుని పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగి పోయిన కొడుకు వార్త ఒకటి చదివాను. ఎందుకనో మనసంతా దిగులు, చిరాకు కమ్ముకున్నాయి. ఎప్పుడో చదివిన ఎస్.ఎల్ బైరప్ప ‘‘గృహ భంగం’’ నవలలో పనికిమాలిన ఇద్దరు కొడుకుల భారాన్ని భుజాలపైకి ఎత్తుకున్న వితంతు తల్లి పాత్ర జ్ఞాపకం వచ్చింది. అదే రోజు రాత్రి హోటల్లో బస చేసిన వెంటనే అలవాటుగా పక్కనే వున్న పత్రికను చేతిలోకి తీసుకున్నాను తిరగేద్దామని. పత్రిక పేరు ‘‘పాస్’’ ప్రకటనలతో నిండిన నాలుగైదు ముందు పేజీలు తిప్పాక, చక్కటి అమ్మాయి ఫొటో. పేరు శర్వాణి పొన్నం, చీఫ్ ఎడిటర్. ప్రారంభ వాక్యాలు ‘‘క్రూర విమర్శ, నిజాయితీరాహిత్యం, వెన్నుపోటు.. వంటి పలు అంశాలను అలాగే పట్టుకోకుండా వదిలేయడమే కొన్నిసార్లు ఉత్తమంగా ఉంటుంది’’ అని రాశారు ఆమె. ఎందుకనో మనసు పదే పదే ఆ వాక్యాల చుట్టూ భ్రమించడం మొదలు పెట్టింది. అంతకు ముందే వస్తూ వస్తూ ప్రయాణంలో చదవడానికి పట్టుకొచ్చిన చువాంగ్ త్సు పుస్తకపు పరిచయ వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి. 815వ సంవత్సరంలో చైనా ఆస్థానకవి ‘‘చు ఈ’’ని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని, రాజ్యం పనితీరుని నిలదీసే ప్రశ్నలు వేస్తున్నాడని దేశబహిష్కారం చేసిందట అక్కడి రాజ్యం. భార్యను మాత్రమే తన వెంట రానిచ్చారు. ఊరు కాని ఊరు, అంతవరకు పొందిన సౌకర్యాలు, మానసిక సౌఖ్యాలు, ఆనందాలు ఏవీ లేని, ఉన్న అన్నిటినుంచి తరిమివేసిన దూరాభారం. ఎలా ఆ దుఃఖం నుంచి బయటపడటం. అప్పుడు చువాంగ్ త్సును చదవటం మొదలు పెట్టాడట చు ఈ. ఆ చదువు నుంచి అతను ‘‘స్వస్థలాన్ని వదిలేయడం, బంధువులకు దూరంకావడం, ఎరుగని కొత్త ప్రాంతంవైపు బహిష్కరణకు గురికావడంతో, నా హృదయం ఎంతో పరితాపానికి, బాధకు గురవుతోంది. చువాంగ్ త్సును సంప్రదించాక, నేను దేనికి చెందినవాడినో కనుగొన్నాను. కచ్చితంగా నా స్థలం కనీసం భూమి కాని చోటే ఉంది’’ అంటూ ‘‘రీడింగ్ చువాంగ్ త్సు’’ అనే పేరుతో ఒక కవితను రాశాడు. చువాంగ్ త్సు ఇంకా అంటాడు ‘‘ఏం జరిగినా దాని వెంట సాగిపో, నీ మనస్సును స్వేచ్ఛగా ఉంచుకో: నీవు ఏం చేస్తున్నావో దాన్ని ఆమోదించడం ద్వారా సమస్థితిలో ఉండు. ఇదే అంతిమమైనది’’ అని. నిజంగా దుర్మార్గమైన విమర్శలనూ, నిజాయితీలేని వ్యక్తులనూ, వెన్నుపోట్లనూ మనసులో పెట్టుకోకుండా సరే లెమ్మని పోనియ్యడం సాధ్యమేనా? అనర్హులై ఉండీ అర్హులను చూసి అసూయపడే మను ష్యులూ, మనం ముందుండాలంటే ముందుండేవాళ్ళని క్రిందికి లాగడమే మార్గం అని నమ్మే వ్యక్తులూ.. కులాలనీ, మతాలనీ, ఉందనీ, లేదనీ ఇంకా అదనీ ఇదనీ, అర్థం కాకనో అర్థం చేసుకునే స్థాయి లేని స్థోమత లేని వ్యక్తులు చేసే ఎన్నెన్ని గాయాలు? కొన్నిసార్లు హృదయానికయ్యే ఈ గాయపు పోట్లు చాలా తీవ్రంగా ఉంటాయి, మానాయనుకున్నా మచ్చలు మరీ భయంకరంగా పడి మిగిలిపోతాయి కదా, అటువంటపుడు మరచిపోదామనుకున్నా మచ్చలు కనిపిస్తున్నపుడు మరి చువాంగ్ త్సు నో, జిడ్డు కృష్ణమూర్తినో చదువుకుంటూ, స్మరించుకుంటూ ఈ గాయాల నదిని దాటివేయగలమా? మళ్ళీ శర్వాణి జ్ఞాపకం వస్తుంది నాకు. కొన్నిసార్లు పట్టుకుని ఉండ టం కన్నా వదిలివేయడం మేలు అన్నది కదా ఆ అమ్మాయి. వదిలివేయడం అంటే ఎట్లాగా? పేజీలు తిప్పుతూ వెళితే రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ కనిపించింది అదే పత్రికలో. ‘మన జీవనమంతా ఉదయరాత్రాల మధ్యన ఉంచి చూసుకోవడం. ఈ పొద్దు గడిస్తే ఈ రాత్రికి మరణిస్తాం. అందరమూ మరణిస్తాం. మనల్ని మోసం చేసిన వాళ్ళు, వెన్నుపోటుదారులు, అసత్యవంతులు, తప్పు చేస్తూనే దబాయించే దుర్మార్గులూ అందరమూ మరణిస్తాం’ ఆర్వీజీ చెప్పిన ఈ పొట్టి వాక్యం సులభంగా వుంది కదా. ఇలా ఆలోచించుకుంటూ ఉన్నానా.. హఠాత్తుగా క్రైస్తవ మత ప్రేమిక అయిన నా బిడ్డ వచ్చి ‘‘అమ్మా.. అమ్మా!’’ నీ యుద్ధాన్ని నా యుద్ధంగా భావించి నేనే నీ బదులుగా పోరాడుతాను, నిన్ను అవమానపర్చిన వారిని వారి స్వమాంసం వారు తినేట్లు చేస్తాను’ అని వచ్చిందమ్మా ఇవాళ్టి వాక్యం, ఇట్స్ కూల్’’ అంది. నవ్వొచ్చింది. కనుక శర్వాణి చెప్పినట్టు కొన్నింటిని పట్టుకోకుండా వదిలేయడంలో నిజంగానే చాలా సుఖం వుంది కదా. జీవితంలో దమ్ముతో నిలబడి పోరాడాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. పోరాడాలి. అలాగే వదిలేసి ముందుకు నడిచిపోవాల్సిన అంశాలూ చాలా ఉంటాయి. ఆగిపోకూడదు. ముందుకెళ్లిపోవాలి. ఎప్పుడు ముందుకెళ్లాలి, ఎప్పుడు పోరాడాలో మన బుద్ధి మనకు తప్పక చెపుతుంది. అందులో మనసును తల దూర్చనీయకపోతే చాలు. కాలం ముందుకే వెళుతుంది. వెనకకు ఎప్పుడూ రాదు. అన్నింటికన్నా ముందుండి ఎప్పుడూ నన్ను నడిపించే హేతువు, నాలో మొలకెత్తే భావ నిస్సత్తువను కాలితో మట్టం చేసే హేతువు ఇదే నిజమని చెప్తుంది. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి సామాన్య 80196 00900 -
విద్యపై మార్కెట్ నీలినీడలు
ఆలోచనం ఏ మంచం కొనాలో, ఏం తినాలో మార్కెట్ చెబుతుంది. ప్రభుత్వ బడుల్లో మంచి చదువు దొరకదని మార్కెట్టే చెప్పింది. మార్కెట్ ఇంతలా మనల్ని అల్లుకుని వున్న ఈ కాలంలో మోదీ మూస మాటల వల్ల ఏం లాభం జరుగుతుంది? పోయిన శుక్రవారం ఢిల్లీలో ‘‘పరీక్షా పర్ చర్చ’’ అనే కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో ముచ్చటిస్తూ, మోడీ ‘‘మీ మొత్తం దృష్టినంతా నేర్చుకోవడంపై పెట్టాలి. ఫలితాలు, మార్కులు అనేవి అనుబంధ ఉత్పత్తులుగా ఉండాలి’’ అని, అంతటితో ఆగక ‘‘తమ పిల్లలు ఏదో అవ్వాలన్న తల్లిదండ్రుల స్వప్నాలను మీరు అంగీకరించాలి’’ అన్నారు. మోదీ పలికిన ఈ ఆణిముత్యాలను నెమరువేసుకుంటూ ఉంటే, నాకు, కార్పొరేట్ కళాశాలల దౌష్ట్యం వల్ల, గత రెండేళ్లలో దాదాపు 450 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. ఇవన్నీ నాకు పదే పదే నా చదువును జ్ఞాపకం చేశాయి. నా తల్లికి నన్ను డాక్టర్‌గా చూడాలని ఉండేది. నాకేమో మెదడులో ఎడమ భాగం కన్నా కుడి భాగం చురుకుగా పనిచేసేది. ఎడమ వైపు మెదడు తార్కికమైన, క్రమానుగతమైన సైన్స్, మ్యాథ్స్‌లకు చెందగా, కుడి వైపు మెదడు సమగ్ర చింతన, సృజనాత్మకత, కళా సంగీతాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏ మనిషికీ కేవలం కుడి లేకా ఎడమ మెదడు మాత్రమే పని చేయడం ఉండదు కానీ, ఒక వైపు మెదడు మరో వైపు కంటే చురుకుగా పని చేయడం సాధారణంగా ఉంటుందట. అట్లా నన్ను వేకువన, మా హాస్టల్లో చదువుకోవడానికని లేపితే, ఎంతకీ నా బుర్రలోకి ఎక్కని ఫిజిక్స్ మెటీరియల్ చేతిలో పట్టుకుని, స్టడీ చైర్లో కూర్చుని, నా చుట్టూ ఆవరించి వున్న లైట్ వెలుతురుకి ఆవల వున్న నిశీధిని దాటి, చాలా దూరంలో వున్న స్మశానంకేసి చూస్తూ, అసలు ప్రపంచం చెప్తున్నట్లు కొరివి దయ్యాలనేవి ఉన్నాయా అని శ్రద్ధగా వెదికేదాన్ని. కొరివి దయ్యాలు కనిపించేవి కావు కానీ, మార్కులు మాత్రం గుడ్డు సున్నాలు వచ్చేవి. నా అదృష్టం బాగుండటం చేత నేను సైన్స్ నుంచి బయటపడి ఆర్ట్స్‌కి వచ్చాను. అప్పుడిక నా కుడి మెదడు వికసించి, ఎదురు లేకుండా బంగారు పతకాలతో, బహుమతులతో విజయబావుటా ఎగురవేసుకుంటూ వచ్చాను. ఐన్‌స్టీన్ ‘‘ప్రతి ఒక్కరూ మేధావే. కానీ మీరు చెట్లు ఎక్కగలగడాన్నిబట్టి చేప సామర్థ్యాన్ని నిర్ధారిస్తానంటే అది జీవితాంతం తాను మందమతిని అని నమ్మేస్తూ బతుకుతుంది’’ అంటాడు. నా చదువు గుర్తొచ్చినప్పుడల్లా నాకీ కొటేషన్ జ్ఞాపకం వస్తుంది. అసలు చేపల్ని చెట్లు ఎక్కించాలని నేటి తల్లిదండ్రులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రాణాలు పోగొట్టుకున్న ఈ 450 మంది పిల్లల తల్లిదండ్రులు వారిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మాత్రమే ఎందుకు చూడాలనుకుంటున్నారు? సమాజం మనుషుల ఉన్నతిని డబ్బుతోనే కొలుస్తుంది కనుక, తమ పిల్లలు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాలంటే డబ్బులొచ్చే చదువులు చదవాలన్నది వారి ఆశ. వారి ఆశ లేదా డిమాండు యొక్క సృష్టే కార్పొరేట్ కళాశాలలు. అందరూ అంటున్నట్లు ఆత్మహత్యలకు కారణం కార్పొరేట్ కళాశాలలు కాదు. తల్లిదండ్రులు అందుకు కారణం. తల్లిదండ్రుల ఆశని డబ్బురూపంలో స్వీకరించే కళాశాలలు వారి ఆశలను ఫలింపచేయడానికి రకరకాల పద్ధతులను కనిపెట్టి ‘సప్లై’ చేస్తున్నాయి. సోషల్ డార్వినిజం ‘సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్’ సిద్ధాంతాన్ని చెప్తుంది. ఒత్తిడిని తట్టుకోగలిగిన వాళ్ళు తట్టుకుని డాక్టర్లో మరొకటో కావచ్చు, అలా కాని వాళ్ళు పెద్దల ఆశకు, కళాశాలల ఆచరణకు మధ్యన నలిగి బలి అవుతున్నారు. తల్లిదండ్రులు చేపల్లాంటి తమ పిల్లల్ని చెట్లెక్కాలని కోరుకోవడం వెనుక వున్న ప్రోద్బలాన్ని ‘‘మార్కెట్’’ అంటున్నాడు మైఖేల్ జె.శాండల్ తన ‘వాట్ మనీ కాంట్ బై’ అన్న పుస్తకంలో. ‘‘ఇటీవలి దశాబ్దాల్లో, మార్కెట్ విలువలు జీవితంలోని ప్రతి ఒక్క అంశంపైనా అంటే వైద్యం, విద్య, ప్రభుత్వం, చట్టం, చివరకి కుటుంబ జీవనం పైన కూడా ప్రభావితం చూపుతూ వచ్చాయి. మనం మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నుంచి మార్కెట్ సమాజం వైపు కొట్టుకుని పోతున్నాము... ఏ ఆలోచనాత్మకమైన ఎంపిక ద్వారానో మనం ఈ స్థితికి రాలేదు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయినందువల్ల, మార్కెట్, మార్కెట్ చింతన అనేవి కనీవినీ ఎరుగని ప్రతిష్ఠను ఆస్వాదిస్తున్నట్లుంది. ఇదే నిజం కావచ్చు కూడా.’’అంటారు. నా తండ్రి కాలంలో చదువు ఒక చాయిస్ మాత్రమే, బ్రతుకుదెరువు కాదు. ఇప్పుడలా కాదు ఏ మంచం కొనాలో, ఏం తినాలో మార్కెట్ చెబుతుంది, మనుషుల్ని ప్రలోభ పెడుతుంది. ప్రభుత్వ బడుల్లో మంచి చదువు దొరకదు అని మార్కెట్టే మనకు చెప్పింది. మార్కెట్టు ఇంతలా మనల్ని అల్లుకుని వున్న ఈ కాలంలొ మోడీ మూస మాటల వల్ల ఏం లాభం జరుగుతుంది? ఇప్పుడు మనముందున్న మార్గాలు రెండే. మొదటిది విద్యావ్యవస్థని మార్కెట్ బంధనాలనుంచి తప్పించి, సంపూర్ణంగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకుని విద్యను జ్ఞానాన్ని, సంస్కారాన్ని ఇచ్చేదిగా తీర్చిదిద్దడం. రెండు, సోషల్ డార్వినిజం ప్రకారం ఆత్మహత్యలు చేసుకునే పిల్లలు చేసుకోగా, పటిష్టమైన వారే సమాజంలో మిగుల్తారులే అని చూసీ చూడనట్టు ఊరుకోవడం. మోదీ మొదటి మార్గాన్ని ఎంచుకుని ఆ దిశగా అడుగులు వేస్తే ఎంత బాగుంటుంది కదా! వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900 సామాన్య -
ఒళ్లంతా ముళ్లుండే కాలం..!
‘‘ఈ దేశంలోని ఆడదానికి ఒళ్లంతా ముళ్లుండే రోజు ఎప్పుడొస్తుందా’’ అన్నారొక రచయిత్రి. స్త్రీలు అవసరమైనపుడు ఒళ్లంతా ముళ్లు పుట్టించుకుని తమను తాము రక్షించుకోగల విద్యలో తర్ఫీదు అవ్వాల్సి ఉంది. ఆలోచనం ఢిల్లీ కోర్టులో 2014లో నమోదైన ఒక కేసుపై నిన్న తీర్పు ఇస్తూ జస్టిస్ సీమా మైని ‘‘స్త్రీ తన శరీరమంతటికీ తానే హక్కుదారు. ఆమె అనుమతి లేకుండా ఆమె శరీరాన్ని తాకే హక్కు ఎవరికీ లేదు. తీవ్ర వాంఛాపరులైన, లైంగికంగా విపరీతబుద్ధి కలిగిన మనుషులు ఇలాంటి చర్యల ద్వారా శృంగారపరమయిన కిక్కును పొందుతారు’’ అని పేర్కొంటూ ఆ నేరస్తుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను, పదివేల జరిమానాను విధిం చారు. తల్లితో వెళుతున్న తొమ్మిదేళ్ల పాపను జన సమ్మర్ధంలో తాకరాని చోట తాకి పైశాచికపు ఆనందాన్ని పొందిన ఒక వ్యక్తికి పడ్డ శిక్ష అది. అలా తాకాలనే కాంక్ష వున్న మగవాళ్లు తమ కోరికను తమలోనే అణిచివేసుకోవాలన్నంతగా భయపెట్టే తీర్పు ఇది. అయితే మన వార్తాపత్రికలు ఆ వార్తకు అతికష్టం మీద 70 పదాల స్థలాన్ని మాత్రమే కేటాయించాయి. బహుశా మీడియాకి వున్న మగ దృక్పథమే కారణం కావచ్చు. ‘భారత్ వంటి స్వేచ్ఛాయుతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న, సాంకేతికంగా బలమైన దేశంలో, మహిళలు వారు పెద్దవారైనా లేక చిన్నపిల్లలైనా సరే.. బహిరంగ స్థలాల్లో, ప్రత్యేకించి జనంతో నిండి ఉండే మార్కెట్లు, బస్సులు, మెట్రోలలో నిత్యం బాధితులుగా కొనసాగుతుండటం దురదృష్టకరం’ అన్నారు జస్టిస్ సీమా మైని. దేశంలో ప్రతిరోజు ఎన్నో అత్యాచారాలు జరుగుతుండగా వాటిలో వెలుగులోకి వచ్చే అత్యాచారాల సంఖ్యే అతి తక్కువగా ఉంటుంది. అటువంటిది బస్సులో ఏమీ తెలియనట్టు, పనిలో ఏ ఫైలో ఇస్తున్నట్టు ఎరిగీ ఎరగకుండా తాకి ఆనందపడే మగవాళ్ల సంఖ్య రోజుకి కోట్లల్లో ఉంటుంది. నమోదు చేస్తూ వెళితే ఒక్క రోజులోనే, అత్యున్నత స్థానంలో ఉండీ, తోటి మహిళాధికారి రూపెన్‌తో అసభ్యకరంగా ప్రవర్తించి, పిర్రమీద చరిచిన కేసులో జైలుపాలైన కేపీఎస్ గిల్ లాంటి వాళ్లు బోలెడు మంది కనబడతారు. ఇలాంటి కోట్ల మంది కామ పిశాచుల అత్యాచారాలను అంతరాలు లేకుండా స్త్రీలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో మగవాళ్లు అభ్యం తరకర రీతిలో తాకడంపై మాట్లాడుతూ కథానాయిక అనుష్క ‘‘ఈ మధ్య హైదరాబాద్‌లో నాకిలాంటి ఓ ఘటన జరిగింది. ఆ మూమెంట్లో చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది. కానీ, అలా చేయలేం కదా. అందుకే కొట్టాను. ఆ ఘటన జరిగిన రోజు రాత్రి నిద్ర పట్టలేదు. వక్రబుద్ధి ఉన్నవాళ్లే ఇలా చేస్తారనుకుంటా’’ అని పేర్కొన్నారు. అనుష్క చదువుకున్న, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న, చుట్టూ మందీ మార్బలం ఉన్న వ్యక్తి. ఆమె ఆ క్షణంలో అనుకుని ఉంటే, చంపెయ్యాలన్నంత తన కోపానికి ఒక రూపాన్ని ఇచ్చి ఉండొచ్చు. బాంబే హైకోర్ట్ 2014లో మహేంద్ర చాటే కేసును విచారిస్తూ, ‘మీరు మహిళ భుజంపై మీ చేయి ఉంచినా సరే, ఆ స్పర్శ స్వభావం స్నేహపూర్వకమైనదా, సోదరపూర్వకమైనదా లేక పితృవాత్సల్యంతో కూడినదా అనే అంశంపై వ్యాఖ్యానించవలసింది ఆ మహిళ మాత్రమే’ అని వ్యాఖ్యానించిందని తెలిసి ఉంటే, తనని అభ్యంతరకర రీతిలో తాకిన ఆ వ్యక్తిని కొట్టడానికైనా సరే అతనికి చేయి తగిలించాల్సిన పని లేకుండా అనుష్క కేసు నమోదు చేసి ఉండొచ్చు, ఏ రెండేళ్లో జైలులో కూర్చోబెట్టి మిగిలిన ఆడవాళ్లకు ఒక సెలెబ్రిటీగా మార్గదర్శకం చేసి ఉండొచ్చు. ఆమెకైనా లేదా ఇతర స్త్రీలకైనా చట్టం తమకేం సౌలభ్యతలు కల్పిస్తుందో తమను ఎలా కాపాడుతుందో తెలియకపోవడం, ఆ చట్టాలను ఉపయోగించుకునే చొరవ, తెగువ లేకపోవడం పెద్ద లోపం. అలా తెలిసిన స్త్రీలను కూడా మగవాళ్లు సాంప్రదాయాల పేరు చెప్పి, సామాజిక అస్పృశ్యత బూచిని చూపించి అణచిపెడుతూ ఉంటారు. మగవాళ్లు, తమను తాము రక్షించుకోవడానికి రచించుకున్న ఈ భావజాలాలనుంచి బయటపడే తర్ఫీదు స్త్రీలకూ ఇవ్వాలి. స్త్రీవాద కవి జయప్రభ స్త్రీవాదం తొలిదశలో ‘‘చూపులు’’ అని ఒక కవిత రాశారు. ఇందులో ఆమె.. సెక్సిస్ట్ వైఖరితో ఆడదాన్ని గాయపరచగల మగవాడి చూపులెలా ఉంటాయో.. అవి ఆడవాళ్లని ఎంతగా హింస పెడతాయో చెబుతారు.. ‘‘రెండు కళ్లనించి చూపులు సూదుల్లా వచ్చి/ మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతుంటాయి /చూపులెప్పుడూ ముఖంలోకి చూడవు /మాట ఎప్పుడూ మనసు నించి పుట్టదు /కనిపించినప్పుడల్లా కంపరం పుట్టేలా/ఒంటిమీద చూపులు చెదల్లా పాకుతూ ఉంటాయి’’ అని చెపుతూ ‘‘ఈ దేశంలోని ఆడదానికి/ఒళ్లంతా ముళ్లుండే రోజు/ ఎప్పుడొస్తుందా’’ అని ముగిస్తారు. పాలనా యంత్రాంగంలో ఆకాశంలో సగమన్న స్త్రీకి చిటికెడు చోటుకూడా ఇవ్వని పురుష పరిపాలకులున్న ప్రపంచం ఇది. కవి సుధ ‘‘ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలి/నీ యుద్ధం నువ్వే గెలవాలి/నీ రక్తంతో నీ మూలిగతో/నీ కత్తి డాలు నువ్వే చేసుకోవాలి’’ అని చెప్తారు స్త్రీలకు. స్త్రీలు మరోసారి ఉద్యమమై ఒకరికి ఒకరై ఈ వాక్యాలను పునరావృతం చేసుకుంటూ ముందుకు వెళ్లవలసిన అవసరాన్ని ఈ అతిచిన్ని వార్తాకథనం నాకు జ్ఞాపకం చేసింది. స్త్రీలు అవసరమయినపుడు వళ్లంతా ముళ్ళు పుట్టించుకుని తమను తాము రక్షించుకోగల విద్యలో తర్ఫీదు అవ్వాల్సిన అవసరాన్ని కూడా నాకీ వార్తాకథనం గుర్తుచేసింది. సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ఫోన్ నెంబర్ : 80196 00900 -
మతసమస్యా, న్యాయసమస్యా?
నమ్మిన మూగజీవులను ప్రేమించడం, వాటికోసం స్వర్గాన్ని కూడా వదులుకోవడం మన సంప్రదాయం. కానీ దీపావళి రోజున పటాసులను పేల్చి వాటికి భంగం కలిగించడం న్యాయమేనా? నేషనల్ కేపిటల్ రీజియన్‌లో నవంబర్ ఒకటి వరకు బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తూ, అక్టోబర్ 9న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. చేతన్ భగత్ లాంటి వాళ్ళు ఈ విషయానికి మత రంగు పులమాలని ప్రయత్నిస్తున్నప్పుడు జస్టిస్ ఏ కె సిఖ్రి ‘‘నా గురించి తెలిసినవారికి నేను ఆధ్యాత్మికవాదిగా కనబడవచ్చు, కానీ ఇది న్యాయానికి సంబంధించిన సమస్య’’ అన్నాడు. కోర్టు ఇది ప్రజల ఆరోగ్యాలకు సంబంధించింది, మతాలకు కాదు అని నిర్ద్వందంగా ప్రకటించింది. మనం మనుషులం కదా, మనకు అభ్యుదయాన్ని కోరుకునే నాగరికులు ఉంటారు, కోర్టులుంటాయి, విప్లవ పోరాటాలూ ఉంటాయి. అందుకనే కోర్టుకెళ్లి బాణాసంచా వల్ల చాలా కాలుష్యం పెరిగిపోతుందని బాణాసంచా అమ్మకంపై నిషేధం తీసుకొచ్చాం. కానీ, పాపం భూమిపై సమాన హక్కే ఉన్నా పశు పక్ష్యాదులకు ఇవన్నీ ఏమీ లేవు. అందుకే మీరు పేల్చే బాణాసంచాకు మా చెవులు పగిలిపోతున్నాయి, మా గుండెలు ఆగిపోతున్నాయి, బాణాసంచా పేల్చడం ఆపండి అని కోర్టులకు ఎక్కలేకపోతున్నాయి. బాణాసంచాపై సుప్రీం కోర్టు తీర్పు వినగానే నాకు మొదట మా రాజమల్లిక జ్ఞాపకమొచ్చింది. రాజ మల్లిక నాకు ఇప్పుడే కాదు, డాం అని టపాసు పేలిన ప్రతిసారీ జ్ఞాపకమొస్తుంది. రాజమల్లిక సెయింట్ బెర్నార్డ్ జాతి కుక్క. దాదాపు 60 కిలోల బరువు ఉండి, అతి గంభీరమైన ముఖమూ, స్వభావము కలిగిన శున కం ఇది. చుట్టూ హోంగార్డులు ఉండే మా ఇంటిలో మా ఆవును దొంగిలించడానికి దొంగలు పడినప్పుడు, ఎక్కడో మిద్దె పైన ఉన్న రాజమల్లిక, పశువుల దొడ్డిలోని అలజడిని విని మా ఆవును కాపాడింది. మేముండే చోట అతి పెద్ద భూకంపం వచ్చినపుడు గట్టిగా అరిచి మమ్మల్ని హెచ్చరించింది. అలా కాపాడటానికి అవసరమైన శక్తి దానికి సునిశితమైన దాని చెవులు ఇచ్చాయి. అయితే రాజమల్లికకు ఉన్న ఈ శక్తి దానికి ఈ భూమిపైన టపాసులు పేలే ప్రతి పండుగనాడు నరకాన్ని చూపించింది. ఎంత సముదాయిం చినా దాని ఆందోళనను మేము ఆపలేకపోయినప్పుడు పశువైద్యుడు ఆందోళనను తగ్గించే మాత్రలు కానీ, స్వల్ప స్థాయిలో మత్తు ఇంజెక్షన్ కానీ ఇచ్చేవాడు. చివరికి ఒక వినాయక చవితి నిమజ్జనం రోజు టపాసుల శబ్దానికి భయపడి గుండె ఆగి రాజమ్మ మరణించింది. రాజమల్లికను ‘‘అక్క’’ అని భావించే నా కూతురు ఎన్నోసార్లు ఈ టపాసుల విషయాన్ని ప్రపంచానికి తెలి సేట్లు రాయమని నన్ను బతిమాలుకుంటూ ఉంటుంది. సత్యభామ నరకాసురుని వధించినప్పుడు ప్రజలు చాలా సంతోషించి, ఆ అమావాస్య రోజున దీపాలు వెలిగించి, కాంతితో నింపి ఆనందాన్ని ప్రకటించుకున్నారట. మనిషికి ఆనంద ప్రకటన పట్ల మక్కువ చాలా ఎక్కువ. దీపావళి వచ్చే కాలంలోనే వానలు వంకలూ వచ్చి పురుగూ పుట్రా పెరిగిపోయి ఉంటాయి. ఆ సమయంలో బాణాసంచా పేలిస్తే ఆ పొగకు విష పురుగులన్నీ చస్తాయని ఎవరో ఎక్కడో రాస్తే చదివాను. కానీ ఇవాళ మనం కేవలం దీపావళి సమయంలోనే టపాసులు పేల్చి ఆగిపోతున్నామా? నిజానికి మనుష్యులకు పురుగూ పుట్రా కన్నా కూడా తమ ఆనందాన్ని పక్క వీధివారికో, ఊరి చివరి వారికో చెవులలో మోత మోగించి మరీ వినిపించడం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. మన ఈ ఆసక్తి నోరులేని మూగజీవులను ఎంత బాధపెడుతుందో ఆలోచించకపోతే మనం ఆలోచించగల జీవులం ఎలా అవుతాం? పశు పక్ష్యాదులను భయపెట్టి జీవావరణ సమతుల్యతను దెబ్బతీయడం ఇప్పటికిప్పుడు పెద్ద ప్రమాదకారకంగా అని పించకపోవచ్చు కానీ భవిష్యత్తులో అదే పెద్ద చింతనీయమైన విషయంగా మారవచ్చునేమో కదా! మా తాతకి టామీ అనే దేశీ జాతి కుక్క ఉండేదిట. అది ఎప్పుడూ మా తాతను విడువకుండా తిరి గేది. అది చనిపోయాక మా తాత తినే ప్రతిసారీ మొదటి ముద్దను పక్కన పెట్టడం మొదలు పెట్టాడట. మేం పుట్టాక మాకు మాత్రమే కాదు మా ఊరందరికీ తెలుసు గండవరపు సుబ్బరామిరెడ్డి కుక్క పేరు టామీ అని, ఆయన తినే తిండిలోని మొదటి ముద్దకి అది హక్కుదారని. ధర్మరాజు భార్య, తమ్ముళ్లు మరణిం చాక తానొక్కడే ఒక కుక్క తోడుగా స్వర్గారోహణ చేశాడు. మధ్యదారిలో రథం వేసుకొచ్చి ఇంద్రుడు కలిశాడు, ఇక నడవనక్కరలేదు వచ్చి ర«థమెక్కు అన్నాడు. అందుకు ధర్మరాజు అన్నాడట ఈ కుక్క కూడా ర«థం ఎక్కవచ్చా అని. ఇంద్రుడు కుదరదూ అన్నాడట. కుక్కని వదిలివచ్చేయ్ అని బలవంతపెట్టాడట. అప్పుడు ధర్మరాజు ఇంద్రుడితో అన్నాడట ‘స్వామీ! ఈ కుక్కను వదిలి పెట్టడం నాకు కుదరని పని. దీనిని వదిలేసి వచ్చి పొందే స్వర్గం నాకు అవసరం లేదు. ఇక నువ్వు వెళ్ళు’ (మహాప్రస్థానిక పర్వం–59) అని స్వర్గాన్నే తిరస్కరించాడట. చాలామంది అంటున్నారు బాణాసంచా కాల్చడం మన సంప్రదాయం అని. నిజానికి బాణాసంచాకి వాడే గన్ పౌడర్ చైనా వారి ఆవిష్కరణ. అలా చైనా నుంచి టపాసులు పుట్టాయి. నమ్మిన మూగజీవులను హృదయపూర్వకంగా ప్రేమించడం, వాటికోసం స్వర్గాన్ని కూడా వదులుకోవడం మన సంప్రదాయం. సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి 91635 69966 -
పవన్ అజ్ఞానపు అభిమానులు ఏమన్నారు!
ఆలోచనం రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని ఉందన్నపుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమన్నారన్నది పక్కన పెడదాం. నిజానికి, ఇద్దరు పిల్లల భారాన్ని తన భుజాలపై మోస్తున్న ఆమెకు వరుడు దొరకడం అంత సులభమేనా? మహాభారతంలో దీర్ఘతమ మహర్షి అంధుడు. అతని భార్య ప్రద్వేషి. ఆమె ఒకానొకరోజు అతని అంధత్వాన్ని భరించలేనని భావించి ‘‘పతియు భరియించు గావున భర్తయయ్యె! భామ భరియింపబడుగాన భార్య యయ్యె బరగనవి మనయందు వీడ్వడియె నిన్ను ! నేన ఎల్లకాలం భరియింతు గాన (మహాభారతం 1–4–228)’’ అంటూ భర్తను వదిలిపెట్టేస్తున్నానని ప్రకటిస్తుంది. అప్పుడు దీర్ఘతముడు భార్య కాళ్లావేళ్లా పడలేదు. చక్కగా ‘‘భర్తలను కోల్పోయిన భార్యలు అతి ధనవంతులైనా, ఉత్తమ కులాలలో పుట్టినవారైనా ఇప్పటినుంచి, అలంకారాలు లేనివారుగా, తాళిహీనులవుదురుగాక’’ అని శాపం పెట్టేశాడు. ఆపై ఉశిజను పెళ్లాడి 11 మందికి జన్మనిచ్చాడు, సుదేష్ణకు 5 మంది పుత్రులను అనుగ్రహించాడు. కానీ ప్రద్వేషి ‘ఒక మగవాడిని నేను భరించలేను బాబో విడిచిపెట్టేస్తాను’ అన్నందుకు ఇవాళ స్త్రీ జాతంతా ఆ శాపాన్ని అనుభవిస్తున్నట్లుందని నాకు రేణూదేశాయ్ మాటలు విన్నాక తోచింది. దీర్ఘతమ మహర్షి నుంచి నేటివరకు పురుషులు భార్యలను వదిలేశాక మళ్లీ పెళ్లాడుతూ, ఆ స్త్రీలకు సంతానాన్ని ప్రసాదిస్తూ, పెళ్లాడలేని స్త్రీలకు సంతానాన్ని అనుగ్రహిస్తూ సంతోషంగానే ఉన్నారని పవన్ కళ్యాణ్ మనకు సోదాహరణంగా తెలియపరుస్తున్నారు. భవయ్యా అనేది ఒక బెంగాలీల జానపద పాయ. అందులో ఒక పాట పల్లవి ‘‘నారీ హోవార్ కీ జె భేతా, ఏ పృథ్వి భూజేన తాహా’’ అంటే.. స్త్రీగా జన్మనెత్తడం ఎంత బాధాకరమైన విషయమో ఈ ప్రపం చం దానిని అర్థం చేసుకోవడం లేదు అని అర్థం. నా జీవితంలో నాకు తారసపడిన అనేకమంది స్త్రీలు, స్త్రీగా పుట్టడంలో ఉన్న బాధను అనేక సార్లు నాకు పరిచయం చేశారు. నా ఇంట్లోకి కొత్తగా వచ్చిచేరిన వంటమ్మాయి కోటమ్మ. ఒక బిడ్డ పుట్టీ పుట్టగానే అకారణంగా భర్త ఆమెను విడిచి పెట్టేశాడు. బిడ్డకు పందొమ్మిదేళ్లు. పద్దెనిమిదేళ్ల క్రితపు తన జీవితాన్ని నాకు చెబుతూ ఇవాళంతా ధారాపాతంగా ఏడ్చింది. ఈ మధ్యనే పరిచయమైన భ్రమరాంబ దిగువ మధ్యతరగతి స్త్రీ. భర్త గుండెపోటుతో పోయాడు. ఇద్దరు పిల్లలు. మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే బోలెడు సందేహం.. నా పిల్లల్ని చూస్తాడా ఆ వచ్చేవాడు అని. ఆ నలభయ్యేళ్ల స్త్రీ రెండు చేతులతో కళ్లనుంచి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటే నాకు చాలా నిస్సహాయంగా అనిపించింది. ఎందుకని వీళ్లందరికీ పవన్ కల్యాణ్‌కి అయినంత సులభంగా పెళ్లిళ్లు కావడం లేదు? సౌందర్యమూ, సంస్కారమూ ఉన్న రేణూ దేశాయ్ రెండోపెళ్లి చేసుకోవాలని ఉందన్నపుడు పవన్ అజ్ఞానపు అభిమానులు ఏమన్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే, నిజానికి, ఇద్దరు పిల్లల భారాన్ని కావడిని మోస్తున్నట్లు తన భుజాలపై మోస్తున్న ఆమెకు వరుడు దొరకడం అంత సులభమేనా? కాదని చెబుతుంది యునైటెడ్ నేషన్స్ వారి వరల్డ్ విమెన్ 2015 రిపోర్ట్. ఈ నివేదిక ప్రకారం ‘‘తల్లిదండ్రులలో ఒకరే ఉన్న కుటుంబాలలో నాలుగింట మూడొంతులు.. పిల్లలతో కూడిన ఒంటరి మహిళలతోనే ఉంటున్నాయి. 40 నుంచి 49 ఏళ్ల వయస్సు కలిగివుండి విడాకులు తీసుకున్న లేక విడిపోయిన మహిళల నిష్పత్తి అదే వయస్సు ఉన్న పురుషుల గ్రూప్ నిష్పత్తి కంటే 25 శాతం అధికంగా ఉంటోంది’’. ఒకప్పుడు అంటే వితంతు పునర్వివాహ ఉద్యమం జరుగుతున్నపుడు సంఘసంస్కర్తలు అదే పనిగా ఆ విషయంపై దృష్టి కేంద్రీకరించారు కనుక ఆనాటి ఉద్యమావేశంలో కొంతమంది స్త్రీలకు పునర్వివాహాలు అయిఉండొచ్చు కానీ ఇప్పుడు గ్రామాలవారీగా పరిశీ లిస్తూ వెళితే నిండు యవ్వనంలో ఉండీ పునర్వివాహం కానీ స్త్రీలు మీకు ఎంతోమంది కనిపిస్తారు కానీ పురుషులు ఆ స్థాయిలో కనిపించరు. సెలెబ్రిటీ అయినా రేణూ దేశాయ్ పునర్వివాహం గురించి చర్చ పెట్టడం బాగానే ఉంది కానీ ఆమె స్టేట్మెంట్లో నన్ను చాలా ఆశ్చర్యపరిచిన అంశం ‘‘శరీరం బాగాలేనప్పుడు చూసుకునేందుకు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా అందుకని పునర్వివాహం గురించి ఆలోచిస్తున్నాను’’ అని చెప్పడం. కొన్నేళ్ల క్రితం, అప్పటికే ఉద్యోగం నుంచి రిటైరయి ఉన్న నా స్నేహితురాలి తండ్రి ఏళ్లకు ఏళ్లు కాపురం చేసిన తన భార్య చనిపోయిన కొద్ది నెలల్లోనే ‘‘కాసిన్ని ఉడుకు నీళ్లు కాచి ఇచ్చే వాళ్లుంటే బాగుంటుంది’’ అని భావించి పిల్లల్తో ఘర్షణపడి ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అలా చేసుకునేందుకు ఆయన చెప్పిన ‘‘ఉడుకు నీళ్ల’’ కారణమే, బాగా పుస్తకాలు చదువుతాను అని చెప్పుకునే రేణూ దేశాయ్ కూడా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. చలం ‘స్త్రీకి శరీరం ఉంది దానికి వ్యాయామం కావాలి’ అన్నాడు. ఆ వ్యాయామం భౌతిక సుఖావసరాలు కూడా కదా. అందుకని బాగా చదివే రేణూ దేశాయ్‌కి ‘‘గాన్ విత్ ది విండ్’’ రాసిన మార్గరెట్ మిషెల్ మాటలు గుర్తు చేయాలని నాకనిపిస్తోంది. మార్గరెట్ మిషెల్ 1930లలోనే ‘‘మగవాడితో నిమిత్తం లేకుండా ఆడది ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయగలదు; పిల్లల్ని కనడం తప్ప, మరే పనైనా చేయగలదు’’ అని తన నవలా పాత్ర ద్వారా ప్రకటించింది. పోతే, రేణూ దేశాయ్ విషయంలో నాకు, పవన్ అభిమానులను ఒక ప్రశ్న అడగాలని ఉంది. ఈ ప్రశ్న తనను బిడ్డ తల్లిని చేసి వదిలేసిన దుష్యంతుడిని శకుంతల అడుగుతుంది.. ‘బుద్ధితో బాగా పరిశీలిస్తే – పతి వ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కారభావంతో చూసే కడు దుర్బుద్ధికి ఇహపరసుఖాలు రెండూ ఉంటాయా? సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 -
అదే నిజమైన ప్రేమరుచి
ఆలోచనం విధేయంగా ఉండే ఆడపిల్లల్ని కాదు, తలలో మెదడు ఉన్న ఆడపిల్లల్ని, మీరు అవునంటే కాదని ఖండించి తల ఎగరేసే అమ్మాయిల్ని ప్రేమించేలా చేసుకోండి. అప్పుడు తెలుస్తుంది నిజమయిన ప్రేమరుచి. రోమియో అండ్ జూలి యట్లో షేక్సి్పయర్ వాడిన భాష, అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. నా కూతురు ఈ దసరా సెలవులలో ప్రఖ్యాతి గాంచిన ఈ విషాదాంత ప్రేమ నాటకాన్ని చదువుతూ చీటికీమాటికీ అమ్మా అలా అంటే ఏమిటీ, ఇలా అంటే ఏమిటీ అని అడగటం మొదలు పెట్టింది. అడుగుతూ, జూలియట్ తండ్రి క్యాపులెట్, కూతురి గురించి ‘భూమి నా ఆశలన్నింటిని కబళించినది కానీ ఆమె.. ఆమె నా ధరణికే ఆశాజనకమైన దొరసాని’ అన్న డైలాగ్ చదివి, ప్రేమికుడి కోసం పొడుచుకు చనిపోయిన జూలియట్‌ని తలచుకుని ఆ తండ్రిపై చాలా జాలిపడింది. ఆ డైలాగ్ విన్న తర్వాత నాకు హఠాత్తుగా ఈ మధ్య ప్రేమికుడి చేతిలో హత్యకు గురయిన చాందిని జైన్ జ్ఞాపకం వచ్చింది. ఆ సంఘటనతో పాటు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న ఓ విద్యార్థి జంట కూడా జ్ఞాపకం వచ్చారు. పిల్లల ఫీజులకోసమని చిన్న చిన్న ఆనందాలను కూడా మూలనపడేసి తల్లిదండ్రులు ఇంజనీరింగ్‌కి పంపిస్తే వీళ్ళ ప్రాణాలు కేవలం వీళ్ళవే అయినట్లు ఎంత సులభంగా ప్రాణాలను తృణప్రాయం అనుకున్నారు కదా అని పించి చాలా బాధ కలిగింది. అసలు రోమియో జూలియట్‌ని మొదటిసారి చది వినపుడు నేనెలా ఫీలయ్యానో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. నేనూ నా కూతురిలానే ఏ పది హేనేళ్ల వయసులోనో ఆ నాటకాన్ని చదివాను. ఇప్పుడు నా బిడ్డలాగే అప్పుడు నేను జూలియట్ తండ్రి గురించి ఆలోచించానా? లేదా.. ‘‘గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవర్ టోల్డ్’’ అనుకున్నానా.. జ్ఞాపకం రావటం లేదు. ఇప్పుడైతే నాకది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అనిపించడం లేదు. నా కూతురుతో చాలా కచ్చగా ‘‘రోమియోకి తెలివి చాలా తక్కువ, చంచలుడు! మొదట రోసాలిన్ను ఇష్టపడ్డాడు, తర్వాత చాలా సులభంగా ఆ ప్రేమను వదిలి జూలియట్ వెంట పడ్డాడు. జూలియట్ నటిస్తుందా, లేక నిజమా అని ఓపికగా తెలుసుకోకుండా చచ్చిపోయాడు’’, అని ‘‘వెరీ స్టుపిడ్ హీరో ఐ హావ్ ఎవర్ రీడ్’’ అని చిరచిరా చిరాకు పడ్డాను. తల్లిదండ్రులపట్ల కొంచెమన్నా బాధ్యత, వారేమవుతారోనన్న అక్కర లేకుండా ప్రాణాలు తీసుకున్న, తీస్తున్న ప్రేమికులను గొప్పవారనడం బాగుంటుందా? లేదా స్వార్థపరులనడం బాగుంటుందా? ప్రేమించే హృదయమున్న వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని ఉదారంగా ప్రేమిస్తారు. స్నేహితులను, తల్లిదండ్రులను, బాధ్యతలను, ముఖ్యంగా పరుల దుఃఖాలను, అందుకే ‘మీ సంతోషం కంటే అవతలి వ్యక్తి సంతోషమే ముఖ్యంగా భావించడమే ప్రేమ’ అంటాడు హెచ్ జాక్సన్ బ్రౌన్. ప్రేమ ఎదుటి మనిషిని గౌరవించడం నేర్పుతుంది. మాటలకు మృదుత్వాన్ని ఇస్తుంది. చేతలకు సరళతను నేర్పుతుంది. అన్నిటికన్నా హృదయంలో ప్రేమవున్న మనుషులు దయార్ద్రంగా ఉంటారు. తీసుకోవడంకన్నా ఇవ్వడాన్ని ఇష్టపడతారు. దానినే ఖలీల్ జిబ్రాన్ ‘ప్రేమ వశము చేసుకొనదు వశము కాదు తానెప్పుడు’ అంటాడు. మొన్న ఒక పెళ్ళికి వెళ్లాను. వధూవరులు నునులేత యౌవనస్తులు. జీవితాంతపు ప్రేమబంధంలోకి అడుగుపెడుతున్న ఆ చిన్న పిల్లల ఎదుట పెళ్లి పురోహితుడు పదే పదే అంటున్నాడు ‘భార్య భర్తకి లోబడి ఉండాలి’ అని. ఎవరైనా ఎవరికైనా లోబడి వున్నపుడు ఆ బంధంలో ప్రేమ పుడుతుందా. లోబడి భయంతో బ్రతుకుతున్న చోట తిరుగుబాటు, చిరాకు కదా ఉంటాయి. సమానమైన మెదడు ఆలోచనా శక్తి వున్న ఆడపిల్ల జీవితపర్యంతం ప్రేమించాల్సిన భర్తకి లోబడి ఉండాలనే బోధన కాకుండా ఖలీల్ జిబ్రాన్ చెప్పాడు కదా ‘ఒకరినొకరు ప్రేమింపుడు.. కానీ ఈషణ్మాత్రము ఆ ప్రేమ మీకు బంధనమ్ము కాగూడదు ఏ క్షణమున,/అంతకన్నను మీరు మీమీ యెడదలను తీరాలు జేయుడు/ప్రేమ కడలిని వాని మధ్యనజేరి అల్లల్లాడనీయుడు/ఒకరిపాత్రను ఒకరు నింపుడు/కాని యెప్పుడు ఏక చషకమునుండి పానము చేయబోకుడు/ఒకరి కబళము ఒకరికీయుడు/ కాని యెప్పుడు ఒకే కబళము పంచుకొని సేవింపబోకుడు./సంతసంబుగ ఎల్లవేళల కలిసియాడుడు కలిసిపాడుడు/కాని యెప్పుడు వేరువేరుగ నిలిచి ఉండుడు/ ఎవరి వ్యక్తిత్వంబు వారు నిలుపుకొనుడు/వీణ తీగలు రాగమందున ఏకమయ్యును/దేనికయ్యది వేరువేరుగ నిలిచి వుండును./స్వీయకంపనము తోడ పలుకును’. ఈ మధ్య కాలంలో బాగా హిట్ అయిన బెంగాలీ సినిమా పాట–అమాకే అమార్ మతో తాక్తే దావ్–ఈ పాట పల్లవి–నన్ను నా లాగే ఉండనివ్వు, నాకు నచ్చిన విధంగా నన్ను నేను మలుచుకొన్నాను, నాకు ఏది దొరకలేదో అది దొరకకుండానే ఉండనీ, కోరుకొన్నవన్నీ దొరికిన జీవితం వృథా... ఎంత గొప్ప వాక్యాలు కదా. మనుషులం ఎవరికి వారమే ప్రత్యేకం. ప్రేమించుకుం టున్నపుడు కూడా మనం విడివిడి మనుషులం. విడివిడి అభిప్రాయాలు ఉండే మనుషులం. చెప్పినట్లు ఉండటం లేదనీ, చెప్పిన మాట వినడం లేదనీ ఆడబిడ్డల్ని క్రూర జంతువులు కూడా చంపవు. పురుషుడికి లోబడి ఉండే ఆడపిల్లల్ని కాదు, తలలో మెదడు ఉన్న ఆడపిల్లల్ని, మీరు అవునంటే కాదని ఖండించి తల ఎగరేసే అమ్మాయిల్ని ప్రేమించేలా చేసుకోండి. స్వయంగా వారిచేతనే దాసోహమనిపించుకోండి. అప్పుడు తెలుస్తుంది నిజమైన ప్రేమరుచి. అదే నిజమైన ప్రేమను గెలుచుకున్న రుచి. సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ఫోన్: 91635 69966 -
ఓటమి గర్భంలో దాగిన విజయం
ఆలోచనం జగన్ కూడా ‘ఐనను పోయిరావలె హస్తినకు’ అంటూ నంద్యాలకి వెళ్లి ‘ఐ యామ్ ఎ వారియర్’ అని ప్రకటించారు. శ్రీకృష్ణ రాయభారం విఫలమైనా అసలు యుద్ధంలో పాండవులే గెలిచారు. అలాగే నంద్యాల ఓటమి రేపటి అసలు విజయానికి నాంది. నేను రోడ్లు వేశాను, వీధి దీపాలు వేశాను, ఓటుకు ఐదువేలివ్వగలను! నా తిండి తింటూ, నా బట్ట కడుతూ నాకు ఓటు ఎందుకు వెయ్యరూ అని ప్రజ లను బెదిరిస్తూ, భయపెడుతూ సీఎం చంద్రబాబు నంద్యాల ఉపఎన్నికలకు శంఖారావం పూరించారు. దాంతో ఉప ఎన్నికల స్వరూప స్వభావాలు ఎలా ఉండబోతున్నాయో ప్రతి ఒక్కరూ సులభంగానే అంచనా వేశారు. అయితే ప్రతిపక్ష నాయకుడు ఇది అధర్మానికి, ధర్మానికి జరుగుతున్న యుద్ధమనీ, తన పక్షాన ధర్మముందనీ, భూమా నాగిరెడ్డి కుటుంబానికి తాను న్యాయం తప్ప అన్యాయం చేయలేదనీ, బాబు 21 మంది తన పక్షపు ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించకుండా పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చారని ఆరోపిస్తూ, పోటాపోటీగా ఎన్నికల బరిలోకి దిగినప్పుడు అందరూ ఈ ఎన్నికల పట్ల తీవ్రమైన ఆసక్తిని చూపించారు. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు చాలా కొద్ది చోట్ల అరుదుగా మాత్రమే ప్రతిపక్ష పార్టీలు ఉపఎన్నికల్లో గెలి చాయి. అధికారంలో వున్న పార్టీల చేతుల్లో అంగ బలం, అర్థబలం అవసరానికి మించి ఉంటుంది. వాగ్దానం చేయడానికి వారు అప్పటికప్పుడు సంక్షేమ పధకాలు సృష్టించగలరు, సహకరించకుంటే నోటిదగ్గర కూడును లాక్కుంటామని బెదిరించగలరు. టీడీపీకి ఇన్ని ఉన్నాయని, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతకైనా తెగబడుతుందని తెలి సినా తెలుగు రాష్ట్రాల ప్రజలలో ఈ ఎన్నికల పట్ల తీవ్రమైన ఉత్కంఠత నెలకొన్నది. అనేక చోట్ల ఇరు పార్టీల అభిమానుల మధ్య బెట్టింగులు నడిచాయి. ఇరు పక్షాలలో ఎవరూ వెనుకంజ వేయలేదు. చివరికి వైఎస్సార్సీపీ ఉపఎన్నికలో ఓటమినొందింది. కానీ ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్రెడ్డి తన పక్షానికి ధైర్యాన్ని నూరి పోయడంలో ఓడిపోలేదు. విజయం ఏకపక్షం అని కచ్చితంగా తెలిసిన చోట కూడా అధికారపక్షాన్ని బెంబేలెత్తించడంలో, వారిని అటూ ఇటూ పరుగులెత్తించి విపరీతమైన ఒత్తిడికి లోనయ్యేట్లు చేయడంలో ఆయన బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారు. నంద్యాల ఉపఎన్నికకు జగన్ అంత విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం చూసి, గెలుపు టీడీపీదే అని అంచనా వేసిన నా స్నేహితుడు, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఒకరు ‘అధికారపక్షం వారు అంత తెగబడుతున్నారు. గెలుపు వంద శాతమూ వారిదే అవుతుంది. జగన్ ఎందుకు వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ కష్టపడుతున్నారు’ అని నాతో అంటూ ఉండేవాడు. అతను ఆ అపనమ్మకాన్ని వ్యక్తపరిచిన ప్రతిసారీ అతనికి నేనో పద్యం చెప్తూ వచ్చాను. తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన పాండవోద్యోగ విజయాలు నాటకంలోని పద్యం అది. పాండవోద్యోగము అంటే పాండవ ప్రయత్నం అని అర్థం. ధర్మరాజు శ్రీకృష్ణుడ్ని హస్తినకు రాయబారానికి పంపుతూ, ‘కృష్ణా! న్యాయంగా మాకివ్వాల్సిన మా తండ్రి పాలు ఇవ్వమను, ఇవ్వలేమంటే, పోనీ మా మీద ఆధారపడి వున్న బంధుమిత్ర సపరివార సంక్షేమం చూడటానికి, మా క్షత్రియ ధర్మాన్ని నెరవేర్చటానికి కనీసం అయిదు ఊర్లు ఇమ్మను చాలు. అందరం యుద్ధం లేకుండా సంతోషంగా ఉంటాం’ అని చెబుతాడు. ఆవేశపరుడైన భీముడు కూడా అన్న మాటే నా మాట అంటాడు. అంతా విని కృష్ణుడు, ‘మీరైతే సంధి అంటున్నారు కానీ, దుర్యోధనాదులు యుద్ధం చెయ్యడానికి ఉవ్విళ్ళూరుతున్నారు, సంధి రాయబారం సఫలం కాదు’ అంటూనే ‘‘ఐనను బోయిరావలయు హస్తినకచ్చటి సంధిమాట యె/ట్లైనను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు మీ/మానసమందు గల్గు ననుమానము దీర్పగ వచ్చు తత్సమా/ధానము మీ విధానమును తాతయు నొజ్జయు విందురెల్లరున్’’అని ముగిస్తాడు. శ్రీకృష్ణుడికి గొప్ప రాజనీతిజ్ఞుడని పేరు. ఆయనకు కచ్చితంగా తెలుసు, కౌరవులు సంధికి ఒప్పుకోరని. అయినా సరే మొదట సంధికి వెళ్లాల్సిందే అంటాడు. నిష్ఫలమైన ఆ సంధి కార్యక్రమం నుంచి ఆయన ‘‘శత్రురాజులు బలాబలాలు తెలుస్తాయి, మీకున్న అనుమానాలు తీరుతాయి, సమాధానాలు దొరుకుతాయి, మీ విధానం ఏమిటో పెద్దవాళ్లకు తెలుస్తుంది’’ అంటూ అద్భుతమైన లాభాలను బయటకి తీస్తాడు. అట్లాగే తరాల రాజకీయనేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జగన్‌కి కూడా నంద్యాల జయాపజయాల గురించి ఒక అంచనా ఉండేవుంటుంది. అయినా ఆయన నంద్యాలకు పోయిరావడానికి కారణం అసలు సమరానికి శత్రువును అంచనా వెయ్యడానికి, శత్రువుకు తాను ఎంత బలమైన ప్రత్యర్థినో చెప్పడానికి అయ్యుండొచ్చు అని నేను చెబితే నా స్నేహితుడు అంగీకరించి అమెరికన్ స్వాతంత్య్ర సంగ్రామపు ఉత్తేజాన్ని నాతో పంచుకున్నాడు. 1775లో యుద్ధం మొదలైనపుడు అందరికీ తెలుసు.. ఆ యుద్ధంలో పాల్గొంటూన్న బ్రిటిష్ వారికి సుశిక్షితమైన సైనికులూ, గొప్ప నావికాబలమూ ఉందని, అవతల అమెరికన్ల సైనికులు అశిక్షితులనీ, వారి నావికాదళం రాయల్ నేవీ ముందు ఎందుకూ పనికి రాని దనీ. అయినా అమెరికన్లు తాము గెలుస్తామని నమ్మారు. ‘బ్రదర్స్, ఐ యామ్ ఎ వారియర్’ అని ప్రకటించాడు జార్జ్ వాషింగ్టన్. అప్పటి ఆ యుద్ధంలో అమెరికన్లు ఓడిపోయారు. చిత్రంగా చరిత్ర కొన్ని ఓటములను విజయంగానే గుర్తిస్తుంది. అప్పటి ఆ ఓటమిని విజయంగానే గుర్తించింది. జగన్ కూడా ‘‘ఐనను పోయిరావలె హస్తినకు’’ అంటూ నంద్యాలకి వెళ్లి ‘ఐ యామ్ ఎ వారియర్’ అని ప్రకటిం చారు. నంద్యాలలాగే భారతంలో కూడా సంధి విఫలమయింది. కానీ అంతిమంగా అసలు యుద్ధంలో పాండవులు గెలిచారు. అమెరికన్లు అప్పుడు ఓడిపోయుండచ్చు.. వారి ప్పుడు యుద్ధాన్ని గెలిచిన స్వతంత్రులు. చరిత్ర ప్రకారం నంద్యాల ఓటమి అసలు సంగ్రామ విజయానికి నాంది. - సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 -
గురుపరంపరకు వందనం
ఆలోచనం కులము, మతము, జెండర్ ఘర్షణలు జోరుగా రగులుతున్న కాలంలోనే నా గురువులు నాకు కులమత దేశాలకతీతంగా మనిషిని చూడటం నేర్పారు. నేనివాళ గ్లోబల్ సిటిజన్ని అని చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చారు. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన ఈ రోజును భారతదేశం 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవి స్తోంది. ఎంఎన్ రాయ్ మాటల్లో చెప్పాలంటే భారతదేశంలో ఆనాడు ఉన్న మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్ తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి. ఆయన 15సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.నా వరకు నాకు అద్భుతమైన గురువుల సాహచర్యం లభించింది. గ్రాడ్యుయేషన్‌లో ఉన్నపుడు నాకు లెక్చరర్ శోభాదేవిగారు పరిచయమయ్యారు. దొరికిన ప్రతి కాగి తాన్ని చదివేసే నా కాంక్షను ఆమె ఒక దారిలో పెట్టారు. అన్ని అస్తిత్వ చైతన్యాలను నాతో నిశితంగా అధ్యయనం చేయించారు. నేను రాయాలి అనుకున్నపుడు మేడం, ఆమె సహచరుడు సాయి గారు నాకు ఏయే పుస్తకంలో ఏమేం చదవాలో గుర్తు పెట్టి అనేక పుస్తకాలను ఇచ్చి చదివించారు. యూనివర్సిటీకి వచ్చాక నాకు కేకేఆర్ (కేకే రంగనాథాచార్యులు) సర్ పరిచయమయ్యారు. విరసం వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన ఈ మార్క్సిస్టు విమర్శకుని మార్గదర్శకత్వం నేను పయనించే మార్గాన్ని అప్పటినుంచీ ఇప్పటివరకూ జ్ఞాన కాంతులతో నింపుతూ వస్తోంది. నా ఎంఫిల్ పరిశోధనకు గైడ్‌గా వ్యవహరించి పరిశోధన ఎలా చేయాలో నేర్పించిన గురువు ఆయన. ఎదుటి మనిషిని మాట్లాడనిచ్చే, గౌరవించే సంస్కారాన్ని నేను తననుంచి నేర్చుకున్నాను. ఇంకో గురువు ఎంవీ (ముదిగొండ వీరభద్రయ్య) గారు నాకే కాదు కేసీఆర్ గారికి కూడా గురువు. పాఠం మొదలుపెడితే ప్రపంచాన్ని చూసొచ్చేవాళ్ళం. ఇప్పటికీ ప్రతి వారం నా కాలమ్ చదివి ‘అమ్మాయ్! ఇదిగో ఇక్కడ ఇలా ఉండాలి, ముగింపు ఇలా ఉండాలి’ అని మార్గనిర్దేశం చేస్తారు. పీహెచ్‌డీకి వచ్చాక నా గురువు పిల్లలమర్రి రాములు గారు. మాతృత్వం కాలాపహరణం చేస్తున్నపుడు మంచి స్నేహితుడిలా నా వెంట నిలిచి నా పీహెచ్డీ పూర్తి చేయించారు. కులం, మతం, జెండర్ ఘర్షణలు జోరుగా రగులుతున్న కాలమిది. ఈ కాలంలోనే నాకు లభించిన ఈ గురువులలో ఒక్కరు కూడా నా కులం వారు కాదు. సగం మంది ఆధిపత్య బ్రాహ్మణ కులాలవారు అయినా వారు నాకు తమది గురువుల కులం అని మాత్రమే సందేశం ఇచ్చారు. ఆ కులానికి విద్యార్ధి సంక్షేమంతో తప్ప ఇతరత్రా అంశాలతో సంబంధం లేదని చెప్పారు. నా గురువులు నాకు కులమత దేశాలకతీతంగా మనిషిని చూడటం నేర్పారు. అయితే అందరు గురువులూ నా గురువులంత ఉదాత్తంగానే ఉన్నారా? లేరని ‘భీమాయణం’ పుస్తక ప్రచురణకర్త ఎస్. ఆనంద్ అంటారు. తమ ప్రొఫెసర్ కులవాది అని తెలుసుకోవడానికి బ్రాహ్మణేతరురాలయిన తన స్నేహితురాలు, తాను పేపర్లు మార్చుకుని అసైన్మెంట్ ఇచ్చినపుడు తనకెప్పుడూ ఎక్కువ మార్కులిచ్చే ప్రొఫెసర్ వేరే పేరుతో సబ్మిట్ చేసిన తన పేపర్‌కు తక్కువ మార్కులిచ్చాడని చెప్పుకొచ్చారు. ఈ దేశంలో గురువులు ప్రతిభను కులం వారీగా కూడా కొలుస్తారని చెప్పడానికి ఇది ఒక బ్రాహ్మణుడు చెప్పిన తార్కాణం. మన దేశంలో భర్తీ అయిన విద్యార్థుల్లో 50% మాత్రమే పాఠశాల విద్య పూర్తి చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వారు తన విజన్ మిషన్ డాక్యుమెంట్ లోని సెక్టార్ పేపర్ ఆన్ ఎడ్యుకేషన్‌లో ‘‘ప్రజాసముదాయానికి నాణ్యమైన విద్య అందిస్తే వారు ‘తక్కువ ఆదాయం ఉచ్చు’ నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు’’ అని రాసుకున్నారు. మన రాష్ట్రంలో 2016–17లో ప్రాథమిక విద్యలో 12.77% డ్రాప్‌అవుట్ ఉంటే సెకండరీ ఎడ్యుకేషన్‌లో 20.67% ఉంది. దీన్ని తగ్గించడానికి ప్రభుత్వం వద్ద కండిషనల్ కాష్ ట్రాన్స్ఫర్స్లాంటి నిర్దిష్ట కార్యాచరణ ఏమీ లేకపోవటం విచారకరం. మీరు ఈ క్లాస్ వరకు మీ పిల్లల్ని స్కూల్‌కి పంపితే మీకింత డబ్బును ఇస్తాం అంటూ బతకడానికి తమకు తామే పెట్టుబడి అయిన పేద వర్గాల వారికి భరోసా ఇవ్వడం నేడు మన రాష్ట్రంలో అత్యవసరం. ఈ అవసరాన్ని ప్రతిపక్ష నాయకుడు తన నవరత్న పథకాలలో ఒకటిగా ‘అమ్మ ఒడి’ అని ప్రకటించడం ఆశావహమైన వాగ్దానంగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నేత ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు మెస్ బిల్ కోసం కూడా అదనంగా డబ్బు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం విద్యార్ధి భవిష్యత్తుకి భరోసా అనొచ్చు. అదే కాదు కంప్యూటర్ ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకుంటున్న బాబుగారి పాలనలో కంప్యూటర్ వున్న క్లాస్ రూంల శాతం 28.6% మాత్రమే. అదే మహారాష్ట్రలో 55.7% కేరళలో 93.77%. ప్రథమ్ సంస్థ వారి వార్షిక విద్యా నివేదిక (్చట్ఛట) ప్రకారం 2016లో ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ 2వ తరగతి పాఠాన్ని చదవగలిగిన విద్యార్థులు 52 శాతం మాత్రమే. అయితే ప్రభుత్వ గణాంకాల ప్రకారమే మన ప్రభుత్వ పాఠశాలల్లో 99.97 శాతం ఉపాధ్యాయులు అన్ని అర్హతలూ కలిగి ఉన్నారు. 2030లోగా ప్రపంచ దేశాలు సాధించాల్సిన మానవ అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన.. ‘నిలకడ కలిగిన అభివృద్ధి లక్ష్యాల’లో విద్యకి సంబంధించినది 4వ నంబర్ గోల్. దీని ప్రకారం అందరికీ సమంగా నాణ్యమైన విద్యని అందించడంతోపాటు జీవితాంతం విద్యని అభ్యసించే అవకాశాలని పెంపొందించాలి. చిత్తశుద్ధి ఉన్న ఉపాధ్యాయులు ఈ అడ్డంకులన్నీ అధిగమించగలరు. అందుకు మన పూర్వ గురుపరంపరే తార్కాణం. (నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా) వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 సామాన్య కిరణ్ -
చలనశక్తే సాధికారత
ఆలోచనం చలనశక్తి మహిళల కదలికలనే కాదు, వారి ఆలోచనలను కూడా చలనశీలం చేస్తుంది. ఇప్పుడు మహిళలకి కావల్సినది, వారినో మూలన ఉంచి అన్నలిచ్చే రక్షణ కాదు. స్వతంత్రతనిచ్చే చలనశక్తే. అర్ధరాత్రి రహదార్లపై ఒక మహిళ స్వేచ్ఛగా నడవగలిగిన రోజే, భారతదేశం తన స్వాతంత్య్రాన్ని సాధించిందని మనం చెప్పగలం అన్నారు గాంధీ. ఆ వ్యాఖ్య రక్షణ గురించే కాకుండా అంతర్లీనంగా స్త్రీ మొబిలిటీ (చలన శక్తి)ని కూడా ప్రస్తావించిందేమో.. తెరాస ఎంపీ కవిత ‘‘సిస్టర్స్ ఫర్ చేంజ్’’ అని రక్షాబంధన్ రోజు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి స్లోగన్ ‘‘అన్న మనకు రక్ష–అన్నకు హెల్మెట్ రక్ష’’. రాఖీ కట్టి హెల్మెట్ ఇచ్చి సోదరుల ప్రాణాలను ప్రమాదాలనుంచి కాపాడండి అని ఆ కార్యక్రమ సందేశం. ఇందులో మనకు బాహ్యంగా కనిపిస్తున్న అంశం తోడబుట్టిన వారి మీద ప్రేమ. కానీ ఈ నినాదం చాలా బలమైన మూస ధోరణిలో పురుషస్వామ్యాన్ని మళ్లీ నొక్కి చెబు తోంది. చలనశక్తి ఉన్న అన్నకు హెల్మెట్ రక్ష, ఇంట్లో వుండే ఆడవాళ్లకు అన్న లేదా మరో మగవాడు రక్ష అనే భావజాలాన్ని ఇది వ్యాపింపచేస్తుంది. ‘జెండర్ ఈక్వాలిటీ అండ్ డెవలప్మెంట్’ అనే పేరుతో వరల్డ్ బ్యాంకు 2012లో ప్రచురించిన రిపోర్టుకి ‘జెండర్ అండ్ మొబిలిటీ ఇన్ ది డెవలపింగ్ వరల్డ్’ అనేది ఒక నేపథ్య వ్యాసం. అందులో వారు ప్రొఫెసర్ సెలెస్ట్ లాంగన్ పేర్కొన్న ‘మొబిలిటీ డిసెబిలిటీ’ భావనని ఉటంకించారు. రూసో తన ‘సోషల్ కాంట్రాక్టు’లో.. పరుగెత్తాలని ఆరాటపడే శారీరక వైకల్యంగల వ్యక్తీ, శారీరకంగా అంతా బాగుండి ఆ కోరిక లేని వ్యక్తీ ఇద్దరూ ఒక్క చోటే ఉండిపోతారంటారు. ఈ మాటల్ని లాంగన్ ఖండిస్తారు. సామాజిక వాతావరణం, ఆచారాలే చలన శక్తిని, చలన హీనతను సృష్టించగలవు. ఇవి సర్వాంగాలు సక్రమంగా ఉన్న వ్యక్తిని కూడా చలనహీనుల్ని చేయగలవు. సమాజం, ఆచారాల పేరిట స్త్రీలను అలా నిస్సహాయులను చేసింది అంటారామె. స్త్రీలు కీలక స్థానాలలో లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందేమో అనే అభిప్రాయం ఈ వ్యాసాలలో వ్యక్తమయింది కానీ, పురుషులు స్త్రీల శరీరాలనే కాదు మెదడులను కూడా నియంత్రించారు కదా. అందుకే కీలక పదవులలో ఉన్న కొద్దిమంది స్త్రీలు కూడా పైకి ఆధునికులుగా కనిపిస్తూ వెనుకబాటు భావజాలాన్నే ప్రచారం చేస్తుంటారు. స్త్రీవాద ఉద్యమమిచ్చిన చైతన్యాలలో చలనశక్తి కూడా ఒకటి. 1896 సంవత్సరంలో అమెరికన్ సివిల్ రైట్స్ లీడర్ సుసాన్ బి ఆంథోనీ ‘ద్విచక్ర వాహనం స్త్రీలకు చాలా విముక్తిని ఇచ్చింది. అది ఎక్కిన మరుక్షణం వారికి స్వావలంబన భావాలు కలుగుతాయి’ అంటారు. నా భర్త ఉద్యోగరీత్యా గిరిజన ప్రాంతాలలో ఉన్నపుడు నేను నా స్కూటీపై కూతుర్ని తీసుకుని చుట్టుపక్కల సంతాలీ పాడాలు తిరిగేదానిని. నా మొబిలిటీ నాకిచ్చిన స్వేచ్ఛ వారిని నాకు స్నేహితుల్ని చేసింది. నెల్లూరులో నాకొక స్నేహితురాలు ఉంది. చిన్నప్పుడు తన సైకిల్‌పై మేమిద్దరం డబుల్స్ వెళ్ళేవాళ్ళం. నవ్వులే నవ్వులు. కావలసినంత స్వేచ్ఛ. గత పదిహేనేళ్లుగా తన భర్త సౌదీలో ఉద్యోగం చేస్తూ ఉంటే, తాను ఇక్కడ పిల్లల్ని చదివిస్తూ ఉంది. సైకిల్ నుంచి స్కూటర్‌కు, కార్కు మారింది. మొబిలిటీ మా జీవితాలకు సుఖాన్నిచ్చింది. కష్ట సమయాలలో స్థైర్యాన్నిచ్చింది. అదే మాట్లాడుకుంటూ ఎవరైనా రాజకీయనేత డిగ్రీ అమ్మాయిలకు ఉచితంగా స్కూటీనిచ్చే స్కీమ్ పెడితే బాగుండును, అది వారిలో ఎంతో ధైర్యం నింపుతుంది కదా అనుకున్నాం. బిహార్ ప్రభుత్వం 9వ తరగతి అమ్మాయిలకు సైకిళ్ళ పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టినపుడు దాని ప్రభావాలపై కేంబ్రిడ్జి కోసం పరిశోధన చేసిన కార్తీక్ మురళీధరన్, నిషిత్ ప్రకాష్‌లు కూడా అమ్మాయిల మొబిలిటీ భావితరాల్ని ప్రభావితం చేయబోతోందన్నారు. ఈ ప్రపంచీకరణ సమాజంలో, మొబిలిటీ స్త్రీల పేదరికంపై చూపిస్తున్న ప్రభావం గురించి కూడా అనేక పరిశోధనలు జరిగాయి. పేద స్త్రీలు పనికి నడిచి వెళుతున్నారని, వాహనాలు ఎక్కలేక, పని ప్రదేశాలకు ఆలస్యంగా చేరుతున్నారనీ, దీని వలన వీరికి పేదరికం నుంచి బయటపడే అవకాశాలు తగ్గిపోతున్నాయనీ తెలుస్తున్నది. ప్రస్తుతం నేను నివాసముంటున్న బెంగాల్‌కి, తెలుగు సమాజానికి మధ్య నేను గమనించిన ప్రధానమైన తేడా మొబిలిటీనే. బెంగాల్లో పేద స్త్రీలు సైకిల్ని చాలా ఎక్కువగా వినియోగిస్తారు. మొబిలిటీ నా పరిశీలన మేరకు మన కదలికలనే కాదు, ఆలోచనలను కూడా చలనశీలం చేస్తుంది. మన దేశంలో చాలా సార్లు సర్పంచ్ భర్తలు, తామే సర్పంచులమని చెప్పుకుంటారు. ఉత్తర భారత్‌లో ప్రధాన్ పతి (సర్పంచ్ భర్త) అనే కొత్త పదం కూడా పుట్టింది. బెంగాల్లో సర్పంచుల భర్తలెవరో కూడా ప్రస్తావనకు రాదు. స్త్రీ సాధికారతకు మొబిలిటీకి ఉన్న సంబంధానికి ఇదో ఉదాహరణ. అంతెందుకు చిన్నప్పుడు చరచరా సైకిల్‌పై వీధులన్నీ చుట్టపెట్టేదట మమతా బెనర్జీ. ఆమెని రక్షించే, లేక రక్షిస్తున్న అన్నల గురించి మీరెప్పుడైనా విన్నారా? అందుకేనేమో ఆమె ‘సబూజ్ సాథీ’ పేరిట అమ్మాయిలకు 45 లక్షల సైకిళ్ళు పంపిణీ చేసి, వాహనమే మీ నేస్తం అనే సందేశాన్నిచ్చారు. ఇలా రాజకీయ నేతలు ఇప్పుడు జరుగుతున్న సామాజిక ఉద్యమాల గురించి వారి డిమాండ్ల గురించి తెలుసుకుని ఉంటే బాగుంటుంది కదా. కొంత స్త్రీవాద స్పృహ అలవరచుకొంటే, ఎంతో చురుకుదనం ఉన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా ‘‘అన్నలు, చెల్లెళ్లకి మోటార్ బైక్ నడపడం విధిగా నేర్పించండి, చెల్లెళ్లకి హెల్మెట్లు బహుమతులుగా ఇవ్వండి’’ అనేవారేమో. లోపలి లోకాలను తాకే ‘‘సంచారమే ఎంత బాగున్నది’’ పాటలో గోరటి వెంకన్న ‘‘మూలనున్నవి మురిగి పోతున్నవి, సంచరించేవి శక్తితోనున్నవి’’ అంటారు. నిజం! ఇప్పుడు స్త్రీకి కావల్సినది, ఆమెనో మూలన ఉంచి అన్నలిచ్చే రక్ష కాదు. స్వతంత్రతనిచ్చే మొబిలిటీనే. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 సామాన్య కిరణ్ -
పెళ్లిని, భర్తని నెట్టేస్తున్న కెరీర్
ఆలోచనం తమ ఆలోచనల్లో ఇంకిపోయిన సెక్సిజం నుంచి బయటపడనంత కాలం, మన మగవాళ్లకి ఈ కాలంలో పెళ్లిళ్లు కావడం కష్టమవడమే కాదు, ఆ పెళ్లిళ్లను అవలీలగా పెటాకులు చేసి ఆడవాళ్లు వెళ్ళిపోతారు కూడా. కొద్ది రోజుల క్రితం అమెరికాకు చెందిన మిజ్. షీలా మైకేల్స్ మరణించారు. అప్ప టివరకూ పురుషుడిని వివాహ పూర్వమూ, అనంతరమూ మిస్టర్‌గా పరిగణిస్తూ ఉండగా స్త్రీని వివాహమనే జీవన మధ్యధరా రేఖ నుంచి అటు వైపు ఉన్నపుడు తండ్రి అనే మగవాడికి చెందిన కుమారి గాను, ఇటు వైపు ఉన్నపుడు భర్త అనే మగాడి ఆస్తిగా శ్రీమతి గాను పరిగణిస్తూ వచ్చేవారు. స్త్రీవాది అయిన షీలా దీనిని ‘‘నేను నా తండ్రికీ చెందను, అలాగని నేనేం చేయాలో నాకు పదేపదే చెబుతుండే ఒక భర్తకూ చెందాలనుకోలేదు’’ అని ఒక అస్థిత్వ ప్రశ్నను లేవనెత్తింది. ‘‘ఏ మగవాడికీ చెందాలనుకోని ఒక స్త్రీని ఏమని సంబో ధించాలి అని వెతికాను. నాకేమీ కనిపించలేదు’’ అన్న షీలా దానికి పరిష్కారంగా మిజ్ (ఝట) పదాన్ని వాడా లని ప్రపంచానికి సూచించింది. ‘మిజ్ పదం వాడట మంటే నువ్వు స్త్రీని వివాహార్హతతో కాకుండా, ఎవరి భాగస్వామిగానో కాకుండా ఆమెని ఒక మనిషిగా మాత్రమే గుర్తిస్తున్నావని అర్థం’ అని చెప్పింది. 1963లో ప్రచురితమైన బెట్టీ ఫ్రైడెన్ ‘ఫెమినైన్ మిస్టిక్’ పుస్తకం, ప్రపంచం చెప్తున్నట్టు ఆడవాళ్ళు శ్రీమ తులుగా భర్తల వెనకాల, చెల్లెళ్లుగా అన్నల పక్కన, తల్లు లుగా కొడుకుల కోసం కష్టపడుతూ, నగలు వేసుకుని, ఆస్తులు చూసుకుని మురిసిపోతూ ఏమీ లేరనీ, వాళ్లు తమ తెలివితేటలకు, సామర్థ్యానికి తగిన గుర్తింపు రావటం లేదని బాధపడుతున్నారని తెలిపింది. స్త్రీత్వం, మాతృత్వం అత్యద్భుతమైనవి అంటూ స్త్రీల చుట్టూ మగవాళ్ళు అల్లిపెట్టిన భ్రమాత్మక అద్భుతత్వాన్ని స్త్రీవా దులు అలా బద్దలు కొట్టారు. దానిని అనుసరిస్తూ తెలు గులో కూడా ఓల్గా, జయప్రభ, వసంత లక్ష్మి వంటి స్త్రీవా దులు స్త్రీ పురుషులిద్దరికీ ‘శ్రీ’ అనే గౌరవ వాచకాన్ని వాడితే చాలని సూచించారు. అనుసరించారు. ఫెమినైన్ మిస్టిక్ ప్రచురణ జరిగి అనేక ఏళ్ళు గడిచి పోయాయి. అత్యంత ఎక్కువ సంఖ్యలో అమ్ముడయిన పుస్తకంగా అది రికార్డులు సాధించింది. కానీ మగవాళ్ళు మాత్రం ఇంకా తదనుగుణంగా తర్ఫీదు కాలేదు. స్త్రీని లైంగికంగా చూడటమూ మానలేదు. రాజదీప్ సర్దేశాయ్ ఆధునికుడైన అభ్యుదయ జర్నలిస్ట్. ఆయన సానియా మీర్జాను ఇంటర్వ్యూ చేస్తూ చాలా సాదా సీదా మగవాడి లాగా ‘‘మరి తల్లి కావడం ఎప్పుడు? సెటిలవడం ఎప్పు డు?’’ అని ప్రశ్నించాడు. ఆ అమ్మాయి చాలా తీవ్రంగా స్పందించి ‘‘ఈ సమయంలో ప్రపంచ నంబర్ వన్‌గా ఉండటం కంటే మాతృత్వాన్ని నేను ఎంచుకోనందుకు మీరు ఆశాభంగంతో ఉన్నట్లు మీ మాటలు ధ్వనిస్తున్నాయి. ఒక మహిళగా అన్ని సమయాల్లో నేను ఈ ప్రశ్ననే ఎదుర్కొంటున్నాను. అదేమిటంటే మొదట పెళ్లి, తర్వాత మాతృత్వం. మేం సెటిల్ కావడం అంటే ఇదేనన్నమాట. ‘‘ఎన్ని వింబుల్డన్‌లు మేం గెల్చుకున్నా, ఎన్ని సార్లు ప్రపంచ నంబర్ వన్లుగా మారినా, మేం సెటిల్ కానట్లే మరి’’ అని సమాధానమిచ్చింది. ఇటీవలే ఒక తెలుగు దినపత్రిక స్త్రీ శిశు హత్యల కారణంగా స్త్రీల సంఖ్య తగ్గిపోయిందని మగ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకక బాధపడుతున్నా రని వేదన చెందుతూ పెద్ద వార్త రాసింది. స్త్రీ శిశు హత్యలు జరగటం వలన అమ్మాయిల సంఖ్య తగ్గి పోవడమనేది నిజమే అయినా వాళ్లకి అమ్మాయిలు దొర కకపోవడం వల్లే పెళ్లి కావడం లేదా అనేది ప్రశ్న. విద్య జ్ఞానపు పరిధులను విస్తరించగా, ఆర్థిక స్వాతంత్య్రం దేన్నయినా ఎదుర్కునే ధైర్యాన్ని ఇస్తుంది. మా అమ్మమ్మ నాతో ఎప్పుడూ ‘‘నీకేమమ్మా నిన్నెవరేం చేయగలరు, నీకు సరస్వతి తోడుగా ఉంది’’ అనేది. నా సరస్వతి నాకు ధనాన్నివ్వడమే కాదు ఎలాటి భర్తను ఎంపిక చేసుకో వాలో నేర్పింది. ఇవాళ్టి ఆడపిల్లలందరూ నాకూ, సాని యాకు ప్రతినిధులే, గాయని మేఘన్ ట్రయ్నర్ పాట ‘‘డియర్ ఫ్యూచర్ హస్బెండ్’’లో ‘‘నేను వంట చేయడం ఎన్నడూ నేర్చుకోలేదు కానీ, నేను జనాకర్షకమైన పాట రాయగలను.. రా నాతో కలిసి పాడు!’’ అన్నట్టు అన డమూ నేర్పింది. బహుశా ఈ నాటి చదువుకున్న అమ్మా యిల ఈ మనస్తత్వాలు అనుగుణమైన అబ్బాయిలు దొరకకపోవడం చేత వాళ్ళు అంత త్వరగా పెళ్ళికి సిద్ధ పడటం లేదేమో. కాలం మారింది కానీ ఈ సంధి కాలంలో అబ్బాయి, అతని తరఫు వారూ మాత్రమే కాదు రాజ దీప్ సర్దేశాయ్ లాంటి ఆధునికులూ తమ ఆలోచనలలో ఇంకిపోయిన సెక్సిజం నుంచి బయట పడలేక పోతు న్నారు. అలా బయటపడనంత కాలం మన మగవాళ్ళకి ఈ కాలంలో పెళ్లిళ్లు కావడం కష్టమవడమే కాదు, ఆ పెళ్లిళ్లను అవలీలగా పెటాకులు చేసి ఆడవాళ్లు వెళ్లి పోతారు కూడా. ‘‘కొంతమంది మహిళలు పురుషులను అనుసరిస్తారు. కొంతమంది స్త్రీలు తమ స్వప్నాలను అనుసరిస్తారు. ఏ మార్గాన్ని అనుసరించాలని మీరు సందేహిస్తున్నట్లయితే, తెలుసుకోండి. మీ ఉద్యోగం ఒకానొకరోజు మిమ్మల్ని నిద్రలేపి, నేనింక నిన్ను ప్రేమించబోవటం లేదు అని చెప్పి మిమ్మల్ని మధ్యలో వదిలేయదు’’ అని గాయని లేడీ గాగా అన్న మాటలు నాకు భలే ఇష్టం. నేనో సారి ఆ మాటలను పన్నెండేళ్ల నా కూతురితో పంచుకున్నాను. ఆ మాటలను నా కూతురు భట్టీయం వేసుకుంది. తననెప్పుడూ వదిలిపోని చదువు, ఉద్యోగమే భర్తకన్నా, వివాహం కన్నా ముఖ్యమని అను కుంటోంది. రాబోయే కాలమంతా ఇలాంటి అమ్మాయిలే కనిపించబోతున్నారు. కనుక మగవాళ్లూ మారండి! మారకపోతే వివాహాలు కావండీ! - సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 -
సంఘ బహిష్కరణకు శిక్షేది?
ఆలోచనం ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం గరగపర్రు విషయంలో సరైన చర్యలు తీసుకుని ఉంటే ఏ రాజకీయ నేత కలెక్టర్‌కి అడ్డుపడేవాడు? వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేసిన ఐఏఎస్ ఎస్.ఆర్. శంకరన్ ఎవరికయినా తలవంచారా? గరగపర్రు గ్రామంలో చెరువొడ్డున బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం నిలబెట్టడం కోసం దళితులు సంఘ బహిష్కరణకు గురికావడం నాకు అనేక జ్ఞాపకాలను తెచ్చింది. అందులో మొదటిది 1927వ సంవత్సరంలో అంబేడ్కర్ మహద్ చెరువులో నీరు తాగే హక్కు కోసం ఉద్యమించడం. దానిని వ్యతిరేకించిన సవర్ణులు ‘ఆవు పేడ’తో ఆ చెరువును శుద్ధి చేసుకోవడం. ఇది జరిగి ఇప్పటికి 90 ఏళ్లు. ‘నేను భంగీని’ రచయిత భగవాన్ దాస్ 1957లో, ‘హిందూ మతం మనిషి గుణాన్ని, యోగ్యతల్ని పట్టించుకోకుండా మనిషి పుట్టుకకు ప్రాధాన్యతనిస్తోంది. సమానత్వం, ఐక్యతలను వ్యతిరేకిస్తుంది’ అని రాసి ఇప్పటికి 60 ఏళ్లు. విజయనగరం జిల్లా ‘వసి’ గ్రామంలో దళితులను ఇలాగే ఊరి నుంచి వెలివేసినపుడు, 1999లో బాలగోపాల్ ప్రభుత్వ పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ ‘సంఘ బహిష్కరణకు శిక్ష మాటేమి టి’? అనే వ్యాసం రాశారు. ఇది జరిగి నేటికి 18 ఏళ్లు. మనిషి మరో మనిషిపై పుట్టుకతోనే ఆధిపత్య సౌకర్యాన్ని పొందడానికి విశ్వవ్యాప్తంగా మతం కృషి చేయడం, ప్రయాణ సాధనాలు సరిగా లేని ఆ కాలం లోనే ప్రపంచమంతా కూడబలుక్కున్నట్లు ఈ అంతరాల మానవ సమాజాన్ని నిర్మించడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. దీన్ని వదిలేసి, సామాజిక మాధ్యమాల్లో కొంత మంది, దళిత రాజకీయ నేతల చిత్తశుద్ధిని ప్రశ్నించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్, రాంసే మెక్డొనాల్డ్లు ప్రతిపాదించిన దళిత ప్రత్యేక నియోజక వర్గాల ఆలోచనను వ్యతిరేకించిన గాంధీ ‘ఇలా చేస్తే హిందూ సమాజం ముక్కచెక్కలై పోగలదని’, తిండీ నీళ్లు మానేసి ‘పూనా ఒప్పందం’ చేసుకున్నాడు. అలా దళిత నేతల రాజకీయ ప్రాణాలని, వారి నియోజకవర్గాలలోని సవర్ణ ఓటర్ల చేతిలో పెట్టాడు. సమాజాభివృద్ధికంటే కులమూ, మతమూ ప్రధానాంశాలుగా భావిస్తూ ఓట్లేసే ప్రజలున్న చోట, అసలు రాజకీయమే ఒక జూదం. ఈ జూదంలో, మనుగడకోసం ప్రతి రాజకీయ నేత ఎత్తుకు పైఎత్తు వేయాల్సిందే, కానీ గరగపర్రులో అధికారుల తీరు మాటేమిటీ? ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ 3 (యూ), 3 (జెడ్íసీ)ల ప్రకారం సంఘ బహిష్కరణ చేసిన వారికి 6 నెలల నుంచి ఐదేళ్లదాకా శిక్ష విధిం చొచ్చు. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయిలో సీఎం నేతృత్వంలో, జిల్లా స్థాయిలో కలక్టర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ పని చేయాలి. ప్రతినెలా జిల్లా కమిటీ రిపోర్ట్ రాష్ట్రానికి పంపాలి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ మీటింగ్ ప్రతి 3 నెలలకి ఒకసారి కచ్చితంగా జరగాలి. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్‌ని ఈ చట్టం అమలుకు నోడల్ ఆఫీసర్‌గా నియమించాలి. వీటన్నిటినీ పాటిస్తూ గరగపర్రు విషయంలో సరైన చర్యలు తీసుకుని ఉంటే ఏ రాజకీయ నేత కలెక్టర్‌కి అడ్డుపడేవాడు? హేమాహేమీలయిన రాజకీయ నాయకులు అడ్డు నిల్చినా వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేసిన ఐఏఎస్, ఎస్.ఆర్. శంకరన్, ఎవరికయినా తలవంచారా? మరి గరగపర్రు విషయంలో ఆ జిల్లా కలెక్టర్ ఎందుకలా స్పందించలేకపోయారు? రెండ్రోజుల క్రితం ‘ది టెలిగ్రాఫ్’లో ఒక వార్త. బ్రిటన్‌లో పుట్టిపెరిగిన సందీప్, రీనా అనే హిందూ జంట సంతానలేమితో అక్కడే ఒక బిడ్డని దత్తత తీసుకోవాలనుకున్నారట. దత్తతనిచ్చే స్థానిక సెంటర్‌ని సంప్రదిస్తే, వారు వర్ణవివక్షను మొహమాటం లేకుండా ప్రదర్శిస్తూ, తమ దగ్గర అందరూ తెల్ల పిల్లలే వున్నారని, ఇండియన్స్ తెల్లబిడ్డని దత్తత తీసుకోవడానికి అనర్హులు అని, దరఖాస్తు చేసుకోవడం కూడా అనవసరం అన్నారట. గరగపర్రు దళితులను బహిష్కరించిన సందర్భంలో వచ్చిన ఈ వార్త నాకో ఆలోచన కలిగించింది. ఒక వేళ ప్రపంచమంతా ఒక్కటైపోతే, ఇప్పుడు గరగపర్రు దళి తులపై అత్యాచారం చేసిన బలరామకృష్ణమరాజు, రామరాజు, విషయం తెలిసినా ఊరకున్న సీఎం చంద్రబాబుల పెద్ద కులాల మాటేమిటి? ‘వి హావ్ ఆల్వేస్ ఫెల్ట్ బ్రిటిష్’ అని తెల్లబిడ్డ దత్తత కోరుకున్న ఆ దంపతుల్లాగే మన సవర్ణులూ, మాది చాలా గొప్పకులం అన్నా, అప్పుడు గాంధీకి దక్షిణాఫ్రికాలో జరిగిన అవమానమే వీళ్లకీ జరుగుతుంది కదా. ఎంత కాదన్నా రూపంలో, సంపత్తిలో చాలా దేశాల ప్రజలు మనకంటే చాలా సవర్ణులు కదా మరి. ఆ మధ్య సీఎం తాను, వెంకయ్య ఇద్దరం అమెరికాలో పుట్టివుంటే బాగుండేదని అన్నారు. ఆ అమెరికా స్వాతంత్య్ర దినం ఈ రోజు. వారి యునైటెడ్ స్టేట్స్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ రెండో పేరా ‘మనుషులం దరూ సమానులుగానే పుట్టారు అనడానికి ఈ వాస్తవాలను ససాక్ష్యంగా ఎత్తిపెట్టాం’ అని మొదలవుతుంది, ఆ స్ఫూర్తితో ‘‘బానిసత్వానికి అనుకూలంగా ఎవరైనా వాదిస్తుండటాన్ని నేను విన్నవ్పుడల్లా, అలా వాదించేవారిపై వ్యక్తిగతంగా ఆ బానిసత్వాన్ని అమలు చేసి చూడాలనే బలమైన భావన నాకు కలుగుతుంది’’ అని ప్రకటించి, బానిసత్వ నిర్మూలన వ్యతిరేకులకు ఛాతీ ఎదురొడ్డి నిలిచాడు అబ్రహాం లింకన్. సీఎం చంద్రబాబు ఈ విషయాలను తెలుసుకుని, దళితుల సంఘ బహిష్కరణ పట్ల నిజాయితీగా స్పందిస్తే, అప్పుడు ఆయన అమెరికాలో పుట్టాల్సినవాడినంటే మనం కాదంటామా, కావాలంటే అబ్రహాం లింకన్ అంతటివాడివని కూడా అంటాం. - సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 -
నీలి రంగు.. అసలు రంగు
ప్రజాస్వామ్య దేశంలో సీఎం చంద్రబాబు కూడా ప్రజలలో ఒక భాగం. అంతే తప్ప ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కాదు కదా ‘‘నా రాజ్యంలో ఉంటూ నా సొమ్ము తింటూ నాకే అన్యాయం చేస్తారా’’ అనడానికి. నేను గ్రాడ్యుయేషన్‌కి వచ్చిన తరువాత చంద్రబాబునాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాజనీతి, అర్థశాస్త్రాల విద్యార్థినిని కావ డం చేతననుకుంటా మార్క్సిస్టులు ఆయనను దుయ్యబట్టేందుకు వాడే ‘ఇండియన్ మాకియవెల్లి’ మాటతో పాటు, ఒక దినపత్రిక ఆయనను కీర్తిస్తూ రాసే అనేక కథనాలను నేను ఆసక్తిగా చదివేదానిని. టెక్నాలజీని, అభివృద్ధిని ఆయన కావలించుకునే తీరును చూసి, ఎల్తైన కట్టడాల పట్ల, మిరుమిట్లు గొలిపే నగరాల పట్ల ఆయన మక్కువను చూసి, బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ హైదరాబాద్ రావడం చూసి బాబుని చాలా మేధావి అనీ, ఆధునికుడు కామోసు అని ఒక్కోసారి భ్రాంతి చెందేదాన్ని. కానీ ఆశ్చర్యం.. ఇంత ఘనమైన కీర్తిమంతుడు అని ఇన్ని సంవత్సరాలుగా కొన్ని దినపత్రికలు, టీవీ చానళ్లూ చెప్తూ వచ్చిన బాబు, నంద్యాలలో ‘నా పెన్షన్ తీసుకుంటున్నారు, నేనిచ్చే రేషన్ తింటున్నారు, నా రోడ్ల మీద తిరుగుతున్నారు, నేను వేసిన వీధి దీపాలలో ముందుకెళుతున్నారు. అటువంటిది మనకి ఓటెయ్యకుండా ఎలా వుంటారు? మన పరిపాలన నచ్చకపోతే మనదగ్గర నుంచి ఏమీ తీసుకోవద్దు’ అని మాట్లాడారు. ఈ మాటలు నన్నెంత షాక్‌కి గురిచేశాయంటే టీడీపీ అభిమానుల మీద నాకు చాలా జాలి వేసింది. తమ నాయకుడు ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడటం వారికి కూడా అవమానంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజలే పరిపాలించుకొనే ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు కూడా ప్రజలలో ఒక భాగం. అంతే తప్ప ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కాదు కదా ‘నా రాజ్యంలో ఉంటూ నా సొమ్ము తింటూ నాకే అన్యాయం చేస్తారా’ అనడానికి. ఈ మాటలను బట్టి ఆయనకి ప్రజాస్వామ్య నిర్వచనమే తెలియదని అనుకుందామా.. ఆయన బెదిరింపు ప్రజలను వారికి రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కు భావప్రకటనా హక్కుల నుంచి దూరం చేయడం లేదా? ఇది ఒక్కటేనా? అసలేమీ చదువుకోకున్నా, సంస్కారం మాత్రం మెండుగా వున్న పల్లెటూరు వ్యక్తులు కూడా, ఈ రోజుల్లో ‘అమ్మాయైతే ఏంటి, అబ్బాయైతే ఏంటి మాకు ఇద్దరూ సమానమే’ అంటూ ఉంటే ఈయన ‘కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా’ అని పాతరాతియుగపు సామెతలు ఉదహరిస్తున్నారు, ఇది పరోక్షంగా స్త్రీ శిశు హత్యలను ప్రేరేపించడం లేదా 800 ఏళ్ళ క్రితమే చట్టం ముందు రాజుతో సహా అందరూ సమానమే అని ‘మాగ్నాకార్టా’ని ప్రకటించుకున్న దేశాలతో పోటీపడుతూ గ్లోబల్లీ ఫీజిబుల్ సొసైటీని నిర్మిస్తానని చెప్తున్న ముఖ్యమంత్రి ఆయా దేశాలలో పెద్ద పెద్ద మేడలు మాత్రమే ఉంటాయని అనుకుంటున్నారా? వారు అన్ని రంగాలలోనే కాదు సంస్కారంలోను అభివృద్ధి సాధించిన నాగరికులని తెలుసుకోలేదా? అంత పెద్ద పదవిలో ఉంటూ ఇటువంటి మాటలు ఆ దేశాల నాయకులు ఎవరైనా మాట్లాడి ఉంటే ఆ ఆధునిక దేశాల ప్రజలు వారిని పదవీచ్యుతులని చేసి ఉండేవారు. హాలుని గాధాసప్తశతిలో ఒక గాథ ఉంది ’’ఎంతయలుకగొన్ననేమి? సత్పురుషుల/నోటనెట్లు చెడ్డమాట వెడలు?/రాహువదనగహ్వరమున జిక్కియు జంద్రు /కరములమృతరసమే కురియుగాదే. అని. ‘నిజం కదా, రాహువు నోటిలో చిక్కిన తరుణంలో కూడా చంద్రుడు వెన్నెల కురిపిస్తాడు కానీ విషం కాదు కదా. అంతకు ముందు కొన్ని పత్రికలు, చానళ్లూ బాబు అజ్ఞానాన్ని, వాచాలత్వాన్ని వడపోసి నాణ్యమైన బాబుని మాత్రమే మనకి చూపించేవి. ఆయన కొమ్ము కాసే పత్రికలు కీర్తిస్తున్నట్టు బాబు సద్గుణశీల సంపన్నుడు కావడం నిజమే అయివుంటే, ఆయన నోటినుంచి కష్టాలలోనే కాదు, కలలోకూడా ఇటువంటి మాటలు వచ్చివుండేవి కాదు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుం టారా అని ఒక జాతి జాతినే హేయంగా మాట్లాడిన బాబు నిజస్వరూపం ఇదే. ఇప్పుడు పత్రిక, దృశ్య మాధ్యమ మీడియాలోకి లెక్కకు మిక్కిలి వ్యక్తులు, సామాజిక మాధ్యమాలు ప్రవేశించడం చేత, ప్రజలు ముఖ్యమంత్రి నిజరూపాన్ని చూడగలుగుతున్నారు. అనగనగా ఒక నక్క తిండి వెదుక్కుంటూ వెళ్లి నీలి రంగు డబ్బాలో పడిపోయిందిట. నీలి రంగులో వున్న తనని గుర్తించక దూరం దూరం వెళుతున్న ఇతర నక్కలను చూసి దానికో ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచన ప్రకారం మిగిలిన నక్కలన్నిటినీ పిలిచి మీటింగ్ పెట్టి, నన్ను మీకోసం దేవుడు పంపాడు. నేను ప్రత్యేకం, మేధావిని, శూరధీర నక్కని, సాక్షాత్తు భగవంతుడ్ని అన్నదట. ఆ నీలి రంగు చూసి మిగిలిన నక్కలు అవును కామోసనుకుని దానిని ఇలలో వెలసిన దైవమని కొలవడం మొదలెట్టాయట. ఒకానొక మంచి రోజు పెద్ద గాలీవానా వచ్చి, నక్క నీలి రంగంతా పోయి అసలు నక్క బయటికొచ్చిందట. అంతవరకు దేవుడి పేరుతో విలాసంగా బతుకుతున్న దానిని తోటి నక్కలు ఏం చేశాయనేది మిగిలిన క«థ. అసలు సంగతేంటంటే, ఆయన కొమ్ముకాసే పత్రికలు గేలన్ల, గేలన్ల నీలిరంగు పూసి ఆయనను కాపాడటానికి ప్రయత్నిస్తుంటే, ఆ నీలిరంగుని చీల్చుకుని బయటకొస్తున్న చంద్రబాబే ప్రజాస్వామ్య వ్యతిరేక అసలు సిసలు ఫ్యూడల్ బాబు. సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966’ -
ఇంటర్నెట్ ‘మరుగుజ్జు’లు
ఆలోచనం విషాదం ఏమిటంటే ఈ ‘ఇంటర్నెట్ ట్రోల్స్’’ తమ ప్రత్యర్థుల లాగా సైద్ధాంతికంగా, న్యాయబద్ధంగా మాట్లాడరు. వీరి భావజాలం ఏకపక్షంగాను, వాదనకు నిలబడనిదిగాను ఉండటం చేత తమ ప్రత్యర్థుల మీద రకరకాల దాడులకు పాల్పడతారు. సామాజిక మాధ్యమంలో దైవదూషణ చేస్తూ పోస్ట్‌లు పెట్టినందుకు గాను తైమూర్ రాజా అనే పాకిస్థానీయుడికి ఆ దేశపు యాంటీ టెర్రరిజం కోర్టు మరణశిక్ష విధించింది. సోషల్ మీడియాలో పోస్టుకు సంబంధించి కోర్టు మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారట కానీ, మత మౌఢ్యాన్నీ ప్రశ్నించే వారు, నాస్తికులు, స్త్రీవాదులు, లౌకిక మేధావులు రకరకాల శిక్షలకు గురికావడం ఇవాళ్టిదేమీ కాదు. దాదాపు 30 మంది బంగ్లాదేశీ బ్లాగర్లు భగవంతునిపై విశ్వాసం లేనివారనే ముద్రపడి హత్యకు గురయ్యారు. భారతదేశం అధికారిక మతం లేని లౌకిక సర్వసత్తాక దేశం. ఇక్కడ పాకిస్థాన్‌లో వలే మరణ శిక్షలు, భౌతిక హత్యలు లేవు కానీ ఫేస్బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాలలో లౌకిక వాదులు, ముఖ్యంగా స్వేచ్ఛావాదులూ, స్త్రీవాదులు, మతతీవ్రవాదుల నుంచి రకరకాల వేధింపులను ఎదుర్కొంటూ వస్తున్నారు. డైలీఓ అనే ఆన్లైన్ పత్రిక ప్రకారం, 2014 తర్వాత అతి వాదులు కొంతమంది ట్వీటర్లో రకరకాల పేర్లతో కొన్ని గ్రూపులను ఏర్పరచి సమాజాన్ని ప్రశ్నించే వారిని, లౌకికవాద మేధావులను ఆయా గ్రూపులలో చేర్చి దూషిస్తున్నారు. ‘మనిషి రూపంలో వుండే రోగులు’ ‘పిచ్చి పట్టిన కుక్కలు’, ‘ఆవుని తినే ఆటవికులు’ అనేవి వాటిలో కొన్ని గ్రూపులు. ప్రజాస్వామిక పాత్రికేయులను ప్రాస్టిట్యూట్స్ (వేశ్య) పదం స్ఫురించేట్లు ‘ప్రెస్టిట్యూట్స్’ అని పిలుస్తూ, ఆ పేరుతో ఫేస్బుక్లో పేజీలను సృష్టిస్తున్నారు. నీతా భల్ల అనే జర్నలిస్ట్ ‘‘అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో తీవ్ర జాతీయవాదులు, సామాజిక మాధ్యమాలలో జర్నలిస్టులపై బురద చల్లడం, దూషించడం, తెగబడటం, భౌతికదాడులు చేస్తామని బెదిరించడం ఇటీవలే ఎక్కువైంది’’ అని అంటుంది. ‘తల్లిగా ఉండడానికి అనర్హులు’ అని పేరు ఉన్న ఒక ట్వీటర్ గ్రూప్‌లో రాజ్యసభ టీవీకి చెందిన అర్ఫా కానుమ్ షేర్వాణీ, ది న్యూస్ మినిట్‌కి చెందిన ధన్య రాజేంద్రన్, ఎన్డీ టీవీకి చెందిన సునేత్ర చౌదరి వంటి వారిని చేర్చారు. ఫేస్బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాలు నిజానికి మనిషి భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన తలుపులను బార్లా తెరిచి పెట్టాయి. సాంప్రదాయక మీడియా నుంచి మనిషికి కొంత స్వేచ్ఛని ఇచ్చాయి. అభివ్యక్తీకరణ వున్న ప్రజా సమూహానికి ఈ మాధ్యమాలు ఒక వేదికగా మారాయి. ఈ రోజు వెనుకాముందూ పైసా ఆదాయం లేని విద్యావంతుడైన దళితుడు కులం గురించి, ఇంటి నుంచి బయటకు రాకుండానే ఒక మధ్యతరగతి స్త్రీ తన అంతరంగాన్ని, సమాజం తనని బంధించి వున్న సంకెళ్ళ గురించి మాట్లాడే వెసులుబాటుని కల్పించడమే కాకుండా, ప్రపంచం మొత్తాన్ని అనుసంధానించి గ్లోబల్ స్టేజ్‌గా రూపొందాయి. కానీ ఇదంతా సామాజిక మాధ్యమం సఫల రూపం మాత్రమే. సర్వజన సౌభ్రాతృత్వాన్ని, అంతరాలు లేని సమాజాన్ని కాంక్షించే సహృదయులు ఈ మాధ్యమాన్ని తమ భావ వ్యక్తీకరణకు ఎప్పుడయితే వాడటం మొదలు పెట్టారో వెనువెంటనే సంప్రదాయవాదులు, తీవ్ర జాతీయవాదులు మేల్కొని లెక్కకు మిక్కిలి సమూహాలై ఈ మాధ్యమాన్ని వాడటం మొదలు పెట్టారు. విషాదం ఏమిటంటే ఈ ‘ఇంటర్నెట్ ట్రోల్స్’ (ఇంటర్నెట్ ట్రోల్ అనేది ఒక వాడుకలో ఉన్న వ్యక్తీకరణ. వ్యక్తుల పరువుకు భంగం కలిగించడానికి, ఆగ్రహం కలిగించడానికి, అపహాస్యం చేయడానికి, మండించడానికి లేదా ఇతర ఆన్లైన్ యూజర్లను రెచ్చగొట్టడానికి, సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికతను విని యోగించుకునే వారిని ట్రోల్ అని పిలుస్తారు) తమ ప్రత్యర్థుల లాగా సైద్ధాంతికంగా, న్యాయబద్ధంగా మాట్లాడరు. వీరి భావజాలం ఏకపక్షంగాను, వాదనకు నిలబడనిదిగాను ఉండటం చేత తమ ప్రత్యర్థుల మీద రకరకాల దాడులకు పాల్పడతారు. పైన పేర్కొన్న ట్వీటర్ సమూహాల పేర్లు అటువంటి ‘‘ట్రోల్ రాంట్స్’’ చేసే పనులే. గత 20 ఏళ్లుగా సైబర్ నేరస్థులపై పని చేస్తున్న ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ మైఖేల్ నఖిటెల్లి ఈ ఇంటర్నెట్ ట్రోల్స్‌ని దాదాపు వందకుపైగా రకాలుగా విభజించాడు. కామెంట్ ట్రోల్, ఫ్లడర్, ఫోరమ్ కల్టిస్ట్ వంటివి అందులో కొన్ని. మైఖేల్ ఈ తరహా సమూహాల స్వభావాలకి రకరకాల మానసిక రోగాలు కారణమనీ, వీరు సహజంగా సంఘంలో అనామకంగా ఉండి గుర్తింపు కోసం, తమ ఉనికిని తెలియ పరచడం కోసం ఇతరులను వేధిస్తుంటారని పేర్కొన్నాడు. ఇప్పుడు మనం పైన పేర్కొన్న వాళ్లు ‘‘హేట్ మాంగర్స్’’ ట్రోల్ జాతి. వీళ్ళు ఒక విషయాన్ని నమ్మి దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అప్రజాస్వామికంగా దూషిస్తూ దాడి చేస్తారు. నోమ్ ఛాంస్కీ వాక్ స్వాతంత్య్రాన్ని గురించి మాట్లాడుతూ ‘మీరు వాక్స్వాతంత్య్రాన్ని విశ్వసిస్తున్నట్లయితే, మీరు ఇష్టపడని అభిప్రాయాలకు చెందిన వాక్స్వాతంత్య్రాన్ని కూడా విశ్వసిస్తారు. గోబెల్స్ తాను ఇష్టపడే అభిప్రాయాలకు చెందిన వాక్స్వాతంత్య్రానికి అనుకూలంగా ఉంటాడు. మీరు వాక్స్వాతంత్య్రానికి అనుకూలురు అయితే, మీరు తిరస్కరించే అభిప్రాయాలకు చెందిన వాక్ స్వాతంత్య్రానికి కూడా మీరు అనుకూలురని అర్థం’ అన్నాడు. ప్రస్తుతం ఈ సామాజిక మాధ్యమాలలో తారాడే అతివాద సమూహాలు సరిగా గోబెల్స్ తరహాలో వాక్ స్వాతంత్య్రాన్ని గౌరవిస్తున్నాయి. భారతదేశంలో రాజ్యాంగం ఇస్తున్న హక్కులను కొంతమంది అల్లరి మూకలు కాలరాస్తూ పాకిస్థాన్‌లో రాజ్యం పోషిస్తున్న పాత్రను నిర్వహిస్తున్నారు. సమాజంలో భద్ర జీవనాన్ని గడుపుతూ, మర్యాదపూర్వకంగా తమ భావాలను వ్యక్తపరిచే మేధావులే కాదు రాజకీయ నాయకులు చివరకు అసలేమీ సంబంధం లేని వారి కుటుంబ సభ్యులు కూడా వీరినుంచి అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ప్రభుత్వాలు దీనిని ‘కమ్ విత్ ది టెరిటరీ’ అనుకోకుండా, మేధావుల చేత అధ్యయనం చేయించి అందరికీ ఆమోదకరమైన రీతిలో స్పందిం చడం ప్రజాస్వామ్య దేశపు ఆరోగ్యానికి సత్వర అవసరం. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి సామాన్య కిరణ్ 91635 69966 -
‘గోరక్షణ’ రాజకీయం!
ఆలోచనం ‘‘అనుత్పాదక పసరాన్ని తొలగించకుండా రైతులు.. గోవులను పెంచలేరు’’ అన్నారు కురియన్. శంకరాచార్య దీనిని ఖండించినపుడు ‘‘మీరు అనుత్పాదక గోవులను పోషించే భారం తీసుకోగలరా’’ అని కురియన్ ప్రశ్నించారు. 2017కి నక్సల్బరీకి యాభయ్యేళ్లు నిండాయి. ఉద్యమాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ సందర్భంలో నా మనసు, గూడ అంజన్న రాయగా లేబ్రాయపు గద్దర్ పాడిన వందనాలు... పాట దగ్గర చిక్కుకుపోయింది. పేద ధనిక అంతరాలు లేని చల్లని ప్రపంచాన్ని కలగని, ప్రాణాలు కోల్పోయిన తమ పిల్లల గురించి ‘‘ఏ దిక్కూ లేనోళ్లకూ మా బిడ్డలూ/ మీరు దిక్కు చూపే చుక్కలయ్యిండ్రా’’ అంటూ సాగే తల్లుల కడుపుశోకం ఆ పాట. జంతువుల పట్ల క్రూరత్వాన్ని నిషేధించే చట్టానికి చెందిన నియమాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరణ చేసినపుడు ‘‘కట్టిన ఆ తెల్ల ఆవును కంటి పాపల చూసుకుంటాం/పచ్చిగడ్డీ పిండి పెట్టి ప్రాణమోలే పెంచుకుంటాం/పురిటి నెప్పులు దానికొస్తే కాపలుండి కాన్పుజేస్తం/తల్లి లేగను నాకుతుంటే తల్లి ప్రేమా గురుతుకొచ్చే/మీరు పురిటి నెప్పూలయ్యి వస్తారా మా బిడ్డలు/మళ్లీ జన్మయ్ మాకే పుడతారా మా బిడ్డలూ’’ అంటూ సాగే ఈ పాట మళ్లీ నన్ను వెంటాడింది. నేపాల్‌లోని గదిమాయి దేవతకు బలి ఇవ్వడానికి భారత్ నుంచి జరుగుతున్న లక్షలాది పశువుల అక్రమ ఎగుమతిపై చర్య తీసుకోవాలని పీపుల్ ఫర్ ఎనిమల్స్ కార్యకర్త గౌరి మాలేఖి 2014 సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై 13 జూలై 2015లో ‘ఇండియా నుంచి ఇతర దేశాలకు పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి, కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలు చేయాలని’ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పశువుల మార్కెట్లలో రైతుల మధ్యే క్రయవిక్రయాలు జరగాలనీ, అది కేవలం వ్యవసాయ సంబంధిత పనుల కోసమే జరగాలని, ఆవులు గేదెలు దూడల వంటి వాటిపై ఎటువంటి హింసా జరగరాదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం నియమాలను సవరించింది. ఈ అస్పష్టపు సవరణ తిరిగి భారతీయులను గో భక్షకులు, గో రక్షకులు అని రెండు వర్గాలుగా విడకొట్టింది. గోరక్షకులలో ఉన్నత ఆర్థిక వర్గాల వారు, సాధువులు, మఠాధిపతులు ఉండగా, గో భక్షకులలో దళి తులు, ముస్లిములు చేరారు. వీరిపై హింసకు పాల్పడే వారుగా ముద్ర వేస్తున్నారు. ఈ చర్చ నిజానికి రైతు దగ్గర మొదలు పెట్టాలి. కొన్నేళ్ల క్రితం నేను బెంగాల్ లోని కూచ్ బిహార్, సిలిగురి ప్రాంతాలలో ఉండేదానిని. ఇక్కడనుంచి బంగ్లాదేశ్, నేపాల్‌లకు ప్రతిరాత్రి మందల కొద్దీ పశువుల అక్రమ రవాణా నిత్యకృత్యం. ఈ పశువులను అమ్మేవాళ్లు మాత్రం రైతులూ, పేద దిగువ తరగతి వారు. వీళ్లలో అత్యధికులు హిందువులు. గోవును మాతలా పూజించే ఈ రైతులు వట్టిపోయిన గోవును వధ్యశాలకు లేదా వధ్య వ్యాపారికి ఎందుకు అమ్ముతున్నారు? దీనినే తెల్ల విప్లవ పితామహుడు కురియన్ తన ‘ఐ టూ హేడ్ ఏ డ్రీమ్’లో ‘‘మనం పాలు తాగడమంటే, మాంసం కూడా భక్షించడమే. అనుత్పాదక పసరాన్ని తొలగించకుండా రైతులు పాలు ఇచ్చే గోవులను పెంచలేరు’’ అన్నాడు. శంకరాచార్య ఈ వాదనను ఖండించినపుడు ‘మీరు దేశంలో ఉండే అనుత్పాదక గోవులను పోషించే భారం తీసుకోగలరా’ అని ప్రశ్నించారు. అయితే రైతులో లేదా పసరాలను పెంచే నిమ్నాదాయ వర్గాలవారో జంతువుల పట్ల హింసాయుతంగా ఉంటున్నారా ? లేదూ మాంసం భక్షించే ఆయా జాతుల వాళ్ళు గో రక్షకులంత ప్రేమగా జంతువుల పట్ల ఉండటం లేదా అనేది ప్రశ్న .. నా దగ్గరున్న జంతువులలో ఒక గొర్రె ఉంది. దాని పేరు శాంతి. నాలుగు నెలల పిల్లగా 2007లో అది నా ఇంటికి వచ్చింది. ‘‘మేరీ హాడ్ ఏ లిటిల్ లాంబ్’’ పిల్లల పాటలోలాగా నిత్యం మా అమ్మాయి వెనుకే తిరిగే శాంతికి నోరు ఒక్కటి లేదు కానీ అన్ని మనోభావాలు ఉంటాయి. ఇంత కమ్యూనికేట్ చేసే ఈ జీవిని హత్య చేసి మనుష్యులు ఎలా తినగలుగుతున్నారు అని నాకు అనిపిస్తుం టుంది? ఆ తర్వాతి ప్రశ్న, అంత కాలం పాలిచ్చిన సాత్విక జీవిని మాంసానికి ఎలా అమ్మేస్తున్నారు అని? ఇక్కడే నాకు కురియన్ ప్రశ్న మళ్లీ జ్ఞాపకమొచ్చింది, నేను, లేదా గోవధను వ్యతిరేకించే పశు ప్రేమికులు రైతులకు ఎంత ఇవ్వాలో అంత ధనం ఇచ్చి గోశాలలు ఏర్పరచి గోరక్షణ చేయగలరా? ప్రభుత్వం అలా గోరక్షణ శాలలు ఏర్పరిచే దిశగా ధనికులను ప్రోత్సహిస్తుందా? దీనిపై గాంధీ స్పష్టంగా ఇలా చెప్పాడు ‘‘గోశాలలు, గోరక్షణ సంఘాలు కేవలం కొన్ని గోవులను తెచ్చి కట్టి పడవేయటం కాకుండా, గోవులకు మేతను సమకూర్చడం, పచ్చిక బయళ్లను కాపాడటం, పేద రైతుల నుంచి గోవులను కొనుగోలు చేయడం వంటి విస్తృత చర్యలు చేపట్టాలి’’ అని. ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టకుండా గో ప్రేమని పేద రైతులపై రుద్దటం అన్యాయం కదా. ‘వందనాలు’ పాటలోనే మరో వాక్యం ఉంది ‘‘ఊర పిచ్చుక జంట వస్తే గూడు కట్టుకోనిస్తాం, మీరు ఊర పిచ్చుక గుడ్డులవుతారా మా బిడ్డలు / ఆ గుడ్డులో మా బిడ్డలవుతారా’’ అని. జనజీవనంలో జీవకారు ణ్యం కూడా ఒక భాగమే. అది ఎవరూ నేర్పాల్సిన పని లేదు. నేను ఐచ్ఛిక శాఖాహారిని. ఇది చర్చకి వచ్చిన సందర్భంలో ఒక బెంగాలీ ఆవిడ ఇలా చెప్పింది ‘‘నువ్వు ఆ జీవులను చంపి తింటున్నానని భావించడం నిజం కాదు. మనిషి జన్మ ఎత్తాలంటే కొన్ని కోట్ల జన్మలు దాటాలి. ఈ జీవులను తినడం ద్వారా నీవు వాటికి ముక్తిని ఇచ్చి మానవ జన్మ ఎత్తడానికి సహకరిస్తున్నావ్’’ అని. అలా అనుకోకుంటే మానవ జీవనం ముందుకు సాగదు కదా. చివరిగా ఒక ప్రశ్న.. ప్రభుత్వం వారి ఈ జీవ కారుణ్యం కేవలం జంతువులకేనా? వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి సామాన్య కిరణ్ 91635 69966 -
విడుదల లేని జీవిత బందీ
ఆలోచనం మిర్చి రైతుల ఆక్రందనలు, ఆత్మహత్యలు నాకు శ్రీనాథుని ఒక పద్యాన్ని జ్ఞాపకం తెచ్చాయి. కొండవీటి రాజుల ప్రాభవం అంతరించి పోయాక ఆదరించేవారు కరువై బ్రతుకుదెరువు కోసం కవిసార్వభౌమ బిరుదాంకితుడయిన శ్రీనాథుడు ఓడ్ర రాజుల పాలనలో వున్న కృష్ణాతీరంలోని బొడ్డుపల్లి గ్రామాన్ని గుత్తకు తీసుకుని వ్యవసాయం చేయించాడు. ప్రకృతి వైపరీత్యాలు పంటని దోచుకెళ్ళాక 700 రూపాయల సుంకమెలా కట్టాలో తోచక ‘‘కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము/బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు/బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి/నెట్లు చెల్లింతు సుంకంబు నేడు నూర్లు?’’ అని విలపిస్తాడు. శిస్తుకట్టని నేరానికి భుజం పై శిలను మోయిస్తూ ఆయనను ఊరంతా తిప్పగా, ఆ అవమానంతో ‘‘సార్వభౌముని భుజస్కందమెక్కెను కదా నగరి వాకిటనుండు నల్లగుండు’’ అని విలపిం చాడు, మరణించాడు. ఈ కవి 15వ శతాబ్దం వాడు. యర్రగొండపాలెం, మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు తిరుపతి కోటయ్య, అంతంత మాత్రమే పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, అప్పులవాళ్ళు నట్టనడివీధిలో అవమానించగా దిక్కుతోచక పురుగులమందు తాగాడు. శ్రీనా«థునికి, తిరుపతయ్యకు మధ్య 600 ఏళ్ళ ఎడం వుంది. ఈ మధ్యలో రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యాలు వచ్చాయి. కానీ ఆశ్చర్యంగా రైతు పరిస్థితిలో మార్పు రాలేదు. వేలసంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితి అంతా ఏ కారణం చేత సంభవిస్తూ వుంది? రైతులు ఏ విషవలయంలో చిక్కుకుని ఉన్నారు పరిశీలించాల్సిన అవసరం వుంది. నా రాజకీయోద్యోగంలో భాగంగా నేను అనేక గ్రామాలలో తిరిగాను. అప్పుడు నేను ఒక విషయాన్ని గమనించాను. అదేమిటంటే ఈ రాష్ట్రంలో లేదా, ఈ దేశంలో దిగువ మధ్యతరగతి ఇళ్లన్నీ ఒక రకంగానూ, మధ్యతరగతి ఇళ్లు ఒకరకం సెట్టింగ్తోను, ఎగువతరగతి ఇళ్లన్నీ మరో రకం సెట్టింగ్తోనూ ఉన్నాయి. ఉదాహరణకు ఖరీదయిన లెదర్ రిక్లైనర్ సోఫాలను మార్కెట్ విడుదలచేస్తే సంపన్నుల ఇళ్లన్నీ ఆ సోఫాలను అత్యవసరంగా భావిస్తున్నాయి. మన ఇల్లు, మన జీవితాలు మన అభిరుచులకు అనుగుణంగా లేవు, మార్కెట్ ఎలా చెప్తే అలా ఉంటున్నాయి. రైతుల వ్యవసాయం కూడా అంతే. బీటీ విత్తనం, వనిల్లా పత్తి, మిర్చి, మొక్కజొన్న ఏదయినా ఏ పంట వేయాలో మార్కెట్ నిర్ణయిస్తూ ఉంది. రైతులంతా పొలోమని అటువైపు వెళ్తున్నారు. రెండవది వ్యవసాయ ఖర్చులు. రైతు జీవితం ‘‘అంగట్లో బియ్యం తంగేడు కట్టె’’. మధ్యతరగతి వారికి కార్లు కొనుగోలు చేసేందుకు లోన్లు ఇవ్వడానికి ఉత్సాహపడినట్లు బ్యాం కులు, రైతులకు రుణాలివ్వడానికి ఉత్సాహం చూపవు. పంటను, చారెడు భూమిని చూపి తెచ్చుకున్న అప్పులు కొండంత పెరిగిపోయి, రైతును ఆత్మహత్య వైపు నెడుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు వేలసంఖ్యను ఎప్పుడో దాటిపోయి రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను దాటుకుని పండించిన పంటను మార్కెట్టుకు తీసుకువస్తే చదరంగంలో పాముల్లా నోళ్లు తెరుచుకుని రైతులను చావు వైపుకు నెట్టే దళారులే అంతటా. దళారుల మీద అదుపులేని రాజ్యం, కొంతమంది రైతులు ఆత్మబలిదానం చేసాక కానీ కొంత రాయితీని ప్రకటించదు. పంటను నిల్వ ఉంచుకుని సరసమయిన ధరకు అమ్ముకోవడానికి, సరైన నిల్వ గోదాములు లేవు. 1991 సెన్సెస్ ప్రకారం 80 లక్షల మంది వ్యవసాయాన్ని వదిలేశారని ది హిందూ రూరల్ ఎఫెయిర్స్ ఎడిటర్ పి.సాయినాథ్ ఒక సెమినార్లో చెప్పారు. ఆ సంఖ్య ఇప్పటికి చాలా పెరిగి ఉంటుంది. చేతిలో సరైన వృత్తి నైపుణ్యం లేని ఈ రైతులందరూ, పట్టణాలలో కూలీలుగా మారి ఉంటారని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 70% వరకూ రైతులూ, రైతు కూలీలు ఉన్న భారత దేశంలో, ప్రజలచేత ఎన్నుకోబడుతున్న ఈ ప్రభుత్వాలు రైతులను ఆత్మహత్యలవైపుకూ, లేదా కార్పొరేట్ గుప్పిళ్ళలోకి ఎందుకు పంపుతూ ఉన్నట్లు ఆలోచిం చాలి. ఇన్ని సంవత్సరాలయినా స్వామినాథన్ సూచనలను ఎందుకు ఆచరణలోకి తీసుకురావటంలేదు. రైతు చేతిలోకి గుప్పెడు డబ్బు వస్తే, అతని కొనుగోలు శక్తి పెరిగితే యథావిధిగా మార్కెట్ వృద్ధి చెందుతుంది కదా. దేశాభివృద్ధికి నాంది వేస్తుంది కదా. తూతూ మంత్రపు రాయితీలు, లోన్లు వంటివి పక్కన పెడితే రైతుల జ్ఞాన పరిధిని విస్తరింపజేయడానికి స్వామినాథన్ చెప్పిన ‘‘విలేజ్ నాలెడ్జ్ సెంటర్’’లను ఎందుకు ఆచరణలోకి తీసుకురావడం లేదు. అప్పుడు తమకేం కావాలో రైతులే విశదంగా చెప్పగలరు కదా. పరిపాలకులలో చిత్తశుద్ధి, రైతుల జీవితాలను మెరుగు పరచాలనే పట్టుదల లేకుంటే సమాజం ఎంత అభివృద్ధి చెందినా, మనం రాకెట్లు ఎక్కి చంద్రుని మీదకి పిక్నిక్ వెళ్లేంత సాంకేతిక ప్రగతి సాధించినా రైతు జీవితం మాత్రం 600 ఏళ్ళ క్రితం ఉన్నట్లు ఇప్పుడు, ఇప్పుడు ఉన్నట్లే మరో 600 ఏళ్ళ తర్వాతా ఉంటుంది. ‘‘కాకమ్మ కథలోని రాహుకేతువులతో ఏడాదికోసారే గ్రహణం/పంట చేతికి వస్తే చుట్టూరా రాహువులు ఏడాదికేడాది గ్రహణం/వాడికేమో విడుదల వుంది /నీవేమో జీవిత బందీ’’ అని సుద్దాల అశోక్ తేజ అన్నట్లు మనం రైతు అంటే జీవిత ఖైదు అని పర్యాయ పదం చదువుకోవాల్సి ఉంటుంది. సామాన్య కిరణ్ ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 -
మానవీయతా మకుటధారి..!
ఆలోచనం కిస గౌతమి అనే స్త్రీ మరణించిన తన బిడ్డని బతికించమని అడిగినపుడు బుద్ద భగవానుడు, తల్లో, బిడ్డో, స్నేహితులో, బంధువులో ఇలా ఇంతవరకూ ఎవరూ మరణించని ఇంటి నుండి గుప్పెడు ఆవాలు తెమ్మన్నాడట, ఎవరూ మరణించని ఇల్లు ఈ భూమిపైన ఎక్కడయినా ఉంటుందా? ఆ గుప్పెడు ఆవాల కోసం తిరిగి అలిసిపోయిన గౌతమికి జననమరణాలు అత్యంత సహజమని తెలియవచ్చింది. సుఖదుఃఖాలు కూడా అంతే. ఈ పృథ్విపై సుఖాన్ని మాత్రమే అనుభవించే మనుషులు ఎవరూ వుండరు. కానీ కష్టాన్ని అనుభవించడం ఎంతో కష్టం. నాకొచ్చిన అటువంటి అత్యంత కష్టంలో సాంత్వనమిచ్చిన వాడు టాగోర్. టాగోర్ రాసిన 2230 పాటలలో ఒక పాట ‘‘ఎయి కోరేచి బాలో నిటుర్ హే’’. అందులో టాగోర్ అంటాడు కదా ‘‘నన్ను దుఃఖంతో జ్వలింపజేస్తున్నావ్ మంచిదే, ధూపం నిప్పులలో దహించబడకపోతే సుగం ధం వస్తుందా, దీపం జ్వలించకపోతే వెలుగు పుట్టదు కదా’’ అని. ఈ పాటను నాకు మానవి బందోపాధ్యాయ అనే ట్రాన్స్‌పర్సన్ పరి చయం చేశారు. తృతీయ ప్రకృతిగా మానవ సమూహాల నుంచి హేళనను ఎదుర్కొంటున్నపుడు, తనచేతిలో లేని తన పుట్టుక తనని బాధపెడుతున్నపుడు ఆ పాట ఇచ్చిన ఓదార్పు అనన్యమైనదని ఆమె చెప్పారు. నన్ను, మానవినే కాదు, కష్టసందర్భాలనే కాదు, టాగోర్ పాటలు మానవుని జీవితంలోని ప్రతి సందర్భాన్ని పలకరిస్తాయని ఆ పాట లను బెంగాలీ నుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్న సందర్భంలో నాకు అర్థమయింది. ఇవాళ వైశాఖం 25వ తేదీ, టాగోర్ పుట్టిన రోజు. కొంతమంది జీవించినపుడే కాదు, జీవితానంతరమూ జీవిస్తారు. మానవ సమాజ ఔన్నత్యానికి ఏమేంకావాలో అంచనావేయగల శక్తి వారిని కాలాతీతులను చేస్తుంది. టాగోర్ అటువంటి దార్శనికుడు. కథకుడిగా, కవిగా, వ్యాసకర్తగా, నాట కకర్త, గేయరచయిత ఇలా టాగోర్ సాహిత్య సృజనకారుడిగా అనేక రూపాలను సమర్థవంతంగా పోషించారు. ఆయన స్పృశించని మానవజీవన కోణమూ, ప్రశ్నించకుండా వదిలిన మూఢత్వమూ బహుశా లేవు. మాష్టారు గారు కథలో హరలాల్, రాస మణి కొడుకు కథలో కాళీ పద్ మరో మార్గమేమీ లేకుండా పేదరికానికి బలికావడం, పోస్ట్ మాస్టర్ కథలో రతన్, సమాప్తిలో తనకు తెలియకనే బాల్యం నుంచి యవ్వనంలోకి సాగిన చిన్ని మ్రున్మయి, ఎప్పుడు ఎందుకు అట్లా జరిగిందో తెలియక దుఃఖాన్ని గుప్తంగా గుండెల్లో దాచ ప్రయత్నించి ఓడిన చారులత, కులం గురించి మాట్లాడిన చండాలిక, సౌందర్యం గురించి చర్చించిన చిత్రాంగద రవీంద్రుని రచనా నైపుణ్యానికి మృదువైన చిరునామాలు. భార్య రాసిన లేఖ అనే కథలో రవీంద్రుడు తానే భార్యగా, ఒక స్త్రీ హృదయాన్ని చది వినట్లు, చీరకి నిప్పంటించుకుని చనిపోయిన తన అనాథ బాంధవి గురించి ‘ఊళ్లో వాళ్ళందరూ రేగారు. ఆడవాళ్ళు చీరెలకు నిప్పంటించుకుని చచ్చిపోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది’ అన్నారు. ఇదంతా నాటకం అన్నారు మీరు. కావచ్చు. కానీ ఈ నాటక క్రీడ–కేవలం బెంగాలీ స్త్రీల చీరెల మీదుగానే జరుగుతుందేం? బెంగాలీ వీర పురుషుల ధోవతుల అంచుల మీదుగా జరగదెందుకనీ? అది కూడా ఆలోచించి చూడ టం యుక్తం..! అని 1913 లోనే స్త్రీల తరపున నిర్ద్వంద్వపు వకాల్తా పుచ్చుకున్నాడు. నోబెల్ బహుమతి పొందిన గీతాంజలి ఆయన రచనలో ఒక చిన్ని పాలు మాత్రమే. టాగోర్ పూర్వీకులలో కొందరు ముస్లిం మతంలోకి మారగా, మిగిలిన వారిని పిరాలి బ్రాహ్మణులంటూ సమాజం వెలివేసింది. ఈ కారణం చేత టాగోర్ కుటుంబం తమకున్న అనేకానేక వ్యాపారాల చేత ఆర్థికంగా సంపన్న వర్గంగా ఉన్నప్పటికీ కులపరంగా చిన్నచూపును అనుభవించారు. వీరి ఇంటి పిల్లలకి సరయిన వివాహ సంబంధాలు రాక కాదంబరి, మృణాళిని వంటి పేదపిల్లలని వివాహమాడారు. అందుకే టాగోర్ తనపై మహమ్మదీయుల, హిందువుల, ఆంగ్లేయుల ప్రభావం ఉందనీ ఒక చోట అన్నాడు. మనుషులందరం ఒక్కటిగానే పుట్టాం దుర్మార్గులు కొందరు హెచ్చు తగ్గులను సృష్టిం చారు అన్న కబీరును టాగోర్ అనువదించడం వెనుక ఈ ప్రభావం కూడా ఉంది. ఈ రోజు ఉదాత్తులనుకునే కొంతమంది కులాలు లేవు మనందరం భారతీయులం అంటుండగా, టాగోర్ ఆ రోజులలోనే నా ప్రాణం ఉండగా నేను మానవీయతకంటే జాతీయత గొప్పది అనే భావనను అంగీకరించను అన్నాడు. ‘ఇంట బయట’లో ఆ విషయాలను చర్చించాడు. ఈ రోజు మనం మాట్లాడుతున్న మారిటల్ రేప్ గురించి అనేక ఏళ్ళ క్రితం ‘కుముదిని’లో చర్చించి, గర్భము, వివాహం, సమాజం స్త్రీ జీవితాన్ని ఎలా సంకెలలో ఉంచేస్తుందో చెప్తాడు. ‘‘నేను గే లాగా జీవించడమనేది, మైనారిటీలో ఉండ టం అంటే ఏమిటన్న అంశంపై నాకు లోతైన అవగాహనను ఇచ్చింది, నిత్యం ఇతర మైనారిటీ బృందాలలోని వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి తోడ్పడింది’’ అన్నాడు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్. బహుశా టాగోర్ పిరాలి బ్రాహ్మణత్వం, మాతృ లేమి, ప్రియబాంధవి కాదంబరి మరణము, సునిశితహృదయం అన్నీ కలిపి సమాజాన్ని కులము, మతము, లింగము, దేశము అనే భావనలకు అతీతంగా చూడటం నేర్పాయేమో. ఏది ఏమయినా టాగోర్, నెహ్రూ చెప్పినట్టు ఒక ‘‘సుప్రీమ్ హ్యూమన్’’. నాటికీ నేటికీ ఆయన మార్గం అనుసరణీయం. రాజులకు మరణం ఉంటుంది, కవులకు కాదు కదా. ఈ గొప్ప సాహిత్యకారుడికి, మానవీయ మూర్తికి, శాంతి నికేతన్ వ్యవస్థాపకునికి అత్యంత ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు! వ్యాసకర్త: సామాన్య కిరణ్ ప్రముఖ రచయిత్రి - 91635 69966 -
ట్రిపుల్ తలాక్ న్యాయాన్యాయాలు
ఆలోచనం ముస్లిం సమాజంలో స్త్రీ పునర్వివాహం, వితంతు వివాహం మొదటి నుంచీ సమ్మతాలు. ప్రవక్త స్వయంగా ఒక వితంతువును వివాహమాడాడు. ఆ కోణంలో చూస్తే ముస్లిములు పది అడుగులు ముందు ఉన్నట్లు లెక్క. ట్రిపుల్ తలాక్‌పై మోదీ, యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీసాయి. ముస్లిములు మూడుసార్లు తలాక్ చెప్పి నిమిషంలో తమ భార్యలకి అన్యాయం చేస్తారని ప్రచా రం ఉంది. దీని గురించి అసలు ఖుర్ఆన్ ఏం చెప్తుందో చూద్దాం. సుర అల్ బఖరహ్లో ప్రవక్తకు దేవుడిలా చెప్పాడు ’’్ర2.226] తమ భార్య వద్దకు పోమని వొట్టేసుకున్న వారికి నాలుగు నెలలవరకు గడువు వుంది. ్ర229]విడాకులు ఇస్తున్నట్లు రెండు సార్లు మాత్రమే ప్రకటించాలి తరువాత నియమానుసారం ఆగాలి. ఒకవేళ అతను ఆమెకు మూడవసారి విడాకులిస్తే ఆ స్త్రీ ఇక అతనికి ధర్మ సమ్మతం కాజాలదు. ్ర231]మీరు స్త్రీలకు విడాకులిచ్చినపుడు, వారు తమ గడువును్రఇద్దత్] చేరుకుంటూ ఉండగా, వారిని ఉత్తమ రీతిలో ఆపుకోండి లేదా ఉత్తమ రీతిలో సెలవు ఇప్పించండి. వేధించే ఉద్దేశంతో ఆపి ఉంచుకుని వారిపై దాష్టీకానికి ఒడి కట్టకండి’’ అంటుంది. అంతే కాదు విడాకుల అనంతరం స్త్రీల పోషణ నిమిత్తమై ఇవ్వాల్సిన పైకాన్ని కూడా సూచించింది. అయితే సున్నీ ముస్లిముల విధి విధానాలు ఈ విషయంలో ఖుర్ఆన్కు కొంత భిన్నంగా వున్నాయి. వీరు ’’బిదత్ తలాక్ ’’్రట్రిపుల్ తలాక్]ను అనుసరిస్తారు. బిదత్ అంటేనే అపసవ్యం అని అర్థం. ఈ తలాక్‌కు తిరుగు లేదు కనుక దీనిని ’’బియన్ తలాక్’’ (తిరుగులేని తలాక్) అంటారు. ప్రవక్త దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఐతే ’’భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్’’ [BMMA ] షరియత్‌కు 2014లో వచ్చిన 217 తలాక్ కేసులలో 22 మాత్రమే ట్రిపుల్ తలాక్‌కి సంబంధించినవి. ముస్లిం మతం స్త్రీపురుషులు తమకు ఇష్టం లేకున్నా వివాహంలో మగ్గిపోవాలని చెప్పదు, వారికి వివాహం స్త్రీ పురుషులు కలసి జీవించడానికి చేసుకునే ఒప్పందం. నిఖా అనే అరబ్ పదానికి సంపర్కం అనే అర్థం వుంది. అందుకే ఇష్టంలేనపుడు ఈ కాంట్రాక్ట్ నుంచి బయటకు రావడానికి అల్లాహ్ సులభమయిన తలాక్ మార్గాన్ని చెప్తూనే, దానిని ఎలా వాడాలో చెప్పి ఉంచాడు. దైవభీతి అనన్యంగా కలిగిన ముస్లిములు దానిని అంతే జాగ్రత్తగా వాడుతారు అనడానికి నిదర్శనం ముస్లింలలో విడాకుల రేటు తక్కువగా ఉండటం. ఒక సర్వే ప్రకారం ఇండియాలో 0.56% ముస్లిములు విడాకులు తీసుకుంటూ ఉండగా 0.76% హిందువులు విడాకులు తీసుకుంటూ ఉన్నారు. అట్లాగే ఖుర్ఆన్ స్త్రీలకు కూడా విడాకుల హక్కును కల్పించింది. దీనిని ’’ఖులా’’ అంటారు. భర్త సహకరించకున్నా షరియత్ అతని అనుమతితో సంబంధం లేకుండానే ఆ స్త్రీకి విడాకులు మంజూరు చేయవచ్చు. ఆMMఅ ప్రకారం విడాకులు కోసం వస్తున్న వాళ్లలో సగం మంది మహిళలే. ముస్లిం సమాజంలో స్త్రీ పునర్వివాహం, వితంతు వివాహం మొదటి నుంచీ సమ్మతాలు. ప్రవక్త స్వయంగా ఒక వితంతువును వివాహమాడాడు. ఆ కోణంలో చూస్తే ముస్లిములు పది అడుగులు ముందు ఉన్నట్లు లెక్క. అయితే దీని అర్థం ముస్లిం సమాజం స్త్రీలను చాలా గౌరవిస్తుందని కాదు. తస్లిమా నజ్రీన్ మాటల్లో చెప్పాలంటే '' religion is against women' s rights and women' s freedom. in all societies women are oppressed by all religions'' హిందూ సమాజంలో సతీసహగమనం, వైధవ్యం, స్త్రీ చదువు భర్తకు ఆయుక్షీణం వంటి మూఢత్వాలు, మొన్నమొన్నటి వరకు ఉండగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇవ్వడానికి అంగీకరించకుండా ’’నస్త్రీ స్వాతంత్య్రమర్హతి’’ అనే మనుధర్మాన్ని భారతీయ పురుషులు నేటికీ పరోక్షంగా ఆచరిస్తూనే వున్నారు. అయితే ఈ మౌఢ్యం నుంచి స్త్రీలను రక్షించేందుకు ఆ మతం నుంచే రాజారామ్మోహన్రాయ్ వంటి వారు పుట్టుకొచ్చి సంస్కరణలు జరిపారు తప్ప ఆంగ్లేయులు సంస్కరించలేదు. అలాగే ముస్లింల నుంచి తస్లిమా, అయాన్ హిర్శి అలీ, మలాలా, ఇబ్న్ వారక్, రష్దీలు పుట్టుకొస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఆ సమాజ సంస్కరణకు కృషి చేస్తున్నారు. మోదీ మరియు బీజేపీ నాయకత్వం ముస్లిం మహిళలకు సామాజిక న్యాయం పేరిట, 4 కోట్లమంది ముస్లింలు సంతకాలు పెట్టి వ్యతిరేకిస్తున్న వారి విశ్వాసాలలో ప్రత్యక్షంగా కలగజేసుకోకుండా, సచార్ కమిటీ ‘‘ఈ దేశంలో ముస్లిముల స్థితిగతులు షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ జాతులు వారికంటే ఘోరంగా ఉన్నాయ’’ని పేర్కొన్నది కదా. మరి ఆ సామాజిక ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరిచే దిశగా అడుగులు వేయాలి. కేసీఆర్ లాంటి వారు అమలు చేయాలనుకుంటున్న ముస్లిం రిజర్వేషన్‌కు సహకరించాలి. ముస్లిం సమాజం కూడా కొంత నిలదొక్కుకుంటే వారి మౌఢ్యాలను వారే ప్రశ్నించుకుంటారు. ఇదిగో నిదర్శనం చూడండి, తెలుగు ముస్లిం కవి ఖాజా తల్లి గురించి ఎలా విలపిస్తున్నారో.. ’’అమ్మ మెళ్ళో వేలాడే షరియత్ గుది బండ/ఏనాడూ అమ్మని తలెత్తి కానీ /కనీసం కళ్ళెత్తి కానీ ఈ లోకాన్ని చూడనివ్వలేదు/ఆ నాలుగు బియ్యపు గింజలు నెత్తి మీంచి దులిపింది మొదలు /నువ్వు పెనం మీద కాలే రోటీవై /పిల్లలు కనే యంత్రానివై /నవాబ్ సాబ్ నాడాబూటు కింద నలిగిన మల్లెపువ్వయినందుకు/మనసంతా నిప్పుల్లో పడ్డ రబ్బరు బంతిలా కమురుకుపోతుందమ్మా’’! వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి సామాన్య కిరణ్ 91635 69966 -
దబాయించేవాళ్లదే రాజ్యం
ఆరు సారా కథల్లోని ‘‘పుణ్యం’’ క«థలో కథకుడు అంటాడు ‘‘మనుష్యుల్లో రెండు కళ్ళూ, రెండు చెవులూ ఉన్నట్టు మంచీ చెడ్డా అంటూ రెండు లేవు. అంతే కాదు లోకంలో పాప పుణ్యాలు లేవు. లాభనష్టాలే ఉన్నాయి’’ అని. ఆలోచనం ‘‘పీడరుబాబు సెప్తున్నాయిను! నువ్వే కాదు, ఈ బాబే కాదు, ఏ మనిషి మంచోడని ఒవురు జెప్పినా నాను నమ్మను, ఈ నోకంల డబ్బూ యాపారం తప్ప మరేటినేదు. పశువులు నోరులేని సొమ్ములు – ఆటికి నీతుంది కానీ మనకినేదు. సదువు లేన్దాన్ని నాకూనేదు; సదువుకున్నోడివి నీకూనేదు. డబ్బుకోసరం నోకం నోకవంతా పడుచుకొంటోంది. డబ్బుకి నాను సారా అమ్ముతున్నాను. డబ్బుకి, సదివిన సదువంతా నువ్వమ్ముతున్నావు. డబ్బుకి పోలీసోళ్ళు నాయేన్నమ్ముతున్నారు. మందుకోసరం పెద్దాసుపత్రికెళ్తే అక్కడ మందులమ్ముతున్నారు, మంచాలమ్ముతున్నారు. లం... రోడ్లంట, రిచ్చాలంట, కార్లంట తిరిగి ఒళ్ళమ్ముకుంటున్నారు. గుళ్ళోకెళ్లి, కొబ్బరికాయ సెక్కా కాన్డబ్బూ ఇస్తే, ఆ దేవుడిదయే అమ్ముతున్నారు. వోట్లొస్తే అమ్మకం! అమ్మకం! అమ్మకం తప్ప మరేటినేదీ లోకంలో. నాను సదువుకోనేదుగానీ, చూసిన సత్తెమ్ మాత్తరం అది. తప్పయితే తప్పని చూపించి సెప్పు! ఇంటాను’’ అంటుంది, రావి శాస్త్రి గారి ఆరు సారా కథల్లో ఒకటయిన ‘మాయ’ క«థలో ముత్తేలమ్మ. ‘సత్యహరిశ్చంద్ర మహారాజ్ కేరాఫ్ అడ్రస్ ఎవరంటే’ చంద్రబాబు నాయుడంటాడు. నీతి, నిజాయితీ మాట్లాడమంటే సత్యహరిశ్చంద్రుడు మా ఇంట్లో పుట్టినట్టే మాట్లాడుతాడు. నేను జాయినయినప్పుడు అనరాని మాటలన్నావ్. చాలెంజ్ చేస్తున్న, ఆ నలుగుర్ని రిజైన్ చేయించు, నేనూ రిజైన్ చేస్తా. నీతినిజాయితీ అనే పదాలు మీకు సూట్ కావండీ. మీరు మాట్లాడేప్పుడు ఆ పదాలు లేకుండా జాగ్రత్తగా మాట్లాడండి’’ ఫిరాయింపు శాసన సభ్యులు నలుగురికి మంత్రిపదవులు ఇచ్చిన చంద్రబాబుని తలసాని శ్రీనివాస యాదవ్ అన్న మాటలు ఇవి. సరిగ్గా ఈ మాటలు విన్నాక నా మెదడులో ముత్తేలమ్మ చెప్పిన పై మాటలు తటిల్లని మెరిసాయి. అరెరే ఎంత బాగా చెప్పిందీ ముత్తేలమ్మ అనిచెప్పి చాలా ఆశ్చర్యం వేసేసింది. అక్కడనే కాదు ఈ మధ్య కాలంలో. వరల్డ్ బ్యాంకు వారు తమ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాఠంలో అవినీతిలో ‘నేపొటిసం’ అనబడే బంధుప్రీతి కూడా భాగమని నొక్కి చెప్తున్నప్పుడు కూడా, ఎవరో అంతవరకు మూసి వున్న తలుపుని గబుక్కున తెరిచినట్లు రావిశాస్త్రి గారు జ్ఞాపకం వచ్చారు. మీరే చూడండి, అవతలి పార్టీ ఎమ్మెల్యేలను అధికారపార్టీ హోదాలో కేసులు పెట్టి బెదిరించీ, కాంట్రాక్టులు, మంత్రి పదవులు ఎరచూపించి కొనుగోలు చేయడం అవినీతి కాదా?. నారా లోకేశ్, కేవలం ముఖ్యమంత్రి కొడుకు అనే కారణం చేత చకచకా చదరంగంలో పది నిచ్చెనలు ఎక్కేసి ఎమ్మెల్సీ, ఆపై మంత్రి అయిపోయి పదవులిచ్చే ఫలాలను పొందడం చంద్రబాబు చేస్తున్న అవినీతిలో భాగం కాదా, అవినీతి అంటే డబ్బు రూపంలో తీసుకునేది, చేతులు మారేదేనా? కాదు! కానీ, మన అర్బన్ ఆర్మ్ చెయిర్డ్ మేధావులు ‘కో’ అన్న అక్షరం ఉంటేనే అది అవినీతి అని భావిస్తారు. ఇదిగో ఈ ఆలోచన స్ఫురణకు వచ్చినప్పుడు రావిశాస్త్రి కష్టార్జితం క«థలో ఒక ముసలాయన ‘‘మనలాంటి వాళ్ళం కడుపు కక్కుర్తికి నిన్నూ నిన్నూ బక్కిరి బక్కిరి పాతికరాళ్ళు సంపాదిస్తే, గెద్దలన్నీ చేరి పిచికల మీద ఆరోపణలూ, వాటి గురించి విచారణలూ, ఆపైన శిక్షలూనూ. దేశం, ప్రభుత్వం, పాలనా అలా వున్నాయి బాబూ!’’ అన్న మాటలు మనసులో మెదిలాయి. పార్టీ అనే వ్యవస్థకు మన దగ్గర చాలా విలువ వుంది. అభ్యర్థులు, వ్యక్తులుగా వారి వారి నియోజక వర్గాలలో పలుకుబడి కలిగిన వారయినా అనేక కారణాల చేత ఒక పార్టీ అనే గొడుగు క్రిందకు చేరి, అధినాయకుని ముఖాన్ని పెట్టుబడిగా పెట్టుకుని ఎన్నికల్లో విజయాలను సాధిస్తారు. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరూ, పోయిన ఎన్నికల్లో, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ఇల్లు పొల్లూ లేక రోజుకు నలభై ఎనిమిది గంటలపాటు పడిన కష్టాన్ని సొమ్ము చేసుకున్న వాళ్ళే. కరుడుగట్టిన స్పీకర్లు, చూసీ చూడనట్లు వుండే న్యాయస్థానాల సంగతి పక్కన పెట్టేద్దాం, నైతికత అనే మాటకు విలువలేదా అని ఉదారవర్గం వాపోతున్నప్పుడు నాకు ఆరు సారా క«థల్లో ‘పుణ్యం’ కథ గుర్తొచ్చింది. అందులో క«థకుడు అంటాడు ‘‘మను ష్యుల్లో రెండు కళ్ళూ, రెండు చెవులూ ఉన్నట్టు మంచీ చెడ్డా అంటూ రెండు లేవు. అంతే కాదు లోకంలో పాప పుణ్యాలు లేవు. లాభనష్టాలే ఉన్నాయి’’ అని. రాజీనామాలు చేయని 21 మంది ఎమ్యెల్యేలు, అందులో మళ్ళీ నలుగురు మంత్రులతో అధికారికంగా తన ప్రభుత్వంలో ప్రతిపక్షాన్ని భాగం చేసుకున్న చంద్రబాబు నాయుడిని చూసినప్పుడు నాకు ఆరో సారా కథలో ‘‘గవర్మెంటు, పిచ్చాసుపత్రి!! ఓహోహో! మర్చేపోయాను. గవర్మెంటుకి, పాపం, పిచ్చెక్కింది కదూ? ఎలా ఉందొ ఏమిటో? పదండి చూద్దాం’’ అన్న మేస్ట్రీటు గుర్తొచ్చాడు. అంతే కాదు ఏ పని చేసినా, చేస్తున్నది పరమ తప్పయినా, దబాయించి మాట్లాడే ముఖ్యమంత్రిని చూస్తున్నప్పుడు, అతను నాకు రావిశాస్త్రి గారి ‘‘రాకెట్ అప్పారావు’’ని గుర్తుకు తెస్తాడని చెప్పకుండా ఈ వ్యాసాన్ని ముగిస్తే అది తీరని లోటు. ఇంతకీ రాకెట్ అప్పారావేమంటాడంటే ‘‘నోకంలో ఎవరు ఈ రోజుల్లో బావుపడాలన్నా డబ్బుండాలి! మాయుండాల! డబాయింపు సెక్సనుండాలి! బోధపడిందా! ’’ అని. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 సామాన్య కిరణ్ -
‘వన్ ఇండియా’ అంటే ఇదా?
ఆలోచనం గోవధ నిషేధం వంటి నిరంకుశ చట్టాలతో సామాన్య ప్రజల వృత్తులపై వేటు వేసి వాటిపై ఆధారపడి బతుకుతున్న వారి జీవితాలను అల్లకల్లోలం చేయడం ‘వన్ ఎకనామిక్ ఇండియా’ కిందికే వస్తుందా? ‘‘ఎక్కడ మనసు నిర్భ యంగా ఉంటుందో /ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగు తారో / ఎక్కడ జ్ఞానం విరి విగా వెలుస్తుందో /ఎక్కడ ప్రపంచం దేశమనే ఇరుకు గోడల మధ్య ముక్కలవ కుండా ఉంటుందో...’’ ఇవి టాగూర్ ప్రఖ్యాతిగాంచిన ‘వేర్ ది మైండ్ ఈస్ వితౌట్ ఫియర్’ కవితలోని మొదటి నాలుగు పంక్తులు. గొప్ప కవిత్వం ప్రధాన లక్షణం ఏమిటంటే, ‘ఎవరి తాహతును బట్టి వారికి ఏదో కొంత అను భూతిని అందించగలగడం’ అంటారు చలం గీతాంజ లికి రాసిన ముందుమాటలో. భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ఈ ఏడాది వెలువరించిన ‘ఎకనామిక్ సర్వే’లో జీఎస్టీకి "One Economic India: For goods and in the Eyes of the Constitution" పేరుతో ఒక అధ్యాయాన్ని కేటాయిం చారు. దీనిని ‘ఎక్కడ ప్రపంచం దేశమనే ఇరుకు గోడల మధ్య ముక్కలవకుండా ఉంటుందో..’ అంటూ ఉదా త్తంగా ప్రారంభించారు. ఈ అధ్యాయం చదువుతున్న పుడు నాకు గొప్ప కవిత గురించి చలం రాసిన పంక్తులు పదే పదే మనసులో కదలాడాయి. చలం పేర్కొన్న తాహతు అనే పదం కొత్త వెలుగులో కనిపించింది. జీఎస్టీ బిల్లును పన్నుల సంస్కరణగా పేర్కొంటూ ‘వన్ ఇండియా, వన్ ట్యాక్స్’ అనీ, ‘వన్ ఎకనామిక్ ఇండియా’ అనీ గొప్ప ఉత్సాహంతో బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. వారు చెప్తున్న ప్రకారం పరోక్ష పన్ను లకు సంబంధించిన జీఎస్టీ ఇంతవరకు ఉన్న అంచెల పన్ను విధానాన్ని రద్దు చేయబోతోంది, జీఎస్టీ వలన జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుంది, ద్రవ్యోల్బణం తగ్గు తుంది. వ్యాపారుల మీద అధికారుల నియంత్రణను అదుపు చేస్తుంది. కానీ దీనివలన పేదవాడికి ఎంత ఒరుగుతుందనేది ఎవరూ నొక్కి వక్కాణించడం లేదు. ఈ జీఎస్టీ అనే పరోక్ష పన్ను ఒక తిరోగామి పన్ను. జైట్లీ చెప్పిన ప్రకారం బెంజి కారుకు, హవాయి చెప్పు లకు వేర్వేరు జీఎస్టీ రేట్లు ఉండొచ్చు కానీ, హవాయి చెప్పులు అంబానీ కొన్నా, రైతు కూలీ అచ్చెమ్మ కొన్నా ఇద్దరూ దానిపై ఉన్న పన్నును ఒకే రకంగా కట్టాల్సి వస్తుంది. పరోక్ష పన్నుకి రైతుకూలీ అచ్చెమ్మ పేదరాలు అనే ఇంగితం ఉండదు. మన దేశం ట్యాక్స్ జీడీపీ రేషియో 16.6% మాత్రమే. ప్రపంచ దేశాలతో పోల్చి చూసుకుంటే ఇది చాలాతక్కువ. ఇప్పుడు ప్రభుత్వం జీఎస్టీ ద్వారా పన్నుల జీడీపీని పెంచుతానని అంటుంది. జేఎన్‌యూ అధ్యాపకుడు సురజిత్ దాస్ ప్రకారం ‘జీఎస్టీ ద్వారా ట్యాక్స్ జీడీపీ పెంచాలనుకునే ప్రయత్నం.. ఇప్పటికే lతీవ్ర ఆర్థిక అసమతౌల్యాలను ఎదుర్కొంటున్న భారత దేశంలో మరిన్ని ఆర్థిక అస మానతలకు తావియ్యడానికి కారణమవుతుంది’. ఒక పన్ను సంస్కరణ సందర్భానికి కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన నినాదాన్ని ఇచ్చింది. ఏమని? వన్ ఇండియా, వన్ ఎకనామిక్ ఇండియా అని. కానీ ఈ దేశం ఏ రోజైనా ’వన్ ఎకనామిక్ ఇండియా’గా ఉందా? భూసంస్కరణలు, ఆర్థిక అస మానతలు తగ్గించడం వంటి అసలు విషయాల జోలికి వెళ్లకుండా ‘వన్ ఎకనామిక్ ఇండియా’ని వ్యాపారం అనే పరిమిత అర్థంలో చూసినా ఇక్కడ ఒక్క ఘనత వహించిన స్త్రీ వ్యాపారవేత్త లేదు, ముస్లింలో, అణచి వేతకు గురైన వర్గాలవారో వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం లేదు. బీజేపీతో సహా ఏ పార్టీ ఆ అసమా నతలను పోగొట్టే దిశగా ప్రయత్నించడం లేదు. పైగా ఈ దేశంలో మత, కులపరంగా పారంపర్యమవుతున్న కొన్ని వ్యాపారాలను బీజేపీ దెబ్బతీస్తోంది. వారి చిన్న చిన్న వ్యాపారాలను దెబ్బకొడుతూ ‘వన్ ఎకనామిక్ ఇండియా’లో వారు భాగస్వామ్యం కాకుండా చేస్తోంది. గోవధ నిషేధం పేరుతో చేస్తున్న చట్టాలు, మాంసం ఎగుమతిపై విధిస్తున్న నిషేధాలు ఈ నిరంకుశత్వంలో భాగమే. ఒక్క యూపీలోనే మాంసం ఎగుమతిని నిషే ధించడం వలన ఆ రాష్ట్రానికి సాలుకు రూ. 11,350 కోట్లు నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కలకత్తా లెదర్ ఎక్స్‌పోర్టర్ జియా నఫీస్ మాటలలోనే చెప్పా లంటే ‘ఇక్కడి తోళ్ల పరిశ్రమ విలువ ప్రస్తుతం 12 బిలి యన్లు, అది 24 బిలియన్ల దిశగా నడుస్తున్నపుడు సప్లై రావటం ఆగిపోతే మేక్ ఇన్ ఇండియా ఎలా సాధ్యం’? అదే విధంగా ఘనత వహించిన కొల్హాపూర్ చెప్పుల పరిశ్రమ తోళ్ల లోటుతో వెలవెలపోతూ ఉంది. అట్లా వారి వారి వృత్తులపై వేటు వేసి దానిపై ఆధార పడి జీవిస్తున్న వారి జీవితాలను అల్లకల్లోలం చేయడం వన్ ఎకనామిక్ ఇండియా కిందికే వస్తుందా? అసలైన అస మానత ఏమిటంటే, అసమంగా ఉన్న విషయాలను సమం చేయడానికి ప్రయత్నించడమే అంటాడు అరిస్టా టిల్. బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఒకవైపు తమ కున్న అనేకానేక ‘‘మెంటల్ రిజర్వేషన్స్’’ను దేశంపైన రుద్దుతూ, మరోవైపు అడ్డుగోడలు తొలగిపోయి దేశ మంతా ఒక్కటి కావాలని కవిత్వాలు ఉటంకించడం, స్లోగన్లు ఇవ్వడం అతి పెద్ద విరోధాభాస. వీటన్నిటిని చూశాక నా తాహతు బట్టి టాగోర్ కవి తను నేను అర్థం చేసుకున్న దానిని బట్టి అందులోంచి తీసుకున్న కొన్ని లైన్లతో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. ‘‘ఎక్కడయితే నిర్జీవమయిన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గా నికి తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు’’. సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి 91635 69966 -
నిజమైన విలన్లు హీరోలే..!
ఆలోచనం సమస్యని, సంక్షోభాన్ని ఎత్తి చూపడానికే రాజకీయాలలోకి వస్తున్నానంటున్న పవన్‌కల్యాణ్‌కి, మద్యపానం సంక్షోభంలా కనిపించకపోతే ఎలా? పౌరసమాజం శక్తివంతంగా ఉండాలంటే తను పాటలో పాడినట్లు అందరూ తాగాల్సిందేనా? రాజులయినా, బంటులయినా, కూలీలయినా, యాపారులయినా చీకటయితే చుక్కకోసం జివ్వు జివ్వు ఆగునా. కల్లయినా, సారాయయినా, ఇంగిలీషు మందయినా, కల్తీ సరుక యినా తాగకుంటే జివ్వు జివ్వు లోన , తాగితేనే తందానా నాన. రంగు రంగులా మందెయిరా, మత్తెక్కి చిందెయ్ రా, వెయ్యేనుగులా బలమొస్తదిరా. నటుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా, ‘కాటమరాయుడు’లో పాట అది. ‘రాజకీయాలలోకి దిగి, అందులో ఉన్న మురికిని కడిగి పారబోసి, చక్కని సమతౌల్యం ఉన్న, శక్తివంత మయిన పౌరసమాజాన్ని నిర్మించాలి’’ అని 19 మార్చిన ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఘనమయిన ఆకాంక్షను వ్యక్తపరచాడు పవన్. పౌరస మాజం ఆయన ఆశించినట్లు ‘వెయ్యేనుగుల బలం’తో శక్తివంతంగా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళూ తాగాల్సిందే నని, ఆయన తాగుతూ, చిందేస్తూ కాటమరాయుడులో భలే బోధించారు. రోగి కోరేది అదే వైద్యుడు చెప్పిందీ అదే కనుక ఆయన అభిమానులు థియేటర్లో ఆ పాటకి ఈలలతో అలాగే అలాగే అని వంత పాడారు. రేజర్ల స్వాతి, వెంకట్ కిరణ్, తోట గోపి వీళ్ళం దరూ ఆంధ్రలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువు కుంటున్న దిగువ మధ్యతరగతి పిల్లలు. మద్యపాన వ్యసనం మీద అవగాహన తరగతులు నిర్వహించడా నికి మేము ఆయా పాఠశాలలకి వెళ్ళినపుడు ఆ బిడ్డలు తమ తండ్రుల వ్యసనం గురించి చెప్తూ గుండెలు పగి లేట్టు ఏడ్చి, ఎక్కిళ్ళు పెట్టారు. వీరిలో తోట గోపీ తండ్రి తనను తాగవద్దని వారించిన భార్యను కిరోసిన్ పోసి తగలపెట్టి చంపేశాడు. కోర్టు పద్నాలుగేళ్ళ జైలు శిక్ష వేసింది. గోపీ అనాథై పర పంచలు పాకుతున్నాడు. తెలంగాణలో ఒక గ్రామం. మా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున విధవలకు చీరలు పంచుదాం అనుకున్నాం. ఆ వూరిలో లెక్కకు మిక్కిలి వున్న విధవల సంఖ్య నన్ను ఆశ్చర్యపరచింది. అందులో 75%మంది 30 లోపు అమ్మాయిలు. వాళ్ళ భర్తల్ని, పవన్ చెప్పారు కదా కల్లయినా, కల్తీ సరుకయినా పర్లేదని, ఆ.. సరుకే మింగేసింది. 26 ఏళ్ళ విధవ శమంత ఇద్దరు బిడ్డల తల్లి, ‘ఈ చీర రంగు నచ్చలేదు, మార్చుకోవచ్చా’ అని అడిగింది నన్ను. జీవితం పట్ల ఆ అమ్మాయికున్న మక్కువను చూసి దుక్కమొచ్చి, ఆమె తల్లిని, ‘చిన్న పిల్ల కదా శమంతకు మళ్ళీ పెళ్లి చేయకూడదా’ అంటే, ‘ఇద్దరు బిడ్డల తల్లి కదమ్మా, ఎవరూ ఇష్టపడటం లేదు’ అన్నది నిర్లిప్తంగా. తాగమని ఎగురుతూ బోధించిన పవన్, గోపీకి తల్లిదండ్రుల్ని, శమంతకు భర్తని తెచ్చిచ్చి తిరిగి వారి జీవితాలలో ఆనందాన్ని నింపగలడా? నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కొత్త డేటా ప్రకారం దేశంలో 96 నిమిషాలకు ఒక్కరు చొప్పున రోజుకు 15 మంది మద్యం వ్యసనం వల్ల చనిపోతున్నారు. oecd రిపోర్ట్ ప్రకారం మద్యం వల్ల ఆరోగ్యాన్ని నష్టపోతున్న దేశాలలో ఇండియా 3వ స్థానంలో ఉంది. ఆరోగ్యం సంగతి వదిలేస్తే భారతదేశపు దారిద్య్రానికి అతి ముఖ్య కారణం మద్యపాన వ్యసనం అని who పేర్కొంది. మద్యపానం గృహ హింసకూ మొదటి కారణమట. ఈ హెచ్చుతగ్గుల సమాజంలో అభివృద్ధి లేని తమ జీవితపు విసుగునుంచి బయటపడటానికి, పేదలు ఏ బెల్టు షాపులోనో చేరి దుక్కాన్ని దించుకోవాలనుకుని జీవితాలను బలిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం వారిని మత్తులో ముంచి వారి రెక్కల కష్టాన్ని దుర్మార్గంగా దోచుకుంటుంది. ‘సమస్యని, సంక్షోభాన్ని ఎత్తి చూప డానికే రాజకీయాలలోకి’ వస్తున్నానంటున్న పవన్‌కి, మద్యపానం సంక్షోభంలా కనిపించకపోతే ఎలా? అధి కారంలో ఉండటం అంటే ఒక్క రాజకీయాధికారమే కాదు. సాంస్కృతిక రంగంలో అధికార స్థానంలో ఉన్న పవన్ కావాలనుకుంటే ఈ పాటని వద్దని చెప్పగలిగే వారే, కానీ ఆయన అలా అనుకోలేదు. ఈ సినిమాలోనే ఇంకో పాట ఉంది ‘మిర్రా మిర్రా మీసం, మెలి తిప్పుతాడు జనం కోసం’ అని. తాగమని పవన్ చెప్పక్కర్లేదు. చెప్పకున్నా తాగుతారు. తనవంతుగా మద్యపాన నిర్మూలనకు కృషి చేసి తన అభిమానుల చేతయినా తాగుడు మానిపించే చాలెంజ్ తీసు కుంటే, అప్పుడు మిర్రామిర్రా మీసం భలే మెలి తిప్పాడు పవన్ జనం కోసం అని అందరం సంతోషంగా పాడుకుంటాం. అసలు ముక్కుకింద ఉన్న ఆ నాలుగు వెంట్రుకలకు మగతనమనే మిత్‌ను ఆపాదించక తప్పకపోతే, పవన్‌కి ఎవరయినా తప్పక ఇలా చెప్పాలి, ‘మిర్రా మిర్రా మీసమే మెలితిప్పాల్సొస్తే, హైకోర్టు కుదరదన్నా సుప్రీంకోర్టుకు వెళ్లి మద్యపాన నిషేధాన్ని సాధించుకొచ్చాడే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ‘మగాడంటే ఆడ్రా బుజ్జీ’ అతను తిప్పాలి మీసం, తాగమని చెప్పే నువ్వు కాదు‘ అని. సామాజిక స్పృహ కొంచెం కూడా లేకుండా, ‘వీడో నేలబారు నడిచే నిండయిన ఆకాశం’ అని తెగ బారెడు పాటలు రాయించుకుని, మహా లావు మాటలు మాట్లాడే ఈ హీరో తరహాని చూస్తుంటే ‘మిత్ర’ రాయగా, విమలక్క ఉద్వేగంగా, ఉద్రిక్తంగా, మహా గొప్పగా పాడిన ఒక పాటలోని వాక్యం గుర్తొస్తుంది ‘నిజమయిన విలనోళ్లు హీరోలురా–అభిమానసంఘాల జోరాయెరా ..! - సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 -
యోగికి పట్టం కట్టిన వ్యూహం
ఆలోచనం బీజేపీతో యుద్ధానికి దిగిన పార్టీలు... ఇది లౌకిక భారతం అని నమ్మి వచ్చి తమ కొమ్ముకాసిన వారి కోసం శత్రుత్వాలను, కుమ్ములాటలనూ మరచి బిహార్ తరహా సయోధ్య వ్యూహాన్ని ఎందుకు అనుసరించలేకపోయాయి? నోట్ల రద్దుతో అట్టుడికిన భారతదేశం ఉత్తర ప్రదేశ్ ఎన్ని కల ఫలితాల దిశగా ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ యుద్ధం లో మోదీ శత్రు కూటమిలో ఎస్పీ, బీఎస్పీ , కాంగ్రెస్‌లు మాత్రమే కాదు భారతదేశం లౌకిక రాజ్యం అని నమ్మే ప్రజాస్వామిక ప్రియులు గోద్రా మారణ హోమం గురించి తెలిసిన అధ్యయనకారులూ పరో క్షంగా మోహరించారు. కానీ వీరి ఆశలపై నీళ్లు చల్లుతూ ‘‘అబ్ కి బార్–300 పార్ ’’ అని యుద్ధ నినాదం చేసిన బీజేపీ అవలీలగా ఆ సంఖ్యని దాటేసి ఉత్తరప్రదేశ్‌పై హిందుత్వ జెండాని రెపరెప లాడించింది. 20% వరకూ ముస్లింలు ఉన్న రాష్ట్రంలో ఒక్క ముస్లింకి కూడా టిక్కెట్ ఇవ్వకుండా విజయాన్ని కైవ సం చేసుకోవడమే కాక యోగి ఆదిత్యనాథ్‌ని ముఖ్య మంత్రిగా ప్రతిష్టించి బీజేపీ దేశానికి ఏం సందేశాన్ని ఇచ్చిందో తప్పకుండా పరిశీలించాల్సి వుంది. ఎన్నికల ప్రచారంలో ముస్లింల ఖబరస్తాన్, దీపా వళి, రంజాన్ వంటి అంశాలను ప్రస్తావించిన బీజేపీ అక్కడితో ఆగి ఉంటే అది గెలుపు ఎత్తుగడకు పన్నిన మత చీలిక వ్యూహం మాత్రమే అయి ఉండేది. కానీ ఆదిత్య నాథ్ ఎంపిక ఆ ప్రచారపు అంతిమ లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తుంది. ఆదిత్యనాథ్ తూర్పు ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఘోరక్‌నాథ్ మఠ వారసుడు. ఈ మఠానికి చెందిన యోగులు ధార్మికతను ప్రచారం చేస్తూ, యోగా భ్యాసంలో మునిగి లోకాన్ని మరచిన మునులు కాదు. ఈ మఠానికి చెందిన మహంత్ దిగ్విజయ్నాథ్, గాంధీజీ అహింసావాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాక, గాంధీజీ హత్యకు ఆజ్యం పోసిన వాళ్లలో ఒకడిగా పేర్కొనబడి 9 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. 1949 రామ జన్మ భూమి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఇతని వారసుడు మహంత్ అవైద్యనాథ్, బీజేపీ రామ జన్మభూమి ఉద్యమాన్ని తన భుజస్కం ధాల మీదకి ఎత్తుకున్నాక, అంతవరకు ఇండిపెండెంట్ ఎమ్ఎల్ఏగా గెలుస్తూ వచ్చినవాడు బీజేపీలో చేరి ఎంపీ అయ్యాడు. వారి వారసుడు యోగి ఆదిత్యనాథ్ ‘‘లవ్ జిహాద్ ’’ ప్రకటించడం, ఘర్‌వాపసీ పేరిట బల వంత మత మార్పిడులు చేయించడం, మత విద్వే షాన్ని రెచ్చకొట్టే వ్యాఖ్యానాలు చేయడం ద్వారా తను ఆ తానులో ముక్కనేనని, బీజేపీ కిరీటానికి కలికి తురాయి కాదగ్గ వాడినని అవకాశం వచ్చిన ప్రతిసారి సంఘ్ పరివార్‌కి నిరూపించడానికి తాపత్రయపడుతూ వచ్చిన హిందుత్వవాది. పారంపర్యం, కులం వంటివి తమ నాయకుల ఎంపికకు ప్రామాణికాలు ఎంత మాత్రమూ కావని బీజేపీ తేల్చి చెబుతూనే మరోవైపున తమ ప్రాధాన్యత ఏమిటో, తన గమన, గమ్యాలు ఏమిటో ఆదిత్యనాథ్‌ను ముందుకు తెచ్చి తేటతెల్లం చేసేసింది. అంతవరకూ తీసుకుంటే బీజేపీకి తమ సిద్ధాంతం పట్ల ఉన్న స్పష్టత, పటిష్టంగా వేస్తున్న అడుగులు ఘనంగా శ్లాఘించదగి నవి. అయితే బీజేపీ గెలుపు 39% ఓట్ల గెలుపు మాత్రమే. ఆ పార్టీ ‘‘ఫస్ట్ వన్ హూ పాస్డ్ ది పోస్ట్’’. అయితే మరి మిగిలిన పార్టీల పక్షాన నిలిచి బీజేపీ వ్యతిరేక ఓటింగ్ చేసిన ఓటర్ల మాట ఏమిటి? వారి ఆకాంక్షల మాట ఏమిటి? అవి పరిగణనీయం కాదా? అందరూ చెప్తున్నట్లు ఇది మరో ‘‘సునమో’’ ఎందు కవుతుంది? అదలా ఉంచితే బీజేపీతో యుద్ధానికి దిగిన పార్టీలు, తమ శత్రువు, గెలుపుకోసం అధికారాన్ని విని యోగించుకోగల స్థితిలో ఉన్నవాడనీ, ‘‘the rules of fair play do not apply in love and war'’’ అని నమ్మే వాడని ఎందుకు గుర్తించలేకపోయాయి? ఇది లౌకిక భారతం అని నమ్మి వచ్చి తమ కొమ్ముకాసిన వారి కోసం శతృత్వాలను, కుమ్ములాటలనూ మరచి బిహార్ తరహా సయోధ్య వ్యూహాన్ని ఎందుకు అను సరించలేక పోయాయి? లౌకిక దేశంలో 20% ముస్లిం లకు ప్రతినిధి లేకుండా ఒక పార్టీ ఘన విజయం సాధిం చడం ఎటువంటి భవిష్యత్తును దేశానికి వాగ్దానం చేయ బోతున్నది అన్నది ప్రధాన ప్రశ్న. ప్రశ్న అక్కడితో ముగియలేదు. నాయకుల ఎంపి కలో తాము కులాన్నో, పారంపర్యాన్నో పరిగణనలోకి తీసుకోమని చెప్పే బీజేపీ తు.చ. తప్పకుండా ఆ మాట లను ఆచరణలో పెడుతూ వస్తూ ఉంది. ఈ దేశపు మధ్య తరగతి చదువరులకు టీ అమ్ముకునే ఒక సాధా రణ కార్యకర్తను కూడా బీజేపీ గౌరవిస్తుందనే నమ్మ కాన్ని ఇవ్వడమే కాదు, యోగులు కూడా పరిపాలనలో భాగం కావచ్చు అనే సఫల స్వప్నాలను అది నిర్మిస్తూ వస్తూ ఉంటే, మరోవైపు స్వాతంత్రోద్యమ నేపథ్యం నుంచి వచ్చిన కాంగ్రెస్, సమసమాజ స్వప్నాలను ఎరవేసే కమ్యూనిస్టులు నేలలోంచి పుట్టిన నాయకు లను తమ ప్రతినిధులుగా ఎందుకు ముందుకు తేలేక పోతున్నారు? ‘‘ముస్లింలు తమ విశ్వాసాన్ని అనన్యంగా ప్రక టించేంతవరకు వారికి ఓటు హక్కు లేకుండా చెయ్యా లని’’ 1952లో స్టేట్స్‌మెన్ పత్రికకు చెప్పిన దిగ్విజయ్ నాథ్ వారసుడైన ఆదిత్యనాథ్‌ని ముఖ్యమంత్రిని చేసిన బీజేపీకి తన లక్ష్యం ఏమిటో, పం«థా ఏమిటో, పథం ఏమిటో వందకి వెయ్యిశాతమన్నంత స్పష్టమైన అవ గాహన ఉంది కనుక తస్మాత్ జాగ్రత్త. - సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి మొబైల్ : 91635 69966 -
అదనపు సమన్వయకర్తగా సామాన్య కిరణ్
హైదరాబాద్: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా శ్రీమతి సామాన్య కిరణ్‌ను నియమిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం పార్టీ వర్గాలు వెల్లడిచాయి. -
నాకూ బిడ్డను కనాలని ఉంది!
పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు సోమనాథ్ బెనర్జీ. ఇద్దరు ఆడపిల్లల తరువాత పుట్టిన పుత్ర సంతానంగా మురిసిపోయారు తల్లిదండ్రులు. కొంత వయసు రాగానే తానసలు మగవాడినే కాదనీ, పురుష శరీరంలో చిక్కడిపోయిన స్త్రీనని తెలుసుకుని, ఆ శరీరం నుంచి విముక్తి కోసం, స్వాధీనత కోసం, స్వాతంత్రం కోసం పెనుగులాడి, పోరాడి చివరికి సెక్స్ మార్పిడి ఆపరేషన్‌తో సోమనాథ్ బెనర్జీ నుంచి ‘మానవి’గా మారింది. భారత దేశంలోనే మొదటి సారి కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఒక ‘ట్రాన్స్ జెండర్’. శ్రీమతి మానవి బెనర్జీ... కాలేజ్ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు కూడా అనేక మంది మహిళా ప్రిన్సిపల్స్ మనకు తెలుసు. అయితే... మానవి గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడం ఎందుకంటే...మనదేశంలో ఒక ట్రాన్స్‌జెండర్ కాలేజ్ ప్రిన్సిపల్ కావడం ఆమెతోనే మొదలు. మానవి బెంగాల్ లోని నదియ జిల్లా కృష్ణ నగర్ మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత నేను వెళ్లి కలిసాను. బెంగాలీ సాహిత్యంలో పీ.హెచ్ డీ చేసిన ఆమెకు కథకళి, భరత నాట్యాలలో ప్రవేశం వుంది. ఆమె ప్రతి మాటలోనూ రవీంద్ర సంగీతం పెనవేసుకుని వుంటుంది. ‘సాంగ్’ అనే నాటక సమాజాన్ని స్థాపించారామె. హిజ్రాల దుఃఖాలకు నాటక రూపమిచ్చి దర్శకత్వం వహిస్తుంటారు. ‘అమానవ్’ అనే పత్రికకు సంపాదకత్వం వహిస్తూ, ‘అద్వితీయ’ అనే మరో స్త్రీల పత్రికలో ‘లజ్జావతి’ అనే కాలమ్ నిర్వహిస్తున్నారు. ఇవికాక దేశంలోనే మొట్ట మొదటిసారిగా పశ్చిమ బెంగాల్ సర్కార్ స్థాపించిన ‘ట్రాన్స్ జెండర్ డెవలప్మెంట్ బోర్డ్’కు వైస్ చైర్పర్సన్ మానవి. థర్డ్ జెండర్ వ్యక్తులతో మన సమాజం ఎలా వ్యవహరిస్తోంది? అనే ప్రశ్నతోపాటు అనేక సంఘటనలు, దృశ్యాలు మానవిని చూడగానే గుర్తుకు వచ్చాయి. చెదరని చిరునవ్వుతో చక చకా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెను ‘థర్డ్ జెండర్’ గా అనేక ఒత్తిడుల మధ్య పీ.హెచ్డీ ఎలా చేసారు, ఇంత గొప్ప వృత్తిలోకి ఎలా వచ్చారు? తల్లిదండ్రుల సహకారమే కారణమా ?’’అని ప్రశ్నిస్తే అందుకు కూడా ఆమె నవ్వారు. మెల్లగా ప్రసన్నంగా నోరు విప్పారామె. ‘‘భారతీయ సమాజం, కుటుంబ వ్యవస్థలు భిన్నమైన పనిని ఎవరు చేసినా, అది మంచిదయినా సరే మొదట శంకించి, ఆ తర్వాత భయపడి ఆ భిన్నమైన దారిని ఎన్నుకున్న వారి మీద దాడి చేస్తుంది. నా కుటుంబమూ ఇందుకు అతీతం కాదు. నేను ఎన్నిసార్లు ఆత్మాహత్య వరకు వెళ్ళానో చెప్పలేను. అన్నిసార్లూ రవీంద్రుడి సంగీతమే ఆదుకుంది. ఈ ప్రపంచంలో ఏ బంధుత్వాలు లేని ఒంటరిని నేను. అయినా సరే బతికే తీరాలి అనుకున్నాను’’ అన్నారామె. ‘ఇలాటి పుట్టుక నా నిర్ణయం కాదు’ అని మానవి ఒక విలువయిన మాట చెప్పారు. ‘హిజ్రా ఆత్మ కథ’ పేరుతో తన జీవితాన్ని రాసిన రేవతి కూడా అదే భావాన్ని వ్యక్తపరుస్తారు. న్యాయాన్ని పాటించడమే నాగరకత! సుప్రీంకోర్ట్ దీనిని మానవ హక్కులకు సంబంధించిన విషయంగా గుర్తించి హిజ్రాలని థర్డ్ జెండర్‌గా గుర్తించడం భారతీయ సమాజం నాగరికత వైపుచురుకైన అడుగులు వేస్తుందని చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. వారికి ఓబీసీ రిజర్వేషన్‌ను కల్పించ మనడమే కాక వారికి సంబంధించిన ఏ అంశాన్నీ విడువకుండా విపులమైన తీర్పునిచ్చింది. దీని గురించి మాట్లాడుతూ మానవి ‘‘సుప్రీం కోర్టు తీర్పుకి సాల్యూట్ చేస్తున్నాం అలాగే మా సంక్షేమానికి కాక మా అభివృద్దికి దేశంలోనే మొదటి సారి ట్రాన్స్ జెండర్ డెవలప్మెంట్ బోర్డ్ పెట్టిన మమతా బెనర్జీకి కృతజ్ఞతలు’’ అన్నారు. మా సంభాషణ ముగింపులో మానవి ఒక మాట అన్నారు. ‘స్త్రీగా నా గర్భం నుంచి ఒక బిడ్డకి జన్మనివ్వాలి’ అనే బలమైన కోరిక వుంది. కానీ అది ఎప్పటికీ నెరవేరదు కదా. టాగోర్ ‘దుయి బిఘా జమీ...’ కవితలో తనకున్న అరెకరం పొలాన్ని కోల్పోయిన వ్యక్తి... ‘‘భగవంతుడు నన్నీ అరెకరం పొలానికే పరిమితం చేయ్యదలచుకోలేదు. అందుకే నన్ను నా భూమి నుంచి దూరం చేసాడు. మంచిదే ఇప్పుడీ పృథ్వి అంతా నాదే’’ అంటాడు. నా పరిస్థితీ అంతే... కాలేజ్ పిల్లలూ, బయటి పిల్లలూ నా పిల్లలే. సాధ్యాసాధ్యాలు, ఉచితానుచితాలను దాటుకుని వ్యక్తులు ఒక హక్కు కోసం ఉద్యమిస్తున్నారంటే అది తప్పనిసరిగా ఆలోచించదగిందే అది థర్డ్ జెండర్ విషయమైనా మరోటయినా. కదా...? - సామాన్య కిరణ్ -
ప్రజాసేవే సంకల్పం
మదనపల్లెలో పుట్టా, చిత్తూరు బీజెడ్ హైస్కూల్లో చదివా వైఎస్సార్ సీపీతోనే అభివృద్ధి సాధ్యం శివప్రసాద్ చేసిందేమిటో చెప్పాలి వేషాలూ..నాటకాలొద్దు వైఎస్సార్ సీపీ చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి సామాన్య కిరణ్ పెనుమూరు, న్యూస్‌లైన్: ప్రజలకు సేవచేయాలనే సంకల్పంతోనే తాను రాజకీయూల్లోకి వచ్చానని, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు అమలుచేయడమే కాకుండా ఆయన ఆశయాలు నెరవేర్చే సత్తా వైఎస్ జగన్మోహన్రెడ్డికే ఉందని విశ్వసించి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరానని ఆ పార్టీ చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి సామాన్య కిరణ్ అన్నారు. ఆదివారం ఆమె పెనుమూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీతోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాను చిత్తూరు జిల్లావాసినేనని, పుట్టింది మదనపల్లెలో, పదో తరగతి వరకూ చదివింది చిత్తూరు బీజెడ్ హైస్కూల్‌లోనేనని చెప్పారు. తాను స్థానికురాలినికానని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ (టీడీపీ) చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణకు చెం దిన వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆ ప్రాంతీయురాలినని ఎలా అవుతానని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ తెలంగా ణ ఉద్యమంలో పాల్గొనలేదని, సీమాంధ్రకు వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని చెప్పారు. వేషాలు, నాటకాలు వేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న శివప్రసాద్ ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుందని చెప్పారు. ప్రాంతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. 20 రోజుల్లో జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైఎస్సార్ సీపీకే ప్రజలు పట్టం కడతారని చెప్పారు. జననేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రజల కష్టాలు తీర్చే ఐదు సంతకాలు చేస్తారని చెప్పారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి కే నారాయణస్వామి మాట్లాడుతూ టీడీపీని అధికారంలోకి తీసుకొస్తానని నారా చంద్రబాబునాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనను నమ్మి ప్రజలు ఓట్లు వేయడం కలలో కూడా జరగదని చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కారేటి గోవిందరెడ్డి, జంభుగోళం భాస్కర్, మండల అధికార ప్రతినిధి చింతా చెన్నకేశవులు, మండల సేవాదళ్ కన్వీనర్ దూది రవికుమార్, తాటిమాకులపల్లె లక్ష్మీపతి, మొరుం త్యాగరాజులు,పెనుమూరు వార్డు సభ్యులు మణి, గంగయ్య, భూపతినాయుడు, టైలర్ మురగ, ఎలుంగుండ్లపల్లె సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.