ఓటమి గర్భంలో దాగిన విజయం
ఆలోచనం
జగన్ కూడా ‘ఐనను పోయిరావలె హస్తినకు’ అంటూ నంద్యాలకి వెళ్లి ‘ఐ యామ్ ఎ వారియర్’ అని ప్రకటించారు. శ్రీకృష్ణ రాయభారం విఫలమైనా అసలు యుద్ధంలో పాండవులే గెలిచారు. అలాగే నంద్యాల ఓటమి రేపటి అసలు విజయానికి నాంది.
నేను రోడ్లు వేశాను, వీధి దీపాలు వేశాను, ఓటుకు ఐదువేలివ్వగలను! నా తిండి తింటూ, నా బట్ట కడుతూ నాకు ఓటు ఎందుకు వెయ్యరూ అని ప్రజ లను బెదిరిస్తూ, భయపెడుతూ సీఎం చంద్రబాబు నంద్యాల ఉపఎన్నికలకు శంఖారావం పూరించారు. దాంతో ఉప ఎన్నికల స్వరూప స్వభావాలు ఎలా ఉండబోతున్నాయో ప్రతి ఒక్కరూ సులభంగానే అంచనా వేశారు. అయితే ప్రతిపక్ష నాయకుడు ఇది అధర్మానికి, ధర్మానికి జరుగుతున్న యుద్ధమనీ, తన పక్షాన ధర్మముందనీ, భూమా నాగిరెడ్డి కుటుంబానికి తాను న్యాయం తప్ప అన్యాయం చేయలేదనీ, బాబు 21 మంది తన పక్షపు ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించకుండా పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చారని ఆరోపిస్తూ, పోటాపోటీగా ఎన్నికల బరిలోకి దిగినప్పుడు అందరూ ఈ ఎన్నికల పట్ల తీవ్రమైన ఆసక్తిని చూపించారు.
భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు చాలా కొద్ది చోట్ల అరుదుగా మాత్రమే ప్రతిపక్ష పార్టీలు ఉపఎన్నికల్లో గెలి చాయి. అధికారంలో వున్న పార్టీల చేతుల్లో అంగ బలం, అర్థబలం అవసరానికి మించి ఉంటుంది. వాగ్దానం చేయడానికి వారు అప్పటికప్పుడు సంక్షేమ పధకాలు సృష్టించగలరు, సహకరించకుంటే నోటిదగ్గర కూడును లాక్కుంటామని బెదిరించగలరు. టీడీపీకి ఇన్ని ఉన్నాయని, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతకైనా తెగబడుతుందని తెలి సినా తెలుగు రాష్ట్రాల ప్రజలలో ఈ ఎన్నికల పట్ల తీవ్రమైన ఉత్కంఠత నెలకొన్నది. అనేక చోట్ల ఇరు పార్టీల అభిమానుల మధ్య బెట్టింగులు నడిచాయి. ఇరు పక్షాలలో ఎవరూ వెనుకంజ వేయలేదు. చివరికి వైఎస్సార్‌సీపీ ఉపఎన్నికలో ఓటమినొందింది. కానీ ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి తన పక్షానికి ధైర్యాన్ని నూరి పోయడంలో ఓడిపోలేదు. విజయం ఏకపక్షం అని కచ్చితంగా తెలిసిన చోట కూడా అధికారపక్షాన్ని బెంబేలెత్తించడంలో, వారిని అటూ ఇటూ పరుగులెత్తించి విపరీతమైన ఒత్తిడికి లోనయ్యేట్లు చేయడంలో ఆయన బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారు.
నంద్యాల ఉపఎన్నికకు జగన్ అంత విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం చూసి, గెలుపు టీడీపీదే అని అంచనా వేసిన నా స్నేహితుడు, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఒకరు ‘అధికారపక్షం వారు అంత తెగబడుతున్నారు. గెలుపు వంద శాతమూ వారిదే అవుతుంది. జగన్ ఎందుకు వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ కష్టపడుతున్నారు’ అని నాతో అంటూ ఉండేవాడు. అతను ఆ అపనమ్మకాన్ని వ్యక్తపరిచిన ప్రతిసారీ అతనికి నేనో పద్యం చెప్తూ వచ్చాను. తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన పాండవోద్యోగ విజయాలు నాటకంలోని పద్యం అది.
పాండవోద్యోగము అంటే పాండవ ప్రయత్నం అని అర్థం. ధర్మరాజు శ్రీకృష్ణుడ్ని హస్తినకు రాయబారానికి పంపుతూ, ‘కృష్ణా! న్యాయంగా మాకివ్వాల్సిన మా తండ్రి పాలు ఇవ్వమను, ఇవ్వలేమంటే, పోనీ మా మీద ఆధారపడి వున్న బంధుమిత్ర సపరివార సంక్షేమం చూడటానికి, మా క్షత్రియ ధర్మాన్ని నెరవేర్చటానికి కనీసం అయిదు ఊర్లు ఇమ్మను చాలు. అందరం యుద్ధం లేకుండా సంతోషంగా ఉంటాం’ అని చెబుతాడు. ఆవేశపరుడైన భీముడు కూడా అన్న మాటే నా మాట అంటాడు. అంతా విని కృష్ణుడు, ‘మీరైతే సంధి అంటున్నారు కానీ, దుర్యోధనాదులు యుద్ధం చెయ్యడానికి ఉవ్విళ్ళూరుతున్నారు, సంధి రాయబారం సఫలం కాదు’ అంటూనే ‘‘ఐనను బోయిరావలయు హస్తినకచ్చటి సంధిమాట యె/ట్లైనను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు మీ/మానసమందు గల్గు ననుమానము దీర్పగ వచ్చు తత్సమా/ధానము మీ విధానమును తాతయు నొజ్జయు విందురెల్లరున్’’అని ముగిస్తాడు.
శ్రీకృష్ణుడికి గొప్ప రాజనీతిజ్ఞుడని పేరు. ఆయనకు కచ్చితంగా తెలుసు, కౌరవులు సంధికి ఒప్పుకోరని. అయినా సరే మొదట సంధికి వెళ్లాల్సిందే అంటాడు. నిష్ఫలమైన ఆ సంధి కార్యక్రమం నుంచి ఆయన ‘‘శత్రురాజులు బలాబలాలు తెలుస్తాయి, మీకున్న అనుమానాలు తీరుతాయి, సమాధానాలు దొరుకుతాయి, మీ విధానం ఏమిటో పెద్దవాళ్లకు తెలుస్తుంది’’ అంటూ అద్భుతమైన లాభాలను బయటకి తీస్తాడు. అట్లాగే తరాల రాజకీయనేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జగన్‌కి కూడా నంద్యాల జయాపజయాల గురించి ఒక అంచనా ఉండేవుంటుంది. అయినా ఆయన నంద్యాలకు పోయిరావడానికి కారణం అసలు సమరానికి శత్రువును అంచనా వెయ్యడానికి, శత్రువుకు తాను ఎంత బలమైన ప్రత్యర్థినో చెప్పడానికి అయ్యుండొచ్చు అని నేను చెబితే నా స్నేహితుడు అంగీకరించి అమెరికన్ స్వాతంత్య్ర సంగ్రామపు ఉత్తేజాన్ని నాతో పంచుకున్నాడు. 1775లో యుద్ధం మొదలైనపుడు అందరికీ తెలుసు.. ఆ యుద్ధంలో పాల్గొంటూన్న బ్రిటిష్ వారికి సుశిక్షితమైన సైనికులూ, గొప్ప నావికాబలమూ ఉందని, అవతల అమెరికన్ల సైనికులు అశిక్షితులనీ, వారి నావికాదళం రాయల్ నేవీ ముందు ఎందుకూ పనికి రాని దనీ. అయినా అమెరికన్లు తాము గెలుస్తామని నమ్మారు.
‘బ్రదర్స్, ఐ యామ్ ఎ వారియర్’ అని ప్రకటించాడు జార్జ్ వాషింగ్టన్. అప్పటి ఆ యుద్ధంలో అమెరికన్లు ఓడిపోయారు. చిత్రంగా చరిత్ర కొన్ని ఓటములను విజయంగానే గుర్తిస్తుంది. అప్పటి ఆ ఓటమిని విజయంగానే గుర్తించింది. జగన్ కూడా ‘‘ఐనను పోయిరావలె హస్తినకు’’ అంటూ నంద్యాలకి వెళ్లి ‘ఐ యామ్ ఎ వారియర్’ అని ప్రకటిం చారు. నంద్యాలలాగే భారతంలో కూడా సంధి విఫలమయింది. కానీ అంతిమంగా అసలు యుద్ధంలో పాండవులు గెలిచారు. అమెరికన్లు అప్పుడు ఓడిపోయుండచ్చు.. వారి ప్పుడు యుద్ధాన్ని గెలిచిన స్వతంత్రులు. చరిత్ర ప్రకారం నంద్యాల ఓటమి అసలు సంగ్రామ విజయానికి నాంది.
- సామాన్య కిరణ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966