‘వన్‌ ఇండియా’ అంటే ఇదా? | samanya kiran writes on one india | Sakshi
Sakshi News home page

‘వన్‌ ఇండియా’ అంటే ఇదా?

Published Tue, Apr 4 2017 1:00 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

‘వన్‌ ఇండియా’ అంటే ఇదా?

‘వన్‌ ఇండియా’ అంటే ఇదా?

ఆలోచనం
గోవధ నిషేధం వంటి నిరంకుశ చట్టాలతో సామాన్య ప్రజల వృత్తులపై వేటు వేసి వాటిపై ఆధారపడి బతుకుతున్న వారి జీవితాలను అల్లకల్లోలం చేయడం ‘వన్‌ ఎకనామిక్‌ ఇండియా’ కిందికే వస్తుందా?

‘‘ఎక్కడ మనసు నిర్భ యంగా ఉంటుందో /ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగు తారో / ఎక్కడ జ్ఞానం విరి విగా వెలుస్తుందో /ఎక్కడ ప్రపంచం దేశమనే ఇరుకు గోడల మధ్య ముక్కలవ కుండా ఉంటుందో...’’ ఇవి టాగూర్‌ ప్రఖ్యాతిగాంచిన ‘వేర్‌ ది మైండ్‌ ఈస్‌ వితౌట్‌ ఫియర్‌’ కవితలోని మొదటి నాలుగు పంక్తులు.

గొప్ప కవిత్వం ప్రధాన లక్షణం ఏమిటంటే, ‘ఎవరి తాహతును బట్టి వారికి ఏదో కొంత అను భూతిని అందించగలగడం’ అంటారు చలం గీతాంజ లికి రాసిన ముందుమాటలో. భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌ వారు ఈ ఏడాది వెలువరించిన ‘ఎకనామిక్‌ సర్వే’లో జీఎస్టీకి "One Economic India: For goods and in the Eyes of the Constitution" పేరుతో ఒక అధ్యాయాన్ని కేటాయిం చారు. దీనిని ‘ఎక్కడ ప్రపంచం దేశమనే ఇరుకు గోడల మధ్య ముక్కలవకుండా ఉంటుందో..’ అంటూ ఉదా త్తంగా ప్రారంభించారు. ఈ అధ్యాయం చదువుతున్న పుడు నాకు గొప్ప కవిత గురించి చలం రాసిన పంక్తులు పదే పదే మనసులో కదలాడాయి. చలం పేర్కొన్న తాహతు అనే పదం కొత్త వెలుగులో కనిపించింది.

జీఎస్టీ బిల్లును పన్నుల సంస్కరణగా పేర్కొంటూ ‘వన్‌ ఇండియా, వన్‌ ట్యాక్స్‌’ అనీ, ‘వన్‌ ఎకనామిక్‌ ఇండియా’ అనీ గొప్ప ఉత్సాహంతో బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. వారు చెప్తున్న ప్రకారం పరోక్ష పన్ను లకు సంబంధించిన జీఎస్టీ ఇంతవరకు ఉన్న అంచెల పన్ను విధానాన్ని రద్దు చేయబోతోంది, జీఎస్టీ వలన జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుంది, ద్రవ్యోల్బణం తగ్గు తుంది. వ్యాపారుల మీద అధికారుల నియంత్రణను అదుపు చేస్తుంది. కానీ దీనివలన పేదవాడికి ఎంత ఒరుగుతుందనేది ఎవరూ నొక్కి వక్కాణించడం లేదు.

ఈ జీఎస్టీ అనే పరోక్ష పన్ను ఒక తిరోగామి పన్ను. జైట్లీ చెప్పిన ప్రకారం బెంజి కారుకు, హవాయి చెప్పు లకు వేర్వేరు జీఎస్టీ రేట్లు ఉండొచ్చు కానీ, హవాయి చెప్పులు అంబానీ కొన్నా,  రైతు కూలీ అచ్చెమ్మ కొన్నా ఇద్దరూ దానిపై ఉన్న పన్నును ఒకే రకంగా కట్టాల్సి వస్తుంది. పరోక్ష పన్నుకి రైతుకూలీ అచ్చెమ్మ పేదరాలు అనే ఇంగితం ఉండదు. మన దేశం ట్యాక్స్‌ జీడీపీ రేషియో 16.6% మాత్రమే. ప్రపంచ దేశాలతో పోల్చి చూసుకుంటే ఇది చాలాతక్కువ. ఇప్పుడు ప్రభుత్వం జీఎస్టీ ద్వారా పన్నుల జీడీపీని పెంచుతానని అంటుంది. జేఎన్‌యూ అధ్యాపకుడు సురజిత్‌ దాస్‌ ప్రకారం ‘జీఎస్టీ ద్వారా ట్యాక్స్‌ జీడీపీ పెంచాలనుకునే ప్రయత్నం.. ఇప్పటికే lతీవ్ర ఆర్థిక అసమతౌల్యాలను ఎదుర్కొంటున్న భారత దేశంలో మరిన్ని ఆర్థిక అస మానతలకు తావియ్యడానికి కారణమవుతుంది’.

ఒక పన్ను సంస్కరణ సందర్భానికి కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన నినాదాన్ని ఇచ్చింది. ఏమని? వన్‌ ఇండియా, వన్‌ ఎకనామిక్‌ ఇండియా అని. కానీ ఈ దేశం ఏ రోజైనా ’వన్‌ ఎకనామిక్‌ ఇండియా’గా ఉందా? భూసంస్కరణలు, ఆర్థిక అస మానతలు తగ్గించడం వంటి అసలు విషయాల జోలికి వెళ్లకుండా ‘వన్‌ ఎకనామిక్‌ ఇండియా’ని వ్యాపారం అనే పరిమిత అర్థంలో చూసినా ఇక్కడ ఒక్క ఘనత వహించిన స్త్రీ వ్యాపారవేత్త లేదు, ముస్లింలో, అణచి వేతకు గురైన వర్గాలవారో వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం లేదు. బీజేపీతో సహా ఏ పార్టీ ఆ అసమా నతలను పోగొట్టే దిశగా ప్రయత్నించడం లేదు. పైగా ఈ దేశంలో మత, కులపరంగా పారంపర్యమవుతున్న కొన్ని వ్యాపారాలను బీజేపీ దెబ్బతీస్తోంది. వారి చిన్న చిన్న వ్యాపారాలను దెబ్బకొడుతూ ‘వన్‌ ఎకనామిక్‌ ఇండియా’లో వారు భాగస్వామ్యం కాకుండా చేస్తోంది.

గోవధ నిషేధం పేరుతో చేస్తున్న చట్టాలు, మాంసం ఎగుమతిపై విధిస్తున్న నిషేధాలు ఈ నిరంకుశత్వంలో భాగమే. ఒక్క యూపీలోనే మాంసం ఎగుమతిని నిషే ధించడం వలన ఆ రాష్ట్రానికి సాలుకు రూ. 11,350 కోట్లు నష్టం జరిగే అవకాశం ఉంది.  అలాగే కలకత్తా లెదర్‌ ఎక్స్‌పోర్టర్‌ జియా నఫీస్‌ మాటలలోనే చెప్పా లంటే ‘ఇక్కడి తోళ్ల పరిశ్రమ విలువ ప్రస్తుతం 12 బిలి యన్లు, అది 24 బిలియన్ల దిశగా నడుస్తున్నపుడు సప్లై రావటం ఆగిపోతే మేక్‌ ఇన్‌ ఇండియా ఎలా సాధ్యం’? అదే విధంగా ఘనత వహించిన కొల్హాపూర్‌ చెప్పుల పరిశ్రమ తోళ్ల లోటుతో వెలవెలపోతూ ఉంది. అట్లా వారి వారి వృత్తులపై వేటు వేసి దానిపై ఆధార పడి జీవిస్తున్న వారి జీవితాలను అల్లకల్లోలం చేయడం వన్‌ ఎకనామిక్‌ ఇండియా కిందికే వస్తుందా? అసలైన అస మానత ఏమిటంటే, అసమంగా ఉన్న విషయాలను సమం చేయడానికి ప్రయత్నించడమే అంటాడు అరిస్టా టిల్‌.  బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఒకవైపు తమ కున్న అనేకానేక ‘‘మెంటల్‌ రిజర్వేషన్స్‌’’ను దేశంపైన రుద్దుతూ, మరోవైపు అడ్డుగోడలు తొలగిపోయి దేశ మంతా ఒక్కటి కావాలని కవిత్వాలు ఉటంకించడం, స్లోగన్లు ఇవ్వడం అతి పెద్ద విరోధాభాస.

వీటన్నిటిని చూశాక నా తాహతు బట్టి టాగోర్‌ కవి తను నేను అర్థం చేసుకున్న దానిని బట్టి అందులోంచి తీసుకున్న కొన్ని లైన్లతో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. ‘‘ఎక్కడయితే నిర్జీవమయిన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గా  నికి తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు’’.

సామాన్య కిరణ్‌
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
91635 69966

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement