దబాయించేవాళ్లదే రాజ్యం | samanya kiran writes on chandrababu | Sakshi
Sakshi News home page

దబాయించేవాళ్లదే రాజ్యం

Published Tue, Apr 11 2017 12:54 AM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM

దబాయించేవాళ్లదే రాజ్యం - Sakshi

దబాయించేవాళ్లదే రాజ్యం

ఆరు సారా కథల్లోని ‘‘పుణ్యం’’ క«థలో కథకుడు అంటాడు ‘‘మనుష్యుల్లో రెండు కళ్ళూ, రెండు చెవులూ ఉన్నట్టు మంచీ చెడ్డా అంటూ రెండు లేవు. అంతే కాదు లోకంలో పాప పుణ్యాలు లేవు. లాభనష్టాలే ఉన్నాయి’’ అని.
ఆలోచనం
‘‘పీడరుబాబు సెప్తున్నాయిను! నువ్వే కాదు, ఈ బాబే కాదు, ఏ మనిషి మంచోడని ఒవురు జెప్పినా నాను నమ్మను, ఈ నోకంల డబ్బూ యాపారం తప్ప మరేటినేదు. పశువులు నోరులేని సొమ్ములు – ఆటికి  నీతుంది కానీ మనకినేదు. సదువు లేన్దాన్ని నాకూనేదు; సదువుకున్నోడివి నీకూనేదు. డబ్బుకోసరం నోకం నోకవంతా పడుచుకొంటోంది. డబ్బుకి నాను సారా అమ్ముతున్నాను. డబ్బుకి, సదివిన సదువంతా నువ్వమ్ముతున్నావు. డబ్బుకి పోలీసోళ్ళు నాయేన్నమ్ముతున్నారు.

మందుకోసరం పెద్దాసుపత్రికెళ్తే అక్కడ మందులమ్ముతున్నారు, మంచాలమ్ముతున్నారు. లం... రోడ్లంట, రిచ్చాలంట, కార్లంట తిరిగి ఒళ్ళమ్ముకుంటున్నారు. గుళ్ళోకెళ్లి, కొబ్బరికాయ సెక్కా కాన్డబ్బూ ఇస్తే, ఆ దేవుడిదయే అమ్ముతున్నారు. వోట్లొస్తే అమ్మకం! అమ్మకం! అమ్మకం తప్ప మరేటినేదీ లోకంలో. నాను సదువుకోనేదుగానీ, చూసిన సత్తెమ్‌ మాత్తరం అది. తప్పయితే తప్పని చూపించి సెప్పు! ఇంటాను’’ అంటుంది, రావి శాస్త్రి గారి ఆరు సారా కథల్లో ఒకటయిన ‘మాయ’ క«థలో ముత్తేలమ్మ.

‘సత్యహరిశ్చంద్ర మహారాజ్‌ కేరాఫ్‌ అడ్రస్‌ ఎవరంటే’ చంద్రబాబు నాయుడంటాడు. నీతి, నిజాయితీ మాట్లాడమంటే సత్యహరిశ్చంద్రుడు మా ఇంట్లో పుట్టినట్టే మాట్లాడుతాడు. నేను జాయినయినప్పుడు అనరాని మాటలన్నావ్‌. చాలెంజ్‌ చేస్తున్న, ఆ నలుగుర్ని రిజైన్‌ చేయించు, నేనూ రిజైన్‌ చేస్తా. నీతినిజాయితీ అనే పదాలు మీకు సూట్‌ కావండీ. మీరు మాట్లాడేప్పుడు ఆ పదాలు లేకుండా జాగ్రత్తగా మాట్లాడండి’’ ఫిరాయింపు శాసన సభ్యులు నలుగురికి మంత్రిపదవులు ఇచ్చిన చంద్రబాబుని తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్న మాటలు ఇవి. సరిగ్గా ఈ మాటలు విన్నాక నా మెదడులో ముత్తేలమ్మ చెప్పిన పై మాటలు తటిల్లని మెరిసాయి. అరెరే ఎంత బాగా చెప్పిందీ ముత్తేలమ్మ అనిచెప్పి చాలా ఆశ్చర్యం వేసేసింది.

అక్కడనే కాదు ఈ మధ్య కాలంలో. వరల్డ్‌  బ్యాంకు వారు తమ పబ్లిక్‌ ప్రొక్యూర్మెంట్‌ పాఠంలో అవినీతిలో ‘నేపొటిసం’ అనబడే బంధుప్రీతి కూడా భాగమని నొక్కి చెప్తున్నప్పుడు కూడా, ఎవరో అంతవరకు మూసి వున్న తలుపుని గబుక్కున తెరిచినట్లు రావిశాస్త్రి గారు జ్ఞాపకం వచ్చారు. మీరే చూడండి, అవతలి పార్టీ ఎమ్మెల్యేలను అధికారపార్టీ హోదాలో కేసులు పెట్టి బెదిరించీ, కాంట్రాక్టులు, మంత్రి పదవులు ఎరచూపించి కొనుగోలు చేయడం అవినీతి కాదా?.

నారా లోకేశ్, కేవలం ముఖ్యమంత్రి కొడుకు అనే కారణం చేత చకచకా చదరంగంలో పది నిచ్చెనలు ఎక్కేసి ఎమ్మెల్సీ, ఆపై మంత్రి అయిపోయి పదవులిచ్చే ఫలాలను పొందడం చంద్రబాబు చేస్తున్న అవినీతిలో భాగం కాదా, అవినీతి అంటే డబ్బు రూపంలో తీసుకునేది, చేతులు మారేదేనా? కాదు! కానీ, మన అర్బన్‌ ఆర్మ్‌ చెయిర్డ్‌ మేధావులు ‘కో’ అన్న అక్షరం ఉంటేనే అది అవినీతి అని భావిస్తారు. ఇదిగో ఈ ఆలోచన స్ఫురణకు వచ్చినప్పుడు రావిశాస్త్రి కష్టార్జితం క«థలో ఒక ముసలాయన ‘‘మనలాంటి వాళ్ళం కడుపు కక్కుర్తికి నిన్నూ నిన్నూ బక్కిరి బక్కిరి పాతికరాళ్ళు సంపాదిస్తే, గెద్దలన్నీ చేరి పిచికల మీద ఆరోపణలూ, వాటి గురించి విచారణలూ, ఆపైన శిక్షలూనూ. దేశం, ప్రభుత్వం, పాలనా అలా వున్నాయి బాబూ!’’ అన్న మాటలు మనసులో మెదిలాయి.

పార్టీ అనే వ్యవస్థకు మన దగ్గర చాలా విలువ వుంది. అభ్యర్థులు, వ్యక్తులుగా వారి వారి నియోజక వర్గాలలో పలుకుబడి కలిగిన వారయినా అనేక కారణాల చేత ఒక పార్టీ అనే గొడుగు క్రిందకు చేరి, అధినాయకుని ముఖాన్ని పెట్టుబడిగా పెట్టుకుని ఎన్నికల్లో విజయాలను సాధిస్తారు. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరూ, పోయిన ఎన్నికల్లో, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ఇల్లు పొల్లూ లేక రోజుకు నలభై ఎనిమిది గంటలపాటు పడిన కష్టాన్ని సొమ్ము చేసుకున్న వాళ్ళే. కరుడుగట్టిన స్పీకర్లు, చూసీ చూడనట్లు వుండే న్యాయస్థానాల సంగతి పక్కన పెట్టేద్దాం, నైతికత అనే మాటకు విలువలేదా అని ఉదారవర్గం వాపోతున్నప్పుడు నాకు ఆరు సారా క«థల్లో ‘పుణ్యం’ కథ గుర్తొచ్చింది. అందులో క«థకుడు అంటాడు ‘‘మను ష్యుల్లో రెండు కళ్ళూ, రెండు చెవులూ ఉన్నట్టు మంచీ చెడ్డా అంటూ రెండు లేవు. అంతే కాదు లోకంలో పాప పుణ్యాలు లేవు. లాభనష్టాలే ఉన్నాయి’’ అని.

రాజీనామాలు చేయని 21 మంది ఎమ్యెల్యేలు, అందులో మళ్ళీ నలుగురు మంత్రులతో అధికారికంగా తన ప్రభుత్వంలో ప్రతిపక్షాన్ని భాగం చేసుకున్న చంద్రబాబు నాయుడిని చూసినప్పుడు నాకు ఆరో సారా కథలో ‘‘గవర్మెంటు, పిచ్చాసుపత్రి!! ఓహోహో! మర్చేపోయాను. గవర్మెంటుకి, పాపం, పిచ్చెక్కింది కదూ? ఎలా ఉందొ ఏమిటో? పదండి చూద్దాం’’ అన్న మేస్ట్రీటు గుర్తొచ్చాడు. అంతే కాదు ఏ పని చేసినా, చేస్తున్నది పరమ తప్పయినా, దబాయించి మాట్లాడే ముఖ్యమంత్రిని చూస్తున్నప్పుడు, అతను నాకు రావిశాస్త్రి గారి ‘‘రాకెట్‌ అప్పారావు’’ని గుర్తుకు తెస్తాడని చెప్పకుండా ఈ వ్యాసాన్ని ముగిస్తే అది తీరని లోటు. ఇంతకీ రాకెట్‌ అప్పారావేమంటాడంటే ‘‘నోకంలో ఎవరు ఈ రోజుల్లో బావుపడాలన్నా డబ్బుండాలి! మాయుండాల! డబాయింపు సెక్సనుండాలి! బోధపడిందా! ’’ అని.


వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966
సామాన్య కిరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement