ఇంటర్నెట్‌ ‘మరుగుజ్జు’లు | Samanya kiran writes on internet trolls | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ ‘మరుగుజ్జు’లు

Published Tue, Jun 20 2017 2:09 AM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM

ఇంటర్నెట్‌ ‘మరుగుజ్జు’లు

ఇంటర్నెట్‌ ‘మరుగుజ్జు’లు

ఆలోచనం
విషాదం ఏమిటంటే ఈ ‘ఇంటర్నెట్‌ ట్రోల్స్‌’’ తమ ప్రత్యర్థుల లాగా సైద్ధాంతికంగా, న్యాయబద్ధంగా మాట్లాడరు. వీరి భావజాలం ఏకపక్షంగాను, వాదనకు నిలబడనిదిగాను ఉండటం చేత తమ ప్రత్యర్థుల మీద రకరకాల దాడులకు పాల్పడతారు.

సామాజిక మాధ్యమంలో దైవదూషణ చేస్తూ పోస్ట్‌లు పెట్టినందుకు గాను తైమూర్‌ రాజా అనే పాకిస్థానీయుడికి ఆ దేశపు యాంటీ టెర్రరిజం కోర్టు మరణశిక్ష విధించింది. సోషల్‌ మీడియాలో పోస్టుకు సంబంధించి కోర్టు మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారట కానీ, మత మౌఢ్యాన్నీ ప్రశ్నించే వారు, నాస్తికులు, స్త్రీవాదులు, లౌకిక మేధావులు రకరకాల శిక్షలకు  గురికావడం ఇవాళ్టిదేమీ కాదు. దాదాపు 30 మంది బంగ్లాదేశీ బ్లాగర్లు భగవంతునిపై విశ్వాసం లేనివారనే ముద్రపడి హత్యకు గురయ్యారు.

భారతదేశం అధికారిక మతం లేని లౌకిక సర్వసత్తాక దేశం. ఇక్కడ పాకిస్థాన్‌లో వలే మరణ  శిక్షలు, భౌతిక హత్యలు లేవు కానీ ఫేస్‌బుక్, ట్వీటర్‌ వంటి సామాజిక మాధ్యమాలలో లౌకిక వాదులు, ముఖ్యంగా స్వేచ్ఛావాదులూ, స్త్రీవాదులు, మతతీవ్రవాదుల నుంచి  రకరకాల వేధింపులను ఎదుర్కొంటూ వస్తున్నారు. డైలీఓ అనే ఆన్‌లైన్‌ పత్రిక ప్రకారం, 2014 తర్వాత అతి వాదులు కొంతమంది ట్వీటర్‌లో రకరకాల పేర్లతో కొన్ని గ్రూపులను ఏర్పరచి సమాజాన్ని ప్రశ్నించే వారిని, లౌకికవాద మేధావులను ఆయా గ్రూపులలో చేర్చి దూషిస్తున్నారు.

‘మనిషి రూపంలో వుండే రోగులు’ ‘పిచ్చి పట్టిన కుక్కలు’, ‘ఆవుని తినే ఆటవికులు’ అనేవి వాటిలో కొన్ని గ్రూపులు. ప్రజాస్వామిక పాత్రికేయులను ప్రాస్టిట్యూట్స్‌ (వేశ్య) పదం స్ఫురించేట్లు ‘ప్రెస్టిట్యూట్స్‌’ అని పిలుస్తూ, ఆ పేరుతో ఫేస్‌బుక్‌లో పేజీలను సృష్టిస్తున్నారు. నీతా భల్ల అనే జర్నలిస్ట్‌ ‘‘అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో తీవ్ర జాతీయవాదులు, సామాజిక మాధ్యమాలలో జర్నలిస్టులపై బురద చల్లడం, దూషించడం, తెగబడటం, భౌతికదాడులు చేస్తామని బెదిరించడం ఇటీవలే ఎక్కువైంది’’ అని అంటుంది. ‘తల్లిగా ఉండడానికి అనర్హులు’ అని పేరు ఉన్న ఒక ట్వీటర్‌ గ్రూప్‌లో రాజ్యసభ టీవీకి చెందిన అర్ఫా కానుమ్‌  షేర్వాణీ, ది న్యూస్‌ మినిట్‌కి చెందిన ధన్య రాజేంద్రన్, ఎన్డీ టీవీకి చెందిన సునేత్ర చౌదరి వంటి వారిని చేర్చారు.

ఫేస్‌బుక్, ట్వీటర్‌ వంటి సామాజిక మాధ్యమాలు నిజానికి మనిషి భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన తలుపులను బార్లా తెరిచి పెట్టాయి. సాంప్రదాయక మీడియా నుంచి మనిషికి కొంత స్వేచ్ఛని ఇచ్చాయి. అభివ్యక్తీకరణ వున్న ప్రజా సమూహానికి ఈ మాధ్యమాలు ఒక వేదికగా మారాయి. ఈ రోజు వెనుకాముందూ పైసా ఆదాయం లేని విద్యావంతుడైన దళితుడు కులం గురించి, ఇంటి నుంచి బయటకు రాకుండానే ఒక మధ్యతరగతి స్త్రీ తన అంతరంగాన్ని, సమాజం తనని బంధించి వున్న సంకెళ్ళ గురించి మాట్లాడే వెసులుబాటుని కల్పించడమే కాకుండా, ప్రపంచం మొత్తాన్ని అనుసంధానించి గ్లోబల్‌ స్టేజ్‌గా రూపొందాయి. కానీ ఇదంతా సామాజిక మాధ్యమం సఫల రూపం మాత్రమే.

సర్వజన సౌభ్రాతృత్వాన్ని, అంతరాలు లేని సమాజాన్ని కాంక్షించే సహృదయులు ఈ మాధ్యమాన్ని తమ భావ వ్యక్తీకరణకు ఎప్పుడయితే వాడటం మొదలు పెట్టారో వెనువెంటనే సంప్రదాయవాదులు, తీవ్ర జాతీయవాదులు మేల్కొని లెక్కకు మిక్కిలి సమూహాలై ఈ మాధ్యమాన్ని వాడటం మొదలు పెట్టారు. విషాదం ఏమిటంటే ఈ ‘ఇంటర్నెట్‌ ట్రోల్స్‌’ (ఇంటర్నెట్‌ ట్రోల్‌ అనేది ఒక వాడుకలో ఉన్న వ్యక్తీకరణ.

వ్యక్తుల పరువుకు భంగం కలిగించడానికి, ఆగ్రహం కలిగించడానికి,  అపహాస్యం చేయడానికి, మండించడానికి లేదా ఇతర ఆన్‌లైన్‌ యూజర్లను రెచ్చగొట్టడానికి, సమాచార, కమ్యూనికేషన్‌  సాంకేతికతను విని యోగించుకునే వారిని ట్రోల్‌ అని పిలుస్తారు) తమ ప్రత్యర్థుల లాగా సైద్ధాంతికంగా, న్యాయబద్ధంగా మాట్లాడరు. వీరి భావజాలం ఏకపక్షంగాను, వాదనకు నిలబడనిదిగాను ఉండటం చేత తమ ప్రత్యర్థుల మీద రకరకాల దాడులకు పాల్పడతారు. పైన పేర్కొన్న ట్వీటర్‌ సమూహాల పేర్లు అటువంటి ‘‘ట్రోల్‌ రాంట్స్‌’’ చేసే పనులే.

గత 20 ఏళ్లుగా  సైబర్‌ నేరస్థులపై  పని చేస్తున్న ఫోరెన్సిక్‌ సైకాలజిస్ట్‌ మైఖేల్‌ నఖిటెల్లి ఈ ఇంటర్నెట్‌ ట్రోల్స్‌ని దాదాపు వందకుపైగా రకాలుగా విభజించాడు. కామెంట్‌ ట్రోల్, ఫ్లడర్, ఫోరమ్‌ కల్టిస్ట్‌ వంటివి అందులో కొన్ని. మైఖేల్‌ ఈ తరహా సమూహాల స్వభావాలకి రకరకాల మానసిక రోగాలు కారణమనీ, వీరు సహజంగా సంఘంలో అనామకంగా ఉండి గుర్తింపు కోసం, తమ ఉనికిని తెలియ పరచడం కోసం ఇతరులను వేధిస్తుంటారని పేర్కొన్నాడు. ఇప్పుడు మనం పైన పేర్కొన్న వాళ్లు ‘‘హేట్‌ మాంగర్స్‌’’ ట్రోల్‌ జాతి. వీళ్ళు ఒక విషయాన్ని నమ్మి దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అప్రజాస్వామికంగా దూషిస్తూ దాడి చేస్తారు.

నోమ్‌ ఛాంస్కీ వాక్‌ స్వాతంత్య్రాన్ని గురించి మాట్లాడుతూ ‘మీరు వాక్‌స్వాతంత్య్రాన్ని విశ్వసిస్తున్నట్లయితే, మీరు ఇష్టపడని అభిప్రాయాలకు చెందిన వాక్‌స్వాతంత్య్రాన్ని కూడా విశ్వసిస్తారు. గోబెల్స్‌ తాను ఇష్టపడే అభిప్రాయాలకు చెందిన వాక్‌స్వాతంత్య్రానికి అనుకూలంగా ఉంటాడు. మీరు వాక్‌స్వాతంత్య్రానికి అనుకూలురు అయితే, మీరు తిరస్కరించే అభిప్రాయాలకు చెందిన వాక్‌ స్వాతంత్య్రానికి కూడా మీరు అనుకూలురని అర్థం’ అన్నాడు. ప్రస్తుతం ఈ సామాజిక మాధ్యమాలలో తారాడే అతివాద సమూహాలు సరిగా గోబెల్స్‌ తరహాలో వాక్‌ స్వాతంత్య్రాన్ని గౌరవిస్తున్నాయి.

భారతదేశంలో రాజ్యాంగం ఇస్తున్న హక్కులను కొంతమంది అల్లరి మూకలు కాలరాస్తూ పాకిస్థాన్‌లో రాజ్యం పోషిస్తున్న పాత్రను నిర్వహిస్తున్నారు. సమాజంలో భద్ర జీవనాన్ని గడుపుతూ, మర్యాదపూర్వకంగా తమ భావాలను వ్యక్తపరిచే మేధావులే కాదు రాజకీయ నాయకులు చివరకు అసలేమీ సంబంధం లేని వారి కుటుంబ సభ్యులు కూడా వీరినుంచి అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ప్రభుత్వాలు దీనిని ‘కమ్‌ విత్‌ ది టెరిటరీ’ అనుకోకుండా, మేధావుల చేత అధ్యయనం చేయించి అందరికీ ఆమోదకరమైన రీతిలో స్పందిం చడం ప్రజాస్వామ్య దేశపు ఆరోగ్యానికి సత్వర అవసరం.


వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
సామాన్య కిరణ్‌
91635 69966

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement