ట్రిపుల్ తలాక్ న్యాయాన్యాయాలు
ఆలోచనం
ముస్లిం సమాజంలో స్త్రీ పునర్వివాహం, వితంతు వివాహం మొదటి నుంచీ సమ్మతాలు. ప్రవక్త స్వయంగా ఒక వితంతువును వివాహమాడాడు. ఆ కోణంలో చూస్తే ముస్లిములు పది అడుగులు ముందు ఉన్నట్లు లెక్క.
ట్రిపుల్ తలాక్‌పై మోదీ, యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీసాయి. ముస్లిములు మూడుసార్లు తలాక్ చెప్పి నిమిషంలో తమ భార్యలకి అన్యాయం చేస్తారని ప్రచా రం ఉంది. దీని గురించి అసలు ఖుర్‌ఆన్ ఏం చెప్తుందో చూద్దాం. సుర అల్ బఖరహ్‌లో ప్రవక్తకు దేవుడిలా చెప్పాడు ’’్ర2.226] తమ భార్య వద్దకు పోమని వొట్టేసుకున్న వారికి నాలుగు నెలలవరకు గడువు వుంది. ్ర229]విడాకులు ఇస్తున్నట్లు రెండు సార్లు మాత్రమే ప్రకటించాలి తరువాత నియమానుసారం ఆగాలి. ఒకవేళ అతను ఆమెకు మూడవసారి విడాకులిస్తే ఆ స్త్రీ ఇక అతనికి ధర్మ సమ్మతం కాజాలదు. ్ర231]మీరు స్త్రీలకు విడాకులిచ్చినపుడు, వారు తమ గడువును్రఇద్దత్] చేరుకుంటూ ఉండగా, వారిని ఉత్తమ రీతిలో ఆపుకోండి లేదా ఉత్తమ రీతిలో సెలవు ఇప్పించండి.
వేధించే ఉద్దేశంతో ఆపి ఉంచుకుని వారిపై దాష్టీకానికి ఒడి కట్టకండి’’ అంటుంది. అంతే కాదు విడాకుల అనంతరం స్త్రీల పోషణ నిమిత్తమై ఇవ్వాల్సిన పైకాన్ని కూడా సూచించింది. అయితే సున్నీ ముస్లిముల విధి విధానాలు ఈ విషయంలో ఖుర్‌ఆన్‌కు కొంత భిన్నంగా వున్నాయి. వీరు ’’బిదత్ తలాక్ ’’్రట్రిపుల్ తలాక్]ను అనుసరిస్తారు. బిదత్ అంటేనే అపసవ్యం అని అర్థం. ఈ తలాక్‌కు తిరుగు లేదు కనుక దీనిని ’’బియన్ తలాక్’’ (తిరుగులేని తలాక్) అంటారు. ప్రవక్త దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఐతే ’’భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్’’ [BMMA ] షరియత్‌కు 2014లో వచ్చిన 217 తలాక్ కేసులలో 22 మాత్రమే ట్రిపుల్ తలాక్‌కి సంబంధించినవి.
ముస్లిం మతం స్త్రీపురుషులు తమకు ఇష్టం లేకున్నా వివాహంలో మగ్గిపోవాలని చెప్పదు, వారికి వివాహం స్త్రీ పురుషులు కలసి జీవించడానికి చేసుకునే ఒప్పందం. నిఖా అనే అరబ్ పదానికి సంపర్కం అనే అర్థం వుంది. అందుకే ఇష్టంలేనపుడు ఈ కాంట్రాక్ట్ నుంచి బయటకు రావడానికి అల్లాహ్ సులభమయిన తలాక్ మార్గాన్ని చెప్తూనే, దానిని ఎలా వాడాలో చెప్పి ఉంచాడు. దైవభీతి అనన్యంగా కలిగిన ముస్లిములు దానిని అంతే జాగ్రత్తగా వాడుతారు అనడానికి నిదర్శనం ముస్లింలలో విడాకుల రేటు తక్కువగా ఉండటం. ఒక సర్వే ప్రకారం ఇండియాలో 0.56% ముస్లిములు విడాకులు తీసుకుంటూ ఉండగా 0.76% హిందువులు విడాకులు తీసుకుంటూ ఉన్నారు. అట్లాగే ఖుర్‌ఆన్ స్త్రీలకు కూడా విడాకుల హక్కును కల్పించింది. దీనిని ’’ఖులా’’ అంటారు. భర్త సహకరించకున్నా షరియత్ అతని అనుమతితో సంబంధం లేకుండానే ఆ స్త్రీకి విడాకులు మంజూరు చేయవచ్చు. ఆMMఅ ప్రకారం విడాకులు కోసం వస్తున్న వాళ్లలో సగం మంది మహిళలే. ముస్లిం సమాజంలో స్త్రీ పునర్వివాహం, వితంతు వివాహం మొదటి నుంచీ సమ్మతాలు. ప్రవక్త స్వయంగా ఒక వితంతువును వివాహమాడాడు. ఆ కోణంలో చూస్తే ముస్లిములు పది అడుగులు ముందు ఉన్నట్లు లెక్క.
అయితే దీని అర్థం ముస్లిం సమాజం స్త్రీలను చాలా గౌరవిస్తుందని కాదు. తస్లిమా నజ్రీన్ మాటల్లో చెప్పాలంటే '' religion is against women' s rights and women' s freedom. in all societies women are oppressed by all religions'' హిందూ సమాజంలో సతీసహగమనం, వైధవ్యం, స్త్రీ చదువు భర్తకు ఆయుక్షీణం వంటి మూఢత్వాలు, మొన్నమొన్నటి వరకు ఉండగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇవ్వడానికి అంగీకరించకుండా ’’నస్త్రీ స్వాతంత్య్రమర్హతి’’ అనే మనుధర్మాన్ని భారతీయ పురుషులు నేటికీ పరోక్షంగా ఆచరిస్తూనే వున్నారు. అయితే ఈ మౌఢ్యం నుంచి స్త్రీలను రక్షించేందుకు ఆ మతం నుంచే రాజారామ్మోహన్‌రాయ్ వంటి వారు పుట్టుకొచ్చి సంస్కరణలు జరిపారు తప్ప ఆంగ్లేయులు సంస్కరించలేదు.
అలాగే ముస్లింల నుంచి తస్లిమా, అయాన్ హిర్శి అలీ, మలాలా, ఇబ్న్ వారక్, రష్దీలు పుట్టుకొస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఆ సమాజ సంస్కరణకు కృషి చేస్తున్నారు. మోదీ మరియు బీజేపీ నాయకత్వం ముస్లిం మహిళలకు సామాజిక న్యాయం పేరిట, 4 కోట్లమంది ముస్లింలు సంతకాలు పెట్టి వ్యతిరేకిస్తున్న వారి విశ్వాసాలలో ప్రత్యక్షంగా కలగజేసుకోకుండా, సచార్ కమిటీ ‘‘ఈ దేశంలో ముస్లిముల స్థితిగతులు షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ జాతులు వారికంటే ఘోరంగా ఉన్నాయ’’ని పేర్కొన్నది కదా. మరి ఆ సామాజిక ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరిచే దిశగా అడుగులు వేయాలి. కేసీఆర్ లాంటి వారు అమలు చేయాలనుకుంటున్న ముస్లిం రిజర్వేషన్‌కు సహకరించాలి.
ముస్లిం సమాజం కూడా కొంత నిలదొక్కుకుంటే వారి మౌఢ్యాలను వారే ప్రశ్నించుకుంటారు. ఇదిగో నిదర్శనం చూడండి, తెలుగు ముస్లిం కవి ఖాజా తల్లి గురించి ఎలా విలపిస్తున్నారో.. ’’అమ్మ మెళ్ళో వేలాడే షరియత్ గుది బండ/ఏనాడూ అమ్మని తలెత్తి కానీ /కనీసం కళ్ళెత్తి కానీ ఈ లోకాన్ని చూడనివ్వలేదు/ఆ నాలుగు బియ్యపు గింజలు నెత్తి మీంచి దులిపింది మొదలు /నువ్వు పెనం మీద కాలే రోటీవై /పిల్లలు కనే యంత్రానివై /నవాబ్ సాబ్ నాడాబూటు కింద నలిగిన మల్లెపువ్వయినందుకు/మనసంతా నిప్పుల్లో పడ్డ రబ్బరు బంతిలా కమురుకుపోతుందమ్మా’’!
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
సామాన్య కిరణ్
91635 69966