‘గోరక్షణ’ రాజకీయం!
ఆలోచనం
‘‘అనుత్పాదక పసరాన్ని తొలగించకుండా రైతులు.. గోవులను పెంచలేరు’’ అన్నారు కురియన్. శంకరాచార్య దీనిని ఖండించినపుడు ‘‘మీరు అనుత్పాదక గోవులను పోషించే భారం తీసుకోగలరా’’ అని కురియన్ ప్రశ్నించారు.
2017కి నక్సల్బరీకి యాభయ్యేళ్లు నిండాయి. ఉద్యమాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ సందర్భంలో నా మనసు, గూడ అంజన్న రాయగా లేబ్రాయపు గద్దర్ పాడిన వందనాలు... పాట దగ్గర చిక్కుకుపోయింది. పేద ధనిక అంతరాలు లేని చల్లని ప్రపంచాన్ని కలగని, ప్రాణాలు కోల్పోయిన తమ పిల్లల గురించి ‘‘ఏ దిక్కూ లేనోళ్లకూ మా బిడ్డలూ/ మీరు దిక్కు చూపే చుక్కలయ్యిండ్రా’’ అంటూ సాగే తల్లుల కడుపుశోకం ఆ పాట. జంతువుల పట్ల క్రూరత్వాన్ని నిషేధించే చట్టానికి చెందిన నియమాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరణ చేసినపుడు ‘‘కట్టిన ఆ తెల్ల ఆవును కంటి పాపల చూసుకుంటాం/పచ్చిగడ్డీ పిండి పెట్టి ప్రాణమోలే పెంచుకుంటాం/పురిటి నెప్పులు దానికొస్తే కాపలుండి కాన్పుజేస్తం/తల్లి లేగను నాకుతుంటే తల్లి ప్రేమా గురుతుకొచ్చే/మీరు పురిటి నెప్పూలయ్యి వస్తారా మా బిడ్డలు/మళ్లీ జన్మయ్ మాకే పుడతారా మా బిడ్డలూ’’ అంటూ సాగే ఈ పాట మళ్లీ నన్ను వెంటాడింది.
నేపాల్‌లోని గదిమాయి దేవతకు బలి ఇవ్వడానికి భారత్ నుంచి జరుగుతున్న లక్షలాది పశువుల అక్రమ ఎగుమతిపై చర్య తీసుకోవాలని పీపుల్ ఫర్ ఎనిమల్స్ కార్యకర్త గౌరి మాలేఖి 2014 సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై 13 జూలై 2015లో ‘ఇండియా నుంచి ఇతర దేశాలకు పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి, కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలు చేయాలని’ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పశువుల మార్కెట్లలో రైతుల మధ్యే క్రయవిక్రయాలు జరగాలనీ, అది కేవలం వ్యవసాయ సంబంధిత పనుల కోసమే జరగాలని, ఆవులు గేదెలు దూడల వంటి వాటిపై ఎటువంటి హింసా జరగరాదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం నియమాలను సవరించింది.
ఈ అస్పష్టపు సవరణ తిరిగి భారతీయులను గో భక్షకులు, గో రక్షకులు అని రెండు వర్గాలుగా విడకొట్టింది. గోరక్షకులలో ఉన్నత ఆర్థిక వర్గాల వారు, సాధువులు, మఠాధిపతులు ఉండగా, గో భక్షకులలో దళి తులు, ముస్లిములు చేరారు. వీరిపై హింసకు పాల్పడే వారుగా ముద్ర వేస్తున్నారు. ఈ చర్చ నిజానికి రైతు దగ్గర మొదలు పెట్టాలి. కొన్నేళ్ల క్రితం నేను బెంగాల్ లోని కూచ్ బిహార్, సిలిగురి ప్రాంతాలలో ఉండేదానిని. ఇక్కడనుంచి బంగ్లాదేశ్, నేపాల్‌లకు ప్రతిరాత్రి మందల కొద్దీ పశువుల అక్రమ రవాణా నిత్యకృత్యం. ఈ పశువులను అమ్మేవాళ్లు మాత్రం రైతులూ, పేద దిగువ తరగతి వారు. వీళ్లలో అత్యధికులు హిందువులు. గోవును మాతలా పూజించే ఈ రైతులు వట్టిపోయిన గోవును వధ్యశాలకు లేదా వధ్య వ్యాపారికి ఎందుకు అమ్ముతున్నారు? దీనినే తెల్ల విప్లవ పితామహుడు కురియన్ తన ‘ఐ టూ హేడ్ ఏ డ్రీమ్’లో ‘‘మనం పాలు తాగడమంటే, మాంసం కూడా భక్షించడమే.
అనుత్పాదక పసరాన్ని తొలగించకుండా రైతులు పాలు ఇచ్చే గోవులను పెంచలేరు’’ అన్నాడు. శంకరాచార్య ఈ వాదనను ఖండించినపుడు ‘మీరు దేశంలో ఉండే అనుత్పాదక గోవులను పోషించే భారం తీసుకోగలరా’ అని ప్రశ్నించారు. అయితే రైతులో లేదా పసరాలను పెంచే నిమ్నాదాయ వర్గాలవారో జంతువుల పట్ల హింసాయుతంగా ఉంటున్నారా ? లేదూ మాంసం భక్షించే ఆయా జాతుల వాళ్ళు గో రక్షకులంత ప్రేమగా జంతువుల పట్ల ఉండటం లేదా అనేది ప్రశ్న .. నా దగ్గరున్న జంతువులలో ఒక గొర్రె ఉంది. దాని పేరు శాంతి. నాలుగు నెలల పిల్లగా 2007లో అది నా ఇంటికి వచ్చింది. ‘‘మేరీ హాడ్ ఏ లిటిల్ లాంబ్’’ పిల్లల పాటలోలాగా నిత్యం మా అమ్మాయి వెనుకే తిరిగే శాంతికి నోరు ఒక్కటి లేదు కానీ అన్ని మనోభావాలు ఉంటాయి.
ఇంత కమ్యూనికేట్ చేసే ఈ జీవిని హత్య చేసి మనుష్యులు ఎలా తినగలుగుతున్నారు అని నాకు అనిపిస్తుం టుంది? ఆ తర్వాతి ప్రశ్న, అంత కాలం పాలిచ్చిన సాత్విక జీవిని మాంసానికి ఎలా అమ్మేస్తున్నారు అని? ఇక్కడే నాకు కురియన్ ప్రశ్న మళ్లీ జ్ఞాపకమొచ్చింది, నేను, లేదా గోవధను వ్యతిరేకించే పశు ప్రేమికులు రైతులకు ఎంత ఇవ్వాలో అంత ధనం ఇచ్చి గోశాలలు ఏర్పరచి గోరక్షణ చేయగలరా? ప్రభుత్వం అలా గోరక్షణ శాలలు ఏర్పరిచే దిశగా ధనికులను ప్రోత్సహిస్తుందా? దీనిపై గాంధీ స్పష్టంగా ఇలా చెప్పాడు ‘‘గోశాలలు, గోరక్షణ సంఘాలు కేవలం కొన్ని గోవులను తెచ్చి కట్టి పడవేయటం కాకుండా, గోవులకు మేతను సమకూర్చడం, పచ్చిక బయళ్లను కాపాడటం, పేద రైతుల నుంచి గోవులను కొనుగోలు చేయడం వంటి విస్తృత చర్యలు చేపట్టాలి’’ అని. ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టకుండా గో ప్రేమని పేద రైతులపై రుద్దటం అన్యాయం కదా.
‘వందనాలు’ పాటలోనే మరో వాక్యం ఉంది ‘‘ఊర పిచ్చుక జంట వస్తే గూడు కట్టుకోనిస్తాం, మీరు ఊర పిచ్చుక గుడ్డులవుతారా మా బిడ్డలు / ఆ గుడ్డులో మా బిడ్డలవుతారా’’ అని. జనజీవనంలో జీవకారు ణ్యం కూడా ఒక భాగమే. అది ఎవరూ నేర్పాల్సిన పని లేదు. నేను ఐచ్ఛిక శాఖాహారిని. ఇది చర్చకి వచ్చిన సందర్భంలో ఒక బెంగాలీ ఆవిడ ఇలా చెప్పింది ‘‘నువ్వు ఆ జీవులను చంపి తింటున్నానని భావించడం నిజం కాదు. మనిషి జన్మ ఎత్తాలంటే కొన్ని కోట్ల జన్మలు దాటాలి. ఈ జీవులను తినడం ద్వారా నీవు వాటికి ముక్తిని ఇచ్చి మానవ జన్మ ఎత్తడానికి సహకరిస్తున్నావ్’’ అని. అలా అనుకోకుంటే మానవ జీవనం ముందుకు సాగదు కదా. చివరిగా ఒక ప్రశ్న.. ప్రభుత్వం వారి ఈ జీవ కారుణ్యం కేవలం జంతువులకేనా?
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
సామాన్య కిరణ్
91635 69966