కాలం గడిచి గడిచి పోయాక, చాలా ఏళ్ళకెపుడో ఏదో సంఘటన పరిష్కరించలేనిది తటస్థపడినపుడు దారి చూపించగలదు చూడండి.. దానిని మనం అత్యుత్తమ కళా రూపం అంటాం. వేణు ఊడుగుల సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’ అలాంటిదే.
ఉదాత్తమైన ఒక దృశ్యకావ్యం కాలం గడిచి చాలా దూరం నడిచివచ్చినా బట్టల పొత్తిళ్ళలో దాక్కుని కూర్చున్న అపురూప పరిమళంలా మనల్ని మనోరంజితం కావిస్తూనే ఉంటుంది. కలతపరచి దిగులుపరచి, మనం ఆలా ప్రవర్తించకూడదనే తెలివిడిని కలిగి స్తూనే ఉంటుంది. చాలా కాలం క్రితం నేను చూసిన ‘రీడర్’ సినిమా నాకివాళ జ్ఞాపకమొస్తోంది. తనకు చదువు రాదని చెప్పుకోవడానికి సిగ్గు పడిన ఒక అమ్మాయి మౌనంగా అనేక సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవి స్తుంది.
అట్లాగే ‘షిండ్లర్స్ లిస్ట్’ నాజీల దురాగతాల సమయంలో ఒక యూదుడు చూపిన అత్యున్నత హృదయస్పందన ఏళ్ళు గడిచినా బాధాభరితమైన రసాయనిక అసమతుల్యతను మనలో కలుగజేస్తుంది. కొరియన్ సినిమా, ‘ఏప్రిల్ స్నో’ అవాంఛితమైన పరిస్థితులలో వైవాహికేతర సంబంధంలోకి వెళ్లిన వివాహిత స్త్రీ పురుషుల ఘర్షణ జ్ఞాపకానికి వచ్చిన ప్రతిసారి హృదయం బరువై మరోవైపుకి ఒత్తిగిలి పడుకోవాలనిపిస్తుంది.
ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే వేణు ఊడుగుల ‘‘నీదీ నాదీ ఒకటే కధ’’ నాకు ఇలాటి భావాన్నే కలి గించింది. కనుక. కాలం గడిచి గడిచి పోయాక, చాలా ఏళ్ళకెపుడో ఏదో సంఘటన పరిష్కరించలేనిది తటస్థపడినపుడు దారి చూపించగలదు చూడండి.. దానిని మనం అత్యుత్తమ కళా రూపం అంటాం . వేణు ఊడుగుల సినిమా అలాంటిదే. అనేక ఒత్తిళ్ల మధ్య చిక్కుకుని, మార్కెట్ చెబుతున్న మార్గంలో పయనించలేక, సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్ రేస్‌లో నిలువలేక రాలి పడిపోతున్న, అయోమయానికి, ఆత్మన్యూనతకు లోనవుతున్న అనేకమందిని వేణు మనకు పరిచయం చేశాడు.
చాలా సినిమాలు ఉదాత్తతను చెబుతూనే మధ్యలో ఎక్కడో పురుష దాస్యాన్ని చెబుతుంటాయి. ఫిదా సినిమా చూస్తున్నపుడు నాకు ఇలాటి ఆశ్చర్యమే కలిగింది. తాటి చెట్టంత మగవాళ్ళు ఇద్దరుండగా, అక్కకు సహాయానికి చెల్లి ఇండియానుంచి రావడమూ, కాలేజ్‌లో తన మీదికి వచ్చిన మగపిల్లలపై, వీరనారిని అని చెప్పుకునే నాయిక నాయకుడి వీరత్వ ప్రదర్శనకు ఎదురుచూడటం, ఇంటి చాకిరీ బాధ్యతగా చేయడం, ఆమె వూగిసలాట చాలా చిరాకు తెప్పించింది. వేణు సినిమాలో అలాంటి ద్వైదీయతలు ఉండవు. మొదటినుండి కడదాకా ఒకటే విషయం, స్థిరచిత్తంతో ప్రశ్నిస్తూ వెడతాడు. ‘మీరు సాధించగలరు’ అని ఒకలాటి భ్రమాత్మకత మాదకత వైపుకి నేటి యువతరాన్ని నెడుతున్న అనేక అంశాలను వేణు ప్రశ్నిస్తాడు .
వేణు చాలా మృదువైన అబ్బాయి. మితభాషి, ముఖంనిండుగా మాటలు అక్కరలేని మౌనం చిద్విలాసంగా వెలుగుతూ ఉంటుంది. అతనిది ‘‘లవ్ ఎట్ రీజనల్ మైల్ స్టోన్’’ నేను చదివిన మొదటి కవిత. అట్లాగే మనసుకు హత్తుకు పోయింది. ప్రేమ సంబంధాలలోకి ఓ ప్రాంతం ఎలా చొచ్చుకొస్తుందో చెప్తాడు ఈ అబ్బాయి ఎంతో హృద్యంగా. ‘‘వంద ప్లాస్టిక్ సర్జరీలు కావాలి–ఆమె చెంపలపైనున్న నా ముద్దుల తడి ఆరడానికి! ఏడు సముద్రాలు కావాలి – నేను మాత్రమే కని పించే ఆ రెండు కళ్ళని కడుక్కోవడానికి’’ అంటూ నీది మా ఏరి యానే అయితే ఈ గొడవే ఉండేది కాదు అని వెళ్ళిపోయిన ప్రాంతీయేతర ప్రియురాలి గురించి అతను రాసిన కవిత సాహిత్య ప్రపంచంలో ఒక సంచలనం. సామాజిక స్పృహ నిండుగావున్న వ్యక్తి తన ఆలోచనలకు దృశ్య రూపం ఇస్తే అది కచ్చితంగా చాలా పాతదే అయిన మట్టిని చీల్చుకుని బుజ్జి బుజ్జి మారాకులు వేసుకుని ఆత్మవిశ్వాసంతో సూర్యుని దిక్కుకి ధిక్కారంతో తల ఎత్తి ప్రశ్నలు వేస్తున్న చిట్టి మొలకలా ఉంటుంది. వేణు ఇప్పుడు మనముందుంచిన ‘‘నీదీ నాదీ ఒకటే కథ’’ అచ్చం అలాటి సినిమానే.
ఎన్నో విలువయిన ప్రశ్నలను ఒక అమాయకుడయినా ఎదిగీ ఎదగని అబ్బాయి చేత అడిగించాడు ఈ దర్శకుడు. సంతృప్తిగా బ్రతకడమంటే ఏమిటీ? సంతృప్తికి కొలమానాలేవి? యూనివర్సిటీలో ఉన్నపుడు క్లాస్ నుంచి తిరిగివస్తుంటే అంత వరకు మట్టి పని చేసిన కూలీలు కేరేజీలు విప్పి వరుసగా కూర్చుని భోజనం చేస్తుండేవారు, మధ్యమధ్యలో బోలెడు చతురులు. ఒక ముద్ద అడిగి పెట్టించుకు తినాలనిపించేది వాళ్ళని చూస్తే. వాళ్ళు సంతృప్తిగా లేరనా? ఇంటికెళ్లి ఉడుకు నీళ్లు పోసుకుని పడుకుంటే వాళ్లకి పట్టే నిద్ర చిరంజీవికి పడుతుందా, మోదీకి పడుతుందా.
మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నాకు నచ్చింది వ్యక్తిత్వ వికాస తరగతులూ, పుస్తకాలు. ఈ మధ్య కాలంలో వేలం వెర్రిగా మార్కెట్‌ను ఆక్రమించుకుంటున్న ఈ అంశం గురించి వేణు భలే చెప్పాడు. ‘‘గొప్ప విజయాలకు ఎల్లప్పుడూ గొప్పత్యాగాలు అవసరమవుతాయి’’ అంటాడు మోటివేషనల్ స్పీకర్ రాబిన్ శర్మ. శాక్రిఫైస్ అనేదానికి పరిమితి ఏమిటీ? ఎంతవరకూ? తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు చుట్టూ అల్లిపెడుతున్న బంగారు వలలో పడి పిల్లలు చేస్తున్న త్యాగాల అత్యాచారాన్ని ఎవరైనా కొలతలు వేస్తున్నారా?
వేణు వేసిన అన్నిటి కన్నా పెద్ద ప్రశ్న ఒకటి ఉంది అది ’’డిగ్నిటీ ఆఫ్ లేబర్’’. డిగ్నిటీ అఫ్ లేబర్ అంటే ఏమిటీ, మనమూ, మనపక్కన వ్యక్తి చేస్తున్న పని ఏదయినా అది విలువయినదే. నేను కార్ నడుపుతాను, నువ్వు ఆ కార్ ఓనర్‌వి అయితే ఏమిటీ, నాకు ఈ వృత్తి వచ్చు, నీకు మరో వృత్తి వచ్చు. ఒక వృత్తి మాత్రమే గొప్పది అని నిర్వచించిన కుట్ర ఎక్కడ మొదలయింది? లేచీ లేవగానే తిండి గింజల కోసం రెక్కలల్లార్చుకుని ఆకాశపు దారుల్లో బయలుదేరే పిట్ట కడుపు నిండాక పడే తృప్తి ముందు రేపటి చింత నిలబడగలదా?
సాదా సీదా సెట్టింగుతో, ఎక్కడా కించిత్తు శారీరక ప్రదర్శనలు లేకుండా ఇన్ని ప్రశ్నలు అడిగిన ఈ అబ్బాయికి, ఇంత మంచి సినిమా తీసిన ఈ అబ్బాయికి భవిష్యత్తు మరిన్ని అవకాశపు వాకిళ్ళను తెరిచే ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పక చూడండి, ఎప్పుడో ఒకప్పుడు మనం ఫీలయిన కథ మనందరి కథ, వేణు ఊడుగుల ‘‘నీదీ నాదీ ఒకటే కథ’’.
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900
Comments
Please login to add a commentAdd a comment