‘‘ఈ దేశంలోని ఆడదానికి ఒళ్లంతా ముళ్లుండే రోజు ఎప్పుడొస్తుందా’’ అన్నారొక రచయిత్రి. స్త్రీలు అవసరమైనపుడు ఒళ్లంతా ముళ్లు పుట్టించుకుని తమను తాము రక్షించుకోగల విద్యలో తర్ఫీదు అవ్వాల్సి ఉంది.
ఆలోచనం
ఢిల్లీ కోర్టులో 2014లో నమోదైన ఒక కేసుపై నిన్న తీర్పు ఇస్తూ జస్టిస్ సీమా మైని ‘‘స్త్రీ తన శరీరమంతటికీ తానే హక్కుదారు. ఆమె అనుమతి లేకుండా ఆమె శరీరాన్ని తాకే హక్కు ఎవరికీ లేదు. తీవ్ర వాంఛాపరులైన, లైంగికంగా విపరీతబుద్ధి కలిగిన మనుషులు ఇలాంటి చర్యల ద్వారా శృంగారపరమయిన కిక్కును పొందుతారు’’ అని పేర్కొంటూ ఆ నేరస్తుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను, పదివేల జరిమానాను విధిం చారు. తల్లితో వెళుతున్న తొమ్మిదేళ్ల పాపను జన సమ్మర్ధంలో తాకరాని చోట తాకి పైశాచికపు ఆనందాన్ని పొందిన ఒక వ్యక్తికి పడ్డ శిక్ష అది. అలా తాకాలనే కాంక్ష వున్న మగవాళ్లు తమ కోరికను తమలోనే అణిచివేసుకోవాలన్నంతగా భయపెట్టే తీర్పు ఇది. అయితే మన వార్తాపత్రికలు ఆ వార్తకు అతికష్టం మీద 70 పదాల స్థలాన్ని మాత్రమే కేటాయించాయి. బహుశా మీడియాకి వున్న మగ దృక్పథమే కారణం కావచ్చు.
‘భారత్ వంటి స్వేచ్ఛాయుతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న, సాంకేతికంగా బలమైన దేశంలో, మహిళలు వారు పెద్దవారైనా లేక చిన్నపిల్లలైనా సరే.. బహిరంగ స్థలాల్లో, ప్రత్యేకించి జనంతో నిండి ఉండే మార్కెట్లు, బస్సులు, మెట్రోలలో నిత్యం బాధితులుగా కొనసాగుతుండటం దురదృష్టకరం’ అన్నారు జస్టిస్ సీమా మైని. దేశంలో ప్రతిరోజు ఎన్నో అత్యాచారాలు జరుగుతుండగా వాటిలో వెలుగులోకి వచ్చే అత్యాచారాల సంఖ్యే అతి తక్కువగా ఉంటుంది. అటువంటిది బస్సులో ఏమీ తెలియనట్టు, పనిలో ఏ ఫైలో ఇస్తున్నట్టు ఎరిగీ ఎరగకుండా తాకి ఆనందపడే మగవాళ్ల సంఖ్య రోజుకి కోట్లల్లో ఉంటుంది. నమోదు చేస్తూ వెళితే ఒక్క రోజులోనే, అత్యున్నత స్థానంలో ఉండీ, తోటి మహిళాధికారి రూపెన్‌తో అసభ్యకరంగా ప్రవర్తించి, పిర్రమీద చరిచిన కేసులో జైలుపాలైన కేపీఎస్ గిల్ లాంటి వాళ్లు బోలెడు మంది కనబడతారు.
ఇలాంటి కోట్ల మంది కామ పిశాచుల అత్యాచారాలను అంతరాలు లేకుండా స్త్రీలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో మగవాళ్లు అభ్యం తరకర రీతిలో తాకడంపై మాట్లాడుతూ కథానాయిక అనుష్క ‘‘ఈ మధ్య హైదరాబాద్‌లో నాకిలాంటి ఓ ఘటన జరిగింది. ఆ మూమెంట్లో చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది. కానీ, అలా చేయలేం కదా. అందుకే కొట్టాను. ఆ ఘటన జరిగిన రోజు రాత్రి నిద్ర పట్టలేదు. వక్రబుద్ధి ఉన్నవాళ్లే ఇలా చేస్తారనుకుంటా’’ అని పేర్కొన్నారు. అనుష్క చదువుకున్న, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న, చుట్టూ మందీ మార్బలం ఉన్న వ్యక్తి. ఆమె ఆ క్షణంలో అనుకుని ఉంటే, చంపెయ్యాలన్నంత తన కోపానికి ఒక రూపాన్ని ఇచ్చి ఉండొచ్చు.
బాంబే హైకోర్ట్ 2014లో మహేంద్ర చాటే కేసును విచారిస్తూ, ‘మీరు మహిళ భుజంపై మీ చేయి ఉంచినా సరే, ఆ స్పర్శ స్వభావం స్నేహపూర్వకమైనదా, సోదరపూర్వకమైనదా లేక పితృవాత్సల్యంతో కూడినదా అనే అంశంపై వ్యాఖ్యానించవలసింది ఆ మహిళ మాత్రమే’ అని వ్యాఖ్యానించిందని తెలిసి ఉంటే, తనని అభ్యంతరకర రీతిలో తాకిన ఆ వ్యక్తిని కొట్టడానికైనా సరే అతనికి చేయి తగిలించాల్సిన పని లేకుండా అనుష్క కేసు నమోదు చేసి ఉండొచ్చు, ఏ రెండేళ్లో జైలులో కూర్చోబెట్టి మిగిలిన ఆడవాళ్లకు ఒక సెలెబ్రిటీగా మార్గదర్శకం చేసి ఉండొచ్చు. ఆమెకైనా లేదా ఇతర స్త్రీలకైనా చట్టం తమకేం సౌలభ్యతలు కల్పిస్తుందో తమను ఎలా కాపాడుతుందో తెలియకపోవడం, ఆ చట్టాలను ఉపయోగించుకునే చొరవ, తెగువ లేకపోవడం పెద్ద లోపం.
అలా తెలిసిన స్త్రీలను కూడా మగవాళ్లు సాంప్రదాయాల పేరు చెప్పి, సామాజిక అస్పృశ్యత బూచిని చూపించి అణచిపెడుతూ ఉంటారు. మగవాళ్లు, తమను తాము రక్షించుకోవడానికి రచించుకున్న ఈ భావజాలాలనుంచి బయటపడే తర్ఫీదు స్త్రీలకూ ఇవ్వాలి. స్త్రీవాద కవి జయప్రభ స్త్రీవాదం తొలిదశలో ‘‘చూపులు’’ అని ఒక కవిత రాశారు. ఇందులో ఆమె.. సెక్సిస్ట్ వైఖరితో ఆడదాన్ని గాయపరచగల మగవాడి చూపులెలా ఉంటాయో.. అవి ఆడవాళ్లని ఎంతగా హింస పెడతాయో చెబుతారు.. ‘‘రెండు కళ్లనించి చూపులు సూదుల్లా వచ్చి/ మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతుంటాయి /చూపులెప్పుడూ ముఖంలోకి చూడవు /మాట ఎప్పుడూ మనసు నించి పుట్టదు /కనిపించినప్పుడల్లా కంపరం పుట్టేలా/ఒంటిమీద చూపులు చెదల్లా పాకుతూ ఉంటాయి’’ అని చెపుతూ ‘‘ఈ దేశంలోని ఆడదానికి/ఒళ్లంతా ముళ్లుండే రోజు/ ఎప్పుడొస్తుందా’’ అని ముగిస్తారు.
పాలనా యంత్రాంగంలో ఆకాశంలో సగమన్న స్త్రీకి చిటికెడు చోటుకూడా ఇవ్వని పురుష పరిపాలకులున్న ప్రపంచం ఇది. కవి సుధ ‘‘ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలి/నీ యుద్ధం నువ్వే గెలవాలి/నీ రక్తంతో నీ మూలిగతో/నీ కత్తి డాలు నువ్వే చేసుకోవాలి’’ అని చెప్తారు స్త్రీలకు. స్త్రీలు మరోసారి ఉద్యమమై ఒకరికి ఒకరై ఈ వాక్యాలను పునరావృతం చేసుకుంటూ ముందుకు వెళ్లవలసిన అవసరాన్ని ఈ అతిచిన్ని వార్తాకథనం నాకు జ్ఞాపకం చేసింది. స్త్రీలు అవసరమయినపుడు వళ్లంతా ముళ్ళు పుట్టించుకుని తమను తాము రక్షించుకోగల విద్యలో తర్ఫీదు అవ్వాల్సిన అవసరాన్ని కూడా నాకీ వార్తాకథనం గుర్తుచేసింది.
సామాన్య కిరణ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
ఫోన్ నెంబర్ : 80196 00900
Comments
Please login to add a commentAdd a comment