ఆలోచనం
విధేయంగా ఉండే ఆడపిల్లల్ని కాదు, తలలో మెదడు ఉన్న ఆడపిల్లల్ని, మీరు అవునంటే కాదని ఖండించి తల ఎగరేసే అమ్మాయిల్ని ప్రేమించేలా చేసుకోండి. అప్పుడు తెలుస్తుంది నిజమయిన ప్రేమరుచి.
రోమియో అండ్ జూలి యట్‌లో షేక్సి్పయర్ వాడిన భాష, అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. నా కూతురు ఈ దసరా సెలవులలో ప్రఖ్యాతి గాంచిన ఈ విషాదాంత ప్రేమ నాటకాన్ని చదువుతూ చీటికీమాటికీ అమ్మా అలా అంటే ఏమిటీ, ఇలా అంటే ఏమిటీ అని అడగటం మొదలు పెట్టింది. అడుగుతూ, జూలియట్ తండ్రి క్యాపులెట్, కూతురి గురించి ‘భూమి నా ఆశలన్నింటిని కబళించినది కానీ ఆమె.. ఆమె నా ధరణికే ఆశాజనకమైన దొరసాని’ అన్న డైలాగ్ చదివి, ప్రేమికుడి కోసం పొడుచుకు చనిపోయిన జూలియట్‌ని తలచుకుని ఆ తండ్రిపై చాలా జాలిపడింది. ఆ డైలాగ్ విన్న తర్వాత నాకు హఠాత్తుగా ఈ మధ్య ప్రేమికుడి చేతిలో హత్యకు గురయిన చాందిని జైన్ జ్ఞాపకం వచ్చింది. ఆ సంఘటనతో పాటు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న ఓ విద్యార్థి జంట కూడా జ్ఞాపకం వచ్చారు. పిల్లల ఫీజులకోసమని చిన్న చిన్న ఆనందాలను కూడా మూలనపడేసి తల్లిదండ్రులు ఇంజనీరింగ్‌కి పంపిస్తే వీళ్ళ ప్రాణాలు కేవలం వీళ్ళవే అయినట్లు ఎంత సులభంగా ప్రాణాలను తృణప్రాయం అనుకున్నారు కదా అని పించి చాలా బాధ కలిగింది.
అసలు రోమియో జూలియట్‌ని మొదటిసారి చది వినపుడు నేనెలా ఫీలయ్యానో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. నేనూ నా కూతురిలానే ఏ పది హేనేళ్ల వయసులోనో ఆ నాటకాన్ని చదివాను. ఇప్పుడు నా బిడ్డలాగే అప్పుడు నేను జూలియట్ తండ్రి గురించి ఆలోచించానా? లేదా.. ‘‘గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవర్ టోల్డ్’’ అనుకున్నానా.. జ్ఞాపకం రావటం లేదు. ఇప్పుడైతే నాకది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అనిపించడం లేదు. నా కూతురుతో చాలా కచ్చగా ‘‘రోమియోకి తెలివి చాలా తక్కువ, చంచలుడు! మొదట రోసాలిన్‌ను ఇష్టపడ్డాడు, తర్వాత చాలా సులభంగా ఆ ప్రేమను వదిలి జూలియట్ వెంట పడ్డాడు. జూలియట్ నటిస్తుందా, లేక నిజమా అని ఓపికగా తెలుసుకోకుండా చచ్చిపోయాడు’’, అని ‘‘వెరీ స్టుపిడ్ హీరో ఐ హావ్ ఎవర్ రీడ్’’ అని చిరచిరా చిరాకు పడ్డాను.
తల్లిదండ్రులపట్ల కొంచెమన్నా బాధ్యత, వారేమవుతారోనన్న అక్కర లేకుండా ప్రాణాలు తీసుకున్న, తీస్తున్న ప్రేమికులను గొప్పవారనడం బాగుంటుందా? లేదా స్వార్థపరులనడం బాగుంటుందా? ప్రేమించే హృదయమున్న వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని ఉదారంగా ప్రేమిస్తారు. స్నేహితులను, తల్లిదండ్రులను, బాధ్యతలను, ముఖ్యంగా పరుల దుఃఖాలను, అందుకే ‘మీ సంతోషం కంటే అవతలి వ్యక్తి సంతోషమే ముఖ్యంగా భావించడమే ప్రేమ’ అంటాడు హెచ్ జాక్సన్ బ్రౌన్. ప్రేమ ఎదుటి మనిషిని గౌరవించడం నేర్పుతుంది. మాటలకు మృదుత్వాన్ని ఇస్తుంది. చేతలకు సరళతను నేర్పుతుంది. అన్నిటికన్నా హృదయంలో ప్రేమవున్న మనుషులు దయార్ద్రంగా ఉంటారు. తీసుకోవడంకన్నా ఇవ్వడాన్ని ఇష్టపడతారు. దానినే ఖలీల్ జిబ్రాన్ ‘ప్రేమ వశము చేసుకొనదు వశము కాదు తానెప్పుడు’ అంటాడు.
మొన్న ఒక పెళ్ళికి వెళ్లాను. వధూవరులు నునులేత యౌవనస్తులు. జీవితాంతపు ప్రేమబంధంలోకి అడుగుపెడుతున్న ఆ చిన్న పిల్లల ఎదుట పెళ్లి పురోహితుడు పదే పదే అంటున్నాడు ‘భార్య భర్తకి లోబడి ఉండాలి’ అని. ఎవరైనా ఎవరికైనా లోబడి వున్నపుడు ఆ బంధంలో ప్రేమ పుడుతుందా. లోబడి భయంతో బ్రతుకుతున్న చోట తిరుగుబాటు, చిరాకు కదా ఉంటాయి. సమానమైన మెదడు ఆలోచనా శక్తి వున్న ఆడపిల్ల జీవితపర్యంతం ప్రేమించాల్సిన భర్తకి లోబడి ఉండాలనే బోధన కాకుండా ఖలీల్ జిబ్రాన్ చెప్పాడు కదా ‘ఒకరినొకరు ప్రేమింపుడు.. కానీ ఈషణ్మాత్రము ఆ ప్రేమ మీకు బంధనమ్ము కాగూడదు ఏ క్షణమున,/అంతకన్నను మీరు మీమీ యెడదలను తీరాలు జేయుడు/ప్రేమ కడలిని వాని మధ్యనజేరి అల్లల్లాడనీయుడు/ఒకరిపాత్రను ఒకరు నింపుడు/కాని యెప్పుడు ఏక చషకమునుండి పానము చేయబోకుడు/ఒకరి కబళము ఒకరికీయుడు/ కాని యెప్పుడు ఒకే కబళము పంచుకొని సేవింపబోకుడు./సంతసంబుగ ఎల్లవేళల కలిసియాడుడు కలిసిపాడుడు/కాని యెప్పుడు వేరువేరుగ నిలిచి ఉండుడు/ ఎవరి వ్యక్తిత్వంబు వారు నిలుపుకొనుడు/వీణ తీగలు రాగమందున ఏకమయ్యును/దేనికయ్యది వేరువేరుగ నిలిచి వుండును./స్వీయకంపనము తోడ పలుకును’.
ఈ మధ్య కాలంలో బాగా హిట్ అయిన బెంగాలీ సినిమా పాట–అమాకే అమార్ మతో తాక్తే దావ్–ఈ పాట పల్లవి–నన్ను నా లాగే ఉండనివ్వు, నాకు నచ్చిన విధంగా నన్ను నేను మలుచుకొన్నాను, నాకు ఏది దొరకలేదో అది దొరకకుండానే ఉండనీ, కోరుకొన్నవన్నీ దొరికిన జీవితం వృథా... ఎంత గొప్ప వాక్యాలు కదా. మనుషులం ఎవరికి వారమే ప్రత్యేకం. ప్రేమించుకుం టున్నపుడు కూడా మనం విడివిడి మనుషులం. విడివిడి అభిప్రాయాలు ఉండే మనుషులం.
చెప్పినట్లు ఉండటం లేదనీ, చెప్పిన మాట వినడం లేదనీ ఆడబిడ్డల్ని క్రూర జంతువులు కూడా చంపవు. పురుషుడికి లోబడి ఉండే ఆడపిల్లల్ని కాదు, తలలో మెదడు ఉన్న ఆడపిల్లల్ని, మీరు అవునంటే కాదని ఖండించి తల ఎగరేసే అమ్మాయిల్ని ప్రేమించేలా చేసుకోండి. స్వయంగా వారిచేతనే దాసోహమనిపించుకోండి. అప్పుడు తెలుస్తుంది నిజమైన ప్రేమరుచి. అదే నిజమైన ప్రేమను గెలుచుకున్న రుచి.
సామాన్య కిరణ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
ఫోన్: 91635 69966