ఆలోచనం
ఏ మంచం కొనాలో, ఏం తినాలో మార్కెట్ చెబుతుంది. ప్రభుత్వ బడుల్లో మంచి చదువు దొరకదని మార్కెట్టే చెప్పింది. మార్కెట్ ఇంతలా మనల్ని అల్లుకుని వున్న ఈ కాలంలో మోదీ మూస మాటల వల్ల ఏం లాభం జరుగుతుంది?
పోయిన శుక్రవారం ఢిల్లీలో ‘‘పరీక్షా పర్ చర్చ’’ అనే కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో ముచ్చటిస్తూ, మోడీ ‘‘మీ మొత్తం దృష్టినంతా నేర్చుకోవడంపై పెట్టాలి. ఫలితాలు, మార్కులు అనేవి అనుబంధ ఉత్పత్తులుగా ఉండాలి’’ అని, అంతటితో ఆగక ‘‘తమ పిల్లలు ఏదో అవ్వాలన్న తల్లిదండ్రుల స్వప్నాలను మీరు అంగీకరించాలి’’ అన్నారు. మోదీ పలికిన ఈ ఆణిముత్యాలను నెమరువేసుకుంటూ ఉంటే, నాకు, కార్పొరేట్ కళాశాలల దౌష్ట్యం వల్ల, గత రెండేళ్లలో దాదాపు 450 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. ఇవన్నీ నాకు పదే పదే నా చదువును జ్ఞాపకం చేశాయి.
నా తల్లికి నన్ను డాక్టర్‌గా చూడాలని ఉండేది. నాకేమో మెదడులో ఎడమ భాగం కన్నా కుడి భాగం చురుకుగా పనిచేసేది. ఎడమ వైపు మెదడు తార్కికమైన, క్రమానుగతమైన సైన్స్, మ్యాథ్స్‌లకు చెందగా, కుడి వైపు మెదడు సమగ్ర చింతన, సృజనాత్మకత, కళా సంగీతాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏ మనిషికీ కేవలం కుడి లేకా ఎడమ మెదడు మాత్రమే పని చేయడం ఉండదు కానీ, ఒక వైపు మెదడు మరో వైపు కంటే చురుకుగా పని చేయడం సాధారణంగా ఉంటుందట. అట్లా నన్ను వేకువన, మా హాస్టల్‌లో చదువుకోవడానికని లేపితే, ఎంతకీ నా బుర్రలోకి ఎక్కని ఫిజిక్స్ మెటీరియల్ చేతిలో పట్టుకుని, స్టడీ చైర్లో కూర్చుని, నా చుట్టూ ఆవరించి వున్న లైట్ వెలుతురుకి ఆవల వున్న నిశీధిని దాటి, చాలా దూరంలో వున్న స్మశానంకేసి చూస్తూ, అసలు ప్రపంచం చెప్తున్నట్లు కొరివి దయ్యాలనేవి ఉన్నాయా అని శ్రద్ధగా వెదికేదాన్ని. కొరివి దయ్యాలు కనిపించేవి కావు కానీ, మార్కులు మాత్రం గుడ్డు సున్నాలు వచ్చేవి. నా అదృష్టం బాగుండటం చేత నేను సైన్స్ నుంచి బయటపడి ఆర్ట్స్‌కి వచ్చాను. అప్పుడిక నా కుడి మెదడు వికసించి, ఎదురు లేకుండా బంగారు పతకాలతో, బహుమతులతో విజయబావుటా ఎగురవేసుకుంటూ వచ్చాను.
ఐన్‌స్టీన్ ‘‘ప్రతి ఒక్కరూ మేధావే. కానీ మీరు చెట్లు ఎక్కగలగడాన్నిబట్టి చేప సామర్థ్యాన్ని నిర్ధారిస్తానంటే అది జీవితాంతం తాను మందమతిని అని నమ్మేస్తూ బతుకుతుంది’’ అంటాడు. నా చదువు గుర్తొచ్చినప్పుడల్లా నాకీ కొటేషన్ జ్ఞాపకం వస్తుంది. అసలు చేపల్ని చెట్లు ఎక్కించాలని నేటి తల్లిదండ్రులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రాణాలు పోగొట్టుకున్న ఈ 450 మంది పిల్లల తల్లిదండ్రులు వారిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మాత్రమే ఎందుకు చూడాలనుకుంటున్నారు? సమాజం మనుషుల ఉన్నతిని డబ్బుతోనే కొలుస్తుంది కనుక, తమ పిల్లలు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాలంటే డబ్బులొచ్చే చదువులు చదవాలన్నది వారి ఆశ. వారి ఆశ లేదా డిమాండు యొక్క సృష్టే కార్పొరేట్ కళాశాలలు. అందరూ అంటున్నట్లు ఆత్మహత్యలకు కారణం కార్పొరేట్ కళాశాలలు కాదు. తల్లిదండ్రులు అందుకు కారణం. తల్లిదండ్రుల ఆశని డబ్బురూపంలో స్వీకరించే కళాశాలలు వారి ఆశలను ఫలింపచేయడానికి రకరకాల పద్ధతులను కనిపెట్టి ‘సప్లై’ చేస్తున్నాయి. సోషల్ డార్వినిజం ‘సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్’ సిద్ధాంతాన్ని చెప్తుంది. ఒత్తిడిని తట్టుకోగలిగిన వాళ్ళు తట్టుకుని డాక్టర్లో మరొకటో కావచ్చు, అలా కాని వాళ్ళు పెద్దల ఆశకు, కళాశాలల ఆచరణకు మధ్యన నలిగి బలి అవుతున్నారు.
తల్లిదండ్రులు చేపల్లాంటి తమ పిల్లల్ని చెట్లెక్కాలని కోరుకోవడం వెనుక వున్న ప్రోద్బలాన్ని ‘‘మార్కెట్’’ అంటున్నాడు మైఖేల్ జె.శాండల్ తన ‘వాట్ మనీ కాంట్ బై’ అన్న పుస్తకంలో. ‘‘ఇటీవలి దశాబ్దాల్లో, మార్కెట్ విలువలు జీవితంలోని ప్రతి ఒక్క అంశంపైనా అంటే వైద్యం, విద్య, ప్రభుత్వం, చట్టం, చివరకి కుటుంబ జీవనం పైన కూడా ప్రభావితం చూపుతూ వచ్చాయి. మనం మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నుంచి మార్కెట్ సమాజం వైపు కొట్టుకుని పోతున్నాము... ఏ ఆలోచనాత్మకమైన ఎంపిక ద్వారానో మనం ఈ స్థితికి రాలేదు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయినందువల్ల, మార్కెట్, మార్కెట్ చింతన అనేవి కనీవినీ ఎరుగని ప్రతిష్ఠను ఆస్వాదిస్తున్నట్లుంది. ఇదే నిజం కావచ్చు కూడా.’’అంటారు.
నా తండ్రి కాలంలో చదువు ఒక చాయిస్ మాత్రమే, బ్రతుకుదెరువు కాదు. ఇప్పుడలా కాదు ఏ మంచం కొనాలో, ఏం తినాలో మార్కెట్ చెబుతుంది, మనుషుల్ని ప్రలోభ పెడుతుంది. ప్రభుత్వ బడుల్లో మంచి చదువు దొరకదు అని మార్కెట్టే మనకు చెప్పింది. మార్కెట్టు ఇంతలా మనల్ని అల్లుకుని వున్న ఈ కాలంలొ మోడీ మూస మాటల వల్ల ఏం లాభం జరుగుతుంది? ఇప్పుడు మనముందున్న మార్గాలు రెండే. మొదటిది విద్యావ్యవస్థని మార్కెట్ బంధనాలనుంచి తప్పించి, సంపూర్ణంగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకుని విద్యను జ్ఞానాన్ని, సంస్కారాన్ని ఇచ్చేదిగా తీర్చిదిద్దడం. రెండు, సోషల్ డార్వినిజం ప్రకారం ఆత్మహత్యలు చేసుకునే పిల్లలు చేసుకోగా, పటిష్టమైన వారే సమాజంలో మిగుల్తారులే అని చూసీ చూడనట్టు ఊరుకోవడం. మోదీ మొదటి మార్గాన్ని ఎంచుకుని ఆ దిశగా అడుగులు వేస్తే ఎంత బాగుంటుంది కదా!
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900
సామాన్య
Comments
Please login to add a commentAdd a comment