న్యూఢిల్లీ: అధిక సమయం స్క్రీన్‌లకు అతుక్కుపోతే అది మీ నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని విద్యార్థులను ప్రధాని మోదీ సున్నితంగా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా పరీక్షల వేళ విద్యార్థుల ఒత్తిడిని పోగొట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ఏడో విడత ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం సోమవారం ఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. వర్చువల్‌గా పాల్గొన్న కోట్లాది మంది విద్యార్థులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. మోదీ విద్యార్థులకు చేసిన పలు సూచనలు, సలహాలు ఆయన మాటల్లోనే..
అవసరం మేరకే ఫోన్ వాడతా
‘ జీవనశైలి సక్రమంగా ఉండాలంటే ఏదీ అతిగా ఉండొద్దు. అతి స్క్రీన్ టైమ్, రీల్స్ చూడటం మీ నిద్రాకాలాన్ని మింగేస్తుంది. ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం నిద్ర అనేది అత్యంత కీలకం. అలాంటి నిద్ర తక్కువకాకుండా చూసుకోండి. నేనైతే అవసరమైన మేరకే ఫోన్ వాడతా. నిద్రకు ఉపక్రమించిన కేవలం 30 సెకన్లలోనే గాఢ నిద్రలోకి జారుకుంటా. రోజూ కొద్దిసేపు ఎండలో గడపండి. ఫోన్‌కు చార్జింగ్ లాగే పిల్లలకు పౌష్టికాహారం ముఖ్యం. ఎక్సర్‌సైజ్ చేసి ఫిట్‌గా ఉండండి. అప్పుడే చక్కగా చదవగలరు’’ అని అన్నారు.
అలాంటి వారితో స్నేహం చేయండి
‘‘ చదువుల్లో బాగా కష్టపడుతూ, తెలివితేటలు ఉన్న తోటి విద్యార్థులతో స్నేహం చేయండి. అప్పుడే వారి నుంచి స్ఫూర్తి పొందగలరు. పేరెంట్స్‌కు నాదో సూచన. పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ మీకు విజిటింగ్ కార్డ్ కాదు. మీరు వెళ్లినచోట మీ పిల్లల చదువుసంధ్యల గురించి అతిగా మాట్లాడకండి. ఎప్పుడూ ఇతర పిల్లలతో పోల్చి చూపకండి. ఇది మంచి పద్ధతి కాదు. పూజ చేసి కొత్త యూనిఫాం, స్టేషనరీ కొని పరీక్ష రోజును ప్రత్యేకమైన దినంగా మార్చేయకండి’’ అని చెప్పారు.
చిన్న లక్ష్యాలతో మొదలెట్టండి
‘‘పిల్లలను మూడు ఒత్తిళ్లు ఇబ్బందిపెడతాయి. ఏకాగ్రత, తల్లిదండ్రుల ఒత్తిడి, ఆత్మవిశ్వాస లేమి. పరీక్షలకు ముందు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధిస్తూ మీ లక్ష్యాలను పెంచుకుంటూ పొండి. పరీక్షలు వచ్చేటప్పటికి సంసిద్ధమౌపోతారు. టీచర్–స్టూడెంట్ బంధం సిలబస్ పాఠాలకు అతీతమైనది. సిలబస్ చెబుతూనే సబ్జెక్ట్ పట్ల వారిలో భయాన్ని పొగొట్టండి. పిల్లలు బెరుకులేకుండా సందేహాలు అడిగేలా సౌమ్యంగా మెలగండి. బోధనను ఒక వృత్తిగా కాకుండా విద్యార్థుల భవతను తీర్చిదిద్దే యజ్ఞంగా భావించండి’’ అని అన్నారు.
నాక్కూడా పరీక్ష లాంటిది
‘‘పరీక్ష పే చర్చా నాకూ ఓ పరీక్ష. ఎందుకంటే నేటితరం విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు ఎక్కువయ్యాయి. వినూత్నంగా ప్రధాని ఈసారి ఏం చెప్తారా? అనుకునే విద్యార్థులకు తగ్గట్లు నేనూ ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యే రావాలికదా’’ అన్నారు.
ఇంట్లో నో గాడ్జెట్ జోన్
‘‘ తల్లిదండ్రులకు నాదో సలహా. టెక్నాలజీ నుంచి దూరం జరగలేం. అలాగని అతక్కుపోవడమూ సబబు కాదు. భోజనం చేసేటపుడు గాడ్జెట్ వాడొద్దనే నియమం పెట్టండి. ఏ యాప్ వాడినా స్క్రీన్ టైమ్ పెట్టుకోండి’’ అని సలహా ఇచ్చారు. ఈ ఏడాది 2.26 కోట్ల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి రిజిస్ట్రర్ చేసుకోవడం విశేషం.
Pariksha Pe Charcha 2024: అర నిమిషంలో నిద్రపోతా
Published Tue, Jan 30 2024 5:07 AM | Last Updated on Tue, Jan 30 2024 5:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment