Pariksha Pe Charcha
-
Pariksha Pe Charcha 2024: అర నిమిషంలో నిద్రపోతా
న్యూఢిల్లీ: అధిక సమయం స్క్రీన్లకు అతుక్కుపోతే అది మీ నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని విద్యార్థులను ప్రధాని మోదీ సున్నితంగా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా పరీక్షల వేళ విద్యార్థుల ఒత్తిడిని పోగొట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ఏడో విడత ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం సోమవారం ఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. వర్చువల్‌గా పాల్గొన్న కోట్లాది మంది విద్యార్థులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. మోదీ విద్యార్థులకు చేసిన పలు సూచనలు, సలహాలు ఆయన మాటల్లోనే.. అవసరం మేరకే ఫోన్ వాడతా ‘ జీవనశైలి సక్రమంగా ఉండాలంటే ఏదీ అతిగా ఉండొద్దు. అతి స్క్రీన్ టైమ్, రీల్స్ చూడటం మీ నిద్రాకాలాన్ని మింగేస్తుంది. ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం నిద్ర అనేది అత్యంత కీలకం. అలాంటి నిద్ర తక్కువకాకుండా చూసుకోండి. నేనైతే అవసరమైన మేరకే ఫోన్ వాడతా. నిద్రకు ఉపక్రమించిన కేవలం 30 సెకన్లలోనే గాఢ నిద్రలోకి జారుకుంటా. రోజూ కొద్దిసేపు ఎండలో గడపండి. ఫోన్‌కు చార్జింగ్ లాగే పిల్లలకు పౌష్టికాహారం ముఖ్యం. ఎక్సర్సైజ్ చేసి ఫిట్‌గా ఉండండి. అప్పుడే చక్కగా చదవగలరు’’ అని అన్నారు. అలాంటి వారితో స్నేహం చేయండి ‘‘ చదువుల్లో బాగా కష్టపడుతూ, తెలివితేటలు ఉన్న తోటి విద్యార్థులతో స్నేహం చేయండి. అప్పుడే వారి నుంచి స్ఫూర్తి పొందగలరు. పేరెంట్స్‌కు నాదో సూచన. పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ మీకు విజిటింగ్ కార్డ్ కాదు. మీరు వెళ్లినచోట మీ పిల్లల చదువుసంధ్యల గురించి అతిగా మాట్లాడకండి. ఎప్పుడూ ఇతర పిల్లలతో పోల్చి చూపకండి. ఇది మంచి పద్ధతి కాదు. పూజ చేసి కొత్త యూనిఫాం, స్టేషనరీ కొని పరీక్ష రోజును ప్రత్యేకమైన దినంగా మార్చేయకండి’’ అని చెప్పారు. చిన్న లక్ష్యాలతో మొదలెట్టండి ‘‘పిల్లలను మూడు ఒత్తిళ్లు ఇబ్బందిపెడతాయి. ఏకాగ్రత, తల్లిదండ్రుల ఒత్తిడి, ఆత్మవిశ్వాస లేమి. పరీక్షలకు ముందు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధిస్తూ మీ లక్ష్యాలను పెంచుకుంటూ పొండి. పరీక్షలు వచ్చేటప్పటికి సంసిద్ధమౌపోతారు. టీచర్–స్టూడెంట్ బంధం సిలబస్ పాఠాలకు అతీతమైనది. సిలబస్ చెబుతూనే సబ్జెక్ట్ పట్ల వారిలో భయాన్ని పొగొట్టండి. పిల్లలు బెరుకులేకుండా సందేహాలు అడిగేలా సౌమ్యంగా మెలగండి. బోధనను ఒక వృత్తిగా కాకుండా విద్యార్థుల భవతను తీర్చిదిద్దే యజ్ఞంగా భావించండి’’ అని అన్నారు. నాక్కూడా పరీక్ష లాంటిది ‘‘పరీక్ష పే చర్చా నాకూ ఓ పరీక్ష. ఎందుకంటే నేటితరం విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు ఎక్కువయ్యాయి. వినూత్నంగా ప్రధాని ఈసారి ఏం చెప్తారా? అనుకునే విద్యార్థులకు తగ్గట్లు నేనూ ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యే రావాలికదా’’ అన్నారు. ఇంట్లో నో గాడ్జెట్ జోన్ ‘‘ తల్లిదండ్రులకు నాదో సలహా. టెక్నాలజీ నుంచి దూరం జరగలేం. అలాగని అతక్కుపోవడమూ సబబు కాదు. భోజనం చేసేటపుడు గాడ్జెట్ వాడొద్దనే నియమం పెట్టండి. ఏ యాప్ వాడినా స్క్రీన్ టైమ్ పెట్టుకోండి’’ అని సలహా ఇచ్చారు. ఈ ఏడాది 2.26 కోట్ల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి రిజిస్ట్రర్ చేసుకోవడం విశేషం. -
అడ్డదారులను నమ్ముకుంటే కష్టాలే
న్యూఢిల్లీ: విద్యార్థులు షార్ట్‌కట్‌లను (అడ్డదారులు) ఎప్పుడూ నమ్ముకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. పరీక్షల్లో చీటింగ్ చేయడం వల్ల ఒకటి రెండు సార్లు లాభపడొచ్చేమో గానీ భవిష్యత్తులో మాత్రం కష్టాలు తప్పవని హెచ్చరించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ఆరో ఎడిషన్ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పరీక్షల వేళ ప్రధానంగా చదువులపైనే దృష్టి పెట్టాలని సూచించారు. దృష్టి మళ్లించే పనులకు దూరంగా ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అతిగా వాడొద్దని, తెలివితేటలపై నమ్మకం ఉంచాలి తప్ప మొబైల్ ఫోన్లపై కాదని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ వల్ల చదువుల్లో నష్టపోకుండా జాగ్రత్తపడాలన్నారు. ఫోన్లు వాడడానికి, సోషల్ మీడియా ద్వారా ఇతరులతో అనుసంధానం కావడానికి ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించుకోవాలని చెప్పారు. ఏకాగ్రత మొత్తం చదువుపైనే.. పరీక్షల్లో కాపీయింగ్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తప్పుడు పనుల వల్ల చెడ్డ ఫలితమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నిజాయితీగా కష్టపడే తత్వమే జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్తుందని విద్యార్థులకు ఉద్బోధించారు. ఒత్తిళ్లకి లోను కాకుండా పరీక్షలకు ప్రశాంతంగా సిద్ధం కావాలని అన్నారు. మన బలాలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఒత్తిడికి తావుండదని వివరించారు. పిల్లలపై కుటుంబ సభ్యులు ఎన్నో అంచనాలు పెట్టుకోవడం సహజమేనని గుర్తుచేశారు. పరీక్ష ఫలితాలు జీవితానికి ముగింపు కాదని స్పష్టం చేశారు. తన వైపు విసిరే బంతిపైనే క్రికెట్ క్రీడాకారుడు ఫోకస్ చేస్తాడని, ఫోర్లు, సిక్సుల కోసం వినిపించే అరుపులను ఏమాత్రం పట్టించుకోడని, విద్యార్థులు సైతం అలాగే ఉండాలని, వారి ఏకాగ్రత మొత్తం చదువుపైనే ఉండాలని స్పష్టం చేశారు. పిల్లల చదువులు, వారు సాధించబోయే మార్కుల గురించి తల్లిదండ్రులు గొప్పలు చెబుతుంటారని, విద్యార్థుల్లో ఒత్తిడికి ఇది కూడా ఒక కారణమని ఉద్ఘాటించారు. పిల్లలు చెప్పింది విశ్వసించాలని తల్లిదండ్రులకు హితవు పలికారు. పరీక్ష ఫలితాల గురించి లేనిపోని అంచనాలు పెట్టుకోవద్దని అన్నారు. ప్రశ్నలడిగే వారిని స్వాగతించాలి విద్యార్థుల పరిధి మరింత విస్తృతం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. 10, 12వ తరగతుల పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థులకు కొంత డబ్బు ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ డబ్బుతో కొత్త ప్రాంతాల్లో పర్యటించాలని, అక్కడి అనుభవాలను పుస్తకంలో రాయాలని విద్యార్థులతో చెప్పారు. పిల్లలను ఆంక్షల వలయంలో బందీలను చేయడం ఎంతమాత్రం సరి కాదన్నారు. కొత్త ప్రాంతాలను దర్శించేలా, కొత్త మనుషులను కలిసి మాట్లాడేలా ప్రోత్సహించాలన్నారు. ప్రశ్నలడిగే విద్యార్థులను స్వాగతించాలని ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచించారు. ఒక విద్యార్థి ప్రశ్నలు అడుగుతున్నాడంటే అతడిలోని పరిశోధకుడు మేల్కొన్నట్లు గుర్తించాలని, అది చాలా మంచి పరిణామం అని తెలియజేశారు. ఏది మంచి? ఏది చెడు? దేశంలో పౌరులు నిత్యం సగటున 6 గంటలకు పైగానే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు చూస్తున్నట్లు ఒక అధ్యయనంతో తేలిందని నరేంద్ర మోదీ వెల్లడించారు. గాడ్జెట్లకు జనం బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏది మంచో, ఏది చెడో నిర్ణయించుకొనే జ్ఞానాన్ని, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని దేవుడు మనకు ఇచ్చాడని, గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా ఇకనైనా అప్రమత్తంగా ఉందామని పిలుపునిచ్చారు. భారత్ ‘సగటు’ దేశం కాదు ప్రభుత్వంలో సగటు(యావరేజ్) వ్యక్తులే ఉన్నారని, భారత్ ఒక సగటు దేశంగానే కొనసాగుతోందంటూ వస్తున్న విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. భారత్ సగటు దేశం ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పారు. ప్రపంచంలో మన దేశం వెలిగిపోతోందని, ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆశారేఖగా మారిందని స్పష్టం చేశారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనని అన్నారు. గొప్ప విజయాలు సాధించినవారిలో చాలామంది ఒకప్పుడు సగటు వ్యక్తులేనని వ్యాఖ్యానించారు. అందరూ ‘తీస్మార్ఖాన్’లు కావాల్సిన అవసరం లేదన్నారు. విమర్శలకు, ఆరోపణలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. విమర్శ అనేది మనం బలంగా మారడానికి ఉపయోగపడే ఒక టానిక్ లాంటిదన్నారు. ఎవరైనా ఆరోపణలు చేస్తే సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యార్థులకు సూచించారు. కొందరు ఎప్పుడూ ఆరోపణలు చేస్తుంటారని, వారి అసలు ఉద్దేశం వేరే ఉంటుందని, పట్టించుకోవద్దని చెప్పారు. తెలివిగా వాడుకోవడమే తెలివి మీ గాడ్జెట్ మీ కంటే తెలివైందని ఎన్నడూ అనుకోవద్దని విద్యార్థులతో మోదీ చెప్పారు. ఆన్లైన్ గేమ్‌లు, సోషల్ మీడియాకు బానిసలుగా మారొద్దన్నారు. తరచుగా ‘టెక్నాలజీ ఉపవాసం’ చేయాలన్నారు. ఫోన్లను పూర్తిగా పక్కన పెట్టాలని వెల్లడించారు. అలాగే ప్రతి ఇంట్లో టెక్నాలజీ–ఫ్రీ–జోన్ ఉండాలన్నారు. దీనివల్ల ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని, పిల్లలు గాడ్జెట్స్‌కు బానిసలుగా మారకుండా ఉంటారని వివరించారు. తాను రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ చేతిలో ఫోన్‌తో చాలా అరుదుగా కనిపిస్తుంటానని మోదీ తెలిపారు. ఫోన్లో మాట్లాడడానికి కొంత సమయం కేటాయించుకుంటానని అన్నారు. టెక్నాలజీని పూర్తిగా పరిహరించాలని తాను చెప్పడం లేదని, మనకు అవసరమైన పరికరాలు అవసరమైనంత మేరకే వాడుకోవడం ఉత్తమమని వెల్లడించారు. మనం తెలివైనవాళ్లమా? లేక మన ఫోన్ తెలివైనదా? అనేది విద్యార్థులు నిర్ణయించుకోవాలన్నారు. ఫోన్ మాత్రమే తెలివైందని భావిస్తే సమస్య మొదలైనట్లేనని పేర్కొన్నారు. ఫోన్‌ను తెలివిగా వాడుకోవడంలోనే తెలివి దాగి ఉందన్నారు. ఫోన్‌ను ఉత్పాదకత పెంచుకోవడానికి ఉపయోగపడే ఒకపరికరంగా భావించాలని కోరారు. ఇదీ చదవండి: అన్ని భాషలు నేర్చుకోవాలనే తపన ఉండాలి- ప్రధాని మోదీ -
‘పరీక్షా పే’ చర్చలో అక్షర.. 9వ తరగతి విద్యార్థినికి ప్రధాని మోదీ సమాధానం
సాక్షి, హైదరాబాద్ (రాయదుర్గం): ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రశ్నించే అవకాశం శేరిలింగంపల్లి గోపన్‌పల్లిలోని జవహర్ నవదోయ విద్యాలయలోని 9వ తరగతి చదివే ‘అక్షర’కు కలిగింది. ఈ కార్యక్రమంలో అక్షర వీడియో ద్వారా ప్రధాని నరేంద్రమోదీని ‘మల్టిపుల్ ల్యాంగ్వేజ్‌లను నేర్చుకోవడానికి విద్యార్థులు ఏమి చేయాలి?’ అని ప్రశ్నించింది. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ఈ ప్రశ్నను ఇద్దరు విద్యార్థినిలు ప్రధాని దృష్టికి తేగా ఆయన స్పందిస్తూ దేశంలోని ప్రతి విద్యార్థి కూడా తన మాతృభాషతోపాటు ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక వాక్యం మాట్లాడడానికి అవకాశం కలిగేలా చూడాలని కోరారు. దేశంలో ఎన్న భాషలు ఉన్నాయో..వాటన్నింటిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు. ప్రధాని ప్రతిష్టాత్మకంగా ప్రతియేటా నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో మొదటిసారిగా జవహర్నవోదయ విద్యాలయ విద్యార్థినికి అవకాశం కలుగడం విశేషం. ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం శేరిలింగంపల్లి గోపన్‌పల్లిలోని జవహర్నవోదయ విద్యాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ డానియల్ రత్నకుమార్ ఆధ్వర్యంలో తిలకించారు. అక్షర ప్రశ్న వచ్చే సమయంలో జేఎన్వీ విద్యార్థులంతా కేరింతలు కొడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం అక్షరను అభినందించారు. జేఎన్వీకి అవకాశం రావడం సంతోషకరం జాతీయ స్థాయి కార్యక్రమం ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో జేఎన్వీ రంగారెడ్డి జిల్లా విద్యార్థినికి అవకాశం రావడం సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్ డానియల్ రత్నకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఈ కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థిని అక్షర ఎంపిక కావడం, ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి వచ్చి వీడియో షూట్ ద్వారా అక్షర ప్రశ్నను తీసుకొని వెళ్లడం జరిగిందన్నారు. చదవండి: ‘తల్లిని చూసి నేర్చుకోండి.. లైఫ్‌లో షార్ట్ కట్స్ వద్దు’ -
Pariksha Pe Charcha:‘తల్లిని చూసి నేర్చుకోండి.. లైఫ్‌లో షార్ట్ కట్స్ వద్దు’
PM Narendra Modi Pariksha Pe Charcha.. విద్యార్థులకు ఇది పరీక్షా సమయం.. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పరీక్షా పే చర్య కార్యక్రమంలో పాల్గొని వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పేరెంట్స్, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ క్రమంలో వారితో ముచ్చటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. కాగా, ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియం పరీక్షా పే చర్చకు వేదికైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సమయపాలన గురించి కీలకంగా చర్చించారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే.. సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలుస్తుందన్నారు. విద్యార్థులు గెలుపు, ఓటమిని సమానంగా తీసుకోవాలని సూచించారు. ఎవరైతే పరీక్షల పట్ల శ్రద్ధ పెడతారో వారి శ్రమకు తగిన ఫలితం తప్పకుండా దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కూడా ప్రధాని మోదీని పలు ప్రశ్నలు అడిగారు. మోదీజీ.. హార్డ్ వర్క్ లేక స్మార్ట్ వర్క్.. పరీక్షా పే చర్చ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చర్చ మధ్యలో ఓ విద్యార్థి ప్రధాని మోదీని.. స్మార్ట్ వర్క్ లేక హార్డ్ వర్క్ ఏదీ ముఖ్యమైంది ప్రధాని సార్ అంటూ ప్రశ్నించాడు. దీనికి ప్రధాని సమాధానం ఇస్తూ.. ‘కొంతమంది చాలా అరుదుగా తెలివితో పనిచేస్తారు. మరికొందరు తెలివిగా కష్టపడతారు’ అన్ని అన్నారు. కొంత మంది విద్యార్థులు వారి క్రియేటివిటిని పరీక్షల్లో చీటింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఆ క్రియేటివిటి మంచి మార్గానికి వాడుకుంటే మంచి విజయాన్ని అందుకుంటారని తెలిపారు. మనం జీవితంలో ఎన్నడూ షార్ట్‌కట్స్ వెతుక్కోకూడదు. ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. వారు అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు. ఇదే సమయంలో చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి పెంచవద్దని తల్లిడండ్రులు, ఉపాధ్యాయులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వారికి నచ్చిన రంగంలో పిల్లలను ప్రోత్సహించాలన్నారు. మానసిక ఉల్లాసం ఉంటేనే పిల్లలు బాగా చదువుతారన్నారని చెప్పారు. ప్రశాంతమైన మనసుతో పిల్లలు పరీక్షలు రాస్తేనే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇక.. పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించారు. కాగా, ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో సుమారు 38.80 లక్షల మంది పాల్గొన్నారు. - విద్యార్థులు- 31.24 లక్షలు, - ఉపాధ్యాయులు - 5.60 లక్షలు, - తల్లిదండ్రులు - 1.95 లక్షల మంది ఉన్నారు. - గతేడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దాదాపు 15.7 లక్షల మంది పాల్గొన్నారు. అయితే, పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారికి వచ్చిన సందేహాలపై సమాధానాలు ఇస్తుంటారు. విద్యార్థులను పరీక్షల కోసం సిద్ధం చేస్తుంటారు. WATCH | PM @narendramodi cites the example of INDIA & its Economic Growth trajectory. Suggests not to be affected & stressed about being average or extraordinary. Link: https://t.co/b9K0J2A3OH@PMOIndia@EduMinOfIndia#ParikshaPeCharcha#PPC2023 pic.twitter.com/gNDJoZBAGR — DD India (@DDIndialive) January 27, 2023 -
పరీక్షా పే చర్చకు భారీ ఎత్తున సన్నాహాలు
సాక్షి, ఢిల్లీ: ఈసారి భారీ ఎత్తున పరీక్షా పే చర్చా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ప్రతీ ఏడాది వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థులతో చర్చా కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోదీ పాల్గొంటూ వస్తున్నారు. తద్వారా పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రధాని మోదీ.. విద్యార్థులకు మార్గనిర్దేశన చేస్తున్నారు. అయితే.. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27న ప్రధాని పరీక్ష పే చర్చ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈసారి ఈ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచాలని బీజేపీ యోచిస్తోంది. అందుకే భారీ ఎత్తున్న ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లేందుకు వందలాది పాఠశాలల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించింది. ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ అప్డేటెడ్ వెర్షన్ పుస్తకాలను పంపిణీ చేసింది. దేశం మొత్తం మీద 13 భాషలలో అందుబాటులోకి(జనవరి 19వ తేదీనే) వచ్చింది ఈ పుస్తకం. విద్యార్థులు ఒత్తిడి దూరం చేసుకునేందుకు.. చిట్కాలతో కూడిన పుస్తకం ఇది. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు హెల్తీ బేబీ షో లు నిర్వహిస్తున్నారు నేతలు. Updated edition of #ExamWarriors book by PM @narendramodi, with new mantras for both students and parents, is now available in 𝟭𝟯 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗹𝗮𝗻𝗴𝘂𝗮𝗴𝗲𝘀. Hindi, English, Tamil, Telugu, Malayalam, Kannada, Odia, Assamese, Gujarati, Marathi, Punjabi, Urdu & Bengali. pic.twitter.com/VafWDl67xW — Exam Warriors (@examwarriors) January 19, 2023 ఇక.. తెలంగాణ వ్యాప్తంగా చాలా స్కూల్స్‌లో విద్యార్థులు వీక్షించే విధంగా బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకునేందుకు బీజేపీ కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ఎజెండాలోనూ ఈ అంశాన్ని చేర్చింది. బీజేపీ సీనియర్లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, పలువురు నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దేశం నలుమూలల నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి కొన్ని పోటీలను పెట్టి, విజేతలైన వారికి మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానం ఉంటుంది. కార్యక్రమంలో.. ఎంపికైన విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్ పాల్గొంటారు. -
బ్రిటన్ రాజుకు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం బ్రిటన్ రాజు చార్లెస్–3తో ఫోన్లో మాట్లాడారు. వాతావరణ మార్పులు, జీవవైవిధ్య పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో వినూత్న ఆవిష్కరణలు వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)తెలిపింది. 27న ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చా’ ఈ నెల 27వ తేదీన వార్షిక ‘పరీక్షా పే చర్చా కార్యక్రమం జరగనుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోదీ మాట్లాడనున్నారు. ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో 6వ విడత పరీక్షా పే చర్చా జరగనుందని కేంద్ర విద్యాశాఖ మంగళవారం ట్వీట్ చేసింది. ఇదీ చదవండి: నెతన్యాహుకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ -
పరీక్షలకు పండుగలా సిద్ధం కావాలి
న్యూఢిల్లీ: పరీక్షలంటే భయం వద్దేవద్దని విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. పరీక్షలకు ఒక పండుగలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పరీక్షలు రాయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఎన్నో పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొన్న అనుభవం విద్యార్థులకు ఉందని, ఒత్తిడికి లోను కావొద్దని సూచించారు. తాము నెరవేర్చుకోలేని కలలు, ఆకాంక్షలను పిల్లలపై బలవంతంగా రుద్దవద్దని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తును నిర్ణయించుకొనే స్వేచ్ఛను పిల్లలకు ఇవ్వాలన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో కేంద్ర విద్యా శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ నిర్వహించిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. ► వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలతో సమస్య ఏమీ లేదు. సమస్య మన మనసుల్లోనే ఉంది. ఆన్లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా సరే చదువుపై మనసు పూర్తిగా లగ్నం చేయాలి. అప్పుడు పరధ్యానానికి తావుండదు. ► చదువు నేర్చుకోవానికి అందుబాటులోకి వస్తున్న నూతన మార్గాలను ఒక అవకాశంగానే భావించాలి తప్ప సవాలు అనుకోకూడదు. ► విద్యార్థులు అప్పుడప్పుడు ఇన్లైన్లోకి (వారితో వారే గడపాలి) వెళ్లాలి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో గడపడానికి దూరంగా ఉండాలి. ► విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు నా వయసు 50 ఏళ్లు తగ్గిపోయినట్లుగా అనిపిస్తోంది. ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం నాకు ఎంతగానో తోడ్పడుతోంది. ► కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) దేశంలో అన్ని వర్గాలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తుండడం సంతోషకరం. ► నచ్చిన సబ్జెక్టులను అభ్యసించే అవకాశం ఎన్ఈపీలో ఉంది. సరిగ్గా అమలు చేస్తే భవ్యమైన భవితకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ► పోటీని చూసి బెంబేలెత్తిపోవాల్సిన పని లేదు. దాన్ని జీవితంలో అతిపెద్ద బహుమతిగా భావించాలి. పోటీని ఆహ్వానించాలి. అప్పుడే మనం పరీక్షకు గురవుతాం. సామర్థ్యం బయటపడుతుంది. యువతరం ఎదుట ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందుకు గర్వపడాలి. ► ‘పీ3 (ప్రో ప్లానెట్ పీపుల్) ఉద్యమ’ అవసరం ఎంతైనా ఉంది. ‘యూజ్ అండ్ త్రో’ సంస్కృతిని వదిలించుకోవాలి. బాలికల ప్రతిభను గుర్తించకపోతే ప్రగతే లేదు కుమారులతోపాటు కుమార్తెలను సమానంగా చూడాలని ప్రధాని మోదీ చెప్పారు. ఇరువురి మధ్య భేదభావం చూపొద్దని కోరారు. ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. బాలికల ప్రతిభను గుర్తించని సమాజం ఎప్పటికీ ప్రగతి సాధించలేదని స్పష్టం చేశారు. పరీక్షా పే చర్చలో ఆయన మాట్లాడుతూ... గతంలో బాలబాలికల మధ్య వ్యత్యాసం చూపేవారని, ఇప్పుడు పరిస్థితి చాలావరకు మారిపోయిందని అన్నారు. కొత్తగా పాఠశాలల్లో చేరుతున్నవారిలో బాలల కంటే బాలికలే ఎక్కువ మంది ఉంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి బాలికలు పెద్ద ఆస్తిగా, బలంగా మారుతున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో బాలికలు రాణిస్తున్నారని ఉద్ఘాటించారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడానికి పెళ్లికి దూరంగా ఉన్న కుమార్తెలు ఎంతోమంది ఉన్నారని, అదే సమయంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చి, హాయిగా కాలం గడుపుతున్న కుమారులు కూడా ఉన్నారని మోదీ వ్యాఖ్యానించారు. -
విద్యార్థులతో ప్రధాని మోదీ మాటామంతీ
-
ప్రధాని మోదీకి తెలుగు విద్యార్థిని ప్రశ్న, ఊహించని గిఫ్ట్
సాక్షి, ప్రకాశం: ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడిన పల్లవిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అభినందించారు. ఆమె ఉన్నత విద్యకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. గురువారం మార్కాపురంలోని తన నివాసంలో మంత్రి పల్లవిని సత్కరించారు. తల్లిదండ్రులు మోహనరావు, సంపూర్ణ, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావుతో కలిసి వచ్చిన పల్లవితో ఆయన మాట్లాడారు. ‘‘ఎంతో ధైర్యంగా ప్రశ్న అడిగావు.. ప్రధాని సమాధానం ఇచ్చారు. శభాష్ పల్లవి..’’ అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. భవిష్యత్తులో ‘‘నీ లక్ష్యం ఏమిటి’’ అని పల్లవిని మంత్రి.. ప్రశ్నించగా తాను డాక్టర్ కావాలనుకుంటున్నట్లు చెప్పడంతో ప్రభుత్వం తరపున ఉన్నత చదువుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. పల్లవి ఆన్లైన్ విద్యాభ్యాసానికి తమ ఇంట్లో టీవీ లేదని చెప్పగా మంత్రి అప్పటికప్పుడు టీవీతో పాటు డిక్షనరీని కూడా బహూకరించారు. ధైర్యంగా ప్రధానిని ప్రశ్నించిన పల్లవి ‘పరీక్షా పే చర్చ' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పల్లవి ఎంపికై తన సందేహాలను వీడియో ద్వారా ప్రధాని ముందుంచింది. 'కరోనా ప్రభావంతో ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పరీక్షలు దగ్గర పడుతుండటంతో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నాం. భయాన్ని వీడి ఏకాగ్రతతో పరీక్షలు రాసేందుకు ఉపాయం చెప్పండి' అని పల్లవి కోరింది. ఇందుకు ప్రధాని 'పరీక్షలంటే భయపడవద్దు. మనల్ని మెరుగుపరచుకునేందుకు ఉపకరించేవిగా వాటిని చూడండి. కొన్నిసార్లు సామాజిక, కుటుంబ వాతావరణం కూడా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఒత్తిడి లేకపోతే విద్యార్థులు పరీక్షలను భారంగా భావించరు. కష్టంగా అనిపించిన సబ్జెక్టుల నుంచి దూరంగా పారిపోవద్దు. నా వరకు నేను కష్టమైన పనిని ఉదయాన్నే చేస్తాను. అప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది. సులభమైన పనుల్ని రాత్రి పొద్దుపోయాక చేస్తుంటాను'' అని సమాధానమిచ్చారు. ( చదవండి: ‘నే ఆటోవాణ్ణి.. పచ్చదనం రూటువాణ్ణి! ) -
పరీక్షల పై ప్రధాని ప్రసంగం
-
మోదీకి కుంబ్లే కృతజ్ఞతలు..
న్యూఢిల్లీ: తనను ప్రేరణగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కృతజ్ఞతలు తెలిపారు. పరిక్షా పే చర్చా కార్యక్రమంలో తన గురించి ప్రస్తావించిన మోదీకి కుంబ్లే ధ్యనవాదాలు తెలియజేశారు. అలాగే పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వివరాల్లోకి వెళితే..గత రెండు సంవత్సరాలుగా పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ఒత్తిడికి గురికాకుండా మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని తాల్కోట్రా స్టేడియంలో నిర్వహించారు. దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని..టీమిండియా క్రికెటర్లు సాధించిన గొప్ప ప్రదర్శనలను తెలియజేసి విద్యార్థులకు మోదీ ప్రేరణ కలిగించారు. మెదీ మాట్లాడుతూ..2001 సంవత్సరంలో కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ను గుర్తు చేశారు. ఫాలో ఆన్‌ను ఎదుర్కొంటు, ఓటమి దాదాపు ఖాయమనుకున్న స్థితిని నుంచి టీమిండియా బ్యాట్స్మెన్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ అద్వితీయ ఆటతీరును కనబరిచి చరిత్రాత్మక విజయాన్ని అందించారని అన్నారు. తీవ్ర ఒత్తిడిలోను రాహుల్, లక్ష్మణ్ ప్రదర్శించిన తీరును విద్యార్థులు ప్రేరణగా తీసుకొని.. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలను విజయవంతంగా రాయాలని మోదీ ఆకాంక్షించారు. పరీక్షలలో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చచడానికి విద్యార్థలకు ఈ రెండు సంఘటనలు ప్రేరణ కలిగిస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. చదవండి: 'ధోని ఉంటాడో లేదో ఐపీఎల్‌తో తేలిపోనుంది' Honoured to have been mentioned in #ParikshaPeCharcha2020 Thankyou Hon. PM @narendramodi ji. Best wishes to everyone writing their exams. pic.twitter.com/BwsMXDgemD — Anil Kumble (@anilkumble1074) January 22, 2020 -
మార్కులే సర్వస్వం కాదు..
న్యూఢిల్లీ: విద్యార్థులకు పరీక్షలే ప్రధానం కాదనీ, తమ ఆసక్తులను బట్టి విద్యార్థులు ఎదగాలనీ, సాంకేతికతకు బానిసలు కారాదనీ ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా హాజరైన విద్యార్థులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. తాత్కాలికంగా ఎదురయ్యే అవరోధాలను చూసి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ప్రధాని పిల్లలకు హితవు పలికారు. పరీక్షల సమయంలో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో, పరీక్షల్లో సమయపాలనకు ఏం చేయాలో కొన్ని చిట్కాలు చెప్పారు. క్రికెట్ నుంచి మొదలుకొని, చంద్రయాన్ –2 ప్రయోగం వరకు స్వీయ అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలను ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలనీ, అయితే అది మన జీవితాలను శాసించే స్థాయికి చేరకుండా జాగ్రత్తపడాలన్నారు. ‘అత్యంత వేగంగా సాంకేతికాభివృద్ధిలో మార్పులు సంభవిస్తున్నాయి. సాంకేతికతను చూసి భయపడాల్సిన పనిలేదు. శాస్త్ర సాంకేతిక విజ్ఙానం మన స్నేహితుల్లాంటిది. దాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ∙కేవలం ఆ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ఒక్కటే సరిపోదు, దాన్ని అన్వయించడమే ప్రధానమైన విషయం. దాన్ని మనం అధీనంలో ఉంచుకోవాలి తప్ప దాని అధీనంలోకి మనం వెళ్లి సమయాన్ని వృథా చేసుకోరాదు’అంటూ విద్యార్థులకు హితబోధ చేశారు. నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి జయాపజయాలతో నిమిత్తం లేకుండా నిత్యం ప్రయత్నించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ ఆయన.. ‘చంద్రయాన్–2 ఆవిష్కరణ విజయవంతమవుతుందన్న గ్యారెంటీ లేకపోయినప్పటికీ లాంచింగ్ సమయంలో ఇస్రోలో ఉండాలనుకున్నా. ఆ అనుభవాన్ని ఎన్నటికీ మరిచిపోలేను’అని ఉదహరించారు. ఎలాంటి అననుకూల పరిస్థితుల్లోనైనా రాణించాలని సూచించారు. 2001లో భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఏం చేశారు? అని ప్రశ్నించారు. మొత్తం మ్యాచ్‌నే మలుపుతిప్పిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. పరీక్షల్లో మంచి మార్కులు రావడమొక్కటే సర్వస్వం కాదని గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పిల్లల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని సూచించారు. పరీక్ష హాలులోకి ప్రవేశించేటప్పుడు ఒత్తిడిని విడనాడాలనీ, ఆత్మ విశ్వాసంతో ఉండి నేర్చుకున్న విషయాలపై దృష్టిసారించాలని ఉద్బోధించారు. దాదాపు 2,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆ రాత్రి నిద్ర పట్టలేదు : మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ సాంకేతిక కారణాలతో విఫలమైన రోజు తనకు నిద్ర పట్టలేదని మోదీ చెప్పారు. ఆ రాత్రి నిద్రపోలేదని పేర్కొన్నారు. విద్యార్థులకు పరీక్షల కాలం సమీపిస్తుండటంతో మోదీ సోమవారం ‘పరీక్ష పే చర్చా’ కార్యక్రమం నిర్వహించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో 2 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ విద్యార్థులతో మాట్లాడుతూ.. చంద్రయాన్-2 లాంచ్ మిషన్‌ను వీక్షించేందుకు వెళ్లవద్దని తనకు పలువురు సూచించారు. అది విజయవంతం అవుతుందనే నమ్మకం లేదని.. విఫలమైతే పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు అన్నారు. కానీ నేను మాత్రం ఇస్రోకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పిన తరువాత.. నేను అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లిపోయాను. కానీ ఈ పరిణామంతో అసంతృప్తి చెందలేదు. ఆ తర్వాత పీఎంవో అధికారులును పిలిచి ఇస్రో శాస్త్రవేత్తలతో రేపు ఉదయం సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించాను. వెంటనే తన షెడ్యూల్‌ను మార్చవల్సిందిగా పీఎంవో బృందాన్ని ఆదేశించాను. మరుసటి రోజు ఉదయమే శాస్త్రవేత్తలతో భేటీ అయ్యాను. ఈ సందర్భంగా చంద్రయాన్-2 కోసం కష్టపడిన శాస్త్రవేత్తల శ్రమను అభినందించాను. నా భావాలను వారితో పంచుకున్నాను. ఈ ఘటన ఓటమి నుంచి గెలుపు పాఠాలు నేర్పిందన్నాను. రాబోయే రోజుల్లో భారీ విజయాలు సాధించవచ్చని చెప్పాను. మనం అనుకున్న విధంగా చంద్రుని ఉపరితలాన్ని చేరుకోలేపోయాం.. కానీ దీనిని ఓ కవి మాత్రం చంద్రున్ని తాకలానే తాపత్రాయంతో విక్రమ్ ల్యాండర్ వేగంగా దూసకెళ్లిందని అభివర్ణించారు’ అని తెలిపారు. -
నేడు పీఎంతో ‘పరీక్షా పే చర్చా’
న్యూఢిల్లీ: పరీక్షల కాలం ముంచుకొస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ‘పరీక్షా పే చర్చా’కు తెరతీశారు. పరీక్షల సమయంలో తలెత్తే ఒత్తిడిని తగ్గించేందుకు విద్యార్థులకు విలువైన సూచనలివ్వనున్నారు. ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో నేడు(సోమవారం) ఆయన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. ఇందులో పాల్గొనేందుకు 2 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వ్యాస రచన పోటీలు నిర్వహించి 1,050 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుందని అధికారులు తెలిపారు. ప్రధానిని ప్రశ్నించే విద్యార్థులను వారు రాసిన ఎస్సేల ఆధారంగా ఎంపిక చేశామన్నారు. 2018, 2019 ల్లోనూ పరీక్షా పే చర్చాను నిర్వహించారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థుల నుంచి 2.6 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, ఇది గతేడాది కన్నా 1.2 లక్షలు ఎక్కువని వెల్లడించారు. -
విజిటింగ్ కార్డుల్లా చూడొద్దు
న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలలను పిల్లలపై రుద్దవద్దని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించే రీతిలో తల్లిదండ్రులు వ్యవహరించాలన్నారు. పిల్లల రిపోర్టు కార్డులను తమ విజిటింగ్ కార్డుల్లా పరిగణించవద్దని పేర్కొన్నారు. ‘పరీక్షా పే చర్చ’లో భాగంగా మంగళవారం ఢిల్లీలోని థాల్కాటోరా స్టేడియంలో దేశవ్యాప్తంగా ఎంపికైన దాదాపు 2 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. పరీక్షల గురించి ఒత్తిడికి గురికావద్దని, పరీక్షలే జీవితం కాదని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు ముఖ్యమైనవే.. కానీ ఇవి జీవితానికి సంబంధించినవా? లేక 10వ తరగతికో, 12వ తరగతికో పరిమితమైనవా? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలన్నారు. దీనికి సమాధానం వస్తే ఒత్తిడిని అధిగమించగలిగినట్లే అని పేర్కొన్నారు. చిన్నారులను పోత్సహించి, ప్రేరణనిచ్చే శక్తి తల్లిదండ్రులకు మాత్రమే ఉందని మోదీ స్పష్టం చేశారు. ఏ విషయంలోనూ చిన్నారులను ఇతరులతో పోల్చవద్దని దీనివల్ల వారి ఆత్యస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రధాని హెచ్చరించారు. పిల్లలు సాధించిన చిన్న చిన్న విజయాలను కూడా తల్లిదండ్రులు అభినందిస్తూ ఉంటే వారు మరింత మెరుగ్గా రాణించగలరని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ ర్యాంకులకు మాత్రమే పరిమితమైందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా దీనికి తగ్గట్టే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిన్నారులకు తగినంత స్వేచ్ఛ ఇవ్వాలని.. ర్యాంకుల కోసం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న విషయాలను చూసి నేర్చుకునేలా వారిని ప్రోత్సహించాలని మోదీ సూచించారు. నేర్చుకోవడాన్ని పరీక్షల వరకే పరిమితం చేయవద్దని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే రీతిలో చిన్నారులను సన్నద్ధం చేయా లని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, దానిని అధిగమించే దిశగా కృషిచేయాలని విద్యార్థులకు సూచించారు. దేశమే నా కుటుంబం.. మీరు రోజులో 17 గంటలు ఎలా పనిచేయగలుగుతున్నారని ఓ విద్యార్థి ప్రధానిని ప్రశ్నించగా.. ‘ఓ తల్లి తన కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. అయినా అలసిపోదు. అలాగే నేను దేశాన్ని నా కుటుంబంగా భావిస్తాను. వారి కోసం ఎంతవరకైనా శ్రమిస్తూనే ఉంటాను’ అని మోదీ బదులిచ్చారు. మాకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునేలా తల్లిదండ్రులను ఎలా ఒప్పించాలని ఓ విద్యార్థి ప్రశ్నించగా.. ‘మీ ప్యాషన్ గురించి వారికి చెప్పండి. అది సాధించడానికి మీ వద్ద ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించండి. అవసరమైతే మీ టీచర్ల సాయం తీసుకోండి. వారి సాయం తో మీ తల్లిదండ్రులను ఒప్పించండి’ అని మోదీ సలహా ఇచ్చారు. -
యే పబ్జీ వాలా హై క్యా: మోదీ
న్యూఢిల్లీ: పరీక్షా పే చర్చ 2.0 కార్యక్రమంలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎలా జయించాలనే దానిపై ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మధుమిత సేన్ గుప్తా అనే మహిళ మోదీతో మాట్లాడుతూ.. ‘నా కుమారుడు తొమ్మిది తరగతి చదువుతున్నాడు. ఇదివరకు తను చదువుల్లో ముందుండే వాడు. కానీ ఇటీవలి కాలంలో గేమ్స్‌కు ఆకర్షితుడై చదువుల్లో వెనకబడ్డాడు. గేమ్స్ మాన్పించడానికి నేను ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింద’ని తెలిపారు. దీనికి పరిష్కారం చూపాలని మోదీని కోరారు. దీనిపై స్పందించిన మోదీ ‘యే పబ్జీ వాలా క్యా హై’ అంటూ సరదాగా తన సమాధానాన్ని మొదలెట్టారు. దీంతో అక్కడున్న వాళ్లంతా పెద్దగా నవ్వారు. ఆ తర్వాత మోదీ టెక్నాలజీపై విలువైన సూచన చేశారు. ఈ రోజుల్లో పిల్లలకు టెక్నాలజీని దూరంగా ఉంచితే వారు చాలా వెనక్కి వెళ్లిపోతారని తెలిపారు. ఒక విధంగా చెప్పాలంటే టెక్నాలజీ వచ్చి చాలామందిని రోబోలుగా తయారు చేస్తుందని.. అందుకే దానిని ఎలా వినియోగించాలనే దానిపై పిల్లల్లో అవగాహన తీసుకురావాలని అన్నారు. ఈరోజు ఎవరి చేతిలో చూసినా కూడా సెల్ ఫోన్ తప్పక కనిపిస్తుంది.. సమావేశంలో కూర్చున్న చాలామంది కూడా ప్రస్తుతం ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తున్నారు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే టెక్నాలజీని అభివృద్ధి కోసం వాడాలని తెలిపిన ఆయన.. దాన్ని దుర్వినియోగం చేయకూడదన్నారు. ఉపాధ్యాయులు కూడా పిల్లలకు టెక్నాలజీపై, దాని వినియోగంపై అవగాహన తీసుకురావాలని అన్నారు. ఆ విధంగా చేయడం వల్ల పిల్లలు టెక్నాలజీని మిస్ యూజ్ చేయరని అన్నారు. కాగా, ప్రస్తుతం పిల్లలకు, యువతకు పబ్జీ గేమ్ నిద్ర లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు విద్యార్థులు ఈ గేమ్ బారిన పడి చదువులను పక్కన పెట్టేస్తున్నారు. -
యే పబ్జీ వాలా హై క్యా: మోదీ
-
విద్యపై మార్కెట్ నీలినీడలు
ఆలోచనం ఏ మంచం కొనాలో, ఏం తినాలో మార్కెట్ చెబుతుంది. ప్రభుత్వ బడుల్లో మంచి చదువు దొరకదని మార్కెట్టే చెప్పింది. మార్కెట్ ఇంతలా మనల్ని అల్లుకుని వున్న ఈ కాలంలో మోదీ మూస మాటల వల్ల ఏం లాభం జరుగుతుంది? పోయిన శుక్రవారం ఢిల్లీలో ‘‘పరీక్షా పర్ చర్చ’’ అనే కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో ముచ్చటిస్తూ, మోడీ ‘‘మీ మొత్తం దృష్టినంతా నేర్చుకోవడంపై పెట్టాలి. ఫలితాలు, మార్కులు అనేవి అనుబంధ ఉత్పత్తులుగా ఉండాలి’’ అని, అంతటితో ఆగక ‘‘తమ పిల్లలు ఏదో అవ్వాలన్న తల్లిదండ్రుల స్వప్నాలను మీరు అంగీకరించాలి’’ అన్నారు. మోదీ పలికిన ఈ ఆణిముత్యాలను నెమరువేసుకుంటూ ఉంటే, నాకు, కార్పొరేట్ కళాశాలల దౌష్ట్యం వల్ల, గత రెండేళ్లలో దాదాపు 450 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. ఇవన్నీ నాకు పదే పదే నా చదువును జ్ఞాపకం చేశాయి. నా తల్లికి నన్ను డాక్టర్‌గా చూడాలని ఉండేది. నాకేమో మెదడులో ఎడమ భాగం కన్నా కుడి భాగం చురుకుగా పనిచేసేది. ఎడమ వైపు మెదడు తార్కికమైన, క్రమానుగతమైన సైన్స్, మ్యాథ్స్‌లకు చెందగా, కుడి వైపు మెదడు సమగ్ర చింతన, సృజనాత్మకత, కళా సంగీతాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏ మనిషికీ కేవలం కుడి లేకా ఎడమ మెదడు మాత్రమే పని చేయడం ఉండదు కానీ, ఒక వైపు మెదడు మరో వైపు కంటే చురుకుగా పని చేయడం సాధారణంగా ఉంటుందట. అట్లా నన్ను వేకువన, మా హాస్టల్లో చదువుకోవడానికని లేపితే, ఎంతకీ నా బుర్రలోకి ఎక్కని ఫిజిక్స్ మెటీరియల్ చేతిలో పట్టుకుని, స్టడీ చైర్లో కూర్చుని, నా చుట్టూ ఆవరించి వున్న లైట్ వెలుతురుకి ఆవల వున్న నిశీధిని దాటి, చాలా దూరంలో వున్న స్మశానంకేసి చూస్తూ, అసలు ప్రపంచం చెప్తున్నట్లు కొరివి దయ్యాలనేవి ఉన్నాయా అని శ్రద్ధగా వెదికేదాన్ని. కొరివి దయ్యాలు కనిపించేవి కావు కానీ, మార్కులు మాత్రం గుడ్డు సున్నాలు వచ్చేవి. నా అదృష్టం బాగుండటం చేత నేను సైన్స్ నుంచి బయటపడి ఆర్ట్స్‌కి వచ్చాను. అప్పుడిక నా కుడి మెదడు వికసించి, ఎదురు లేకుండా బంగారు పతకాలతో, బహుమతులతో విజయబావుటా ఎగురవేసుకుంటూ వచ్చాను. ఐన్‌స్టీన్ ‘‘ప్రతి ఒక్కరూ మేధావే. కానీ మీరు చెట్లు ఎక్కగలగడాన్నిబట్టి చేప సామర్థ్యాన్ని నిర్ధారిస్తానంటే అది జీవితాంతం తాను మందమతిని అని నమ్మేస్తూ బతుకుతుంది’’ అంటాడు. నా చదువు గుర్తొచ్చినప్పుడల్లా నాకీ కొటేషన్ జ్ఞాపకం వస్తుంది. అసలు చేపల్ని చెట్లు ఎక్కించాలని నేటి తల్లిదండ్రులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రాణాలు పోగొట్టుకున్న ఈ 450 మంది పిల్లల తల్లిదండ్రులు వారిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మాత్రమే ఎందుకు చూడాలనుకుంటున్నారు? సమాజం మనుషుల ఉన్నతిని డబ్బుతోనే కొలుస్తుంది కనుక, తమ పిల్లలు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాలంటే డబ్బులొచ్చే చదువులు చదవాలన్నది వారి ఆశ. వారి ఆశ లేదా డిమాండు యొక్క సృష్టే కార్పొరేట్ కళాశాలలు. అందరూ అంటున్నట్లు ఆత్మహత్యలకు కారణం కార్పొరేట్ కళాశాలలు కాదు. తల్లిదండ్రులు అందుకు కారణం. తల్లిదండ్రుల ఆశని డబ్బురూపంలో స్వీకరించే కళాశాలలు వారి ఆశలను ఫలింపచేయడానికి రకరకాల పద్ధతులను కనిపెట్టి ‘సప్లై’ చేస్తున్నాయి. సోషల్ డార్వినిజం ‘సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్’ సిద్ధాంతాన్ని చెప్తుంది. ఒత్తిడిని తట్టుకోగలిగిన వాళ్ళు తట్టుకుని డాక్టర్లో మరొకటో కావచ్చు, అలా కాని వాళ్ళు పెద్దల ఆశకు, కళాశాలల ఆచరణకు మధ్యన నలిగి బలి అవుతున్నారు. తల్లిదండ్రులు చేపల్లాంటి తమ పిల్లల్ని చెట్లెక్కాలని కోరుకోవడం వెనుక వున్న ప్రోద్బలాన్ని ‘‘మార్కెట్’’ అంటున్నాడు మైఖేల్ జె.శాండల్ తన ‘వాట్ మనీ కాంట్ బై’ అన్న పుస్తకంలో. ‘‘ఇటీవలి దశాబ్దాల్లో, మార్కెట్ విలువలు జీవితంలోని ప్రతి ఒక్క అంశంపైనా అంటే వైద్యం, విద్య, ప్రభుత్వం, చట్టం, చివరకి కుటుంబ జీవనం పైన కూడా ప్రభావితం చూపుతూ వచ్చాయి. మనం మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నుంచి మార్కెట్ సమాజం వైపు కొట్టుకుని పోతున్నాము... ఏ ఆలోచనాత్మకమైన ఎంపిక ద్వారానో మనం ఈ స్థితికి రాలేదు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయినందువల్ల, మార్కెట్, మార్కెట్ చింతన అనేవి కనీవినీ ఎరుగని ప్రతిష్ఠను ఆస్వాదిస్తున్నట్లుంది. ఇదే నిజం కావచ్చు కూడా.’’అంటారు. నా తండ్రి కాలంలో చదువు ఒక చాయిస్ మాత్రమే, బ్రతుకుదెరువు కాదు. ఇప్పుడలా కాదు ఏ మంచం కొనాలో, ఏం తినాలో మార్కెట్ చెబుతుంది, మనుషుల్ని ప్రలోభ పెడుతుంది. ప్రభుత్వ బడుల్లో మంచి చదువు దొరకదు అని మార్కెట్టే మనకు చెప్పింది. మార్కెట్టు ఇంతలా మనల్ని అల్లుకుని వున్న ఈ కాలంలొ మోడీ మూస మాటల వల్ల ఏం లాభం జరుగుతుంది? ఇప్పుడు మనముందున్న మార్గాలు రెండే. మొదటిది విద్యావ్యవస్థని మార్కెట్ బంధనాలనుంచి తప్పించి, సంపూర్ణంగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకుని విద్యను జ్ఞానాన్ని, సంస్కారాన్ని ఇచ్చేదిగా తీర్చిదిద్దడం. రెండు, సోషల్ డార్వినిజం ప్రకారం ఆత్మహత్యలు చేసుకునే పిల్లలు చేసుకోగా, పటిష్టమైన వారే సమాజంలో మిగుల్తారులే అని చూసీ చూడనట్టు ఊరుకోవడం. మోదీ మొదటి మార్గాన్ని ఎంచుకుని ఆ దిశగా అడుగులు వేస్తే ఎంత బాగుంటుంది కదా! వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900 సామాన్య -
ఫలితంపై ఆందోళన వద్దు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారి.. పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి.. ఎలా విజయం సాధించాలన్న అంశాలపై విద్యార్థులకు సూచనలు, సలహాలు చేశారు. ఫలితం గురించి ఆందోళన చెందకుండా నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు ఆయన బోధించారు. ఇతరులతో పోటీ పడకుండా తమతో తామే పోటీపడాలని, నిరాశతో మధ్యలోనే వదిలిపెట్టే ధోరణిని అధిగమించాలని సూచించారు. ప్రతి భారతీయ చిన్నారి పుట్టుకతోనే రాజకీయ నాయకుడని, తనకు కావాల్సింది ఎలా పొందాలో వారికి బాగా తెలుసని మోదీ అన్నారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ‘పరీక్షా పర్ చర్చా’ పేరిట ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో గంటన్నరకు పైగా విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. ఈ చర్చను దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలో చెపుతూ ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని ఇటీవలే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల శ్రమంతా మీ బాగు కోసమే ‘నా ఉపాధ్యాయుల నుంచి నేర్చుకున్న గొప్ప పాఠం ఏమిటంటే నాలోని విద్యార్థి భావనను మరణించకుండా చూసుకోవడం. అందుకు సాయపడిన నా ఉపాధ్యాయుల్ని నేను గౌరవించాలి’అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రధాన మంత్రి కార్యాలయానికి దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వేల కొద్దీ ప్రశ్నలు అందాయి. పరీక్షల్లో పిల్లలు మంచి ప్రదర్శన కనపర్చాలని తల్లిదండ్రులు పెట్టుకునే అంచనాలు, ఒత్తిడిపై విద్యార్థుల ప్రశ్నకు మోదీ సమాధానమిస్తూ..‘మీ తల్లిదండ్రులకు పాఠం చెప్పాలని ఈ రోజు మీరు కోరుకుంటున్నారు. అయితే మన తల్లిదండ్రుల అభిప్రాయం విషయంలో మనం సందేహ పడకూడదు. వారికి తగిన గౌరవం ఇవ్వడంతో పాటు అర్థం చేసుకోవాలి. వారి జీవితం మొత్తం మనం కోసం శ్రమిస్తారు. తమ పిల్లలు ఏదో అవ్వాలన్న తల్లిదండ్రుల స్వప్నాల్ని మీరు అంగీకరించాలి. వారి విశ్వాసాన్ని సందేహించకూడదు. మీ మంచి కోసమే వారు ఇదంతా చేస్తున్నారని అర్థం చేసుకోవాలి’అని మోదీ పేర్కొన్నారు. వారి కలలు నెరవేరనప్పుడు వాటిని తమ పిల్లల ద్వారా తీర్చుకోవాలని తల్లిదండ్రులు భావించినప్పుడే సమస్యలు వస్తాయని అన్నారు. ‘తల్లిదండ్రులు మంచి మూడ్‌లో ఉన్నప్పుడు వారితో విద్యార్థులు మనసు విప్పి మాట్లాడాలి. ఈ విషయాన్ని భారతీయ పిల్లలకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ భారతీయ విద్యార్థి పుట్టుకతోనే రాజకీయ నాయకుడు. తండ్రి ఒప్పుకోనప్పుడు ఫలానా వస్తువు ఎలా పొందాలో ఉమ్మడి కుటుంబంలోని పిల్లలకు బాగా తెలుసు. నానమ్మ, పెద్దన్న, తల్లి లేదా సోదరి సాయంతో వారు దాన్ని సాధిస్తారు’అని చెప్పారు. 2019 ఎన్నికలకు సిద్ధమయ్యారా?: మోదీకి విద్యార్థి ప్రశ్న 2019 లోక్‌సభ ఎన్నికలకు పూర్తిగా సిద్ధమయ్యారా, లేక ఆందోళనతో ఉన్నారా? అని ఢిల్లీ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానమిస్తూ.. ‘చదవడం, నేర్చుకోవడం నిరంతరం కొనసాగిస్తూ ఉండాలని నేను నమ్ముతాను. మీ మొత్తం దృష్టి నేర్చుకోవడంపై పెట్టాలి. వీలైనంత ఎక్కువగా మీలోని బలాల్ని మెరుగుపర్చుకోవాలి, దీనినే జీవిత ధర్మంగా పాటిస్తూ ముందుకు సాగాలి. ఫలితాలు, మార్కులు అనేవి అనుబంధ ఉత్పత్తులుగా ఉండాలి. నేను రాజకీయాల్లో ఈ సిద్ధాంతాన్నే అనుసరిస్తాను. నా సమయం, శక్తి, జ్ఞానం మొత్తాన్ని ప్రజల సంక్షేమం కోసమే వినియోగించాలన్నదే నా సిద్ధాంతం.. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి.. అవి అప్పుడప్పుడూ వచ్చేవి మాత్రమే. మీకు సంవత్సరానికి ఒకసారే పరీక్షలు ఉంటాయి. మాకు 24 గంటలూ పరీక్షే. దేశంలో ఎక్కడో ఒక చోట మేం మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే.. మోదీకి ఎదురుదెబ్బ అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది’అని మోదీ పేర్కొన్నారు. మధ్యలోనే వదిలిపెట్టే ధోరణి విడనాడాలి జీవితంలో ముందుకు సాగాలంటే నిరాశతో మధ్యలోనే వదిలిపెట్టే ధోరణి అధిగమించాలని, అందుకు బీజేపీ పూర్వ రూపమైన జన్‌సంఘ్ ఉదాహరణ అని ప్రధాని చెప్పారు. ‘నేను రాజకీయాల్లోకి రాకముందు.. జన్ సంఘ్ అనే పార్టీ ఉండేది.. లాంతరు దాని గుర్తు.. గుజరాత్ ఎన్నికల్లో 103 మంది అభ్యర్థుల్ని నిలబెడితే 99 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఆ నలుగురి డిపాజిట్లు తిరిగి వచ్చాక.. పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరం చేసుకున్నారు. అలాంటి ఆలోచనా ధోరణి వల్లే ఆ స్థితి నుంచి 2014 ఎన్నికల్లో గెలిచే స్థితికి బీజేపీ చేరుకుంది’అని విద్యార్థులకు వెల్లడించారు. తనను ప్రధానిగా కాకుండా స్నేహితుడిలా భావించాలని విద్యార్థులకు మోదీ సూచించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత ముఖ్యమని చెప్పారు. ‘ఈ రోజు నేను విద్యార్థిని.. మీరు మార్కులేసే ఎగ్జామినర్లు.. తర్వాత మీరు నాకు మార్కులేయవచ్చు’అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు టీవీ న్యూస్ చానల్స్, నరేంద్ర మోడీ యాప్, మైగావ్ యాప్ ద్వారా విద్యార్థులు ప్రధానిని పలు ప్రశ్నలు అడిగారు.