శుక్రవారం ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ‘పరీక్షా పర్ చర్చా’లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారి.. పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి.. ఎలా విజయం సాధించాలన్న అంశాలపై విద్యార్థులకు సూచనలు, సలహాలు చేశారు. ఫలితం గురించి ఆందోళన చెందకుండా నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు ఆయన బోధించారు. ఇతరులతో పోటీ పడకుండా తమతో తామే పోటీపడాలని, నిరాశతో మధ్యలోనే వదిలిపెట్టే ధోరణిని అధిగమించాలని సూచించారు. ప్రతి భారతీయ చిన్నారి పుట్టుకతోనే రాజకీయ నాయకుడని, తనకు కావాల్సింది ఎలా పొందాలో వారికి బాగా తెలుసని మోదీ అన్నారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ‘పరీక్షా పర్ చర్చా’ పేరిట ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో గంటన్నరకు పైగా విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. ఈ చర్చను దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలో చెపుతూ ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని ఇటీవలే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
తల్లిదండ్రుల శ్రమంతా మీ బాగు కోసమే
‘నా ఉపాధ్యాయుల నుంచి నేర్చుకున్న గొప్ప పాఠం ఏమిటంటే నాలోని విద్యార్థి భావనను మరణించకుండా చూసుకోవడం. అందుకు సాయపడిన నా ఉపాధ్యాయుల్ని నేను గౌరవించాలి’అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రధాన మంత్రి కార్యాలయానికి దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వేల కొద్దీ ప్రశ్నలు అందాయి. పరీక్షల్లో పిల్లలు మంచి ప్రదర్శన కనపర్చాలని తల్లిదండ్రులు పెట్టుకునే అంచనాలు, ఒత్తిడిపై విద్యార్థుల ప్రశ్నకు మోదీ సమాధానమిస్తూ..‘మీ తల్లిదండ్రులకు పాఠం చెప్పాలని ఈ రోజు మీరు కోరుకుంటున్నారు. అయితే మన తల్లిదండ్రుల అభిప్రాయం విషయంలో మనం సందేహ పడకూడదు. వారికి తగిన గౌరవం ఇవ్వడంతో పాటు అర్థం చేసుకోవాలి. వారి జీవితం మొత్తం మనం కోసం శ్రమిస్తారు. తమ పిల్లలు ఏదో అవ్వాలన్న తల్లిదండ్రుల స్వప్నాల్ని మీరు అంగీకరించాలి. వారి విశ్వాసాన్ని సందేహించకూడదు. మీ మంచి కోసమే వారు ఇదంతా చేస్తున్నారని అర్థం చేసుకోవాలి’అని మోదీ పేర్కొన్నారు. వారి కలలు నెరవేరనప్పుడు వాటిని తమ పిల్లల ద్వారా తీర్చుకోవాలని తల్లిదండ్రులు భావించినప్పుడే సమస్యలు వస్తాయని అన్నారు. ‘తల్లిదండ్రులు మంచి మూడ్‌లో ఉన్నప్పుడు వారితో విద్యార్థులు మనసు విప్పి మాట్లాడాలి. ఈ విషయాన్ని భారతీయ పిల్లలకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ భారతీయ విద్యార్థి పుట్టుకతోనే రాజకీయ నాయకుడు. తండ్రి ఒప్పుకోనప్పుడు ఫలానా వస్తువు ఎలా పొందాలో ఉమ్మడి కుటుంబంలోని పిల్లలకు బాగా తెలుసు. నానమ్మ, పెద్దన్న, తల్లి లేదా సోదరి సాయంతో వారు దాన్ని సాధిస్తారు’అని చెప్పారు.
2019 ఎన్నికలకు సిద్ధమయ్యారా?: మోదీకి విద్యార్థి ప్రశ్న
2019 లోక్‌సభ ఎన్నికలకు పూర్తిగా సిద్ధమయ్యారా, లేక ఆందోళనతో ఉన్నారా? అని ఢిల్లీ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానమిస్తూ.. ‘చదవడం, నేర్చుకోవడం నిరంతరం కొనసాగిస్తూ ఉండాలని నేను నమ్ముతాను. మీ మొత్తం దృష్టి నేర్చుకోవడంపై పెట్టాలి. వీలైనంత ఎక్కువగా మీలోని బలాల్ని మెరుగుపర్చుకోవాలి, దీనినే జీవిత ధర్మంగా పాటిస్తూ ముందుకు సాగాలి. ఫలితాలు, మార్కులు అనేవి అనుబంధ ఉత్పత్తులుగా ఉండాలి. నేను రాజకీయాల్లో ఈ సిద్ధాంతాన్నే అనుసరిస్తాను. నా సమయం, శక్తి, జ్ఞానం మొత్తాన్ని ప్రజల సంక్షేమం కోసమే వినియోగించాలన్నదే నా సిద్ధాంతం.. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి.. అవి అప్పుడప్పుడూ వచ్చేవి మాత్రమే. మీకు సంవత్సరానికి ఒకసారే పరీక్షలు ఉంటాయి. మాకు 24 గంటలూ పరీక్షే. దేశంలో ఎక్కడో ఒక చోట మేం మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే.. మోదీకి ఎదురుదెబ్బ అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది’అని మోదీ పేర్కొన్నారు.
మధ్యలోనే వదిలిపెట్టే ధోరణి విడనాడాలి
జీవితంలో ముందుకు సాగాలంటే నిరాశతో మధ్యలోనే వదిలిపెట్టే ధోరణి అధిగమించాలని, అందుకు బీజేపీ పూర్వ రూపమైన జన్‌సంఘ్ ఉదాహరణ అని ప్రధాని చెప్పారు. ‘నేను రాజకీయాల్లోకి రాకముందు.. జన్ సంఘ్ అనే పార్టీ ఉండేది.. లాంతరు దాని గుర్తు.. గుజరాత్ ఎన్నికల్లో 103 మంది అభ్యర్థుల్ని నిలబెడితే 99 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఆ నలుగురి డిపాజిట్లు తిరిగి వచ్చాక.. పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరం చేసుకున్నారు. అలాంటి ఆలోచనా ధోరణి వల్లే ఆ స్థితి నుంచి 2014 ఎన్నికల్లో గెలిచే స్థితికి బీజేపీ చేరుకుంది’అని విద్యార్థులకు వెల్లడించారు. తనను ప్రధానిగా కాకుండా స్నేహితుడిలా భావించాలని విద్యార్థులకు మోదీ సూచించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత ముఖ్యమని చెప్పారు. ‘ఈ రోజు నేను విద్యార్థిని.. మీరు మార్కులేసే ఎగ్జామినర్లు.. తర్వాత మీరు నాకు మార్కులేయవచ్చు’అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు టీవీ న్యూస్ చానల్స్, నరేంద్ర మోడీ యాప్, మైగావ్ యాప్ ద్వారా విద్యార్థులు ప్రధానిని పలు ప్రశ్నలు అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment