అడ్డదారులను నమ్ముకుంటే కష్టాలే | Pariksha Pe Charcha: This Way PM Modi Face Oppositions Criticism | Sakshi
Sakshi News home page

అది అవుట్‌ ఆఫ్‌ సిలబస్‌ ప్రశ్న.. విమర్శలపై పరీక్షా పే చర్చలో ప్రశ్న.. ప్రధాని ఆన్సర్‌ ఇదే

Published Fri, Jan 27 2023 4:28 PM | Last Updated on Sat, Jan 28 2023 4:23 AM

Pariksha Pe Charcha: This Way PM Modi Face Oppositions Criticism - Sakshi

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: విద్యార్థులు షార్ట్‌కట్‌లను (అడ్డదారులు) ఎప్పుడూ నమ్ముకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. పరీక్షల్లో చీటింగ్‌ చేయడం వల్ల ఒకటి రెండు సార్లు లాభపడొచ్చేమో గానీ భవిష్యత్తులో మాత్రం కష్టాలు తప్పవని హెచ్చరించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ఆరో ఎడిషన్‌ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

పరీక్షల వేళ ప్రధానంగా చదువులపైనే దృష్టి పెట్టాలని సూచించారు. దృష్టి మళ్లించే పనులకు దూరంగా ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలను అతిగా వాడొద్దని, తెలివితేటలపై నమ్మకం ఉంచాలి తప్ప మొబైల్‌ ఫోన్లపై కాదని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ వల్ల చదువుల్లో నష్టపోకుండా జాగ్రత్తపడాలన్నారు. ఫోన్లు వాడడానికి, సోషల్‌ మీడియా ద్వారా ఇతరులతో అనుసంధానం కావడానికి ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించుకోవాలని చెప్పారు.  

ఏకాగ్రత మొత్తం చదువుపైనే..  
పరీక్షల్లో కాపీయింగ్‌ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తప్పుడు పనుల వల్ల చెడ్డ ఫలితమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నిజాయితీగా కష్టపడే తత్వమే జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్తుందని విద్యార్థులకు ఉద్బోధించారు. ఒత్తిళ్లకి లోను కాకుండా పరీక్షలకు ప్రశాంతంగా సిద్ధం కావాలని అన్నారు. మన బలాలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఒత్తిడికి తావుండదని వివరించారు. పిల్లలపై కుటుంబ సభ్యులు ఎన్నో అంచనాలు పెట్టుకోవడం సహజమేనని గుర్తుచేశారు. పరీక్ష ఫలితాలు జీవితానికి ముగింపు కాదని స్పష్టం చేశారు.

తన వైపు విసిరే బంతిపైనే క్రికెట్‌ క్రీడాకారుడు ఫోకస్‌ చేస్తాడని, ఫోర్లు, సిక్సుల కోసం వినిపించే అరుపులను ఏమాత్రం పట్టించుకోడని, విద్యార్థులు సైతం అలాగే ఉండాలని, వారి ఏకాగ్రత మొత్తం చదువుపైనే ఉండాలని స్పష్టం చేశారు. పిల్లల చదువులు, వారు సాధించబోయే మార్కుల గురించి తల్లిదండ్రులు గొప్పలు చెబుతుంటారని, విద్యార్థుల్లో ఒత్తిడికి ఇది కూడా ఒక కారణమని ఉద్ఘాటించారు. పిల్లలు చెప్పింది విశ్వసించాలని తల్లిదండ్రులకు హితవు పలికారు. పరీక్ష ఫలితాల గురించి లేనిపోని అంచనాలు పెట్టుకోవద్దని అన్నారు.  

ప్రశ్నలడిగే వారిని స్వాగతించాలి  
విద్యార్థుల పరిధి మరింత విస్తృతం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. 10, 12వ తరగతుల పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థులకు కొంత డబ్బు ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ డబ్బుతో కొత్త ప్రాంతాల్లో పర్యటించాలని, అక్కడి అనుభవాలను పుస్తకంలో రాయాలని విద్యార్థులతో చెప్పారు. పిల్లలను ఆంక్షల వలయంలో బందీలను చేయడం ఎంతమాత్రం సరి కాదన్నారు. కొత్త ప్రాంతాలను దర్శించేలా, కొత్త మనుషులను కలిసి మాట్లాడేలా ప్రోత్సహించాలన్నారు. ప్రశ్నలడిగే విద్యార్థులను స్వాగతించాలని ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచించారు. ఒక విద్యార్థి ప్రశ్నలు అడుగుతున్నాడంటే అతడిలోని పరిశోధకుడు మేల్కొన్నట్లు గుర్తించాలని, అది చాలా మంచి పరిణామం అని తెలియజేశారు.  

ఏది మంచి? ఏది చెడు?  
దేశంలో పౌరులు నిత్యం సగటున 6 గంటలకు పైగానే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు చూస్తున్నట్లు ఒక అధ్యయనంతో తేలిందని నరేంద్ర మోదీ వెల్లడించారు. గాడ్జెట్లకు జనం బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏది మంచో, ఏది చెడో నిర్ణయించుకొనే జ్ఞానాన్ని, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని దేవుడు మనకు ఇచ్చాడని, గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా ఇకనైనా అప్రమత్తంగా ఉందామని పిలుపునిచ్చారు.   

భారత్‌ ‘సగటు’ దేశం కాదు  
ప్రభుత్వంలో సగటు(యావరేజ్‌) వ్యక్తులే ఉన్నారని, భారత్‌ ఒక సగటు దేశంగానే కొనసాగుతోందంటూ వస్తున్న విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. భారత్‌ సగటు దేశం ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పారు. ప్రపంచంలో మన దేశం వెలిగిపోతోందని, ప్రపంచ దేశాలకు భారత్‌ ఒక ఆశారేఖగా మారిందని స్పష్టం చేశారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనని అన్నారు.

గొప్ప విజయాలు సాధించినవారిలో చాలామంది ఒకప్పుడు సగటు వ్యక్తులేనని వ్యాఖ్యానించారు. అందరూ ‘తీస్‌మార్‌ఖాన్‌’లు కావాల్సిన అవసరం లేదన్నారు. విమర్శలకు, ఆరోపణలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. విమర్శ అనేది మనం బలంగా మారడానికి ఉపయోగపడే ఒక టానిక్‌ లాంటిదన్నారు. ఎవరైనా ఆరోపణలు చేస్తే సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యార్థులకు సూచించారు. కొందరు ఎప్పుడూ ఆరోపణలు చేస్తుంటారని, వారి అసలు ఉద్దేశం వేరే ఉంటుందని, పట్టించుకోవద్దని చెప్పారు.   

తెలివిగా వాడుకోవడమే తెలివి  
మీ గాడ్జెట్‌ మీ కంటే తెలివైందని ఎన్నడూ అనుకోవద్దని విద్యార్థులతో మోదీ చెప్పారు. ఆన్‌లైన్‌ గేమ్‌లు, సోషల్‌ మీడియాకు బానిసలుగా మారొద్దన్నారు. తరచుగా ‘టెక్నాలజీ ఉపవాసం’ చేయాలన్నారు. ఫోన్లను పూర్తిగా పక్కన పెట్టాలని వెల్లడించారు. అలాగే ప్రతి ఇంట్లో టెక్నాలజీ–ఫ్రీ–జోన్‌ ఉండాలన్నారు. దీనివల్ల ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని, పిల్లలు గాడ్జెట్స్‌కు బానిసలుగా మారకుండా ఉంటారని వివరించారు. తాను రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ చేతిలో ఫోన్‌తో చాలా అరుదుగా కనిపిస్తుంటానని మోదీ తెలిపారు.

ఫోన్‌లో మాట్లాడడానికి కొంత సమయం కేటాయించుకుంటానని అన్నారు. టెక్నాలజీని పూర్తిగా పరిహరించాలని తాను చెప్పడం లేదని, మనకు అవసరమైన పరికరాలు అవసరమైనంత మేరకే వాడుకోవడం ఉత్తమమని వెల్లడించారు. మనం తెలివైనవాళ్లమా? లేక మన ఫోన్‌ తెలివైనదా? అనేది విద్యార్థులు నిర్ణయించుకోవాలన్నారు. ఫోన్‌ మాత్రమే తెలివైందని భావిస్తే సమస్య మొదలైనట్లేనని పేర్కొన్నారు. ఫోన్‌ను తెలివిగా వాడుకోవడంలోనే తెలివి దాగి ఉందన్నారు. ఫోన్‌ను ఉత్పాదకత పెంచుకోవడానికి ఉపయోగపడే ఒకపరికరంగా భావించాలని కోరారు.  
 

ఇదీ చదవండి: అన్ని భాషలు నేర్చుకోవాలనే తపన ఉండాలి- ప్రధాని మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement